గ్రూప్స్‌లో తెలంగాణ ఎకానమీ ఇలా చదవండి..!
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, ఏర్పడక ముందు అతి తక్కువగా చర్చ జరిగిన అంశం తెలంగాణ ఎకానమీ. తెలంగాణ ఉద్యమ నేపథ్యం మొదలైందే నిధుల్లో జరుగుతున్న అన్యాయాలపై. అప్పట్లో ఈ అన్యాయం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి వేలకు వేల సమావేశాలు, కరపత్రాలు, పోస్టర్లు ఇలా ఎన్నో దఫాల చర్చలు, సెమినార్లు, వాదోపవాదాలు, కమిటీ రిపోర్టులు అవసరమయ్యాయి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ప్రతి ఏడాది విడుదలయ్యే సామాజిక ఆర్థిక ముఖచిత్రం వల్ల ప్రతి అంశం అధికారికంగా, స్పష్టంగా తెలుసుకునే వీలు కలిగింది. అందులో భాగంగానే అన్ని పోటీ పరీక్షల్లో తెలంగాణ ఎకానమీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. గ్రూప్-1, గ్రూప్-2, ఇతర పోటీ పరీక్షల్లో ఎంతో కొంత సిలబస్‌లో తేడా ఉండవచ్చు కానీ, మొత్తం తెలంగాణ ఎకానమీని అవగాహన చేసుకోవడమనేది అవశ్యకం. తెలంగాణ ఎకానమీని తెలుసుకుంటే తప్ప తెలంగాణ ముఖచిత్రం అర్థం కాదు. అందువల్ల తెలంగాణ ఎకానమీని విశ్లేషణాత్మకంగా చదవడం ఎంతో ముఖ్యం.
తెలంగాణ ఎకానమీ పరిచయం
– తెలంగాణ ఎకానమీ అంటే కేవలం ఆయా సందర్భాల్లో వచ్చిన డేటాను, పాలసీ విధానం, పథకాలను తెలుసుకోవడం కాదు. తెలంగాణ ఎకానమీది ఏ రాష్ట్ర ఎకానమీకి లేని ఓ ప్రత్యేక నేపథ్యం పాలకుల నిర్లక్ష్య వైఖరి, ప్రజలు అన్యాయానికి గురైన తీరు, ప్రజా పోరాటాల తీరుతెన్నులు ఉన్నాయి. తెలంగాణ ఎకానమీలో అన్యాయాలు, అధర్మ, అబద్ధాల కమిటీ రిపోర్టుల కంటే ప్రజల నోటి మాటకే విలువెక్కువ. ప్రజా సంఘాల రిపోర్టులకే విలువెక్కువ.
– అందుకే తెలంగాణ ఎకానమీని అర్థం చేసుకునే ముందు, తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తాన్ని ఓ మోస్తరుగా చదవాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై ఆధారపడిన సహజ వనరుల ఉనికిని, అది ఆ ప్రజల అవసరాలు ఎలా తీరుస్తాయో ఓ ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలి. అప్పుడే తెలంగాణ ఎకానమీపై పట్టుసాధించవచ్చు.
ఎలా అర్థం చేసుకోవాలి?
1. రాష్ట్ర చరిత్ర ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాలి.
2. తెలంగాణ ఉద్యమ నేపథ్యం తెలుసుకోవాలి.
3. ఉద్యమ సమయంలో పాలకుల నిర్లక్ష్య వైఖరి, ప్రజల స్పందన, ప్రజా పోరాటాలు ఆపై వచ్చిన ప్రభుత్వ విధానాలు తెలియాలి.
4. ఉద్యమ సమయంలో వచ్చిన వివిధ కమిటీ రిపోర్టుల సారాంశం తెలియాలి.
5. అలాగే కొత్తగా ఏర్పడిన రాష్ట్ర విధానాలు, పథకాలు, డేటాపై సంపూర్ణ అవగాహన ఉండాలి.
తెలంగాణ ఎకానమీ
గ్రూప్-1 మెయిన్స్ సిలబస్ – విశ్లేషణ
– ఇది ప్రత్యేకంగా గ్రూప్-1 మెయిన్స్‌కి అని చెబుతున్నప్పటికీ.. ఈ అంశాలు అన్ని పోటీ పరీక్షలకు ఉపయుక్తమని అభ్యర్థులు గమనించాలి.
– మొత్తం తెలంగాణ ఎకానమీలో వివిధ పేపర్లతో ఇచ్చిన అంశాలను బేరీజు వేసుకుని కింది అంశాలను స్పష్టంగా చదవాలి.
1. తెలంగాణ చారిత్రక ఉపోద్ఘాతం
2. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి.
3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (1956-2014)
4. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలు, విద్యుచ్ఛక్తి తీరుతెన్నులు
5. జలవనరుల్లో వివక్ష, నీటి తరలింపు, జలయజ్ఞం, వాటి ప్రస్తుత పరిస్థితి
6. ఆర్థిక వనరుల తరలింపు, ఆర్థిక వనరుల పంపిణీలో అసమానతలు
7. నియామకాల్లో వివక్ష, వాటిపై వచ్చిన కమిటీలు
8. తెలంగాణ వ్యవసాయం, దాని అనుబంధ వ్యవస్థలు
9. తెలంగాణలో పరిశ్రమలు
10. తెలంగాణలో సేవారంగం
11. తెలంగాణలో భూసంస్కరణలు
12. తెలంగాణ వెనుకబాటుకు కారణాలు
13. తెలంగాణ భౌగోళిక తీరుతెన్నులు
– ఇలా ప్రతి అంశాన్ని విడివిడిగా, స్పష్టంగా, ఉద్యమ నేపథ్య చరిత్రను అర్థం చేసుకుంటూ చదవాలి.
పేపర్-4 పార్ట్-2
– మొత్తం పార్ట్-2లో ఐదు ప్రధానమైన చాప్టర్లు ఉన్నాయి. అవి…
1. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఎకానమీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎకానమీ, వివక్ష, అభివృద్ధి మొదలైనవి
2. మానవ వనరులు
3. భూ సంస్కరణలు
4. వ్యవసాయం
5. పరిశ్రమలు, సేవారంగం
– పై ఐదు చాప్టర్లలో దాదాపు తెలంగాణ ఉద్యమ నేపథ్యం వివిధ రంగాల తీరుతెన్నులు, భూసంస్కరణలు మొదలైనవి స్పష్టంగా తెలియాలి.
– ఇప్పుడు ఒక్కో చాప్టర్‌ను విశ్లేషిస్తే అసలు ఏం చదవాలో మనకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలను గుర్తించి వాటిని కలిపి చదివితే మరింత సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల సిలబస్ మొత్తాన్ని చాప్టర్ల వారీగా పరిశీలించడం అప్పనిసరని గుర్తించాలి.
పేపర్-4 పార్ట్-2- చాప్టర్-1
– హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఎకానమీ (వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం).
– పై అంశానికి సంబంధించి మొత్తం హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దాని నిర్మాణం, ఆ దశలో అవలంబించిన విధివిధానాలను తెలుసుకోవాలి.
– అలాగే మొత్తం హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక విధానాల్లో వచ్చిన సంస్కరణలను కూడా స్పష్టంగా తెలుసుకోవాలి.
– అయితే ఈ చాప్టర్ హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత వ్యవసాయం, పరిశ్రమలు, వర్తకం, సేవలు, భూ రికార్డులు, రెవెన్యూ-భూసంస్కరణలు మొదలైనవన్ని 1853 నుంచి 1956 మధ్యకాలంలో పరిశీలించాలి.
చాప్టర్-2
– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (1956-2014), ఆ కాలంలో జరిగిన వివక్ష, అల్పాభివృద్ధి గురించి తెలుసుకోవాలి.
– ఈ విభాగంలో నీళ్లు, నియామకాలు, నిధుల్లో జరిగిన వివక్ష, రూపురేఖలు, వాటివల్ల వచ్చిన ఉద్యమాలు, ఆపై వచ్చిన ప్రభుత్వ ఉపశమన చర్యలు, మళ్లీ వాటిని సంతృప్తిపరచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు.
– ఇదే భాగంలో నీళ్లు, నీటి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని కూలంకషంగా వివరించి వాటిపై వచ్చిన బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునళ్ల తీరుతెన్నులు.
– అదేవిధంగా ఆర్థిక వనరుల పంపిణీలో జరిగిన వివక్ష తాలూకు లలిత్ కుమార్ కమిటీ, వశిష్ట భార్గవ కమిటీ రిపోర్టులు, ఈ అన్యాయాన్ని రూపుమాపడానికి ప్రభుత్వ చర్యలు చదవాలి.
– ఈ భాగంలో ప్రస్తుత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, వృద్ధి (జీడీపీ, పర్క్యాపిటల్), వివిధ రంగాల పనితీరు గురించి డాటాతో సహా చదవాలి.
– అదేవిధంగా తెలంగాణ తలసరి ఆదాయం, ఆదాయ అసమానతలు, పేదరిక అంచనాల మొత్తంగా సెస్, మానవాభివృద్ధి రిపోర్టులు, తెలంగాణ సామాజిక, ఆర్థిక చిత్రణ ఉపోద్ఘాతాలు చదవాలి.
– పై అంశాలన్నింటిని టాపిక్వైజ్గా చదవుతూ వాటిపై అధికారిక డాటాను జోడిస్తే ఆ చాప్టర్‌పై పట్టు సాధించడం సులువవుతుంది.
పార్ట్-2 చాప్టర్-2 విశ్లేషణ
– సిలబస్‌లో మానవ వనరులు అని ఉంది. దీంట్లో జనాభా వివరాలు, దాని నిర్మాణం, దాని రూపాంతరత, డెమొగ్రాఫిక్ డివిడెండ్, లింగ నిష్పత్తి, ఫెర్టిలిటీ రేట్, మాతృత్వ మరణాల రేటు, అక్షరాస్యత, ఉద్యోగిత నిర్మాణాలు మొదలైనవి.
– పై అంశాలన్ని ఆర్థిక సర్వేకు సంబంధించినవి కాబట్టి ఆయా విషయాలను లేటెస్ట్ ఎకనామిక్ సర్వేతో పోల్చుకుని చూస్తే సరిపోతుంది.
– ముగింపు: మొత్తంగా తెలంగాణ ఎకానమీని సులభంగా, క్లుప్తంగా, స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే తెలంగాణకు జరిగిన అన్యాయం, ఆ అన్యాయాన్ని పాలకులు ఏ రకంగా అమలుచేసి ప్రజలను వివక్షకు గురిచేశారు? ఆ వివక్షపై ప్రజల స్పందన ఏంటి? అంటే ప్రజా ఉద్యమాలేంటి? ఆ తర్వాత పాలకుల స్పందన ఏంటి? ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకున్నారు? ఆ తర్వాత అదే అంశంపై వచ్చిన కమిటీలు ఏంటి? ఇలా 4 నుంచి 5 రకాల కోణాల నుంచి తెలంగాణ అంశాల్ని విడదీసి, విశ్లేషించి చదివితే తెలంగాణ ఎకానమీ సులభమవుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు