‘సిలబస్‌లో లేని పాఠం’ పుస్తకం రాసిందెవరు?
డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య
పల్లె పట్టుల్లో సాహిత్య పరిమళాలను వెదజల్లుతూ తన ఇంటినే సాహితీకుటీరంగా మల్చుకుని సాహిత్యవ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. 1938, జూలై 9న నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలోని నీర్నెముల గ్రామంలో కూరెళ్ల వెంకటరాజయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వెల్లంకి గ్రామంలో స్థిరనివాసమేర్పర్చుకొని తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి లోకర్పణం గావించి విద్యాదానం చేస్తున్నారు. తెలుగులో గొలుసుకట్టు నవలలు అనే అంశంపై పరిశోధన చేసి 1980లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. తన ఎంఫిల్ పరిశోధన ద్వారా తెలుగు సాహిత్యంలో మాత్రమే ఉన్న 24 మంది రచయిత్రులు రాసిన ముద్దుదిద్దిన కాపురం అనే గొలుసుకట్టు నవలను తెలుగులోకి తీసుకవచ్చారు.
తెలుగు నవలల్లో స్వాత్రంత్యోద్యమ చిత్రణం అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1988లో డాక్టరేట్ పట్టా పొందారు. ఒకవైపు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే రామన్నపేట పరిసర ప్రాంతాల్లో పలు సాహితీ సంస్థలను స్థాపించి యువ కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ వారి రచనలను వెలుగులోకి తీసుకరావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. లంకాదహనం, భక్తకన్నప్ప నాటకాల్లో హనుమంతుడు, కన్నప్ప పాత్రలను పోషించి నటుడిగా ప్రేక్షకుల మెప్పును పొందారు. కరుణశ్రీ రచించిన పుష్పవిలాపంను అనుసరించి గోవిలాపం అనే కావ్యఖండికను 9వ తరగతి చదువుతున్నప్పుడే రాశారు.
రచనలు: తెలుగు నవలల్లో స్వాతంత్రోద్యమ చిత్రణం, తెలుగులో గొలుసుకట్టు నవలలు, స్వాతంత్రోద్యమం, ఆంధ్రప్రదేశ్‌లో దాని స్వరూపం, విఠలేశ్వర శతకం, స్మృత్యంజలి (పద్యగద్య కవితా సంకలనం), తెలంగాణ కాగడాలు- సీసమాలిక, వెల్లంకి వెలుగు (వెల్లంకి గ్రామ చరిత్ర), దొందూ-దొందే, శిల్పాచార్యులు (పద్యకవితా సంకలనం), కవిరాజు ఏలె ఎల్లయ్య (సంక్షిప్త జీవిత చరిత్ర), కాన్ఫిడెన్షియల్ రిపోరు ్ట(గద్యకవితా సంకలనం), సింగిసింగడు, చద్దిమూటలు, వంద శీర్షికలు- వందసీసాలు (పద్యకవితా సంకలనం) మొదలైనవి. ఇవే కాకుండా పలువురు రచయితలు, కవులు రాసిన పుస్తకాలకు పీఠకలు రాశారు.
పురస్కారాలు: వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి పురస్కారం. ప్రజాకవి సుద్దాల హనుమంతు పురస్కారం, రాష్ర్టోపాధ్యాయ స్వర్ణోత్సవ పురస్కారం, తేజ ఆర్ట్ క్రియేషన్స్ ఆలేరు వారి జీవన సాఫల్య పురస్కారం, పలు సాహితీ సంస్థలచే సన్మానాలను, పురస్కారాలను పొందారు.
బిరుదులు: అభినవ పోతన, మధురకవి, సుధాతిలకం, కవితాశ్రీ, అక్షరకళా సామ్రాట్ మొదలైనవి.
బోయ జంగయ్య
నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో 1942, అక్టోబర్ 1న జన్మించారు. తల్లిదండ్రులు ఎల్లమ్మ, మల్లయ్య. బీ.ఏ, డీలిట్ చదివారు. ప్రభుత్వ ఖజానాలు, లెక్కల శాఖలో చాలాకాలం పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. యాభై ఏండ్లుగా సాహిత్య కృషి చేస్తున్నారు. దళితవాదంలో కవిత్వం వచ్చినంత బలంగా వచన రచనలు రాలేదని చెప్పాలి. కానీ దళితవాదాన్ని చిత్రిస్తూ కథలు, నవలలు మొదలైన రచనలు చేసిన ప్రముఖ రచయిత బోయ జంగయ్య. ఈయన బాలల కోసం అనేక పుస్తకాలు ప్రచురించారు. 2006లో ప్రచురించిన మనవడు చెప్పిన కథలు మంచి గుర్తింపు పొందింది. సాహితీప్రియులు, సన్నిహితులు వీరిని ముద్దుగా బోజ అని పిల్చుకుంటారు. ఈయన రచించిన జాతర నవలను మైసూరు విశ్వవిద్యాలయం బీఎడ్ ఉపవాచకంగా ఎన్నుకుంది. అలాగే గొర్రెలు పుస్తకాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగుకు ఉపవాచకంగా తీసుకుంది. ఇదే పుస్తకాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయం కూడా ఉపవాచకంగా తీసుకుంది.
రచనలు: లోకం, గొర్రెలు, ఎచ్చరిక, దున్న, రంగులు, చీమలు, తెలంగాణ వెతలు, బోజకథలు, బొమ్మలు, ఉప్పునీరు, ఇప్పపూలు, ఆమె మొదలైన కథా సంపుటాలను ప్రచురించారు. పావురాలు అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. అంబేద్కర్, జగ్జీవన్, గుర్రంజాషువా, కె.ఆర్ నారాయణ్‌ల జీవిత చరిత్రల్ని రాశారు. బాలల కోసం బడిలో చెప్పని పాఠాలు, గుజ్జనగూళ్లు, ఆటలు- పాటలు, చిలుకల పలుకులు మొదలగు పుస్తకాలను రాశారు. వీరు రచించిన జాతర నవల తెలంగాణ జనజీవనానికి దర్పణం పడుతుంది.
పురస్కారాలు
2003లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పురస్కారం ఎచ్చరిక కథల సంపుటికి శ్రీశ్రీ స్మారక స్వర్ణపతకం, జాతరకు ఉత్తమ నవల బహుమతితో పాటు ఢిల్లీ సాహిత్య అకాడమీ నుంచి డాక్టర్ అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం లభించింది.
అన్నవరం దేవేందర్
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో 1962, అక్టోబర్ 17న జన్మించారు. తల్లిదండ్రులు కౌదారమ్మ, దశరథ వృత్తిరీత్యా కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో పని చేశారు. 1988లో నూతన సాహితి అనే అభ్యుదయ భావాలు గల సాహితీసంస్థను హుస్నాబాద్‌లో స్థాపించారు. ఈయన మొదటి కవితాసంపుటి తొవ్వ 2001లో వెలువడింది. సాహితీ ప్రపంచంలో అన్నవరాన్ని కవిగా నిలబెట్టిన కవితా సంపుటి ఇది. సామాజిక స్పృహతో రాసిన వ్యాసాలు 2003లో మరో కోణం పేరుతో వెలువడ్డాయి. ఈయన రచించిన కవితల్లో కొన్నింటిని పి.విజయలక్ష్మి, ఫార్మ్లాండ్ ప్రాగ్నెస్ పేరుతో 2011లో ఆంగ్లంలోకి అనువదించారు. నూతన సాహితి, సాహితీగౌతమి, సాహితీసోపతి, తెలంగాణ రచయితల వేదిక మొదలైన సంస్థల బాధ్యులుగా వివిధ హోదాల్లో సాహితీ కృషి గావించారు.
రచనలు: 1. కవితా సంకలనాలు: తొవ్వ, నడక, మంకమ్మతోట, లేబర్అడ్డా, బుడ్డపర్కలు (నానీలు), బొడ్డుమల్లె చెట్టు, పొద్దు-పొడుపు, పొక్కిలివాకిళ్ల పులకరింత.
2. వ్యాస సంకలనం- మరోకోణం
3. సంపాదకత్వం- మేర మల్లేశం పోరాట పాటలు, వల్లుబండ (తెలంగాణ ఉద్యమం కరీంనగర్ కవిత్వం)
4. సంపాదకవర్గ సభ్యులుగా: సీమాంట, శతవసంతాల కరీంనగర్, మానేటి కరీంనగర్, జానపదగోపురం, అక్షర (డా.ఎన్ గోపి షష్టిపూర్తి అభినందన సంచిక). జాగో-జగావో (తెలంగాణ ఉద్యమ కవిత్వం) కరీంనగర్ కవిత, 2011, 2012 ఎన్నెల ముచ్చట్లు-7, కవితాసంకలనం మొదలైనవి.
పురస్కారాలు: 2001లో మహాత్మజ్యోతిబాపూలే ఫెలోషిప్, 2004లో రంజని-కుందుర్తి ఉత్తమ కవితా పురస్కారం, 2006లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఉగాది పురస్కారం 2006లో డాక్టర్ మలయశ్రీ సాహితీ పురస్కారం మారసం రుద్ర రవి స్మారక కవితా పురస్కారం, 2013లో అలిశెట్టి ప్రభాకర్ స్మారక పురస్కారం, తేజ సాహిత్య పురస్కారం కలహంస పురస్కారం, 2013లో పొద్దుపొడుపు కవితాసంకలనానికి అక్షర శిల్పి పురస్కారం, 2014లో మురుగంటి వెంకటనరసింహారెడ్డి సాహిత్య పురస్కారం.
జూకంటి జగన్నాథం
– కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి గ్రామంలో సుశీల, దుర్గయ్య దంపతులకు 1955, జూన్ 20న జన్మించారు. ఈయన కవిత్వం సమకాలీన సమాజానికి అద్దం పడుతుంది. తనదైన ముద్రను సాహిత్యంలో నిలుపుకుంటూ అభ్యుదయ భావ ప్రపంచంలో ప్రయాణిస్తున్నారు.
రచనలు: పాతాళగరిగె, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగడోలు, వాస్కోడిగామా డాట్‌కామ్, బొడ్డుతాడు, ఒకరోజు పది గాయాలు, తల్లికొంగు, పిడికెడు కలలు, దోసెడు కన్నీళ్లు, తారంగం, రాజపత్రం, చిలుక రహస్యం, వైపని కథలు మొదలైనవి.
పురస్కారాలు: ఆంధ్రజ్యోతి వారపత్రిక 1986 దీపావళి కథల పోటీల్లో వలస కథకు ద్వితీయ బహుమతి 1995లో సినారె కవితా పురస్కారం, 2000లో నూతలపాటి గంగాధరం పురస్కారం, ఇదే ఏడాదిలో ఫ్రీవర్స్‌ఫ్రంట్ అవార్డ్, 2002లో తెలుగు విశ్వవిద్యాలయంలో ధర్మనిధి పురస్కారం, 2004లో గరికపాటి పురస్కారం, 2008లో రావిశాస్త్రి కథా పురస్కారం, 2011లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం మొదలైనవి.
నాయని కృష్ణకుమారి
1930, మార్చి 14న గుంటూరు జిల్లాలో జన్మించారు. ఈమె తల్లి పేరు హనుమాయమ్మ. తండ్రి ప్రముఖకవి నాయని సుబ్బారావు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. తెలుగు జానపద గేయగాథలు అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ఆచార్యులుగా, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా పని చేశారు. 2016, జనవరి 30న మరణించారు.
రచనలు: అగ్నిపుత్రి, ఆయాతా (కథల సంకలనం), ఏం చెప్పను నేస్తం (కవితా సంకలనం), పరిశీలన, పరిశోధన (వ్యాస సంకలనాలు), తెలుగు జానపద గేయ గాథల (పరిశోధనాగ్రంథం), కాశ్మీర దీప కళిక (యాత్రా చరిత్ర), జానపద సరస్వతి మొదలైనవి. బిరుదురాజు రామరాజుతో కలిసి జానపద వాజ్ఞ్మయ చరిత్ర వెలువరించారు.
సత్కారాలు: గృహలక్ష్మి స్వర్ణకంకణం, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి బహుమతి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి
జూలూరి గౌరీశంకర్
కోదాడ సమీపంలో నడిగూడెంలో 1963, జనవరి 4న జన్మించారు. సుప్రసిద్ధకవి, విమర్శకుడు, సీనియర్ పాత్రికేయులుగా ప్రసిద్ధిగాంచారు. ఈనాడు, వార్త, ఆంధ్రప్రభ పత్రికల్లో పని చేశారు. స్పృహసాహితీ సంస్థ, అడుగుజాడలు, రామయ్య విద్యాపీఠం సంస్థలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్ష, కార్యదర్శులుగా పని చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో సాహిత్య సాంస్కృతిక రంగంలో 2001 నుంచి 2014 జూన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన వరకు తెలంగాణ రచయితల వేదికకు నేతృత్వం వహించారు. 2000లో బహుజన వర్గాలకు సంబంధించి తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా వేటాడే కలాలు- వెనుకబడిన కులాలు అనే బృహత్తర బీసీ కవిత్వ సంకలనానికి సంపాదకుడిగా వ్యవహరించారు. ఇది తెలుగు సాహిత్యంలో బీసీ వాద కవిత్వానికి పాదులు వేసింది. 2001లో 129 మంది కవులతో మలిదశ ఉద్యమానికి సంబంధించి తొలి తెలంగాణ కవితా సంకలనం పొక్కిలికి సంపాదకత్వం వహించారు. 1934లో సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక వెలువరించిన తర్వాత 129 మంది కవులతో పొక్కిలి కవితా సంకలనం వెలువడటం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ రచయితల వేదికకు బాధ్యతను నిర్వహించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2000 నుంచి చుక్కా రామయ్య రచనలను వెలుగులోకి తెచ్చే పనులను చేపట్టారు.
రచనలు: కవితాసంకలనాలు, ఎలియాస్, నా తెలంగాణ, చెకుముకిరాయి, పాదముద్ర, రెండు ఆకాశాలు, మూడోగుణపాఠం, మొగిలిచర్ల, సిలబస్‌లో లేని పాఠం, నాలుగో కన్ను, కాటు, నా తెలంగాణ, ముండ్లకర్ర, పొంతకుండ, నీటిగుమ్మి మొదలైనవి.
వ్యాససంకలనాలు: ఆధునిక కవిత్వం, తెలంగాణ వ్యాసాలు, యుద్ధవచనం, విభజన రేఖ, బొమ్మల సందుక, తెలంగాణ సంస్కృతి- కళలు (సంపాదకత్వం), సకల జనుల సమ్మె, జయుడు (కేసీఆర్‌పై డాక్యుమెంటరీ పుస్తకం) జయశంకరా (కవితాసంకలనం) ఓడిపోవద్దు, ఆత్మబలిదానాలపై వ్యాస సంకలనం)
మాదిరి ప్రశ్నలు
1. తెలుగులో గొలుసుకట్టు నవలలు పరిశోధనా గ్రంథ రచయిత ?
1) నాయని కృష్ణకుమారి
2) కూరెళ్ల విఠలాచార్య
3) బోయ జంగయ్య
4) సుంకిరెడ్డి నారాయణరెడ్డి
2. శ్రీశ్రీ స్మారక స్వర్ణపతకం పొందిన బోయ జంగయ్య కథల సంపుటి ?
1) లోకం 2) గొర్రెలు 3) ఎచ్చరిక 4) దున్న
3. కింది వాటిలో జూకంటి జగన్నాథం రచన కానిది?
1) పాతాళగరిగె 2) గంగడోలు
3) బొడ్డుతాడు 4) తొవ్వ
4. పొద్దుపొడుపు కవితాసంకలనం రచించిన కవి ?
1) అన్నవరం దేవేందర్ 2) జూకంటి జగన్నాథం
3) బోయ జంగయ్య 4) జూలూరి గౌరీశంకర్
5. మలిదశ ఉద్యమానికి సంబంధించి తొలి తెలంగాణ కవితా సంకలనం పొక్కిలికి సంపాదకత్వం వహించిందెవరు ?
1) దేవేందర్ 2) సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
3) గౌరీశంకర్ 4) అమ్మంగి వేణుగోపాల్
సమాధానాలు:
1-2, 2-3, 3-4, 4-1, 5-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు