The quickest employment | త్వరిత ఉపాధి మార్గం ఐటీఐ
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిరంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రెయినింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రెయినింగ్ (ఎన్సీవీటీ) అనుబంధంగా రాష్ట్రంలో 54 ప్రభుత్వ, 222 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రెయినింగ్ (ఎస్సీవీటీ) అనుబంధంగా రాష్ట్రంలో 10 ఐటీఐలు నడుస్తున్నాయి. ప్రతి ఏటా మే/జూన్‌లో ఐటీఐ కోర్సుకు నోటిఫికేషన్ విడుదలవుతుంది.
-అభ్యర్థులు కోర్సు ఎంపిక చేసుకునే ముందు ఎందుకోసం ఆ కోర్సును ఎంపిక చేసుకుంటున్నాం అని విశ్లేషించుకోవాలి. స్వయం ఉపాధి కోసమైతే మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ రేడియో, టీవీ, మెకానిక్ రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషన్, పెయింటర్ జనరల్, ప్లంబర్ వంటి కోర్సులు మేలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలనుకునే వారు ఐటీఐలలో ఇంజినీరింగ్ కోర్సుల వైపు దృష్టి సారించాలి.
-కోర్సు వ్యవధి: రెండేండ్లు (నాలుగు సెమిస్టర్లు)/ ఏడాది (రెండు సెమిస్టర్లు), ఆరు నెలలు (ఒక సెమిస్టర్ మాత్రమే)
-విభాగాలు: ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/స్టేట్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్/సీబీఎస్సీ, ఐసీఎసీఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఓఎస్), తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీవోఎస్ఎస్) నుంచి ఎస్ఎస్సీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
-ఎనిమిదోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా కొన్ని ట్రేడుల్లో ప్రవేశానికి అర్హులు.
-ఎంపిక: ఎస్ఎస్సీ మార్కుల ఆధారంగా ఉంటుంది. సీట్ల కేటయింపు నియమనిబంధనల మేరకు మెరిట్ కం రిజర్వేషన్ ఆధారంగా జరుగుతుంది.
ఇంజినీరింగ్ కోర్సులు
-అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ (ఏడాది), డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ (రెండేండ్లు), డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్ (రెండేండ్లు), ఎలక్ట్రీషియన్ (రెండేండ్లు), ఎలక్ట్రానిక్ మెకానిక్ (రెండేండ్లు), ఎలక్ట్రోప్లేటర్ (రెండేండ్లు), ఫిట్టర్ (రెండేండ్లు), ఫౌండ్రీమెన్ (ఏడాది), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్ (రెండేండ్లు), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (రెండేండ్లు), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంట్ (రెండేండ్లు), మెషినిస్ట్ (రెండేండ్లు), మెషినిస్ట్ గ్రైండర్ (రెండేండ్లు), మెకానిక్ కంప్యూటర్ హార్డ్‌వేర్ మెషినిస్ట్ (రెండేండ్లు), మెకానిక్ డీజిల్ (ఏడాది), మెకానిక్ మెషీన్ టూల్స్ మెయింటెనెన్స్ (మూడేండ్లు), మౌల్డర్ (ఏడాది), ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్ (ఏడాది), ప్లంబర్ (ఏడాది), టర్నర్ (రెండేండ్లు), షీట్ మెటల్ వర్కర్ (ఏడాది).
నాన్ ఇంజినీరింగ్ కోర్సులు
-బుక్ బైండింగ్ (రెండేండ్లు), కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (ఏడాది), కటింగ్ అండ్ సీవింగ్ (ఏడాది), డాటా ప్రిపరేషన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ (ఏడాది), డ్రెస్ మేకింగ్ (ఏడాది), హ్యాండ్ కంపోజిటర్ (ఏడాది), హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ (ఏడాది), లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్, లిథో ఆఫ్సెట్ మెషిన్ మైండర్, సెక్రటేరియల్ ప్రాక్టీస్, స్టెనోగ్రఫీ ఇంగ్లిష్ (ఏడాది)
అప్రెంటిస్‌షిప్
-ఐటీఐ ఉత్తీర్ణులయ్యాక అభ్యర్థి సంబంధిత జిల్లా అసిస్టెంట్ అప్రెంటిస్‌షిప్ అడ్వైజర్ వద్ద పేరు నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థల్లో అప్రెంటిస్‌షిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయా సంస్థల నిబంధనల ప్రకారం అప్రెంటిస్‌షిప్ కాలపరిమితి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో ఏడాది, ప్రైవేటు సంస్థల్లో ఆరు నెలలు ట్రెయినింగ్ ఉంటుంది. ఈ సమయంలో స్టయిఫండ్ చెల్లిస్తారు. జాతీయ అప్రెంటిస్‌షిప్ పరీక్ష ఉత్తీర్ణులైతే సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తప్పనిసరిగా ఐటీఐతో పాటు అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి. ఉదాహరణకు ఐటీఐ ఫిట్టర్ పూర్తిచేసినవారు బీహెచ్ఈఎల్, బీఈఎంఎల్, హాల్, బీఎస్ఈసీఓఎం, కేపీటీసీఎల్ తదితర ప్రభుత్వరంగ సంస్థలు, టొయోటా, మారుతి, టాటా, హోండా, ఎక్సైడ్ తదితర ప్రైవేటు రంగ సంస్థలు అప్రెంటిస్‌షిప్‌కు అవకాశం కల్పిస్తున్నాయి.
ఉన్నత విద్య వైపు
-ఐటీఐ పూర్తి చేసిన తర్వాత చదువును కొనసాగించాలనుకునే వారికి అత్యుత్తమమైన మార్గం పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశం పొందడం. సంబంధిత ట్రేడ్‌లో మాత్రమే పాలిటెక్నిక్‌లో చేరడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇంజినీరింగ్ చదవవచ్చు. ఆపైన ఎంటెక్ చేయడానికీ అవకాశం ఉంటుంది.
-ఐటీఐ పూర్తిచేసిన తర్వాత జనరల్ డిగ్రీలో ప్రవేశం పొందవచ్చు.
తక్షణం స్వయం ఉపాధి
-ఐటీఐ పూర్తి చేసిన వారికి ఉపాధికి ఢోకా ఉండదు. పై చదువులు, ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఇష్టం లేనివారు.. స్వయం ఉపాధి పొందవచ్చు. మరికొందరికి ఉపాధి చూపవచ్చు. ఇందుకు అనువైన కోర్సులు మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ రేడియో, టీవీ, మెకానిక్ రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషన్, పెయింటర్ జనరల్, ప్లంబర్, శానిటరీ, ఫిట్టర్, వెల్డర్ గ్యాస్, ఎలక్ట్రానిక్, వైర్‌మెన్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్. ఐటీఐలో థియరీ కంటే ప్రాక్టికల్కే ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి నేర్చుకోవాలనే తపన కష్టపడేతత్వం ఉంటే బహుముఖ నైపుణ్యాలను సొంతం చేసుకుని స్వయం ఉపాధితో రాణించవచ్చు.
ఉద్యోగావకాశాలు
-ఐటీఐ డీజిల్ మెకానిక్ పూర్తిచేసిన వారికి ప్రభుత్వరంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. డీజిల్ మెకానిక్ పూర్తిచేసిన వారికి భారతీయ రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ రవాణాశాఖ, రక్షణరంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
-ఐటీఐ ఎలక్ట్రీషియన్ వారికి ఇండియన్ రైల్వే, డీఆర్డీఓ, బీఎస్ఎన్ఎల్ టీటీఏ, ఎంటీఎన్ఎల్, ఎలక్ట్రిసిటీ బోర్డు, ఎన్పీసీ, సెయిల్ తదితర సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.
-ఐటీఐ డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్ అండ్ బీ శాఖలో సివిల్ వర్క్స్, ల్యాండ్ సర్వేయర్లుగా ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
-ఐటీఐ టర్నర్ పూర్తిచేసిన వారికి ఉత్పత్తి, తయారీ పరిశ్రమలు, ఆటోమొబైల్ అనుబంధ ఫ్యాక్టరీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వేలు, షిప్ బిల్డింగ్, రిపేర్, మౌలిక వసతులు, రక్షణరంగంతోపాటు ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్ఈఎల్, బీఈఎంఎల్, ఎన్టీపీసీ, సైనికపరమైన వర్క్‌షాప్‌లలో ఉపాధికి అవకాశం ఉంటుంది.
-ఐటీఐ డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్) ప్రభుత్వ రక్షిత భవనాల సంరక్షణ, ఉత్పత్తి, తయరీ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. నిర్మాణ రంగంలో అవకాశాలకు కొదవ ఉండదు. సేవారంగాలైన రవాణా, రైల్వేలు, షిప్ బిల్డింగ్, ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలతోపాటు బీహెచ్ఈఎల్, బీఈఎంఎల్, ఎన్టీపీసీ తదితర ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో మౌలిక సదుపాయాల కల్పనలో అవకాశాలు ఉంటాయి.
-ఐటీఐ అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) పూర్తిచేసిన వారికి కెమికల్ ప్లాంట్లలో మెషీన్ ఆపరేటర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి.
-ఐటీఐ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ పూర్తిచేసిన వారు మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ ఇతర సంబంధిత వస్తువుల మరమ్మతుల కోసం సొంతంగా వర్క్‌షాప్‌ను ప్రారంభించవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు