భారతదేశంలో పట్టణ ప్రభుత్వాలు
భారతదేశంలో పట్టణ ప్రాంతాల పరిపాలన వ్యవస్థలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు కీలకస్థానాన్ని ఆక్రమించాయి. ప్రాచీన, మధ్యయుగాల్లో రాజకీయ, సాంస్కృతిక, వాణిజ్యపరమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న అనేక పట్టణ ప్రాంతాలు ఏర్పడి అభివృద్ధి చెందాయి. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో మౌర్యుల పాలనా కాలంలో ప్రసిద్ధ గ్రీకు పర్యాటకుడు మెగస్తనీసు భారతదేశంలో పర్యటించారు. తన గ్రంథం ఇండికాలో భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వం గురించి ప్రస్తావించారు. భారతదేశంలో జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలు పట్టణాలుగా ఉండేవని, పట్టణ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఐదుగురు అధికారులు ఉండేవారని పేర్కొన్నారు.
అబుల్ ఫజల్ అనే మరో విదేశీ పర్యాటకుడు మొఘలుల కాలంలో భారతదేశంలో పర్యటించి అప్పటి పట్టణ ప్రభుత్వాల గురించి వివరించారు. అప్పటి పట్టణాల్లో కొందరు మున్సిపల్ అధికారులుండేవారని వారిలో కొత్వాల్ ఒకరని, కొత్వాల్‌కు సంపూర్ణ నియంత్రణాధికారం ఉండేదని అబుల్ ఫజల్ తన అయిన్-ఇ-అక్బరీ గ్రంథంలో కొత్వాల్ విధుల్లో కొన్నింటిని పేర్కొన్నారు.
బ్రిటిష్ కాలంలో భారతదేశంలో మొదటిసారిగా 1687లో మదరాసు (చెన్నై) పట్టణానికి నగర పాలక సంస్థ హోదాను కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
1720లో ప్రత్యేక చార్టర్ ద్వారా ప్రెసిడెన్సీ పట్టణాలైన అప్పటి మదరాసు, బొంబాయి, కలకత్తాలకు మేయర్ కోర్టులను ఏర్పాటు చేశారు.
1850 చట్టం పట్టణ ప్రాంతాల పరిధిలో స్థానిక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. 1870లో లార్డ్ మేయో తీర్మానం భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసే ఉద్దేశంతో వాటి నిర్వహణలో భారతీయుల భాగస్వామ్యం పెంచడానికి దోహదపడతాయని ప్రకటించింది. 1882లో లార్డ్ రిప్పన్ తీర్మానం భారతదేశంలోని పట్టణ స్థానిక ప్రభుత్వాల నిర్మాణంలో చెప్పుకోదగినదిగా చరిత్రకారులు వర్ణించారు.
1907లో అధికారాల వికేంద్రీకరణకు ఉద్దేశించిన రాయల్ కమిషన్ పట్టణ స్థానిక ప్రభుత్వ నిర్మాణ నిర్వహణలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది.
భారత ప్రభుత్వ చట్టం- 1919 దేశంలో రాష్ట్రస్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది. మొత్తం పట్టణ పాలన అంశాలను పట్టణ స్థానిక ప్రభుత్వం అనే అంశంలో చేర్చింది. ఓటుహక్కు పరిమితిని, పన్ను విధింపు అధికారాలను విస్తృతం చేయడం, నామినేట్, అధికార సభ్యుల సంఖ్యను తగ్గించడం వంటి చర్యల అమలుకు ఈ చట్టం వీలు కల్పించింది.
1935 భారత ప్రభుత్వ చట్టం పట్టణ, స్థానిక ప్రభుత్వాలకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రాధాన్యమివ్వలేదు.
స్వాతంత్య్రానంతరం పంచాయతీరాజ్ సంస్థల స్థాపన గురించి రాజ్యాంగం ద్వారా స్పష్టమైన చర్యలు చేపట్టారు. భారత రాజ్యాంగంలోని 40వ అధికరణం రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అనే శీర్షికన స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాల వివరణ ఇచ్చారు. అయితే ఆ సంస్థల ఏర్పాటుకు, వికాసానికి చెప్పుకోదగిన కృషి జరగలేదు. కానీ రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో 5వ ఎంట్రీ కింద ఈ సంస్థల ఏర్పాటు గురించి ప్రస్తావించారు. దానిలో పురపాలక మండళ్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, జిల్లా బోర్డులు, ఇతర స్థానిక సంస్థల గురించిన అంశాలు ఆ ఎంట్రీలో పొందుపర్చారు.
పట్టణ ప్రాంతాలపై తగిన చట్టాలను రూపొందించే అధికారాన్ని రాష్ర్టాల ఆధీనంలో ఉంచింది. పట్టణ ప్రణాళికల అంశాలు 20వ ఎంట్రీలో ఉదాహరించారు. పట్టణ ప్రణాళికల అంశంపై పర్యవేక్షణాధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి ఆధీనంలో ఉంచారు.
పట్టణ, పురపాలక, నగర పాలక సంస్థలు- 74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992
పట్టణ స్థాయి స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన హోదాను కలిగించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం 74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ప్రధాన లక్ష్యం. మున్సిపాలిటీస్ అనే శీర్షికతో 1XA భాగాన్ని ఈ చట్టం రాజ్యాంగంలో ఏర్పర్చింది. రాజ్యాంగం 74వ సవరణ చట్టం 1993ను భారత పార్లమెంటు 1992 డిసెంబర్లో ఆమోదించింది. దానికి 1993 ఏప్రిల్ 20న రాష్ట్రపతి ఆమోదం లభించింది.
మొదటగా పార్లమెంటు ఆ చట్టానికి సంబంధించిన బిల్లును 1989లో రాజ్యాంగ (65వ సవరణ) బిల్లుగా ప్రతిపాదించింది. అయితే లోక్‌సభ అర్ధంతరంగా రద్దు కావడంతో ఆ బిల్లు పార్లమెంటు ఆమోదానికి నోచుకోలేదు. తరువాత ఆ బిల్లులో కొన్ని సవరణలు చేసి 1991 సెప్టెంబర్ 16న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తరువాత పార్లమెంటు ఉభయ సభలు ఆ బిల్లును కూలంకషంగా పరిశీలించి 1992 డిసెంబర్లో ఆమోదించాయి. చివరికి రాష్ట్రపతి ఆమోదం తరువాత ఆ బిల్లు చట్టంగా రూపొంది 1993 జూన్ 1న అమల్లోకి వచ్చింది.
స్థానిక ప్రభుత్వాల నిర్మాణం, నిర్వచనాలు 243 పీ
కమిటీ, జిల్లా, మెట్రోపాలిటన్, మున్సిపల్ ప్రాంతం, మున్సిపాలిటీ, పంచాయతీ, జనాభా వంటి వాటి గురించి వివరణ, నిర్వచనాలను తెలుపుతుంది.
మున్సిపాలిటీ వ్యవస్థ (243 క్యూ ప్రకరణ)
243 క్యూ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ప్రధానంగా మూడు తరహాల మున్సిపాలిటీలు ఉండాలి. అవి..
ఎ) నగర పంచాయతీ (గ్రామీణ ప్రాంత స్థాయి నుంచి పట్టణ ప్రాంతంగా పరివర్తనం చెందుతున్న ప్రాంతం)
బి) మున్సిపల్ కౌన్సిల్ (చిన్న పట్టణ ప్రాంతాలు)
సి) మున్సిపల్ కార్పొరేషన్
మున్సిపాలిటీ నిర్మాణం (243 ఆర్)
దీని ప్రకారం మున్సిపల్ స్థానాలకు ప్రతినిధుల ఎంపిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతుంది. మున్సిపాలిటీలను వార్డులుగా విభజిస్తారు. వార్డులోని ప్రజలు తమ ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఈ చట్టం ప్రకారం ప్రత్యేక అంశాలకు సంబంధించి రాష్ట్ర శాసనసభలు శాసనాలు చేయవచ్చు. మున్సిపాలిటీ ప్రాంత పరిధిలోని రాష్ట్ర శాసనసభ/పార్లమెంటు సభ్యులకు ఓటింగ్ హక్కుతో ప్రాతినిథ్యం కల్పించొచ్చు.
వార్డు కమిటీలు (243 ఎస్)
మూడు లక్షలు లేదా అంతకుమించి ఉన్న పురపాలక సంస్థల్లో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో శాసనాలు రూపొందించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు పొందుతాయని 243 (ఎస్) ప్రకరణ పేర్కొంటుంది. కార్పొరేషన్లలో వార్డు కమిటీలు కనీసం 50కి తక్కువ కారాదు. గరిష్టంగా 100కి మించరాదు.
సీట్ల రిజర్వేషన్ (243 టీ)
మున్సిపల్ ప్రాంతంలోని షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి సీట్ల రిజర్వేషన్లు ఉండాలి. 1/3 వంతు స్థానాలు మహిళలకు కేటాయించాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది.
మున్సిపాలిటీల పదవీకాలం (243 యూ)
మున్సిపాలిటీ పదవీకాలం 5 ఏండ్లుగా నిర్ణయించింది. ఒకవేళ ఏ కారణంతోనైనా పదవీకాలం ముగియక ముందే మున్సిపాలిటీ రద్దయితే తిరిగి ఆరునెలల్లో వాటికి ఎన్నికలు నిర్వహించాలి.
అనర్హులు (243 వీ)
సభ్యులకు ఎన్నికల్లో పోటీ చేయడానికి కావల్సిన అర్హతలను, అనర్హతలను నిర్ణయించే అంశాలను ఈ చట్టం నిర్దిష్టంగా పేర్కొంటుంది. అనర్హతలకు సంబంధించిన వివాదాలను రాష్ట్ర శాసనసభ ఏర్పర్చిన ఒక ప్రత్యేక అథారిటీ నిర్ణయిస్తుంది.
మున్సిపాలిటీల అధికారాలు, హక్కులు, బాధ్యతలు (243 డబ్ల్యూ)
మున్సిపాలిటీలకు అధికారాలు, హక్కులు, బాధ్యతలను రాష్ట్ర శాసనసభలు ప్రత్యేక శాసనాల ద్వారా రూపొందించింది. 18 అంశాలతో మున్సిపాలిటీలకు గల అధికారాలు, హక్కులు, బాధ్యతలను ఈ చట్టం 12వ షెడ్యూల్లో పేర్కొంది.
ఆదాయ వనరులు (243 ఎక్స్)
పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, రాష్ట్ర సంఘటిత నిధి నుంచి లభించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ మొదలైనవి మున్సిపాలిటీలకు గల ఆదాయ వనరులు.
ఆర్థిక సంఘం (243 వై)
ఆర్థిక సంఘం మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితిని కూడా సమీక్షించి, తగిన విధి విధానాల సూచనలతో రాష్ట్ర గవర్నర్‌కు నివేదికను పంపించాలని ఈ చట్టం పేర్కొంటుంది.
లెక్కలు, తనిఖీ, ఖాతాలు (243 జెడ్)
మున్సిపాలిటీల పద్దులు, వ్యయాలపై ఆడిటింగ్ జరపడానికి రాష్ట్ర శాసనసభ తగిన చట్టాలు చేయాలని ఈ చట్టం పేర్కొంటుంది.
మున్సిపాలిటీలకు ఎన్నికలు (243 జెడ్ఏ)
మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిన వ్యవహారాలు మొదలైనవి రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం ఉంటాయి.
కేంద్రపాలిత ప్రాంతాల్లో మున్సిపాలిటీలు (243 జెడ్బీ)
కేంద్రపాలిత ప్రాంతాల్లో మున్సిపాలిటీల ఏర్పాటు, రద్దుకు సబంధించిన వ్యవహారాలు మొదలైనవి రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం ఉంటాయి.
కొన్ని ప్రాంతాల మినహాయింపు (243 జెడ్సీ)
కొన్ని నిర్దిష్ట షెడ్యూల్డ్ ప్రాంతాలకు, ఆదివాసీ ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదని పేర్కొంటుంది. ఉదా: బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా.
జిల్లా ప్రణాళికా సంఘం (243 జెడ్డీ)
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికా ముసాయిదాను ఏర్పాటు చేయడానికి ప్రతి జిల్లాలో ప్రణాళికా సంఘాన్ని రాష్ట్ర శాసనసభ ఏర్పాటు చేయాలని ఈ చట్టం తెలుపుతుంది.
మెట్రోపాలిటన్ ప్రణాళిక సంఘం (243 జెడ్ఈ)
ప్రతి మెట్రోపాలిటన్ ప్రాంతానికి ఒక మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయాలి. మెట్రోపాలిటన్ సమగ్రాభివృద్ధికి అవసరమైన ముసాయిదా ప్రణాళికను రూపొందిస్తుంది.
కొన్ని చట్టాల కొనసాగింపు (243 జెడ్ఎఫ్)
74వ రాజ్యాంగ సవరణ చట్టం రాకముందు వాడుకలో ఉన్న చట్టాలన్నీ శాసనసభ ప్రత్యేకంగా రద్దు చేయకపోతే అవి కొనసాగుతాయని ఈ చట్టం పేర్కొంటుంది.
న్యాయస్థానాల జోక్యంలేదు (243 జెడ్జీ)
మున్సిపాలిటీలకు సంబంధించిన శాసనాల ఔచిత్యం, ఎన్నికల వ్యవహారాలు మొదలైనవి ప్రశ్నిస్తూ ఎలాంటి దావాలను కూడా న్యాయస్థానంలో దాఖలు చేయరాదని మాత్రమే పిటిషన్ రూపంలో దాఖలు చేయాలి.
మున్సిపాలిటీల అధికారాలు,హక్కులు, బాధ్యతలు
74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 రాజ్యాంగంలోని 243 డబ్ల్యూ ప్రకరణ ద్వారా రాజ్యాంగంలో 12వ షెడ్యూల్‌ను చేర్చింది. మున్సిపాలిటీ సంస్థల ప్రధాన విధులు, హక్కులు, అధికారాలున్నాయి. ఇవి 18 అంశాలు అవి..
1) నగర ప్రణాళిక, పట్టణ ప్రణాళిక
2) భూమిని చట్టబద్దంగా వినియోగించుకోవడం, భవనాల నిర్మాణంపై నియంత్రణ విధించడం
3) ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం
4) రహదారులు, వంతెనల నిర్మాణం
5) పరిశ్రమలకు, గృహాలకు నీటి వసతి సౌకర్యం కల్పించడం
6) ప్రజల ఆరోగ్యం, ప్రాథమిక ఆరోగ్యం, మురుగునీటి పారుదల నియంత్రణ
7) అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు
8) పట్టణ అడవులు, పర్యావరణ సంరక్షణ
9) బలహీన వర్గాల పరిరక్షణ, వికలాంగులకు, మానసిక వికలాంగులకు తగిన రక్షణ కల్పించడం
10) మరగుదొడ్లు, మురుగు కాల్వల అభివృద్ధి
11) నగర దారిద్య్ర నిర్మూలన పథకాలు
12) పార్కులు, తోటలు, ఆట స్థలాలు వంటి సౌకర్యాల ఏర్పాటు
13) సాంస్కృతిక, విద్యాభివృద్ధి చర్యలు
14) స్మశానవాటికల సౌకర్యాలు
15) పశువులు, జంతువుల సంరక్షణ
16) జనన, మరణాల నమోదు
17) వీధి దీపాలు, బస్స్టాండ్లు, పార్కులు, ప్రజాపయోగ ప్రాంతాల్లో సౌకర్యాలు
18) మాంసం దుకాణాలపై నియంత్రణ
ఈ విధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం పరిపాలన వికేంద్రీకరణ ఆదర్శానికి అనుకూలంగా ఉంటుంది.
మాదిరి ప్రశ్నలు
1) క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో మౌర్యుల పాలనలో పర్యటించిన గ్రీస్ పర్యాటకుడు మెగస్తనీస్ భారతదేశంలోని పట్టణ స్థానిక ప్రభుత్వం గురించి ఏ గ్రంథంలో ప్రస్తావించారు? (1)
1) ఇండికా 2) అయిన్-ఇ-అక్బరీ
3) అర్థశాస్త్రం 4) ఏదీకాదు
2) మొఘలుల కాలంలో పట్టణ పాలనను చూసే అధికారి? (3)
1) గ్రామణి 2) దశగ్రామణి
3) కొత్వాల్ 4) మున్సబ్
3) కిందివాటిలో సరికానిదేది? (4)
1) లార్డ్ మేయో తీర్మానం- 1870
2) లార్డ్ రిప్పన్ తీర్మానం- 1882
3) ప్రత్యేక చార్టర్ చట్టం- 1720
4) రాయల్ కమిషన్ 1909
4) 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? (3)
1) 1991 సెప్టెంబర్ 16
2) 1992 డిసెంబర్ 24
3) 1993 జూన్ 1 4) 1993 జూలై 1
5) పట్టణ స్థానిక ప్రభుత్వం అనే అంశం మొదట ఏ చట్టంలో చేర్చారు? (2)
1) 1909 భారత ప్రభుత్వ చట్టం
2) 1919 భారత ప్రభుత్వ చట్టం
3) 1935 భారత ప్రభుత్వ చట్టం
4) 1947 భారత స్వాతంత్య్ర చట్టం
6)భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల నిర్మాణ, నిర్వహణలో కిందివాటిలో దేనిని మాగ్నాకార్టాగా పిలుస్తారు? (2)
1) లార్డ్ మేయో తీర్మానం
2) లార్డ్ రిప్పన్ తీర్మానం
3) రాయల్ కమిషన్
4) 1991 భారత ప్రభుత్వ చట్టం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు