TS JL & DL ZOOLOGY | జేఎల్, డీఎల్, గురుకుల లెక్చరర్ ప్రిపరేషన్
ప్రభుత్వం జేఎల్, డీఎల్, గురుకుల టీచర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి అర్హత ఉన్న
ప్రతిఒక్కరూ పోటీపడుతుంటారు. ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఉంటారు. కానీ ఎలా చదవాలో తికమకపడే వారు చాలామంది ఉంటారు. వారి కోసమే ‘నిపుణ’ అందిస్తున్న ఈ వ్యాసం. దీనిలో సబ్జెక్టులవారీగా ఎలా చదవాలో తెలుసుకుందాం..
జువాలజీ
- 199 జేఎల్, 58 డీఎల్, 146 గురుకుల జేఎల్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది.
- గురుకుల జేఎల్, డీఎల్ 100 ప్రశ్నలు, 100 మార్కులు, జనరల్ జేఎల్ 150 ప్రశ్నలు, 300 మార్కులు కేటాయించారు.
సిలబస్ - జనరల్ కాన్సెప్ట్స్
- నాన్-కార్డేటా
- కార్డేటా
- కణజీవశాస్త్రం (Cell Biology)
- జన్యుశాస్త్రం (Genetics)
- వ్యవస్థ, కణశరీర ధర్మ శాస్త్రం (Systm and Cell Physiology)
- పరిణామ శాస్త్రం (Evaluation)
- అభివృద్ధి జీవశాస్త్రం/ పిండోత్పత్తి శాస్త్రం (Developmental Biology)
- కణజాల శాస్త్రం (Histology)
- జీవావరణ శాస్త్రం (Ecology)
- రోగ నిరోధక శాస్త్రం (Immunology)
జనరల్ కాన్సెప్ట్స్ - దీనిలో వ్యవస్థీకరణలో నిర్మాణాత్మక అంతస్థులు (Levels of Structural Organization), శరీర కుహరం (Coelom), జాతి భావన, జీవుల వర్గీకరణకు సంబంధించిన ప్రాథమిక భావనలు పొందుపర్చారు. ఈ యూనిట్లో ప్రాథమిక భావనలు సులువుగా అర్థం కావడం కోసం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతుశాస్త్రం పుస్తకాన్ని తప్పకుండా చదవాలి.
నాన్ కార్డేటా - ప్రొటోజొవా నుంచి ఇఖైనోడర్మేటా వరకు గల వర్గాల సాధారణ లక్షణాలు, వర్గీకరణను చదవాలి. జేఎల్‌కు వర్గీకరణ తరగతి వరకు (Up to Class Level), డీఎల్‌కు క్రమాల వరకు (Up to Order Level) చదవాలి. అంతేకాకుండా ప్రొటోజొవా వర్గం నుంచి ఇఖైనోడర్మేటా వర్గం వరకు ఆయా వర్గాలకు సంబంధించిన సాధారణ అంశాల (General Topics)తో పాటు సిలబస్‌లో పొందుపర్చిన టైప్ స్టడీస్‌ను అధ్యయనం చేయాలి.
- ఇంటర్మీడియట్, డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలు, ఆర్ఎల్ కోట్పాల్ రాసిన మోడ్రన్ టెక్ట్స్ బుక్ ఆఫ్ జువాలజీ – ఇన్వర్టిబ్రేట్స్ పుస్తకాలు చదవాలి.
కార్డేటా - దీనిలో హెమీకార్డేటా నుంచి క్షీరదాల (Mamm als) వరకు సాధారణ లక్షణాలతో పాటు వర్గీకరణను చదవాలి. జేఎల్‌కు తరగతి వరకు, డీఎల్‌కు క్రమాల వరకు వర్గీకరణను అధ్యయనం చేయాలి. హెమీకార్డేటా వర్గానికి చెందిన వర్గ వికాసం, సంబంధ బాంధవ్యాలతో పాటు సకశేరుకాల శరీర కుడ్యం గురించి చదవాలి. అంతేకాకుండా చేపల నుంచి క్షీరదాల వరకు సాధారణ అంశాలపై పట్టు సాధించాలి. అదేవిధంగా సకశేరుకాలకు సంబంధించిన జీర్ణ, శ్వాస, ప్రసరణ, విసర్జన, ప్రత్యుత్పత్తి వ్యవస్థలకు సంబంధించిన తులనాత్మక అధ్యయనం చేయాలి.
- ఇంటర్మీడియట్, డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలు, ఆర్ఎల్ కోట్పాల్ రాసిన మోడ్రన్ టెక్ట్స్ బుక్ ఆఫ్ జువాలజీ – ఇన్వర్టిబ్రేట్స్ అనే పుస్తకం, కెన్నెత్ వీ కార్డంగ్ రాసిన వర్టిబ్రేట్స్ కంపారిటివ్ అనాటమీ, ఫంక్షన్, ఎవల్యూషన్ అనే పుస్తకాలు చదవాలి.
కణజీవ శాస్త్రం - దీనిలో కేంద్రక పూర్వ, నిజ కేంద్రక కణాలు, ప్లాస్మా త్వచం-నిర్మాణం, విధులు, వివిధ రకాల కణాంగాలు (Cell Organelles) – వాటి నిర్మాణం, విధులు, క్రోమోసోములు, కణ విభజన, కణ చక్రం, పునఃసంయోజక డీఎన్ఏ సాంకేతికత, జన్యు పరివర్తన, క్లోనింగ్, ప్రొటీన్ల ఉత్పత్తి, జన్యు వ్యక్తీకరణ నియంత్రణ మొదలైన అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధించాలి.
- ఎన్సీఈఆర్టీ 11వ తరగతి బయోటెక్నాలజీ పుస్తకం, డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలు, పీఎస్ వర్మ, వీకే అగర్వాల్ రాసిన సెల్ బయాలజీ పుస్తకాలు చదవాలి.
జన్యుశాస్త్రం - దీనిలో మెండల్ అనువంశిక సూత్రాలు, సహలగ్నత (Linkage), వినిమయం (Crossing Over), ఉత్పరివర్తనాలు (Mutation), క్రోమోసోమ్‌ల విపధనాలు (Chromosomal aberrations), మానవ జన్యుశాస్త్రం (Human Genetics) మొదలైన అంశాలను క్షుణ్ణంగా చదవాలి.
- ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ సెకండియర్ జంతుశాస్త్రం, ఎన్సీఈఆర్టీ 11వ తరగతి బయోటెక్నాలజీ పుస్తకం, డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలు, పీకే గుప్తా రాసిన జెనెటిక్స్ పుస్తకాలు చదవాలి.
వ్యవస్థ, శరీర ధర్మశాస్త్రం - జీవాణువులు (Biomolecules), జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, కండర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, ద్రవాభిసరణక్రమత, అంతఃస్రావక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ మొదలైన వాటి గురించి సమగ్ర అధ్యయనం చేయాలి.
- ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ సెకండియర్ జంతుశాస్త్రం, డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలు, Sameer Rastogi రాసిన Ganongs Review of Medical Physiology, Text book of Human Anatomy & Physiology పుస్తకాలు చదవాలి.
పరిణామం - జీవం పుట్టుకకు సంబంధించిన సిద్ధాంతాలు, జీవ పరిణామ సిద్ధాంతాలు, నిదర్శనాలు, జనాభా జన్యుశాస్త్రం, వివక్తత, జాతుల ఉత్పత్తి (Speciation), మానవుడి, గుర్రం పరిణామం, జంతు భౌగోళిక మండలాలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.
- ఇంటర్, డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలు, వీర్ బాలా రస్తోగి రాసిన ఆర్గానిక్ ఎవాల్యూషన్ పుస్తకాలు చదవాలి.
పిండోత్పత్తి శాస్త్రం - శుక్ర కణోత్పాదన, అండ కణోత్పాదన, ఫలదీకరణం, విదళనం, గ్యాస్ట్రులేషన్, జనన స్తరాల ఏర్పాటు, అనిశేక జననం, పిండత్వచాలు, జరాయువు, కప్ప, కోడి పిండాభివృద్ధి మొదలైన అంశాలపై పట్టు సాధించాలి.
- ఇంటర్, డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలు, ఏకే బెర్రీ రాసిన యాన్ ఇంట్రడక్షన్ టు ఎంబ్రియాలజీ పుస్తకం, పీఎస్ వర్మ, వీకే అగర్వాల్ రాసిన కార్డేట్ ఎంబ్రియాలజీ పుస్తకాలు చదవాలి.
కణజాల శాస్త్రం - ఉప కళాకణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం మొదలైన వాటి గురించి సమగ్రంగా చదవాలి.
- ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు అకాడమీ పుస్తకంతో పాటు ఇందర్బీర్ సింగ్ టెక్ట్స్ బుక్ ఆఫ్ హ్యూమన్ హిస్టాలజీ పుస్తకం చదవాలి.
జీవావరణ శాస్త్రం - ఆవరణ వ్యవస్థ, జీవభౌమ రసాయన వలయాలు, జంతువులపై పర్యావరణ కారకాలు, శక్తి ప్రసరణ, ఆహారపు గొలుసు, ఆహారపు వల, జంతు సంబంధాలు, జీవావరణ అనుక్రమం, పర్యావరణ కాలుష్యం, దేశంలో వన్యప్రాణుల సంరక్షణ, చిప్కో ఉద్యమం, జీవ వైవిధ్యం మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.
- ఇంటర్, డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు పీడీ శర్మ రాసిన ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పుస్తకం చదవాలి.
రోగనిరోధక శాస్త్రం - రోగనిరోధక కణాలు, అవయవాలు, ప్రతిజనకం, ప్రతిదేహం, స్వాభావిక అసంక్రామ్యత, ఆర్జిత అసంక్రామ్యత, కణాధారిత రోగ నిరోధకత, దేహద్రవ రోగనిరోధకత, ప్రతిజనక-ప్రతి దేహ సంబంధం, అతి గ్రాహకత్వం మొదలైన అంశాలు అధ్యయనం చేయాలి.
- ఇంటర్, డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలతో పాటు కూబీ ఇమ్యునాలజీ పుస్తకం, సీవీ రావు రాసిన ఇమ్యునాలజీ పుస్తకం చదవాలి.
ప్రిపరేషన్
- అభ్యర్థులు ముందుగా సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. జంతుశాస్ర్తానికి సంబంధించిన పలు రకాల పరీక్షల గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవాలి. ప్రామాణిక పుస్తకాలను సమకూర్చుకుని ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ చేయాలి.
- రోజూ 6-8 గంటలకు తగ్గకుండా చదవాలి. చాప్టర్వైజ్గా బిట్స్ తయారు చేసుకొని ప్రాక్టీస్ చేయాలి.
డా. మోదాల మల్లేష్
విషయ నిపుణులు
పాలెం, నకిరేకల్, నల్లగొండ
9989535675
Previous article
TSPSC JL & DL Telugu | జేఎల్, డీఎల్, గురుకుల లెక్చరర్ ప్రిపరేషన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు