The roar of free chambers | స్వేచ్ఛా గళాల గర్జన
వ్యాపారం కోసం భారత్‌కు వచ్చి కుట్ర, బలప్రయోగంతో దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ పాలకులపై భారత ప్రజలు తరుచూ తిరగబడుతూ వచ్చారని చరిత్ర చెబుతున్నది. ముఖ్యంగా మైదాన ప్రాంత ప్రజల కంటే స్వేచ్ఛాపిపాసులైన గిరిజన సమూహాలు బ్రిటిష్ దమననీతిని తీవ్రంగా వ్యతిరేకించి అనేక తిరుగుబాట్లు చేశాయి. మైదాన ప్రాంతాల నుంచి వ్యవసాయదారులు, వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, వారిని బలపరిచే బ్రిటిష్ అధికారుల దోపిడీ పెరిగిపోవటంతో గిరిజనులు అనేక హింసాయుత ఘర్షణలకు దిగారు. అసాధారణ సైనిక బలం ఉన్న బ్రిటిషర్లు ఈ తిరుగుబాట్లను ఎప్పటికప్పుడు అణచివేస్తూ వచ్చినప్పటికి తదనంతర కాలంలో స్వాతంత్రోద్యమ నాయకులకు, ప్రజలకు ఈ తిరుగుబాట్లే స్ఫూర్తిగా నిలిచాయి. బ్రిటిష్ పాలనాకాలంలో దేశంలో జరిగిన ప్రధాన తిరుగుబాట్ల వివరాలు నిపుణ పాఠకుల కోసం..
కట్ట బొమ్మన తిరుగుబాటు (1792-99)
-జరిగిన ప్రాంతం: తమిళనాడులోని తిరునల్వేలి.
-తిరుగుబాటు నాయకులు: వీర పాండ్య కట్ట బొమ్మన (పాంచాళ కురుచ్చీ ప్రాంత నాయకుడు)
-కారణం: బ్రిటిష్ సార్వభౌమాధికారం అంగీకరించకపోవడం
-ఫలితం: కట్ట బొమ్మనను ఉరితీసి, ఆయన రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించారు.
పైకుల తిరుగుబాటు (1804-06)
-జరిగిన ప్రాంతం: ఒరిస్సా
-తిరుగుబాటు నాయకులు: కుర్దారాజు, జగ్బంధు
-కారణం: బ్రిటిష్ రెవెన్యూ విధానానికి వ్యతిరేకంగా
-ఫలితం: తిరుగుబాటును అణచివేశారు.
వేలుతంబి తిరుగుబాటు (1808 – 09)
-జరిగిన ప్రాంతం: కేరళలోని ట్రావెన్కోర్
-తిరుగుబాటు నాయకులు: వేలుతంబి (ట్రావెన్కోర్ సంస్థాన దివాన్)
-కారణం: బ్రిటిష్ సైన్య సహకార విధానం అమలులోని లోపాలను ఒప్పుకోకపోవడం
-ఫలితం: వేలుతంబిని ఉరితీసి, తిరుగుబాటుని అణచివేశారు.
బారామాయి తిరుగుబాటు (1816-19):
-జరిగిన ప్రాంతం: కథియవార్.
-తిరుగుబాటు నాయకులు: రావూ బారామాయి (కచ్ పాలకుడు)
-కారణం: బ్రిటిష్ వారి విస్తరణను అంగీకరించకపోవడం
-ఫలితం: ఓడిపోయి సైన్య సహకార పద్ధతికి అంగీకరించడం
రామోసీల తిరుగుబాటు (1822-29)
-జరిగిన ప్రాంతం: పూనా
-నాయకులు: చిత్తూర్‌సింగ్, ఉమాజీ
-కారణం: పీష్వా రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించడంతో నిరుద్యోగులైన పోలీసులే ఈ రామోసీలు.
-ఫలితం: తిరుగుబాటు అణచివేసి వారికి భూములు, పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు.
కిట్టూర్ తిరుగుబాటు (1824-29):
-జరిగిన ప్రాంతం: కర్ణాటకలోని ధార్వార్ ప్రాంతం
-నాయకులు: రాణి చెన్నమ్మ, రాయప్ప
-కారణం: కిట్టూరు అధిపతి శివలింగ రుద్రదేశాయి మృతిచెందాక, దత్త కుమారుడిని బ్రిటిష్ వారు అంగీకరించకుండా పరిపాలన చేపట్టడం.
-ఫలితం: రాజు భార్య చెన్నమ్మను బ్రిటిష్ వారు జైలులో బంధించి, ఆమెను బలపరిచిన రాయప్పను చంపివేశారు.
సంబాల్పూర్ తిరుగుబాట్లు (1827-1910)
-జరిగిన ప్రాంతం: సంబాల్పూర్ (ఒరిస్సా)
-నాయకులు: సురేంద్రసాయి
-కారణం: వారసత్వ ఎన్నిక విషయంలో (కిట్టూరి మాధురి) బ్రిటిష్ వారు జోక్యం చేసుకోవడం
-ఫలితం: తిరుగుబాటుని అణచివేసి, సురేంద్ర సాయిని జీవితకాలం జైలులో బంధించారు.
శతవంది తిరుగుబాటు (1839-45)
-జరిగిన ప్రాంతం: మహారాష్ట్రలోని శతవంది
-నాయకులు: పాండూ సావంత్
-కారణం: బ్రిటిష్ వారు శతవంది ప్రాంతాన్ని ఆక్రమించడం
-ఫలితం: మార్షల్ లా ప్రకటించి అణచివేశారు.
సతార తిరుగుబాటు (1840-41)
-జరిగిన ప్రాంతం: మహారాష్ట్రలోని సతార
-నాయకులు: ధార్రావ్ పవార్
-కారణం: సతార రాజు ప్రతాప్‌సింగ్‌ను బ్రిటిష్ వారు పదవి నుంచి తొలిగించడం
-ఫలితం: ధార్రావ్ నాయకత్వంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బ్రిటిష్ వారు అణచివేశారు.
బుందేల తిరుగుబాటు (1842)
-జరిగిన ప్రాంతం: మధ్యప్రదేశ్‌లోని సాగర్ ప్రాంతం
-నాయకులు: మధుకర్షా, జవహర్‌సింగ్
-కారణం: బ్రిటిష్ వారి రెవెన్యూ విధానానికి వ్యతిరేకం
-ఫలితం: తిరుగుబాటును అణచివేసి, నాయకులను ఉరితీశారు
గడకారి తిరుగుబాటు (1840-45)
-జరిగిన ప్రాంతం: మహారాష్ట్రలోని కొల్హాపూర్
-కారణం: గడకారీలు కొల్హాపూర్ రాజు వద్ద ఉన్న భూములను తీసుకుని రాజుకు సేవచేసే ఉద్యోగులు. అయితే, బ్రిటిష్ వారు కొల్హాపూర్‌ను ఆక్రమించి పన్నులు విధించడంతో వ్యతిరేకించారు.
-ఫలితం: తిరుగుబాటుని అణచివేశారు
రౌజ్ తిరుగుబాటు (1827- 37)
-జరిగిన ప్రాంతం: విశాఖపట్నం
-నాయకులు: వీరభద్రరౌజ్
-కారణం: అతని జమీందారీ ప్రాంతాన్ని ఆక్రమించి పింఛను ఇవ్వడం.
-ఫలితం: అణచి వేశారు
పాలకొండ తిరుగుబాటు (1831- 32)
-జరిగిన ప్రాంతం: తూర్పుగోదావరి గిరిజన ప్రాంతం
-నాయకులు: పాలకొండ జమీందారు
-కారణం: పన్ను చెల్లించలేదని జమీందారీని ఆక్రమించడం
-ఫలితం: అణచి వేశారు
గుంసూర్ తిరుగుబాటు (1835- 37)
-జరిగిన ప్రాంతం: గంజాం ప్రాంతం (ఒరిస్సా)
-నాయకులు: ధనుంజయ భాంజ
-కారణం: పన్ను బకాయిలు చెల్లించలేదని బ్రిటిష్ వారు జమీందారీని ఆక్రమించడం
-ఫలితం: తిరుగుబాటు అణచివేత
పర్లాకిమిడి తిరుగుబాటు (1829-35)
-జరిగిన ప్రాంతం: పర్లాకిమిడి (ఒరిస్సా)
-నాయకులు: జగన్నాథ్, గణపతి నారాయణ రావ్
-కారణం: పన్ను బకాయిలు చెల్లించలేదని జమీందారీని ఆక్రమించడం
-ఫలితం: తిరుగుబాటు అణచివేత
వహాబి ఉద్యమం (1820-70)
-జరిగిన ప్రాంతం: ఉత్తర భారతదేశం, దక్కన్
-నాయకులు: సయ్యద్ అహ్మద్
-కారణం: బ్రిటిష్ వారిని తమ శత్రువులుగా ప్రకటించి, ముస్లిం రాజ్యాన్ని స్థాపించడం
-ఫలితం: 50 ఏండ్లపాటు సుదీర్ఘ పోరాటం చేశారు. అతికష్టం మీద బ్రిటిష్‌వారు ఉద్యమాన్ని అణచివేశారు.
పాగల్‌పంతి ఉద్యమం (1823 -35)
-జరిగిన ప్రాంతం: షేర్పూర్ (తూర్పుబెంగాల్)
-నాయకులు: కరంషా, టిప్పు
-కారణం: బ్రిటిష్ వారి అణచివేతకు వ్యతిరేకంగా
-ఫలితం: అణచివేశారు
కుకా ఉద్యమం (1845- 72)
-జరిగిన ప్రాంతం: పంజాబ్
-నాయకులు: భగత్ జవహర్‌మల్
-కారణం: సిక్కు మతాన్ని, సంఘాలను బలపరుచుకోవడం, బ్రిటిష్ వారి పంజాబ్ ఆక్రమణను వ్యతిరేకించడం
-ఫలితం: ఉద్యమాన్ని అణచివేశారు
ముఖ్యమైన గిరిజన తిరుగుబాట్లు
సంతాలులు (1855-56)
-ప్రస్తుత జార్ఖండ్ ప్రాంతం.
-సిద్ధో, కన్హో దీనికి నాయకులు.
-1846 – 48లో గోండులు చక్రబిషాయి నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
-1831-32లో హోళులు బుద్ధోభగత్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు.
-1913లో గోవింద్‌గురు నాయకత్వంలో భిల్లులు, 1914-16లో జాత్రభగత్ నాయకత్వంలో ఒరాన్లు, 1920లో రంపా ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో కోయలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
-1899-1900లో వచ్చిన ముండ తిరుగుబాటు ప్రాచుర్యం పొందింది. దీనికి బిర్సా ముండా నాయకత్వం వహించాడు. దీనికి మత రంగు కూడా కలిసింది. వైష్ణవ భక్తుడు అయిన బిర్సా తనను తాను మత ప్రవక్తగా ప్రకటించుకుని క్రైస్తవ మిషనరీలపై దాడులు చేశాడు. ఈ తిరుగుబాటును ఉల్గులాన్ తిరుగుబాటు అంటారు.
20వ శతాబ్దంలోని రైతు ఉద్యమాలు
-నీలిమందు విప్లవం: బెంగాల్లో ప్రారంభమైంది. బ్రిటిష్ పెట్టుబడిదారులు బెంగాల్‌లోని రైతులకు కొంత అడ్వాన్సులు ఇచ్చి నీలిమందు పంటను పండించమని కోరేవారు.
-వారి లాభాల కోసం మరింత ప్రాంతంలో నీలిమందు పండించాలని ఒత్తిడి చేయడం, వారికి ఇష్టమొచ్చిన ధరకు దానిని కొనడం, తమ మాట వినని రైతులపై దౌర్జన్యాలు చేశారు.
-దీనికి వ్యతిరేకంగా బెంగాల్‌లోని నాధియా జిల్లాలోని గోవింద్పూర్ గ్రామం నుంచి దిగంబర్ బిశ్వాస్, బిష్ణు బిస్వాస్ నాయకత్వంలో రైతులు తిరుగుబాటు చేశారు.
-హిందూ పేట్రియట్ పత్రిక ఎడిటర్ హరీశ్ చంద్ర ముఖర్జీ ఈ విప్లవానికి మద్దతు పలికాడు.
-దీనబంధుమిత్రగా ప్రఖ్యాతిగాంచిన సీఎఫ్ ఆండ్రూస్ తన నీల్దర్పన్ అనే పుస్తకంలో ఆ రైతుల కన్నీళ్లను, వారి బాధలను వర్ణించాడు.
పబ్నా ఉద్యమం
-జమీందారులు పన్నులు పెంచడం, మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా బెంగాల్‌లోని పబ్నా జిల్లాలోని యూసుఫ్ జాహి తాలూకాలో 1873లో ఈ తిరుగుబాటు ప్రారంభమైంది.
-ఇషాన్ చంద్రరాయ్, శంభూపాల్ వంటి వారు దీనికి నాయకత్వం వహించారు.
-చివరకు 1885లో బెంగాల్ కౌలు చట్టం ద్వారా ఈ సమస్య పరిష్కారమైంది.
-దక్కన్ తిరుగుబాటు: 1874లో మహారాష్ట్రలోని సిరూర్ తాలూకాలోని కార్దా గ్రామంలో వడ్డీ వ్యాపారి కాలూరామ్కు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది.
-రైతులంతా కలిసి వడ్డీ వ్యాపారులను సాంఘిక బహిష్కరణ చేశారు. గ్రామసేవకులు కూడా వారికి పనులు చేయకుండా, వారి భూములను దున్నకుండా అన్నిరకాలుగా సహాయ నిరాకరణ చేశారు.
-ఈ సాంఘిక బహిష్కరణ పూనా, అహ్మద్‌నగర్, షోలాపూర్, సతారా జిల్లాలకు వ్యాపించింది.
-అనంతరం ఈ సాంఘిక బహిష్కరణ అనేకచోట్ల వ్యవసాయదాడులుగా మారింది. వడ్డీ వ్యాపారుల ఇంటిపై దాడి చేయడం, వారి ఇండ్లను, అప్పు పత్రాలను తగులబెట్టడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.
-ఈ నేపథ్యంలో ప్రభుత్వం 1879లో దక్కన్ అగ్రికల్చరల్ రిలీఫ్ యాక్ట్ చేసి వడ్డీ రేటును నియంత్రించింది.
-ఈ ఉద్యమంలో పూనా సార్వజనీక సభ స్థాపంచిన జస్టిస్ రనడే ప్రజలను చైతన్యం చేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
-ఔధ్ (అవధ్) కిసాన్ ఉద్యమం: ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
-1918లో ఇంద్రనారాయణ్ ద్వివేది, గౌరీశంకర్ మిశ్రాలు కలిసి ఉత్తరప్రదేశ్ కిసాన్‌సభ ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని చేపట్టారు.
-ఈ సమయంలోనే బాబా రామచంద్ర రైతులను చైతన్యపరచి కుర్మీక్షత్రియ సభను ఏర్పాటు చేసి, జవహర్లాల్ నెహ్రూను అలహాబాద్‌లో కలిసి ఉత్తరప్రదేశ్ మొత్తం ఈ ఉద్యమం చేపట్టడానికి కారణమయ్యారు.
-నెహ్రూ, గౌరీశంకర్ మిశ్రా, బాబా రామచంద్ర 1920లో ఔధ్ కిసాన్సభను ఏర్పాటు చేసి, ఈ ఉద్యమాన్ని బలోపేతం చేశారు.
-1921 ఔధ్ రెంట్ చట్టం ద్వారా ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు