Magazines in the Nizam’s State | నిజాం సంస్థానంలో పత్రికలు
-నిజాం కాలంలో వార్తా పత్రికలు ప్రారంభించడానికి కఠిన నిబంధనలు ఉండేవి. వార్తా పత్రిక ప్రారంభించాలనుకునే వ్యక్తి మొదట హోంశాఖ కార్యదర్శికి, పోలీస్ ప్రెస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తరువాత ఆ దరఖాస్తు ప్రభుత్వం దగ్గరకు, ప్రచార విభాగానికి వెళ్తుంది. వారు పత్రిక పెట్టాలనుకుంటున్న వ్యక్తులు, ఎడిటర్ వివరాలతోపాటు ఇతర విషయాలను దర్యాప్తు చేస్తారు. సంపాదకులు స్థానికులా కాదా అనే విషయంపై కూడా విచారణ జరుగుతుంది. తరువాత ప్రభుత్వానికి బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పత్రికలో రాజకీయాలు, మత విషయాలు రాయబోమని హామీనివ్వాలి. దీనికోసం గస్తీ నిషాన్ 53ను నిజాం ప్రభుత్వం అమలు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నిజాం సర్కారు నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొని తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రారంభించిన పలు పత్రికలు తెలంగాణ ప్రజలను జాగృతం చేయడంలో ప్రధానపాత్ర పోషించాయి.
-నిజాం రాష్ట్రంలో వెలువడిన తొలి పత్రిక పారశీ భాషకు చెందిన అక్టారే షఫిక్గా భావిస్తున్నారు. ఇది 1878లో హైదరాబాద్ నుంచి వచ్చేది. తరువాత ముస్లిం స్త్రీల సంస్కరణల కోసం ప్రారంభించిన మౌలిం-ఇ-నిస్వాన్ను 1892లో మౌల్వి మొహిబ్ హుసేన్ ప్రారంభించారు. ఇందులో ముస్లిం స్త్రీలకు విద్య కావాలని, మూఢనమ్మకాలను తొలగించుకోవాలని ప్రభోదించేది. దీన్ని నిషేధించారు. అయితే తొలి తెలుగు పత్రిక గురించిన సమాచారం కొంత వివాదాస్పదంగా ఉంది. సేద్య చంద్రిక పేరుతో ఒక పత్రిక వెలువడిందని, అదే తెలంగాణలో ప్రచురణ పొందిన తొలి తెలుగు పత్రిక అని ఇటీవల కాలంలో పరిశోధకులు వాదిస్తున్నారు. ఇది 1886లో ప్రారంభమైందని ప్రముఖ పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ రాశారు. ఉర్దూ పత్రిక పునూన్కు ఇది అనువాదం. దీన్ని మున్షి మహమ్మద్ ముస్తాక్ అహ్మద్ మాలిక్ వెలువరించారు. ఇది వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక మార్పులను కొత్తరకపు వంగడాలు, వ్యవసాయ పనిముట్లు, భూమి రకాలు, వాతావరణానికి తగిన పంటల ఎంపిక, పూల తోటల వంటి సమాచారం అందించేది. దీన్ని తెలుగు మాత్రమే తెలిసిన గ్రామీణ వ్యవసాయదారుల అభివృద్ధిని కాంక్షిస్తూ నెలకొల్పిన పత్రికగా చెప్పవచ్చు.
-దీనికి తరువాత విభిన్న వాదనలున్నప్పటికీ తెలంగాణ నుంచి వెలువడ్డ మొదటి తెలుగు దినపత్రిక దినవర్తమాన్ అని పరిశోధకులు రాపోలు ఆనందభాస్కర్, వెల్దుర్తి మాణిక్యరావులు పేర్కొన్నారు. 1890-91 ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ప్రచురించారని భావిస్తున్న ఈ పత్రిక గురించి సరైన సమాచారం లేదు. అయితే ఈ పేరు మీద ఉర్దూ, ఇంగ్లిష్ ద్విభాషా పత్రిక మాత్రం వెలువడేది. దీన్ని నారాయణ స్వామి మొదలియార్ నేటి సుల్తాన్ బజార్ నుంచి నడిపేవారు. అంతకుముందు ఈయన 1878లో ఆరు పేజీలుండే అసఫ్-ఉల్-అక్బర్ అనే వార పత్రికను కూడా నడిపారు.
మరాఠీ పత్రికలు
-హైదరాబాద్‌లో స్థిరపడ్డ మరాఠీలు నిజాం రాజ్యంలో ఉన్నత స్థానాల్లో ఉండేవారు. విద్యావంతులు కూడా కావడంతో వారు మరాఠీ భాషలో పత్రికలు వెలువరించారు. 1905లో శ్రీపతిరావు వకీల్ నిజాం వైభవ్ అనే పత్రికను స్థాపించాడు. అయితే ఇది ఆరు నెలలు మాత్రమే నడిచి మూతపడింది. తరువాత 1906లో భాగ్యేశ విజయ్ పత్రికను ఆయన స్థాపించారు.
-మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్‌రావు పాఠక్ ది బోధ అనే మాసపత్రికను స్థాపించి రెండు సంచికలు తీసుకొచ్చాడు. తరువాత ఆయనే నిజాం విజయ్ అనే వార పత్రికను స్థాపించేందుకు నిజాం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాడు.
-నిజాం ప్రభుత్వాన్ని విమర్శించకూడదనే షరతుపై అనుమతి లభించింది. హైదరాబాద్‌పై పోలీస్ చర్య తరువాత దాన్ని లోక్ విజయ్ పేరుతో వెలువరించారు.
-వీటితోపాటు 1930లో మరాఠీలో లోక్ శిక్షణ్, 1932లో సంజీవని, రాజహంస పత్రికలు వెలువడ్డాయి. గుల్బర్గా సమాచార్, చంపావతి అనే పత్రికలు కూడా ఈ కాలంలో వచ్చాయి. గుల్బర్గా సమాచార్‌ను గుల్బర్గాకు చెందిన పరశురామ్ పంత్ బోదాస్ ప్రచురించేవారు. ఇందులో కేశవరావు కోరాట్కర్ వంటి ప్రముఖులు నిజాం ప్రభుత్వ విధానాలపై విమర్శనాత్మక వ్యాసాలు రాసేవారు.
ఆంగ్ల పత్రికలు
-డా. సునోస్, ఫోర్బ్స్ అనే ఇద్దరు ఆంగ్లేయుల సహాయంతో అబ్దుల్ ఖాదిర్ దక్కన్ టైమ్స్ పేరుతో మొదటి ఆంగ్ల పత్రికను 1864లో ప్రారంభించారు. ఇది 1885 వరకు కొనసాగింది. ఇందులో రెసిడెన్సీకి సంబంధించిన వార్తలు, అభిప్రాయాలు ఎక్కువగా ప్రచురించేవారు. తరువాత ఈ పత్రికను నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మూసివేసింది.
-1882లో హెదరాబాద్ టెలిగ్రఫీ, 1885లో ది హైదరాబాద్ రికార్డ్ అనే ఇంగ్లిష్ పత్రికలు హైదరాబాద్ నుంచి ప్రచురితమయ్యాయి.
-1889లో దక్కన్ స్టాండర్డ్ అనే ఇంగ్లిష్ పత్రిక హైదరాబాద్ నుంచి వెలువడింది. తరువాత 1890 నుంచి దక్కన్ పంచ్ అనే ఇంగ్లిష్ పత్రికను ప్రారంభించారు.
-ఇవి కాకుండా దక్కన్ బడ్జెట్ (1891), ది దక్కన్ మెయిల్ (1898), హైదరాబాద్ క్రానికల్ వంటి పత్రికలను ఇంగ్లిష్‌లో ప్రచురించారు. నాటి ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొంటూ ఈ పత్రికలు కొనసాగాయి.
తెలుగు పత్రికలు
-1912లో తెలంగాణలో తొలి తెలుగు మాసపత్రిక హితబోధినిని శ్రీనివాస శర్మ ప్రారంభించారు. ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రచురితమయ్యేది.
-ఆత్మకూరు సంస్థానాధీశులు రాజా శ్రీరామభూపాల బహిరీ బలవంత్ బహద్దూర్ ముద్రణా యంత్రానికి సహాయం చేశారు.
-నిరక్షరాస్యత ప్రబలంగా ఉన్న ఆ రోజుల్లోనే ఈ పత్రికకు దాదాపు 500లకు పైగా చందాదారులు ఉండేవారు.
-1917లో దివ్యజ్ఞాన సమాజం తరఫున స్వామి వెంటకరావు ఆంధ్ర మాత పత్రికను సికింద్రాబాద్ నుంచి ప్రచురించాడు.
-ఇందులో దివ్యజ్ఞాన సమాజ భావాలు, వార్తలకు అధిక ప్రాధాన్యత లభించేది. ఇది ఎనిమిది నెలలు మాత్రమే నడిచినప్పటికీ దివ్యజ్ఞాన సమాజ భావాలను ప్రచారం చేయడంతోపాటు ఆనాటి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేది.
-1918 నుంచి మన్యసంఘం కార్యదర్శి జీఎస్ ముత్తయ్య ఆంగ్ల భాషలో ది పంచమ అనే మాసపత్రికను ప్రారంభించాడు. ఇది దళిత చైతన్యం కోసం పనిచేసింది.
-దీనితర్వాత క్రైస్తవ మత ప్రచారం కోసం 1920లో ఖమ్మం కేంద్రంగా ఎంపీ టాక్ సంపాదకత్వంలో ములాగ్ వర్తమాని అనే పత్రిక, 1921లో మహబూబ్‌నగర్ నుంచి సువార్తమణి అనే పత్రిక వెలువడింది.
బీఎస్ వెంకట్రావు
-దళిత వర్గాల విముక్తికోసం నిజాం సంస్థానంలో ఉద్యమం నడిపిన నేత బీఎస్ వెంకట్రావు.
-హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందిన ఈయన 1898, డిసెంబర్ 11న హైదరాబాద్‌లో జన్మించాడు.
-నిజాం రాష్ట్రంలో దళితుల విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో అనేక హక్కులను సాధించాడు.
-1922లో నిజాం ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేసి, నిజాం సాగర్ ప్రాజెక్టు రిక్రూట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో తన పదవికి రాజీనామా చేసి ఏ-క్లాస్ కాంట్రాక్టర్‌గా మారాడు.
-దళితుల్లో మూఢ నమ్మకాలు, జంతుబలులు, మద్యపానం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడి దళితుల్లో విద్యావ్యాప్తికి కృషి చేశాడు.
-ఇతను అనేక దళిత సంఘాలను స్థాపించాడు. వాటిలో మొదటిది 1922లో స్థాపించిన ఆది ద్రావిడ సంఘం. దీనిని అతని స్నేహితులు మాదరి గోవిందరాజులు, మాదరి వెంకటస్వామితో కలిసి స్థాపించాడు.
-1927లో సీఎస్ యతిరాజ్, కే రామస్వామి, అరిగె రామస్వామిలతో కలిసి ఆది హిందూ మహాసభను స్థాపించాడు.
-ఈ సంస్థల ద్వారా దేవదాసీ వ్యవస్థ నిర్మూలన, దళితుల ఐక్యత కోసం శ్రమించాడు.
-1926లో సికింద్రాబాద్‌లో ఆది హిందూ మహాసభను స్థాపించి దానికి అనుబంధంగా లైబ్రెరీని, విద్యావ్యాప్తికోసం రాత్రి బడులను ప్రారంభించాడు.
-1936లో అంబేద్కర్ యూత్ లీగ్‌ను ఏర్పాటు చేసి దళిత యువకుల ప్రగతికి కృషిచేశాడు.
-1938లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో సభ్యునిగా, 1939లో హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్‌గా, 1946లో స్థానిక సంస్థల తరపున హైదరాబాద్ శాసనసభకు ఎంఎల్సీగా, 1947లో విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు.
-1934లో అప్పటి ప్రధాని అక్బర్ హైదరీని కలిసి దళితులకు చట్టసభల్లో ప్రాతినిథ్యం ఉండాలని, జనాభా ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు.
-1938లో హైదరాబాద్ సిటీ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశాడు.
-నిజాం రాజును ఒప్పించి రూ. కోటితో షెడ్యూల్డు కులాల ట్రస్ట్ ఫండ్ పేరుతో దళిత సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయించాడు.
బత్తుల శ్యాంసుందర్
-1942, మే 30న మరాట్వాడా వర్చనీలో జరిగిన డిప్రెస్డ్ క్లాసెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు.
-అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిపేషన్ పుస్తక రచయిత పీఆర్ వెంకటస్వామి శ్యాంసుదర్ దళితోద్యమ ప్రవేశాన్ని రెడ్ లెటర్ డేగా అభివర్ణించాడు.
-వెంకట్రావుతో కలిసి దళిత జాతుల సమాఖ్య కార్యదర్శిగా, డా. బీఆర్ అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌కు అధ్యక్షునిగా పనిచేశాడు.
-1944లో రీకన్స్ట్రక్షన్ కమిటీ సభ్యునిగా, ఎడ్యుకేషన్ స్టాండింగ్ కమిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ సెనెట్‌లో సభ్యునిగా, 1945లో ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు.
-హైదరాబాద్ రాష్ట్ర దళిత సమస్యలను నిజాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో శ్యాంసుందర్ ప్రముఖ పాత్ర పోషించాడు.
-నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యతను కోరాడు.
-మరట్వాడా ప్రాంతంలో, ఔరంగాబాద్‌లో దళితుల విద్యకోసం అంబేద్కర్ ఏర్పాటుచేసిన పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు నిజాంను ఒప్పించి ఐదు లక్షలు కేటాయింపజేశాడు.
-1954లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.
-1968లో భారతీయ భీమ్‌సేన స్థాపించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు