wettest place in the state | రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం?
వర్షం, మేఘాలు ఎలా ఏర్పడతాయి?
-భూ ఉపరితలంపై మహాసముద్రాలు, నదులు, సరస్సులు మొదలైన జలభాగాలున్నాయి. వీటి నుంచి నీరు ఆవిరవుతుంది. భాష్పీభవన ప్రక్రియ ద్వారా శరీరం, చెట్లు, నేల నుంచి నీరు నీటి ఆవిరిగా మారి గాలిలో చేరుతుంది.
-వేడిగాలికి నీరు ఎక్కువగా ఆవిరై ఎప్పుడు ఆకాశానికి చేరుతుందో అప్పుడు అది చల్లబడుతుంది. కారణం భూ ఉపరితలం నుంచి పైకెళ్లేకొద్దీ ట్రోపో ఆవరణం వరకు ఉష్ణోగ్రత తగ్గుతుంది.
-అలా నీటి ఆవిరి చల్లబడుతూ ద్రవీభవనం జరిగి చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ నీటి బిందువుల చుట్టూ ఉన్న సూక్ష్మమైన ధూళి రేణువులు లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరుగుతుంది. ఇలా చిన్న నీటి బిందువులు కలిసి మేఘాలుగా ఏర్పడతాయి.
-మహాసముద్ర ప్రాంతాల్లో భాష్పీభవనం ఎక్కువగా జరుగుతుంది. కావున మహాసముద్ర ప్రాంత ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఏర్పడుతాయి.
-చిన్న నీటి బిందువులు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద బిందువులుగా రూపొందుతాయి. ఇవి బరువెక్కడంతో గాలిలో ఉండలేక వర్షరూపంలో భూభాగాన్ని చేరుతాయి.
-వేసవికాలంలో ఎక్కువ బాష్పీభవనం జరుగుతుంది.
-నీరు పగలు ఎక్కువగా ఆవిరవుతుంది.
-గరిష్ట స్థాయిలో భాష్పీభవనం మహాసముద్రాల నుంచి జరుగుతుంది.
-అవపాతం: వాతావరణంలోని నీటి ఆవిరి, మంచువర్షం, పొగమంచు, వడగండ్లు మొదలైన పలు రూపాల్లో భూమిని చేరుతుంది.
-తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య పొగమంచు ఎక్కువగా కురుస్తుంది. ఇది చలికాలంలో ఎక్కువగా కురుస్తుంది.
-మంచు, వర్షం కురవడం మధ్య తేడా: మంచు ఘనపదార్థం. ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఘనీభవనం చెంది హిమం ఏర్పడుతుంది. గాలి నీటిఆవిరి వల్ల సంతృప్తి చెంది ప్రకృతి సిద్ధంగా పైకి లేచిన తర్వాత ద్రవీభవనం చెంది వర్షం రూపంలో భూమిని చేరుతుంది. దాదాపు 30 సెం.మీ. హిమం 1 సెం.మీ. వర్షానికి సమానం.
-ఆర్థ్రత: వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్థ్రత అంటాం. ఉష్ణోగ్రతతోపాటు ఆర్థ్రత కూడా పెరిగినప్పుడు మనకు అసౌకర్యంగా ఉంటుంది. చెమట త్వరగా ఇంకిపోక ఉక్కగాను, జిగటగాను, ఉప్పుగాను ఉంటుంది.
-జలచక్రం: సముద్రాల నుంచి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా ఏర్పడి వాటికి చల్లగాలి తగలగానే వర్షిస్తుంది. ఆ నీరు పల్లపు ప్రాంతాల్లో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఈ ప్రక్రియనే జలచక్రం అంటారు.
-అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుంచి నైరుతి దిశకు వీస్తాయి. వీటి వల్ల అక్టోబర్, నవంబర్ నెలల్లో తెలంగాణలో చాలా తక్కువ వర్షపాతం సంభవిస్తుంది. ఈ పవనాలను ఈశాన్య రుతుపవనాలు లేదా తిరోగమన రుతుపవనాలు అంటారు.
-తూర్పుకోస్తాలో భయంకరమైన తుపాను 1977, నవంబర్లో సంభవించింది. 6 మీటర్ల ఎత్తున్న సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. కోస్తా తీరంలోని కనీసం 100 గ్రామాలు ధ్వంసమై, 9941 మంది చనిపోయారు.
ప్రదేశం నీరు ఆవిరయ్యే ప్రక్రియ
1) సముద్రాలు భాష్పీభవనం
2) నదులు భాష్పీభవనం
3) చెట్లు, మొక్కలు భాష్పోత్సేకం
4) నేల భాష్పీభవనం
5) గుంతలు భాష్పీభవనం
-వరదలు: అధిక వర్షాలు కురవడం, తుపానులు రావడం అనేవి వాతావరణానికి సంబంధించిన అంశం. వాటిని నియంత్రించడం మానవుని చేతుల్లో ఉండదు. కాబట్టి వాటి వల్ల వచ్చే వరదలు సహజసిద్ధమైనవి.
-వరదలకు కారణం అడవులను నరికివేయడం. అధిక వర్షాలు కురిసినప్పుడు భూమి పైపొర కొట్టుకుపోయి నదులు, వాగులు, పల్లపు ప్రాంతాల్లోకి చేరుతుంది. దీని ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పూడిక చేరి వాటి లోతు తగ్గుతుంది. ఫలితంగా తక్కువ వర్షం కురిసినా వరదలు సంభవిస్తాయి. ఈ వరదలు మానవ తప్పిదాల వల్ల వస్తున్నాయి.
-వరదలు గ్రామాలను ముంచెత్తితే తాగునీటి వనరులన్నీ కలుషితమై తాగడానికి పనికిరాకుండాపోతాయి. వ్యవసాయ భూముల్లో పంట నష్టం జరుగుతుంది. వరదల వల్ల ప్రాణ, ఆస్తి, పశునష్టం కలుగుతుంది. భూమి పైపొరలో ఉండే సారవంతమైన మృత్తికలు కొట్టుకునిపోతాయి.
-గంగానది పరివాహకంలో వరదలకు కారణం: పూర్వం గంగ, దాని ఉపనదులకు జన్మస్థలమైన హిమాలయాల్లో అడవులు పుష్కలంగా ఉండేవి. ఇటీవల కాలంలో చెట్లను అధికంగా నరికివేయడంతో అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. ఇక్కడ వర్షపాతం కారణంగా మృత్తికా క్రమక్షయం జరిగి వరద మైదానాలు ఏర్పడుతున్నాయి. తరచూ మట్టి చేరడంతో నది లోతు తగ్గి వరదలు సంభవిస్తున్నాయి.
వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఏం చేయాలి?
-తుపానులు, వరదలు కాలానుగుణంగా
సంభవిస్తుండటంతో టీవీలు, రేడియోల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలి.
-ప్రతి ఇంటిలో అత్యవసర కిట్ సిద్ధంగా ఉండేటట్లు చూడాలి. దగ్గరలోని పునరావాస కేంద్రాన్ని ముందుగానే గుర్తుంచుకోవాలి.
-ఇంటిగోడలు, పైకప్పు, తలుపులు, కిటికీలు గట్టిగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి.
-తుపాను హెచ్చరిక తెలిసిన వెంటనే మంచినీరు, ఆహారపదార్థాలు, తడిని తట్టుకొనే బ్యాగుల్లో సిద్ధం చేసుకోవాలి.
-హెచ్చరిక సమయంలో తీరప్రాంతాలకు వెళ్లరాదు.
-తలుపులు, కిటికీలు మూసేసి ఇంటిలోపలే ఉండాలి.
-ఇల్లు సురక్షితం కాదని భావిస్తే దగ్గరలోని పక్కా భవనంలోకి వెళ్లాలి.
-వాహనంపై ఉండగా తుపాను సంభవిస్తే వాహనాన్ని ఆపి సముద్రతీరం, చెట్లు, ఎలక్ట్రిక్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
-తుపానులు హఠాత్తుగా ఆగిపోయినప్పుడు అధికార యంత్రాంగం ప్రకటించే వరకు బయటికి రాకూడదు.
-హెచ్చరిక ప్రకటనలు, సలహాలు తీసుకొనే జాగ్రత్తలు రేడియోల ద్వారా ప్రసారం చేయాలి.
-వరదనీటిలోకి వెళ్లరాదు, అవి బాగా లోతుగా ఉండొచ్చు.
తెలంగాణలో వర్షపాతం
-జూన్లో నైరుతి రుతుపవనాల రాక
-మే-అక్టోబర్ మధ్య బంగాళాఖాతం నుంచి తుపానుల రాక/తుపాను వర్షం
-అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈశాన్య రుతుపవనాలు లేదా తిరోగమన రుతుపవనాల ద్వారా వర్షం. ఈ నెలల మధ్య తూర్పు, ఉత్తర తెలంగాణలో భారీ వర్షం, తెలంగాణ పీఠభూముల్లో మిత వర్షపాతం కురుస్తుంది.
కరవును తగ్గించడంలో అడవులు, వృక్ష సంపద పాత్ర
-అడవులు వాతావరణ సమతౌల్యాన్ని పరిరక్షిస్తాయి. అడవులు ఎక్కువగా ఉన్నచోట వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.
-భూమిపై చెట్లు, మొక్కలు, గడ్డి పెంచితే వర్షపు నీటి ప్రవాహవేగాన్ని తగ్గించొచ్చు. ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకడానికి తోడ్పడుతుంది. నీటిని భూమిలోకి ఇంకేటట్లు చేయడం వల్ల భూగర్భ జలం వృద్ధి చెందుతుంది.
-కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు బావులు, గొట్టపు బావుల ద్వారా భూగర్భ జలాన్ని ఉపయోగించుకొని కరవు పరిస్థితులను అధిగమించవచ్చు.
-ఈశాన్య రుతుపవనాల వల్ల కోస్తా ప్రాంతం అధిక వర్షం పొందుతుంది.
-ఈశాన్య రుతుపవనాలు వీచేకాలం అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలం
-తిరోగమన రుతపవనాలను ఈశాన్య రుతుపవనాలు అంటారు.
-ఆంధ్రప్రదేశ్లో 1997లో భయంకరమైన తుపాను కృష్ణానది డెల్టాలో సంభవించింది.
-దివిసీమ కృష్ణాజిల్లా తూర్పుకోస్తా ప్రాంతంలో ఉంది.
-పవన దిశలో ఉన్న సముద్రతీర ప్రాంతం వద్ద అధిక వర్షాలు కురుస్తాయి.
-బంగాళాఖాతంలో ఏర్పడిన మేఘాలను పవనాలు దేశంలోని ఈశాన్య రాష్ర్టాలకు తీసుకొనిపోతాయి.
-అరేబియా సముద్రంలో ఏర్పడిన మేఘాలను పవనాలు దేశంలోని కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా మొదలైన ప్రాంతాలకు తీసుకొనిపోతాయి.
-ఈశాన్య, నైరుతి దిశల నుంచి పవనాలు పశ్చిమబెంగాల్, ఢిల్లీ, లక్నోలకు రుతుపవన వర్షాలను తీసుకొనిపోతాయి.
-తెలంగాణలో 1) అధిక వర్షపాతం 100 సెం.మీ. కన్నా పైన ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో నమోదవుతుంది.
-అల్ప వర్షపాతం 100 సెం.మీ. కన్నా తక్కువ నిజామాబాద్, కరీంనగర్, మెదక్లలో నమోదవుతుంది.
-అత్యల్ప వర్షపాతం 60 సెం.మీ. కన్నా తక్కువ మహబూబ్నగర్, నల్లగొండలలో నమోదవుతుంది.
-నైరుతి రుతుపవనాల ద్వారా వర్షపాతం పొందనివి- తమిళనాడు తీరం, దక్షిణాంధ్రప్రదేశ్
-ఈశాన్య రుతుపవనాల ద్వారా వర్షంపొందే ప్రాంతం- తమిళనాడు తీరం (కోరమండల్ తీరం), ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు, కడప
-నైరుతి రుతుపవనాలు జూన్లో తెలంగాణలో ప్రవేశిస్తాయి.
-వరదల సమయంలో కలుషిత నీరు తాగడంవల్ల కలరా, కామెర్లు వంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయి.
-నదిలో ప్రధాన కాలువలకు ఇరువైపులా గులకరాళ్లు, ఇసుకుతో నిక్షేపించబడిన మైదానాలే వరద మైదానాలు.
వర్షపాతాన్ని కొలిచే పరికరమే వర్ష మాపకం.
-వరదల సమయంలో నీటిని శుద్ధి చేయడానికి హాలోజిన్ బిళ్లలు ఉపయోగించాలి.
-భాష్పీభవన ప్రక్రియ ఉష్ణోగ్రత పెరిగే కొద్ది వేగవంతమవుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు