TSPSC JL & DL Telugu | జేఎల్, డీఎల్, గురుకుల లెక్చరర్ ప్రిపరేషన్
ప్రభుత్వం జేఎల్, డీఎల్, గురుకుల టీచర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి అర్హత ఉన్న
ప్రతిఒక్కరూ పోటీపడుతుంటారు. ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఉంటారు. కానీ ఎలా చదవాలో తికమకపడే వారు చాలామంది ఉంటారు. వారి కోసమే ‘నిపుణ’ అందిస్తున్న ఈ వ్యాసం. దీనిలో సబ్జెక్టులవారీగా ఎలా చదవాలో తెలుసుకుందాం..
తెలుగు
- సాధారణ జూనియర్ కాలేజీల్లో 60, డిగ్రీ కాలేజీల్లో 27, గురుకుల జూనియర్ కాలేజీల్లో 225, డిగ్రీ కాలేజీల్లో 55 మొత్తం 367 తెలుగు పోస్టులు ఉన్నాయి.
- ఇతర సబ్జెక్టుల వారితో పోలిస్తే తెలుగు రాసేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. రోజువారీ ప్రణాళిక, సమగ్రమైన మెటీరియల్, సిలబస్‌ను అంశాలవారీగా ప్రాక్టీస్ చేయడం, మోడల్ పేపర్స్ సాధన, గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు.
- ముందుగా గుర్తుంచుకోవాల్సింది పేపర్-1 జనరల్ స్టడీస్. ఇది ఇతర సబ్జెక్టుల వారితో పోలిస్తే తెలుగు అభ్యర్థులకు కొంత కష్టంగా ఉంటుంది. జనరల్ స్టడీస్‌లో తెలంగాణ రాష్ట్రంలోని 6-10 తరగతుల వరకు గల సోషల్ స్టడీస్, సైన్స్ పాఠ్యపుస్తకాలను బాగా చదవాలి.
- లాజికల్ రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, కళలు-వారసత్వం, సాహిత్యం మొదలైన అంశాలను ప్రత్యేకంగా చదవాలి. కరెంట్ అఫైర్స్‌తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి.
పేపర్-2
- దీనిలో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. కాబట్టి ఈ పేపర్ చాలా కీలకం. దీనిలోని ప్రధాన అంశాలు..
1) సంప్రదాయ సాహిత్య కవుల అధ్యయనం – కాలం, రచనలు
2) వేమన తాత్వికత – సమకాలీన పరిశీలన, దృక్పథం – సమాజంలో వేమన కవిత్వ ప్రభావం
3) సాహిత్య ధోరణుల అధ్యయనం (ఆధునిక కవిత్వోద్యమాలు)
4) జానపద విజ్ఞానం (జానపద సాహిత్యం)
5) ఆధునిక కవుల అధ్యయనం (కాళోజీ, దాశరథి, కందుకూరి, సినారె, గురజాడ, శ్రీశ్రీ, ఎన్ గోపి మొదలైనవారు)
6) తెలుగు వ్యాకరణం – ఛందస్సు అధ్యయనం (బాల వ్యాకరణం, వృత్తాలు, జాతులు, ఉపజాతులు, అలంకారాలు)
7) తెలుగు భాషా చరిత్ర పరిణామం (ప్రాజ్ఞ్నన్నయ యుగం నుంచి నేటి వరకు)
8) భాషా విజ్ఞాన అధ్యయనం – భాషా శాస్త్రం (అర్థ విపరిణామం, శాసన సభ నుంచి సాహిత్య భాష వరకు)
9) తెలుగు సాహిత్య పరిణామం (ప్రాజ్ఞ్నన్నయ యుగం నుంచి నేటి వరకు)
10) సౌందర్య, సాహిత్య విమర్శ అధ్యయనం (ప్రాక్, పశ్చిమ, ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ)
11) సంస్కృత వ్యాకరణం – కావ్యాల అధ్యయనం (పంచతంత్రం, హితోపదేశం, కాళిదాసు కృతులు, సంస్కృత పంచ కావ్యాల పరిచయం) - ఈ సిలబస్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అంశాలవారీగా పట్టు సాధించాలి. జేఎల్, డీఎల్, గురుకుల కాలేజీ పరీక్షలకు సిలబస్ దాదాపు ఒకేవిధంగా ఉంటుంది. కాబట్టి ఒక్క పరీక్షకు సన్నద్ధమైతే మూడు ఉద్యోగాల్లో ఏదో ఒకటి సాధించవచ్చు. ప్రిపరేషన్లో కింది అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.
తెలుగు సాహిత్య చరిత్ర
- ప్రాజ్ఞ్నన్నయ యుగం నుంచి ఆధునిక యుగం వరకు గల 10 యుగాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. తెలుగు సాహిత్య చరిత్రను, యుగాలవారీగా కవులను అధ్యయనం చేస్తూ సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి.
- సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ముంగిలి, జీ నాగయ్య తెలుగు సాహిత్య సమీక్ష, ద్వానా శాస్త్రి తెలుగు సాహిత్య చరిత్ర, ఎన్కే మద్దిలేటి తెలుగు సాహిత్య దీపిక పుస్తకాలను బాగా చదవాలి.
- వేమన తాత్వికత – సమకాలీన సమాజంపై వేమన కవిత్వ ప్రభావం
- వేమన పద్యాలు, వాటి ప్రభావం, వేమనపై పలువురి పరిశోధనలు చదవాలి.
- రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రచించిన వేమన, ఆరుద్ర రచించిన మన వేమన, మరుపూరు కోదండరామిరెడ్డి, ఎన్ గోపి వంటి రచయితల సిద్ధాంత వ్యాస గ్రంథాలు చదవాలి.
తెలంగాణ సాహిత్య చరిత్ర
- ప్రాచీన తెలంగాణ కవుల నుంచి ఆధునిక, నేటి తెలంగాణ కవుల వరకు)
- ముంగిలి, తెలుగు అకాడమీ వారి తెలంగాణ సమగ్ర సాహిత్యం, ముదిగంటి సుజాతా రెడ్డి తెలంగాణ సాహిత్య చరిత్ర, ఎన్కే మద్దిలేటి తెలుగు భాషా సాహిత్యాలు వంటి పుస్తకాలతో పాటు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠ్యపుస్తకాలు చదవాలి.
ఆధునిక కవిత్వోద్యమాలు
- సంఘసంస్కరణ, జాతీయోద్యమ కవిత్వం, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీ వాద కవిత్వం దళిత వాద కవిత్వం, అనుభూతి కవిత్వం, మైనారిటీ కవిత్వం, తెలంగాణ అస్థిత్వవాద కవిత్వం, తెలంగాణ ఉద్యమ కవిత్వం మొదలైనవి అధ్యయనం చేయాలి.
- తెలుగు అకాడమీ వారి తెలుగులో కవిత్వోద్యమ పుస్తకాలు చదవాలి.
జానపద విజ్ఞానం
- జానపద గేయాలు, కళలు-కళాకారులు, కళారూపాలు, సామెతలు, పొడుపు కథలు, ఐతిహ్యాలు, గద్య కథనాలు, జానపద సాహిత్యంపై పలువురి పరిశోధనలను అధ్యయనం చేయాలి.
- ఆర్వీఎస్ సుందరం ఆంధ్రుల జానపద విజ్ఞానం, జీఎస్ మోహన్ జానపద విజ్ఞానాధ్యయనం పుస్తకాలు చదవాలి.
తెలుగు భాషా చరిత్ర – భాషా శాస్త్రం
- భాషా నిర్వచనాలు, భాషా కుటుంబాల వర్గీకరణ, ద్రావిడ భాషలు, తెలుగు లిపి పరిణామం, ఆంధ్రం – తెలుగు, ధ్వని పరిణామం, అర్థ విపరిణామం, గ్రాంథిక, వ్యవహారిక భాషోద్యమాలు, ఆధునిక ప్రామాణిక, ప్రసార మాధ్యమాల భాష, తెలుగులో అన్యదేశ్యాలు, తెలుగు భాషా వికాసం, పలువురి పరిశోధనలపై అధ్యయనం చేయాలి.
- భద్రిరాజు కృష్ణమూర్తి సంపాదకత్వంలో వెలువడిన తెలుగు భాషా చరిత్ర, వెలమల సిమ్మన్న తెలుగు భాషా చరిత్ర పుస్తకాలు చదవాలి.
సాహిత్య విమర్శ – అలంకార సౌందర్య శాస్త్రం
- కవి – కావ్యం, కావ్య నిర్వచనాలు, కావ్య ప్రయోజనాలు, కావ్య హేతువులు, కావ్య సంప్రదాయాలు, కావ్య భేదాలు, భారతీయ నాటకం – దశరూపకాలు, రస సిద్ధాంతం – స్వరూప స్వభావం, ధ్వని సిద్ధాంతం, సాహిత్య విమర్శ, ప్రముఖ ప్రాచ్య, పాశ్చాత్య అలంకారికుల అలంకార శాస్త్ర గ్రంథాలు – అభిమతాలు అధ్యయనం చేయాలి.
- పింగళి లక్ష్మీకాంతం సాహిత్య శిల్ప సమీక్ష, దివాకర్ల వేంకటావధాని సాహిత్య సోపానాలు పుస్తకాలు చదవాలి.
సంస్కృత సాహిత్య చరిత్ర – వ్యాకరణం
- పంచతంత్ర, హితోపదేశం, కాళిదాసు కృతులు, సంస్కృత పంచ కావ్యాల పరిచయం, సంస్కృత సంధులు, సంస్కృత సమాసాలు అధ్యయనం చేయాలి.
- ముదిగంటి సుజాతా రెడ్డి సంస్కృత సాహిత్య చరిత్ర పుస్తకం చదవాలి.
బాల వ్యాకరణం – పరిచయం - దీనిలోని సంజ్ఞ, సంధి, క్రియా, తత్సమ, ఐచ్ఛిక పరిచ్ఛేదాలు అధ్యయనం చేయాలి.
- వంతరాం రామకృష్ణ బాల వ్యాకరణ ఘాంటాపథ వ్యాఖ్య చదవాలి.
తెలుగు వ్యాకరణం - క్రియలు, వాక్యం – వాక్య భేదాలు, సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు అధ్యయనం చేయాలి.
- తెలుగు వ్యాకరణ చంద్రిక, తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు చదవాలి.
- పై విధంగా తెలుగు సిలబస్‌ను అంశాలవారీగా విభజించుకొని, చక్కని స్టడీ మెటీరియల్‌ను సేకరించుకొని, గత తెలుగు పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వారి మార్గదర్శక సలహాలను పాటిస్తూ ప్రిపరేషన్ అయితే చాలామంచిది. ప్రశ్నల సరళి యూజీసీ నెట్ పరీక్షల విధానాన్ని పోలి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సన్నద్ధం కావాలి. ప్రశ్నపత్రంలోని ప్రశ్నల సరళి కింది విధంగా ఉంటుంది.
1) ఒక ప్రశ్నకు నాలుగు సమాధానాలు (మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్)
2) కింది వాటిని జతపర్చండి (మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్)
3) కింది వాటిలో సరికాని జతను గుర్తించండి
4) కింది వాటిలో సరైన వ్యాఖ్య
5) కింది వాటిలో సరికాని ప్రవచనం
6) కింది వాటిని కాలక్రమాన్ని లేదా సంఘటన క్రమాన్ని అనుసరించి గుర్తించండి
7) నిశ్చయార్థక, హేత్వర్థక వాక్యాల్లో సరైనవి గుర్తించండి
8) కింది వాటిలో ఎ, బి, సరైనవి, బి, డి సరైనవి, ఎ, సి సరైనవి, ఎ, బి, సి సరైనవి వంటి పలు రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి పరీక్ష ప్రాచీన పద్ధతిలో, మూసధోరణిలో వస్తుందని అనుకోవద్దు. అన్ని విభాగాలపై పరిపూర్ణమైన అవగాహన, సమగ్రమైన పట్టు సాధిస్తే విజయం సాధించవచ్చు.
డా. ఎన్కే మద్దిలేటి
తెలుగు సీనియర్ ఫ్యాకల్టీ
విశ్వవాణి కోచింగ్ సెంటర్
హైదరాబాద్
9440255110
Previous article
TS Constable Mains Model Paper 4 | What were his eyes covered with?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు