Healthy career | హెల్తీ కెరీర్
హెల్త్‌కేర్ రంగంలో రోజురోజుకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉస్మానియా యూనివర్సిటీ అడ్వాన్స్డ్ హెల్త్‌కేర్‌లో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా యశోద, కేర్, సన్‌షైన్, ఓమ్ని, మల్లారెడ్డి, మ్యాక్స్‌క్యూర్, ఇండో-యూఎస్ హాస్పిటల్ వంటి ప్రముఖ కార్పొరేట్ దవాఖానాల్లో ప్రవేశాలు, శిక్షణ కాలంలో వృత్తి శిక్షణ, అనంతరం ఉద్యోగాలు లభించేలా వీటిని రూపొందించింది. ఈ సంస్థలు ఓయూ అనుబంధ హోదాతో కోర్సులను నిర్వహిస్తూ, యూనివర్సిటీ సర్టిఫికెట్‌ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ కోర్సు చేస్తే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఆయా టెక్నీషియన్లకు మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంది వంటి విషయాలు నిపుణ పాఠకుల కోసం..
కోర్సులు
-అనస్థీషియా టెక్నాలజీ, కార్డియాక్ టెక్నాలజీ, క్యాథ్‌ల్యాబ్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ కేర్, ఎమర్జెన్సీ మెడికల్ కేర్, ఇకో కార్డియోగ్రఫి అండ్ సోనోగ్రఫి, హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, మెడికల్ ఇన్ఫర్మాటిక్స్, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఫిజీషియన్ అసిస్టెంట్, పర్ఫ్యూషన్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ బిల్లింగ్, హెల్త్‌కేర్ టెక్నాలజీ.
-ఈ అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా కోర్సులు చేయాలంటే లైఫ్‌సైన్స్ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
-మొదటి రెండు సెమిస్టర్లలో థియరీ పార్ట్ ఉంటుంది. మూడు, నాలుగు సెమిస్టర్లలో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇవి ఆయా దవాఖానల్లో ఆన్ ఫీల్డ్‌లో చేయాలి.
-కోర్సు సమయంలో వివిధ దవాఖానలు రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు స్టయిఫండ్ చెల్లిస్తున్నాయి. ఇది విద్యార్థుల వ్యక్తిగత ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది.
ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ
-ఒక హాస్పిటల్‌కు ఆపరేషన్ థియేటర్ వెన్నెముక లాంటిది. అలాంటి ప్రధానమైన విభాగంలో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజిస్టులు సేవలందిస్తారు. ఇన్ఫెక్షన్ లేని ఆపరేషన్ థియేటర్లో వివిధ రకాల ఆపరేషన్లు జరుగుతాయి. ఏ ఆపరేషన్‌కు ఎలాంటి పరికరాలు ఉంటాయి, వేటిని ఉపయోగించాలి, అవి శుభ్రంగా ఉండేలా చూడటం, ఆపరేషన్‌కు ముందు, తర్వాత వాటిని స్టెరిలైజ్ చేయడం, వాటిలో ఏవైనా లోపాలుంటే సంబంధిత డిపార్ట్మెంట్లకు రిపోర్ట్ చేయడం, ఆపరేషన్ సమయంలో డాక్టర్లకు సహకరించడం వంటి విషయాలను శిక్షణా కాలంలో నేర్చుకోవచ్చు.
ఇకోకార్డియోగ్రఫి అండ్ అల్ట్రా సోనోగ్రఫి
-అల్ట్రాసౌండ్ టెక్నీషియన్లు ఎంపికచేసుకునే కోర్సుల్లో ఇది ఒకటి. మానవ కణజాలాల్లోకి తరంగాలను పంపించి కంప్యూటర్ డాటా ద్వారా ఆ కణజాలం చిత్రాన్ని రూపొందిస్తారు. దాని ఆధారంగా ఆ వ్యక్తులకు సంబంధించిన ఆరోగ్య వివరాలను రిపోర్టుల్లో నిక్షిప్తం చేస్తారు. డాక్టర్లు వారికి వైద్య చికిత్స అందిస్తారు.
-ఈ కోర్సులో 2డీ ఇకో, అల్ట్రాసౌండ్, ఈసీజీ గురించి నేర్చుకోవచ్చు.
ఫిజీషియన్ అసిస్టెంట్
-డాక్టర్‌కు, పేషెంట్లకు మధ్య సంధానకర్తగా ఫిజీషియన్ అసిస్టెంట్ వ్యవహరిస్తాడు. కార్పొరేట్ దవాఖానాల్లో మెడికల్, నాన్ మెడికల్ అనే అంశాలు ఉంటాయి. వీటిమధ్య ఉండే గ్యాప్‌ను పూడ్చటానికి ప్రత్యేకంగా రూపొందించిందే ఫిజీషియన్ అసిస్టెంట్ కోర్సు.
-హాస్పిటళ్లకు వచ్చేవారికి ఏ ట్రీట్మెంట్కు ఎంత ఖర్చవుతుందనే విషయాలను డ్యూటీ డాక్టర్లు, అక్కడ ఉండే మెడికల్ ఆఫీసర్లు సవివరంగా చెప్పలేరు. అలాగే ఏ వ్యాధికి ఎలాంటి వైద్యం అందించాలి వంటి విషయాలను నాన్‌మెడికల్ పీపుల్ వివరించలేరు. ఈ విషయాలను ఫిజీషియన్ అసిస్టెంట్లు చూసుకుంటారు.
ఎమర్జెన్సీ మెడికల్ కేర్
-ఇది చాలా ముఖ్యమైన కోర్సు. వీరు ఎమర్జెన్సీ డాక్టర్లకు అసిస్టెంట్లుగా పనిచేస్తారు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కు కేసులు వచ్చినప్పుడు ఎలా స్పందించాలి, వైద్యులు ఏ మందులు రాస్తున్నారు, ఎంత డోస్‌లో మందులు ఇస్తున్నారు, వాటితో పేషెంట్ ఎలా రియాక్టవుతున్నాడు వంటి వాటిని నిత్యం పర్యవేక్షిస్తారు.
అనస్థీషియా టెక్నాలజీ
-అనస్థీషియాకు సంబంధించిన పరిజ్ఞానం వీరికి ఉంటుంది. ఒక పేషెంట్‌కు ఎలాంటి అనస్థీషియా ఉంది, జనరల్ అనస్థీషియాకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏది, అనస్థీషియనిస్ట్కు ఎలా సహాయం చేయాలి, పేషెంట్‌కు గతంలో ఏవైనా సర్జరీలు అయ్యాయా, ఎలాంటి అనస్థీషియా ఇచ్చారు వంటి వివరాలను సేకరించాలి. అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చేలోపు పేషెంట్ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. దీనిద్వారా ఆ వ్యక్తికి ఎంత డోస్ ఇవ్వాలి అని డాక్టర్లు నిర్ణయిస్తారు.
రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ
-ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్ధారణ, వాటికి సంబంధించిన టెస్టులు చేయడంలో సంబంధిత వైద్యులకు సహాయం చేస్తారు.
-ఆక్సిజన్‌ను పేషెంట్‌కు ఎలా ఇవ్వాలి, వెంటిలేటర్ ఎలా పెట్టాలి, పేషెంట్ సిక్ అయినప్పుడు, శ్వాస అందనప్పుడు ఏంచేయాలి, కార్డియోథోరసిక్ సర్జరీ పూర్తయిన తర్వాత ఫిజియోథెరపీ చేయడం, లంగ్ ఫంక్షన్ సరిగా ఉందా లేదా పరీక్షించడం, రెస్పిరేటరీ థెరపీ వంటివి చేయాల్సి ఉంటుంది.
డయాలసిస్ టెక్నాలజీ
-నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో డయాలసిస్ చాలా ముఖ్యమైనది. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు లేదా పాడైనప్పుడు డయాలసిస్ తప్పనిసరి. రోగి పరిస్థితి దృష్ట్యా డయాలసిస్ ఎంతసేపు చేయాలి, ఎన్ని గంటలు చేయాలి, విడతలవారీగా అయితే ఎలా, ఎక్కువ సమయం అయితే ఎలా, డయాలసిస్ మిషన్లను ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి నేర్చుకుంటారు. పేషెంట్‌కు డయాలసిస్ మిషన్‌ను అమర్చినప్పటి నుంచి పూర్తయ్యేవరకు దాన్ని పర్యవేక్షిస్తాడు.
మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ
-ఇది ఎక్స్‌రే టెక్నాలజీకి సంబంధించింది.
-ఎక్స్‌రే తీయడం ఎలా, డాక్టర్లు ఏ భాగానికి ఎక్స్‌రే రాశారు, వాటిని ఎలా తీయాలి, ఏ పొజిషన్లో అయితే సరైన ఇమేజ్ వస్తుంది వంటి విషయాలను నేర్చుకుంటారు.
-ఇందులో ఎక్స్‌రే, ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్, ఎండోస్కోపి, న్యూక్లియర్ మెడిసిన్ అనే విభాగాలు ఉంటాయి.
-ప్రతి దవాఖానకు వీరి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కోర్సు చేసిన వారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
క్యాథ్‌ల్యాబ్ టెక్నాలజీ
-గుండెపోటు వచ్చినవారికి యాంజియోగ్రామ్ అవసరమవుతుంది, కొంతమంది చిన్నపిల్లలకు గుండెలో రంధ్రాలు సరిగా పూడుకొనిపోవు ఇలాంటి వాటికి సంబంధించిన డయాగ్నసిస్ అంతా క్యాథ్‌ల్యాబ్‌లో చేస్తారు.
-రక్త నాళాలు పూడిపోయిన (బ్లాక్ అవుతాయి)వారికి ఎక్కడ సమస్య ఉందో గుర్తించి, ఏ రకమైన స్టంట్ వేయాలి, యాంజియోగ్రామ్ ఎలా చేయాలి వంటివి తెలుసుకుంటారు.
హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ అండ్ బిల్లింగ్
-మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతారణంలో మార్పులతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సంపాదనలో ఎక్కువగా వైద్యానికే వెచ్చిస్తున్నాం. వీటిని కొంతైనా తగ్గించుకోవడానికి వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు, కంపెనీ యాజమాన్యాలు అందించే ఆరోగ్య బీమా సదుపాయాలను ఎక్కువమంది ఉపయోగించుకుంటున్నారు. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఈ ఇన్సూరెన్సులకు సంబంధించిన బిల్లులను తయారు చేయడం, వాటిని క్లెయిమ్ చేయడం వంటి పనులు నిత్యం తీరికలేకుండా గడిపే డాక్టర్లకు భారంగా మారాయి. అందువల్ల ఈ విధులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో పీజీ డిప్లొమా ఇన్ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ అండ్ బిల్లింగ్ కోర్సును తీసుకువచ్చారు.
గణేష్ సుంకరి
డిగ్రీ పూర్తికాగానే హెల్త్‌కేర్ కోర్సులు చేయడం వల్ల ఉద్యోగావకాలు అధికంగా ఉంటాయి. హెల్త్‌కేర్ ఇండస్ట్రీ ఎప్పటికీ ఆగిపోయేది కాదు. జనాభా నిత్యం పెరుగుతూనే ఉంటుంది. వారికి వైద్యసేవలు అందించడానికి దవాఖానాలు కూడా వస్తూనే ఉంటాయి. దీంతో మెడికల్ టెక్నీషియన్లు పెద్దసంఖ్యలో అవసరమవుతూ ఉంటారు. అందుకే హెల్త్‌కేర్ కోర్సులకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి వారికోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం చాలా తక్కువ ఫీజుతో, కార్పొరేట్ కాలేజీల సహకారంతో అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా హెల్త్‌కేర్ కోర్సులను అందిస్తున్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు