తెలంగాణకు రక్షణలపై దోబూచులాట
తెలంగాణలో అమలులో ఉన్న ముల్కీ నిబంధనల చట్ట బద్ధతపై వివిధ కోర్టుల్లో అనుకూల వ్యతిరేక తీర్పులు చాలా వెలువడ్డాయి.
-1969 జనవరి 3న జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి రాష్ట్ర విద్యుత్‌శక్తి బోర్డు రాష్ట్ర వ్యాప్త పరిధిగల స్వయం ప్రతిపత్తిగల సంస్థ అయినందున అది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్టు పరిధిలోకి రాదు. కావున ముల్కీ నిబంధనలు దాని నియామకాల్లో వర్తించవని తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో బోర్డులు కార్పొరేషన్లలో స్థానికేతరుల నియామకాలు యధేచ్ఛగా జరిగాయి.
-3-2-1969 డబ్ల్యూపీ నెం. 2235/68 3907/68లను విచారించిన జస్టిస్ చిన్నపరెడ్డి తెలంగాణకు ప్రకటించిన ముల్కీ నిబంధనలు చట్టబద్దం కావని తీర్పు ఇచ్చారు.
-డబ్ల్యు.ఎ. నెం. 44/69 45/69 49/69లను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు పింగళి జగన్మోహన్రెడ్డి, ఆవుల సాంబశివరావులు లోగడ జస్టిస్ చిన్నపరెడ్డి ఇచ్చిన తీర్పును రద్దుచేస్తూ తెలంగాణలో ముల్కీ నిబంధనల అమలు కొనసాగింపు సహేతుకమే అని పేర్కొన్నారు.
-డబ్ల్యుపి నెం. 65/1969ని విచారించిన సుప్రీం ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి హిదాయతుల్లాతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ఫుల్‌బెంచ్ 1969 మార్చి 28న ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చి జీ.వో. 36 చెల్లదని పేర్కొంది.
-పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్‌కు చెందిన లక్ష్మణరావు తదితరుల కేసును విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొమురయ్య న్యాయమూర్తులు గోపాల్రావ్ ఎక్టొటే, ఆవుల సాంబశివరావులతో కూడిన ఫుల్‌బెంచ్ తెలంగాణలో ముల్కీ నిబంధనల కొనసాగింపు చట్టబద్దమే అని తేల్చింది.
-1972 ఫిబ్రవరి 14న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ఫుల్ బెంచ్ ముల్కీ నిబంధనలు చెల్లవని మెజార్టీ న్యాయమూర్తుల తీర్పును వెలువవరించింది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో అవి వర్తించవని పేర్కొంది. మెజార్టీ న్యాయమూర్తుల తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావటంతో అప్పటి ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావు ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు.
-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిక్రీ, ఏఎన్ రే, వైడీ దువా, పాలేకర్, బేగ్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ఫుల్‌బెంచ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మెజార్టీ జడ్జిల తీర్పు చెల్లదని ప్రకటిస్తూ, బెంచ్‌లోని కొండా మాధవరెడ్డి వెలిబుచ్చిన ఆభిప్రాయాలతో ఏకీభవిస్తూ, ఆంధ్ర, తెలంగాణ విలీనంతో ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటికీ ముల్కీ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
-సుప్రీంకోర్టు తీర్పును నాటి ముఖ్యమంత్రి పీవి నరసింహారావు స్వాగతిస్తూ తీర్పు దృష్ట్యా తెలంగాణలో ముల్కీ నిబంధనల కొనసాగింపునకు ఇక తిరుగులేదని వ్యాఖ్యానించారు. చాలాకాలంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కలవరపెట్టిన ముల్కీ సమస్యకు ఈ తీర్పుతో పరిష్కారం లభించింది. ఎందుకంటే ఈ తీర్పుపై అప్పీలుకు అవకాశం లేదు. సుప్రీం ధర్మాసనం తీర్పును అమలుచేసి అక్రమంగా తెలంగాణ ప్రాంతంలో నియామకమైన నాన్ ముల్కీలందరినీ తొలగించి ఏర్పడే ఖాళీల్లో స్థానిక తెలంగాణ వారిని నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. సుప్రీం ధర్మాసనం తీర్పుతో ఇక రాజధాని నగరంలో తమకు విద్యా ఉద్యోగ అవకాశాలు లభించవని భావించిన ఆంధ్రులు ముల్కీ నిబంధనలను, రీజినల్ కమిటీని రద్దుచేయాలని లేకపోతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం చేపట్టి జై ఆంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని రెండు ప్రాంతాల్లోని ప్రజలను సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో 1972 నవంబర్ 27న ప్రధాని ఇందిరాగాంధీ ఐదు సూత్రాల పథకాన్ని లోక్‌సభలో ప్రకటించింది.
ప్రధాని పంచసూత్ర పథకం
1. తెలంగాణ ప్రాంతంలో నాన్‌గెజిటెడ్ ఉద్యోగాలతోపాటు తహసీల్దారు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, జూనియర్ ఇంజినీర్ల పదవుల వరకు ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి.
సచివాలయం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉమ్మడి సంస్థల్లో నాన్‌గెజిటెడ్ ఉద్యోగాల్లో ప్రతి మూడింటిలో రెండో ఉద్యోగానికి ముల్కీ వర్తిస్తుంది.
2. ఈ రక్షణలు తెలంగాణ ప్రాంతంలో 1980 డిసెంబర్ నెలాఖరు, జంటనగరాల్లో 1977 డిసెంబర్ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయి.
3. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లకు తగిన అవకాశాలు కల్పించేందుకు వీలుగా ప్రథమ లేదా ద్వితీయ గెజిటెడ్ స్థాయి వరకు వివిధ సర్వీసుల కేడర్లు ప్రాంతీయం చేశారు. అఖిలభారత సర్వీసులకు ఇది వర్తించదు.
4. సాంకేతిక, వృత్తిపరమైన విద్యాలయాలతో సహా నగరంలోని అన్న విద్యాలయాల్లో ప్రస్తుతం తెలంగాణవారికి లభించే స్థానాలకంటే అదనంగా కొన్ని స్థానాలు సృష్టించాలి. కొత్తగా సృష్టించిన స్థానాలు బేషరతుగా ఏ ప్రాంతం వారైనా పొందవచ్చు.
5. జంటనగరాల్లో ఆంధ్ర, తెలంగాణలకు చెందిన ఉమ్మడి పోలీస్ బలగాలుంటాయి. దీనికి సంబంధించిన వివరాలు రూపొందించిన తరువాత అందుకు అవసరమైన చట్టాలు రూపొందుతాయి.
-సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణలోని అన్ని స్థాయిల్లోని ఉద్యోగాలకు ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి. కానీ పంచసూత్ర పథకం ప్రకారం తెలంగాణలోని గెజిటెడ్ పోస్టులకు ముల్కీ వర్తించదు. ఇది తెలంగాణ నిరుద్యోగులను నిరాశ పరిచింది.
2 తెలంగాణలోని ఉద్యోగాలకు సంబంధించిన ఈ రక్షణలు 1980 డిసెంబర్ నెలాఖరు వరకు, జంట నగరాల్లో మాత్రం 1977 డిసెంబర్ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని గడువులు విధించడం తెలంగాణ ప్రజలను నిరాశపరిచింది.
2 ఆంధ్ర, తెలంగాణ నాయకులు ఉద్యోగ సంఘాలు ఈ పంచసూత్ర పథకాన్ని ఎంత వ్యతిరేకించినా వినకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీంతో ఆంధ్ర ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమం ఉధృతమైంది. ఉద్యమానికి మద్దతుగా పంచసూత్ర పథకాన్ని నిరసిస్తూ చాలా మంది మంత్రులు రాజీనామాలు చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. చివరికి 1973 జనవరి 16న ముఖ్యమంత్రి పదవికి పీవీ నరసింహారావు రాజీనామా చేయడంతో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను సస్పెండ్ చేసి రాష్ట్రపతి పాలన విధించింది. దీంతో కేంద్రం తలపెట్టిన పంచసూత్ర పథకానికి బ్రేకుపడింది. ప్రత్యేక రాష్ట్రం కోరే, సమైక్య రాష్ట్రం కోరే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులను ఢిల్లీకి ఆహ్వానించి సెప్టెంబర్ మూడో వారంలో ఇరుప్రాంతాల నాయకులతో కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు చర్చలు జరిపి వారిని వివిధ పద్ధతుల ద్వారా లోబరుచుకుని సెప్టెంబర్ 21న ఆరు సూత్రాలతో కూడిన ఒక పథకాన్ని ప్రకటించారు ప్రధాని ఇందిరాగాంధీ.
ఆరుసూత్రాల పథకం
1. రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికోసం అదే విధంగా రాష్ట్ర రాజధాని ప్రగతికోసం ప్రత్యేక నిధులను కేటాయించాలి. దీనికోసం ప్రణాళికలు తయారుచేయాలి. ఇందుకోసం వెనుకబడిన ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యులతోపాటు ఇతర నిపుణులకు భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్రస్థాయి ప్రణాళికా బోర్డును వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ఉపసంఘాలను నియమించాలి.
2. విద్యాసంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యమిచ్చే విషయంలో రాష్ర్టానికంతా ఒకే విధానాన్ని పాటించాలి. రాజధాని ప్రాంతంలో ఉన్నత విద్యావసతులను పెంచడానికి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి.
3. ఒక నిర్ణీత స్థాయివరకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ప్రాధాన్యమివ్వాలి. ప్రమోషన్ల విషయంలో కూడా ఒక నిర్ణీతస్థాయి వరకు ఈ నిబంధనలు పాటించాలి.
4. ఉద్యోగ నియామకాలు, సీనియారిటీ ప్రమోషన్లాంటి విషయాల్లో వచ్చే ఫిర్యాదులను పరిశీలించే నిమిత్తం ఉన్నతాధికారాలుగల ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను నియమించాలి. ఈ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలి.
5. పై సూత్రాలను పాటించడంలో ఎదురయ్యే న్యాయమైన చిక్కులను, అనిశ్చిత పరిస్థితులను నివారించడానికి భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని రాష్ట్రపతికి అప్పగించారు.
6. పైన సూచించిన వాటిని పాటిస్తే ముల్కీ నిబంధనలు తెలంగాణ ప్రాంతీయ కమిటీ కొనసాగింపు అనవసరమవుతాయి.
-ఈ ఆరుసూత్రాల పథకంలో తెలంగాణ ప్రాంతానికి ప్రతికూలంగా, ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా ఉన్న అంశాలను అమలు పర్చారు. కానీ తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా ఉండే అంశాలను అమలుపర్చటంలో జాప్యం చేయడం లేదా రద్దు చేయటం జరిగింది. ఉదా: ఈ ఆరుసూత్రాల పథకంలోని మొదటి అంశం రాష్ట్రస్థాయి ప్లానింగ్ బోర్డు వెనుకబడ్డ ప్రాంతాల కోసం నియమించిన ఉప సంఘాలు నామమాత్రంగానే కొంతకాలం పాటు కొనసాగాయి. వెనుకబడిన ప్రాంతా ల అభివృద్ధికి అదనపు నిధులను కేటాయించిన సందర్భాలు లేవు. అదనపు నిధులను కేటాయించే విషయం అలా ఉంచి మామూలుగా కేటాయించిన నిధులను ఇతర ప్రాంతాలకు తరలించారు. పేరుకు మాత్రమే కొనసాగిన ఈ ప్లానింగ్ బోర్డులను కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాగానే రద్దు చేశారు.
-ఈ పథకంలోని రెండో అంశం ప్రకారం రాజధాని నగరంలో ఉన్నత విద్యావసతులను పెంచడానికి ఒక కేంద్రీయ విశ్వ విద్యాలయాన్ని స్థాపించాలి. దీన్ని అనుసరించి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్‌లోనే స్థాపించారు. కానీ హైదరాబాదీయులెవరికీ అందులో సీట్లుగానీ, ఉద్యోగాలు గానీ ఇవ్వలేదు.
-ఈ పథకం అమలుతో తెలంగాణలో అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలు, రీజినల్ కమిటీ రద్దయ్యాయి.
-రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆదాయ, వ్యయాల వివరాలను విడిగా చూపే పద్ధతి రద్దయింది.
-స్థానిక అభ్యర్థిగా పరిగణించేందుకు ముల్కీ నిబంధనల ప్రకారం 12 ఏండ్లు ఉండాల్సిన నివాస పరిమితిని నాలుగేండ్లకు కుదించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు