Cultural diversity | సాంస్కృతిక భిన్నత్వం
నీగ్రిటోలు
-నలుపురంగు, దళసరి పెదాలు కలిగి ఉండి దేశంలో మొదట స్థిరపడినవారు నీగ్రిటోలనే అభిప్రాయం ఉంది. వీరు సమాజంలోని పురాతన జాతి. దక్షిణ భారతేదశంలోని కడారులు, ఇరులాలు, పునియన్లు, రాజమహల్ పర్వతాల్లో నివసించే వారిలో ఈ లక్షణాలు ఉన్నాయి. వీరు ఆఫ్రికా నుంచి ఇరాక్ మీదుగా చేరుకున్నారు.
ఉదా: యానాదులు, ఎరంబులు, ఇరులు, పాయన్లు, అండమాన్ జాతులు
ప్రోటోఆస్ట్రలాయిడ్లు
-పశ్చిమ ఆసియా ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారు ప్రోటోఆస్ట్రలాయిడ్లు. గోధుమ రంగు, దట్టమైన శిరోజాలు, వెడల్పాటి ముక్కు, చిన్న గడ్డంతో ఉంటారు.
ఉదా: సంతాలులు, ముండారీలు, లక్కాకోలులు, కొరవలు, గదబలు. వీరే మొదటగా వ్యవసాయం ప్రారంభించారనే అభిప్రాయం ఉంది.
-భారతదేశ ఈశాన్య ప్రాంతంలో స్థిరపడిన చివరి విదేశీ జాతుల వారు మంగోలాయిడ్లు.
ఉదా: అసోం, నాగాలాండ్, బెంగాల్, త్రిపుర, సిక్కిం, భూటాన్ నివాసితులు.
ద్రవిడియన్లు
-మెడిటేరియన్లలో ఒక భాగమైనవారు ద్రవిడియన్లు. ఆర్యులకు పూర్వమే స్థిరనివాసం, నాగరికతను ఏర్పర్చారు. వీరి భాష పేరుమీదుగా వీరికి ద్రవిడులనే పేరు వచ్చింది. దక్షిణ భారతదేశం మొత్తం వ్యాపించారు. వీరిని దస్యులు అని ఆర్యులు పిలిచేవారు. అలాగే దక్షిణ భారతాన్ని ద్రవిడ దేశం అని అంటారు.
వెస్ట్రన్ బాకిసెఫల్స్
-దేశ జనాభాలో అత్యంత అల్పసంఖ్యలో ఉన్న వెస్ట్రన్ బ్రాకి సెఫల్స్ అండమాన్, ఇతర ప్రాంతాల్లో అతి అరుదుగా కన్పిస్తారు.
నార్డిక్‌లు
-దేశంలో స్థిరపడిన ఆర్యన్లు లేదా ఇండో ఆర్యన్లు నార్డిక్ జాతికి చెందినవారు. ఇక్కడకు వలసవచ్చి స్థిరపడి నాగరికతలను ఏర్పర్చి భారత్‌లో భాగమయ్యారు. వీరి రాకతో భారతీయ నాగరికత, సంస్కృతిలో మార్పులు చోటుచేసుకున్నాయి. వీరు సాహసికులు అవడంతో దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
-ఈ విధంగా భారతీయ సమాజం భిన్న ప్రాంతాల నుంచి ఆగమనం చెందిన జాతులు, స్థానిక ద్రవిడ జాతులతో కలగలసి, వారి ఆచార సంప్రదాయాలతో సంక్లిష్టంగా జాతి భిన్నత్వాన్ని కలిగి ఉంది.
భాషాపరమైన భిన్నత్వం
-1971 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 1652 రకాల మాండలికాలు మాట్లాడే జనసమూహాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో 22 రకాల భాషలను గుర్తించింది. ఇందులో 75 శాతం ఇండో ఆర్యన్ భాషలు, 20 శాతం ద్రవిడియన్ భాషను మాట్లాడుతారు.
-దేశంలో భాషకు, ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉండటంతో ఆయా ప్రాంతాలు ఆయా భాషల ప్రత్యేకతతో వ్యవహరించబడుతున్నాయి.
ఉదా: తెలుగు ప్రాంతం, కన్నడ ప్రాంతం, తమిళ ప్రాంతం
-ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రకారం దేశంలో 5 ప్రధాన సమూహాలకు చెందిన భాషలు ఉన్నాయి. అవి.. నీగ్రోయిడ్ భాషా కుటుంబం, ఇండో ఆర్యన్ భాషా కుటుంబం, ద్రవిడ భాషా కుటుంబం, ఆస్ట్రో-ఏషియాటిక్ భాషా కుటుంబం, సైనోటిబెటియన్ భాషా కుటుంబం.
-ఇందులో అతిపురాతనమైనది నీగ్రోయిడ్ భాష. దీన్నే అండమాన్ భాష అంటారు. ఇది అతి పురాతనమైంది.
-భారతీయ జనాభాలో సుమారు 70 శాతం ప్రజలు ఇండో- ఆర్యన్ కుటుంబానికి చెందిన భాషలనే ఉపయోగిస్తారు. ఇందులో ముఖ్యమైనవి హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, అస్సామీ, బిహారి, బెంగాలీ, ఒరియా.
-భారతీయ జనాభాలో 25 శాతం ప్రజలు ఉపయోగిస్తున్న భాషలు ద్రవిడియన్ భాషా కుటుంబానికి చెందినవే. ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజల భాషలు ఈ కుటుంబానికి చెందినవే. ఉదా: తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మొదలైనవి.
-మిగితా భాషా కుటుంబాలకు చెందిన భాషలను దేశంలోని వివిధ ప్రాంతాల వారు ఉపయోగిస్తున్నారు.
-ఇంతలా భాషాపరమైన వైవిధ్యం ప్రపంచంలో ఏ సమాజంలో కూడా లేదు. అయినా జాతీయ భాష, అధికార భాషగా హిందీని ఉపయోగిస్తుండటం వల్ల ప్రజల మధ్య సమాచార ప్రసారానికి ఆటంకం లేకుండా ఏకత్వానికి తోడ్పడుతుంది.
-భాషాపరమైన వైవిధ్యం వల్ల ప్రత్యేకతలు ఉన్నా అధికమైన భాషా వ్యామోహం, ఇతర భారతీయ భాషలపై ఇతర ప్రాంతాల వారిపై అయిష్టతను, వ్యాకులతను కలిగిస్తూ గే ప్రాంతీయతత్వాన్ని పెంచే విధంగా రుణాత్మకమైన ప్రభావాన్ని కలిగి ఉంది. ఒక దశలో భాషను ప్రాతిపదిక చేసుకొని రాష్ర్టాలను అంటే భాషాప్రయుక్త రాష్ర్టాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
మతపరమైన వైవిధ్యం/ భిన్నత్వం
-మానవుని సామాజిక, మానసిక, వైయక్తిక ప్రవర్తనను తీవ్రంగా ప్రభావం చేసేది మతం. అందుకే కార్ల్‌మార్క్స్ మతం సమాజానికి మత్తుమందు లాంటిదన్నాడు. ప్రతి సమాజంలోనూ ప్రజల జీవన విధానం, సంస్కృతి, నాగరికత, అలవాట్లు, కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాలు ఎక్కువ మొత్తం మతంతో స్థాపితమై, అమలవుతాయి.
-భారతీయ సమాజం విభిన్న మత సంస్కృతులకు నిలయం అందువల్లనే భారతదేశాన్ని మతాలకు ప్రయోగశాల అంటారు. భారతదేశంలో భిన్న సంస్కృతులకు, సంప్రదాయ రీతులకు ప్రధాన కారణం ఆయా మతాలే. అధిక సంఖ్యాకులు హిందూ మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ వీరితోపాటు ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, పారశీకులు, సిక్కులు, ఇతర మతాల వారు ఈ నేలపై నివసిస్తున్నారు. ఈ రకమైన వైవిధ్యం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.
-ఇలాంటి మతపరమైన భిన్నత్వం సమాజంపై రుణాత్మకంగాను, ధనాత్మకంగాను ప్రభావాన్ని చూపుతుంది. జాతీయతాభావం, జాతీయ పతాకం, రాజ్యాంగపరమైన ఏర్పాటు, లౌకిక జాతీయ విధానం అనే ఇన్ని వైవిధ్యతల మధ్య ఏకతను సాధిస్తున్నది. మరోవైపు మతోన్మాదం వెర్రితలలు వేస్తూ తీవ్రవాదం రూపంలో దేశ ఐకమత్యానికి సవాలుగా మారింది.
-మతాల మధ్య భిన్నత్వంతోపాటు ప్రతి భారతీయ మతంలో కూడా అంతరంగా వైవిధ్యత ఉంది.
-హిందూ మతం: వైష్ణవం, శైవం, పంచాయతనం, శైవంలో మళ్లీ వీరశైవం, కాపాలిక, పాశుపతం వంటి వైవిధ్యత ఉంది.
-జైనం: శ్వేతంబరం, దిగంబరం
-బౌద్ధం: మహాయానం, హీనయానం, వజ్రయానం
-సిక్కులు: నాందారి, నిరాకారి వ్యవస్థలు
-ఇస్లాం: షియా, సున్నీ సాంస్కృతికపరమైన భిన్నత్వం
-భారత సమాజం భిన్న సంస్కృతుల సమ్మేళనం. దేశంలో భిన్న మతాల మధ్య సాంస్కృతిక మతపరమైన వైవిధ్యాలు, ప్రతి మతంలో కూడా భిన్నమైన సాంస్కృతిక రూపాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా కులం రూపంలో ఉన్నాయి. సుమారుగా 2000లకు పైగా కులాలు, 25,000లకు పైగా ఉపకులాలు ఉన్నాయి.
-దేశంలో దక్షిణ, ఉత్తర, ఈశాన్య, తూర్పు, పడమర ప్రాంతాల్లో వివిధ రకాల సంప్రదాయాల అనుసరణ ఆయా సామాజిక రూపాలైన వివాహం, బంధుత్వం, పండుగలు, ఆహారపు అలవాట్లు, వేషధారణ ఇంకా కట్టడాలు ఇలా వివిధ రూపాల్లో కనిపిస్తుంది.
-కులం అనే సామాజిక వ్యవస్థ భారతదేశంలోనే ఉద్భవించి భారతదేశంలో మాత్రమే కొనసాగుతున్నది. అందుకే భారత్‌ను Country of caste అంటారు.
ఆవాసపరమైన భిన్నత్వం
-భారతీయ సామాజిక నిర్మాణం మూల స్తంభాలు 1. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ 2. కులం 3. గ్రామీణ సామాజిక నిర్మాణం.
-భారతదేశం ఇంతగా పట్టణీకరణకు గురైతున్నప్పటికీ ఎక్కువ శాతం సమాజం గ్రామాలతో నిర్మితమైనది. అలాగే వ్యవసాయ ఆధారమైనది.
-సమాజంలో ప్రధానంగా 1. గ్రామీణ సముదాయాలు 2. నగర సముదాయాలు 3. గిరిజన సముదాయాలు వీటితోపాటు నోమాడిక్ సంస్కృతి, మెట్రోపాలిటన్ సముదాయాలు కూడా ఉన్నాయి.
-వ్యవసాయం, చేతువృత్తులపై ఆధారపడి, పరస్పర సంబంధాలను కలిగి, కులం, మతం, సంప్రదాయాలు వంటి వాటిని అధికంగా పాటిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సముదాయాలే గ్రామీణ సముదాయాలు. ఇవి భారత సామాజిక నిర్మాణంలో అగ్రస్థానంలో ఉన్నాయి.
భిన్నత్వంలో ఏకత్వం
-భారత సమాజంలో విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు, కులాలతోపాటు సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక భిన్నత్వం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించింది. అందుకు ముఖ్య కారణాలు అందరం భారతీయులమనే భావన, మన దేశం, మన రాజ్యం, మన రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ పండుగలు, జాతీయ గీతం, జాతీయ భాష, సెక్యులర్ విధానాలు. ఇలాంటి విశిష్టమైన భిన్నత్వం గల అందరిని ఒకే భరతమాత ముద్దుబడ్డలుగా నిలబెట్టగలగడం భారత సమాజ నిర్మాణం విశిష్ట లక్షణం.
-ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ మూలశాసనం, సమాన హక్కులు, చట్టం ముందు సమానత్వం వంటి రాజకీయ అంశాలతోపాటు భౌగోళికంగా విభిన్నతలున్న దేశం వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన వనరులు కలిగి ప్రజలందరి అవసరాలు తీరుస్తూ మనదేశం మన సంపద వంటి భావనలను ప్రేరేపిస్తున్నాయి.
-సంఘ సంస్కరణ ఉద్యమాలు, భక్తి ఉద్యమాలు, సూఫీ ఉద్యమాలు వంటివి ఏకత్వ సాధనకు ఇతోధికంగా తోడ్పడ్డాయి. ప్రభుత్వాలు సంక్షేమ రాజ్య లక్ష్యం దిశగా పయనిస్తూ ప్రజలందరిని ఒకే రకంగా ఆదరించడం కూడా భిన్నత్వంలో ఏకత్వానికి దారితీసున్నది.
-వివిధ మతాల్లో భిన్న వర్గాలు ఉన్నా (శైవం, వైష్ణవం, సున్నీ, షియా) ఆయా మత శాఖల మధ్యగల ఆదర్శాల పోలిక, ఉమ్మడి దేవతారాధన వంటి అంశాలు ఆయా మతాల మధ్య ఏకత్వ సాధనకు కృషి చేస్తున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు