Global natural diversity | ప్రపంచ ప్రకృతి వైవిధ్యం
ఉష్ణమండల ఎడారులు
-సహజ వృక్ష, జంతు సంపద: ఎడారి మొక్కలు మైనపుపూత పూసినట్లు కనిపించే మందపాటి బెరడును కలిగి ఉంటాయి. కొన్ని మొక్కలకు ఆకులు ఉండవు. ఇక్కడి ప్రధాన జంతువులు గుంటనక్క, ఒంటె. పక్షులు, కీటకాలు ఒయాసిస్లకు మాత్రమే పరిమితం.
-ప్రజలు: ఎడారులు అత్యల్ప జనసాంద్రతను కలిగి ఉంటాయి. ఒయాసిస్ ప్రాంతాలు, ఎక్సోటిక్ నదుల పరీవాహ మార్గానికి ఇరువైపులా చాలా తక్కువ స్థాయిలో జనసాంద్రత ఉంటుంది. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం, నీరు సమృద్ధిగా లభించని ప్రాంతాల్లో పశుపోషణతో జీవిస్తున్నారు.
-కలహారి ఎడారిలో బుష్మెన్లు అనే తెగ ఇప్పటికీ అతి ప్రాచీన ఆటవిక జీవన విధానాన్ని అవలంబిస్తుంది.
-ఆర్థిక ప్రగతి: ఒయాసిస్లలో ఖర్జూరం చెట్లు పెరుగుతాయి. గోధుమ, జొన్నలు ఇక్కడి ప్రధాన పంటలు. పంట భూములకు సాగునీరు సరఫరా చేయడంతో పత్తి, చెరుకు, నారింజ, వరి, కూరగాయలను పండిస్తున్నారు.
-ఈ ప్రకృతిసిద్ధ మండలంలో లభించే అతి ప్రధాన ఖనిజం ముడిచమురు. సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్, ఇరాక్, యూఏఈ దేశాలు పెట్రోలియం ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలు. కాలిఫోర్నియాలో కూడా పెట్రోలియం లభిస్తున్నది. ప్రపంచంలో అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం ఇరాన్‌లోని అబదాన్లో ఉన్నది.
-చిలీ ప్రపంచంలోనే అత్యధిక నైట్రేట్‌ను ఉత్పత్తి చేస్తుంది.
-పెరూ సముద్ర తీరం, తీరానికి సమీపంలోని ద్వీపాల్లో పెద్ద మొత్తంలో పక్షిరెట్టలను సేకరించి, దానిని సహజ ఎరువుగా వినియోగిస్తున్నారు. దీనిని గుయానో అంటారు.
-ఈ మండలంలో అతిపెద్ద నగరం కైరో. అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అలెగ్జాండ్రియా, సైద్, సూయజ్, కలావ్, కరాచీ మొదలైన నగరాలన్నీ రేవు పట్టణాలే.
సవన్నా
-ఏడాదిలో కొంతకాలం వర్షం కురవడం మిగిలిన కాలం పొడిగా ఉండటం ఈ ప్రకృతిసిద్ధ మండలం విశిష్ఠ లక్షణం.
-ఉనికి: భూమధ్యరేఖా మండలానికి ధృవాల వైపు గల సరిహద్దులో 50ల నుంచి 200ల దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది.
-విస్తరణ: దక్షిణ అమెరికా: దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్, బొలీవియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రకృతిసిద్ధ మండల ప్రాంతాన్ని కంపాలు అంటారు. ఉత్తర ప్రాంతంలో వెనెజులా, కొలంబియా దేశాల్లో లానోలు అంటారు. ఈక్వెడార్ తీర ప్రాంతంలోని కొంత భూభాగంలో కూడా ఈ గడ్డి భూములు విస్తరించి ఉన్నాయి.
-మధ్య అమెరికా: మధ్యఅమెరికాలోని దక్షిణ, పశ్చిమ తీరాల్లోని చాలా ప్రాంతాలు, క్యూబా, జమైకా, వెస్టిండీస్ దీవుల పశ్చిమ ప్రాంతాలు.
-ఆఫ్రికా: ఆఫ్రికా ఖండంలోని భూమధ్యరేఖా ప్రకృతిసిద్ధ మండలానికి ఇరువైపులా ఈ ప్రకృతిసిద్ధ మండల భూములు అర్ధచంద్రాకారపు మేఖలుగా విస్తరించి ఉన్నాయి. సెనెగల్, గినియా, మాలీ రిపబ్లిక్, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్, నైగర్, చాద్, సూడాన్, ఘనా, బెనిన్, టోగో, ఐవరీకోస్ట్, నైజీరియా, అంగోలా, జైరే, జాంబియా, జింబాబ్వే, టాంజానియా, మొజాంబిక్, కెన్యా, ఇథియోపియా దేశాలు, మడగాస్కర్ ద్వీపం, పశ్చిమతీర ప్రాంతం ఉన్నాయి.
-మధ్య పసిఫిక్ ద్వీపాలు: హవాయి, ఇతర అనేక ద్వీపాలు.
-శీతోష్ణస్థితి: ఈ మండల సరిహద్దుల్లో గల ఉష్ణమండల ఎడారుల నుంచి వేడిగానూ పొడిగానూ ఉండే దుమ్ముతో కూడిన బలమైన గాలులు వీస్తాయి. ఏడాది పొడవునా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. పొడిగా ఉండే కాలంలో 320C – 370C వర్షాకాలంలో 210C – 270C వరకు ఉంటాయి. పొగ మంచు ఏర్పడదు.
-ఇక్కడ ప్రధాన వర్షపాతం సంవహన వర్షపాతం. హవాయి ద్వీపాల్లోని కౌవాయిలో వయలిలీ పర్వత శిఖరం ప్రపంచంలోని అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం. ఇక్కడి సంవత్సర వర్షపాతం 1234.4సెం.మీ.
-సహజ వృక్షసంపద: భూమధ్యరేఖా మండలం వైపున దట్టమైన అరణ్యాలుగా మొదలై ఎడారి సరిహద్దుల వైపు వెళ్లే కొద్దీ ఎత్తు తక్కువగా ఉండే పలుచని అరణ్యాలు, ఆ తర్వాత పలుచని పొదలు, ఆ తర్వాత 1 నుంచి 6 మీటర్ల ఎత్తు కలిగి పచ్చని తివాచీ పరిచినట్లుగా కనిపించే విశాలమైన గడ్డి భూములు (ఏనుగు గడ్డి) ఆ తర్వాత కురచైన గడ్డిగా క్రమేపీ ఎత్తు తగ్గుతూ ఎడారి సరిహద్దులకు వెళ్లే కొద్దీ అంతరించిపోతాయి.
-జంతుసంపద: దుప్పిలు, జిరాఫీలు, ఆఫ్రికా అడవి దున్నలు, ఏనుగులు, ఖడ్గమృగాలు, సింహాలు, చిరుతపులులు, హైనాలు, నక్కలు, పక్షులు, సరీసృపాలు ఉంటాయి. ఈ జంతువులు శుష్క రుతువులో వర్షాధార ప్రాంతాలకు వలస వెళ్లి వర్షాలతోపాటు ఈ మండలానికి వస్తాయి.
-ప్రజలు: ఈ మండలంలో అనేక విశాలమైన ప్రాంతాల్లో నేటికీ మానవ ఆవాసాలు ఏర్పడలేదు. ఇక్కడి వెస్టిండీస్, క్యూబా, జమైకా దేశాలు అధిక జనసాంద్రత కలిగి ఉన్నాయి.
-ఆర్థిక ప్రగతి: విశాలమైన ఈ పచ్చిక బయళ్లు, ఆఫ్రికా ఖండంలో నివసించే ఆటవిక జాతులవారు జీవనాధారం కోసం పశువులను పెంచుతారు.
-మాంసం కోసం ఎవరూ పశువులను వధించకపోవడం ఈ మండల ప్రత్యేకత.
-పశువుల సంఖ్యను బట్టి ప్రజల సాంఘిక ఔన్నత్యాన్ని నిర్ణయిస్తారు. పెండ్లిలో కన్యాశుల్కంగా పశువులను ఉపయోగిస్తారు.
-ఈ మండలంలో వ్యవసాయం విస్తాపన లేదా పోడు వ్యవసాయం. వాణిజ్య వ్యవసాయం కూడా అమలులో ఉన్నది.
-క్యూబా (ప్రపంచ చక్కెర గిన్నె) ప్రపంచంలో అత్యధికంగా చక్కెరను ఉత్పత్తి చేసే దేశం. క్యూబా హవానాలుగా పిలిచే శ్రేష్ఠమైన చుట్టలకూ ఈ దేశం ప్రసిద్ధి.
-ప్రపంచంలో అత్యధికంగా అనాస పండ్లను ఉత్పత్తి చేస్తున్న దేశం హవాయి. దక్షిణ అమెరికా ఖండంలో పెరిగే క్వెబ్రాషో చెట్టు నుంచి టానిన్‌ను తయారు చేస్తారు. ఇది ఈ మండలం సుప్రసిద్ధ అటవీ ఉత్పత్తి. హవానా, పోర్ట్ ఆఫ్ ప్రిన్స్, కింగ్స్టన్, పనామా సిటీ, బ్రెజీలియా, లాగో, ఆక్రా, హొనొలులు ప్రధానమైన నగరాలు. సవన్నా ప్రాంతాలు రాబోయే కాలాల్లో ప్రపంచానికి అవసరమైన వ్యవసాయ ముడిసరుకులను సరఫరా చేస్తాయి.
అమెరికాలోని ది గ్రాండ్ కాన్యన్ ఆఫ్ కొలరాడో, కార్ల్సబాడ గుహలు, మెక్సికోలోని ఇండియన్ (రెడ్ ఇండియన్)ల పురాతన ఆవాసాల శిథిలాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
స్టెప్పీలు
-వర్షపాతం తగినంత లేకపోవడంతో విశాలమైన ప్రాంతాలు గడ్డి భూములుగా మారాయి. ఇక్కడి ప్రధాన వనరు పచ్చిక. ప్రధాన వృత్తి పశుపోషణ. జనావాసాలు దూరంగా ఉంటాయి.
-ఉనికి: యురేషియాలోని ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం నుంచి కాస్పియన్ సముద్రం వరకు ఉన్న మధ్యప్రాంతం, వాయవ్య చైనా ప్రాంతాల్లోని లోయస్ మెట్ట భూములు, టర్కీలోని అనటోలియా పీఠభూమి, స్పెయిన్‌లోని స్పానిష్ మెసెటా ప్రాంతాలు ఉన్నాయి.
-ఉత్తర అమెరికా ఖండంలో తూర్పు వైపున 100 రేఖాంశం పశ్చిమంలో ఇంటర్ మౌంటేన్ ప్రాంతాల మధ్యలో విస్తరించి ఉన్నది.
-దక్షిణ అమెరికాలో అర్జెంటీనాలోని ఆండీస్ పర్వాతాల వర్షాచ్ఛాయ ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రకృతి సిద్ధమండలాన్ని పెటగోనియా అంటారు.
-ఆఫ్రికాలో డ్రేకన్స్బర్గ్ పర్వతాల పశ్చిమం వైపున, ఆస్ట్రేలియాలో న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రంలో ఈస్టర్న్ హైలాండ్స్ పర్వతాలకు పశ్చిమంగా విస్తరించి ఉన్నది.
-శీతోష్ణస్థితి: ఏడాది పొడవునా వాతావరణ ఆర్ధ్రత తక్కువగానూ వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగానూ ఉండటం ఈ ప్రకృతిసిద్ధ మండలం విశిష్ఠ లక్షణాలు. వర్షపాతం 25 సెం.మీ. నుంచి 50 సెం.మీ.ల వరకు ఉంటుంది. ప్రధానంగా వేసవిలో సంవహన వర్షపాతం సంభవిస్తుంది. వర్షపాతం వరుసగా కొన్నేండ్లు సంభవించి, ఆ తర్వాత వరుసగా కొన్నేండ్లు కరువు ఉంటుంది.
-భూమధ్యరేఖ వైపున సరిహద్దుల్లో వేసవి సగటు ఉష్ణోగ్రత 160C నుంచి 270C వరకు ఉంటుంది. శీతాకాలం ఉష్ణోగ్రతలు- 10C నుంచి 90C వరకు ఉంటాయి.
-సహజ వృక్ష సంపద: వర్షపాతం తగినంత లేకపోవడంతో సహజవృక్ష సంపద గడ్డి, చిట్టడవులు, ఎడారి వృక్ష సంపదలకు పరిమితమై ఉన్నది. పచ్చిక బయళ్లను యురేషియా ప్రాంతంలో స్టెప్పీలు, ఉత్తర అమెరికాలో ప్రయరీలు, దక్షిణ అమెరికాలో పంపాలు, దక్షిణాఫ్రికాలో వెల్డులు, ఆస్ట్రేలియాలో డౌనులు అంటారు.
-జంతుసంపద: స్టెప్పీ ప్రాంతాల్లో యాంటీలోప్లు, డౌనులలో ఎమూ, డింగో, కంగారూలతోపాటు గడ్డి తినే సాధారణ జంతుజాలం కనిపిస్తుంది.
-ప్రజలు: ఈ మండలంలో జనాభా తక్కువ. స్థిరమైన మానవ ఆవాసాలు ఒయాసిస్సుల వద్ద మాత్రమే ఏర్పడ్డాయి.
-ఆర్థిక ప్రగతి: విస్తృత వ్యవసాయం అమలులో ఉన్నది. చైనా, స్వతంత్ర రాజ్యాల కామన్వెల్త్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాలోని సమశీతోష్ణ పచ్చికబయళ్ల ప్రాంతాలు ప్రపంచ గోధుమ ధాన్యాగారాలుగా ప్రసిద్ధి చెందాయి. విస్తృత పశుపోషణ కూడా అమలులో ఉన్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు