Solarjung | సాలార్జంగ్ సంస్కరణలు
సాలార్జంగ్ (క్రీ.శ. 1853-1883)
-సాలార్జంగ్ దివాన్ కావడంతో హైదరాబాద్ రాజ్యంలో నూతన శకం ప్రారంభమైంది. నాసీరుద్దౌలా దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన సిరాజ్-ఉల్-ముల్క్ 1853లో మరణించడంతో అతని స్థానంలో ఆంగ్లేయుల ప్రోద్బలం మేరకు సాలార్జంగ్ను ప్రధానిగా నియమించారు. ఇతడు 1853 మే 31లో దివాన్‌గా నియమితుడయ్యాడు. ఇతని అసలు పేరు తురాబ్ అలీఖాన్. ఇతడు దివాన్‌గా నియమితుడైన వెంటనే సాలార్జంగ్ అనే బిరుదు పొందాడు. ఇతడు 1883, ఫిబ్రవరి 8 వరకు దివాన్‌గా కొనసాగాడు. సాలార్జంగ్ ముగ్గురు నిజాం రాజుల పాలనలో దివాన్‌గా కొనసాగాడు. ఇతడు నాసిరుద్దౌలా (1829-1857), అప్జల్ ఉద్దౌలా (1857-1869), మీర్ మహబూబ్ అలీఖాన్ (1869-1911) కాలంలో ప్రధానిగా ఉండి హైదరాబాద్ రాజ్యంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా హైదరాబాద్ రాజ్యాన్ని ముందుకు నడిపించాడు. ఇతడు దివాన్‌గా పదవి స్వీకరించే నాటికి హైదరాబాద్ రాజ్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా 1766లో ఉత్తర సర్కారులు, 1800లో దత్త మండలాలు, 1853లో బీరార్, రాయచూర్, ధారాశివం వంటి సారవంతమైన జిల్లాలు ఆంగ్లేయ కంపెనీకి అప్పగించడంవల్ల రాజ్యానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటితోపాటు మహారాష్ట్ర, మైసూర్ రాజ్యాలతో యుద్ధాల్లో పాల్గొనడంవల్ల ఆర్థికంగా నష్టపోవడంతో పాటు సరైన పరిపాలన వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నం జరగకపోవడం, పామర్ అండ్ పామర్ కంపెనీ దోపిడీ, మహారాష్ర్టుల చౌత్, సర్దేశ్ముఖ్ పన్నుల వసూలు వంటి కారణాలతో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వీటిని పరిశీలించి హైదరాబాద్ రాజ్య ఇబ్బందులను తొలగించి, నూతన వ్యవస్థ నడిపించడానికి సాలార్జంగ్ తీవ్రంగా ప్రయత్నించి విజయవంతమయ్యాడు.
-పరిపాలనా సంస్కరణలు: నాడు హైదరాబాద్ రాజ్య విస్తీర్ణం 82,698 చదరపు మైళ్లు. 1881 నాటికి హైదరాబాద్ రాజ్య జనాభా 98,45,594. హైదరాబాద్ రాజ్యం ప్రధానంగా మూడు ప్రాంతాల కలయిక. అవి 1. మరఠ్వాడ, 2. తెలంగాణ, 3. కర్ణాటక ప్రాంతాలు.
-ఇతను నిజాం రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం సుబాలుగా, సర్కార్లుగా, మహల్లుగా విభజించాడు. ఇందులో గ్రామం చిట్టచివరిది. ఇలా సాలార్జంగ్ రాజ్యాన్ని ఐదు సుబాలుగా, 17 జిల్లాలు (సర్కార్లు)గా విభజించాడు. సుబాకు అధిపతి సుబేదార్, జిల్లాకు అధిపతి కలెక్టర్, తాలుకా (మహల్) అధిపతి తహసీల్దార్. సమర్థవంతమైన పరిపాలనను అందించడానికి పరిపాలన వ్యవస్థను 14 శాఖల కింద విభజించారు. అవి న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ ప్రజా వనరుల శాఖ, విద్యాశాఖ, వైద్య, పురపాలక, సైనిక, ఆర్థిక, తపాల, రైల్వే, టెలిగ్రాఫ్, నిజాం వ్యక్తిగత (సర్ఫేఖాస్) భూముల శాఖ, రాజకీయ శాఖ, న్యాయ చట్టాల శాఖలు. ఈ 14 శాఖల్లో 7 శాఖలు అయిన న్యాయ, రెవెన్యూ, పోలీస్, ప్రజా పనులు, విద్యా, వైద్య, పురపాలక శాఖలకు ప్రత్యేక మంత్రులు ఉన్నారు. వీరు ఆయా శాఖలను నిర్వహించేవారు. మంత్రులు అన్ని విషయాలను ప్రధాని కార్యదర్శుల ద్వారా నేరుగా ప్రధానికి వివరించేవారు. మంత్రులను సదర్-ఉల్-మిహం అంటారు.
-న్యాయ సంస్కరణలు: సాలార్జంగ్ ప్రధాని అయిన అనంతరం మూడు న్యాయస్థానాలను ఏర్పాటుచేశాడు. అవి 1. అదాలత్-ఎ-పాదుషాహీ, దీన్ని 1853లో ఏర్పాటుచేశాడు.
2. నిజాం, సిక్కు సైనికుల వివాదాల పరిష్కార న్యాయస్థానం. దీన్ని 1855లో ఏర్పాటు చేశాడు.
3. ఇలాకా పేష్కారి ప్రాంతంలో వచ్చే సివిల్ వివాదాలను పరిష్కరించడానికి 1860లో గోవిందరావు అధికారిగా నూతన న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. దివాని ప్రాంతంలో న్యాయ వ్యవహారాలను పరిశీలించేందుకు 1869లో సదర్-ఉల్-మిహం అదాలత్ అనే కార్యాలయాన్ని స్థాపించాడు. నిజాం రాజ్యాంలో మొదటి న్యాయశాఖ మంత్రిగా నవాబు బషీరుద్దౌలా బహద్దూర్‌ని నియమించాడు. ఈ న్యాయశాఖ మంత్రి నగరాల్లో, ముఫిసిల్ ప్రాంతాల్లో సివిల్, క్రిమినల్ తగాదాలను లేదా వివాదాలను పరిష్కరించేవాడు. న్యాయ ధర్మాన్ని కాపాడటానికి ఆజ్ఞలను జారీ చేసేవాడు. ఏదైనా కేసులో తీర్పు తప్పుగా వచ్చిందని, న్యాయం జరగలేదని భావించినప్పుడు ఆ కేసులను తిరిగి విచారించేందుకు, తీర్పు వెలువరించేందుకు ప్రధానమంత్రి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది.
-సాలార్జంగ్ 1872లో కోర్ట్ ఆఫ్ అప్పీల్‌ను మహాక్మా-ఎ-మురఫా-ఎ-అజ్లా అనే పేరుతో స్థాపించాడు. ఈ కోర్టును అప్పిలేట్ కోర్టు ఆఫ్ జ్యూడికేచర్గా వర్ణించారు. దీనిలో అన్ని రకాల సివిల్, క్రిమినల్ విన్నపాలను, నగరాలు, జిల్లాల నుంచి వచ్చే విజ్ఞప్తులను విచారించేవారు. ఇంకా హైదరాబాద్ సివిల్ న్యాయ పరిపాలనలో మజ్లిస్-ఆలియా అదాలత్ (హైకోర్టు) కీలక న్యాయస్థానం, కింది కోర్టులో శిక్షపడ్డ వ్యక్తి హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. డివిజన్లో సివిల్, క్రిమినల్ కేసులను తాలూకాదారుడు విచారించేవాడు. అప్పట్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం రూ. 1200, ఇతర న్యాయమూర్తుల వేతనం రూ. 600, నగర సరిహద్దు సివిల్ న్యాయమూర్తి వేతనం, హైకోర్టు న్యాయమూర్తి కంటే అధికం. అతని వేతనం రూ. 2400, ఖాజీ వేతనం రూ. 500. ఈ విధంగా న్యాయ వ్యవస్థను పటిష్టంగా తయారుచేశాడు. ప్రతిభ, సామర్థ్యం, ఎలాంటి మచ్చలేని వ్యక్తులను న్యాయమూర్తులుగా ఎంపిక చేసేవాడు. అవినీతి, లంచగొండితనం వంటి ఆరోపణలు కలిగినవారికి అవకాశం లేకుండేది.
పోలీస్ సంస్కరణలు
-సాలార్జంగ్ పోలీస్ వ్యవస్థలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు.
-రెవెన్యూ శాఖ నుంచి పోలీస్ వ్యవస్థను వేరు చేశాడు. ప్రతి రెండు తాలూకాలకు ఒక ఇన్స్పెక్టర్ను నియమించాడు. పెద్ద తాలుకాలకు అదనపు ఇన్స్పెక్టర్ను నియమించాడు.
-నిజాం రాజ్యంలో నాడు ఐదు భాగాలు ఉన్నాయి. ప్రతి భాగానికి ఒక అత్యున్నత పోలీస్ అధికారిని నియమించాడు. వీరిని నాయిబ్ సదర్ ముహతమీమ్ అనేవారు.
-ప్రతి జిల్లాపై సూపరింటెండెంట్ (ముహతమీమ్) ఆఫ్ పోలీస్‌ను నియమించాడు. వీరినే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పిలిచేవారు. ఇతడు జిల్లా పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని పర్యవేక్షించేవారు.
-వీరితో పాటు సోవర్స్ అనే ప్రత్యేక పోలీసులను నియమించాడు. ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణగా వీరు ఉండేవారు.
-నగరాల్లో కొత్వాల్ పోలీసు అధికారి. ఇతడు శాంతిభద్రతలను కాపాడటమే కాక ప్రజలకు రక్షణ కల్పించేవాడు.
ఆర్థిక సంస్కరణలు
-సాలార్జంగ్ ప్రధాని అయినప్పుడు ఆదాయం తక్కువగా ఉండి ఖర్చులు అధికంగా ఉండేవి.
-అనవసరమైన ఉద్యోగాలు దాదాపు 1000 వరకు రద్దు చేసి ఖజానాకు కొంతవరకు నష్టాన్ని తగ్గించాడు.
-1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్‌వారికి మద్దతు ప్రకటించి రాయచూర్, ఉస్మానాబాద్ ప్రాంతాలను తిరిగి పొందాడు.
-బ్రిటిష్‌వారికి నిజాం చెల్లించాల్సిన రూ. 50 లక్షల బకాయిలను రద్దు చేయించాడు. దీంతో హైదరాబాద్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడింది.
-1860లో ఎగుమతి-దిగుమతులపై పలు రకాల పన్నులను సాలార్జంగ్ నిషేధించాడు. ఉప్పుపై పన్ను విధించే అధికారం కష్టమ్స్ శాఖకు అప్పగించాడు. దీంతో క్రమబద్ధమైన పన్నుల విధానం అమలులోకి వచ్చింది.
-సాలార్‌జంగ్‌కు ముందు రహదారి పన్నుల వసూలు నామమాత్రంగా జరిగేది. ప్రధాని అయిన అనంతరం ఈ పన్నుల వసూలు క్రమబద్ధంగా జరిగింది.
-అటవీ సంపద కాపాడుకోవడానికి, అటవీ ఉత్పత్తల వల్ల వచ్చే ఆదాయం క్రమబద్ధంగా రాబట్టడానికి 1867లో అటవీశాఖ ఏర్పాటుచేశారు.
-1861లో స్టాంప్ పేపర్ కార్యాలయం మున్సిఖానా ఆధ్వర్యంలో పనిచేసేవిధంగా ఏర్పాటుచేశారు. వీటి విక్రయాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది.
-విద్యా సంస్కరణలు: పరిపాలన సమర్థవంతంగా నడవాలంటే విద్యావంతులు, శిక్షణ పొందిన సిబ్బంది చాలా అవసరం
-సుశిక్షుతులైన ఉద్యోగులను నియమించుకొనేందుకు అనుగుణంగా విద్యావిధానంలో అనేక మార్పులు ప్రవేశపెట్టాడు.
-పాశ్చాత్య విద్యాబోధనతో కూడిన దారుల్ ఉల్మ్ అనే పాఠశాలను 1855లో స్థాపించాడు. దీనిలో పర్షియా, ఉర్దూ, అరబ్బీ, ఆంగ్లంలో విద్యాభ్యాసం ఆరంభమైంది.
-1870లో నగర ఉన్నత పాఠశాల (సిటీ హైస్కూల్) స్థాపించాడు.
-ప్రజాపనుల (పబ్లిక్ వర్క్స్) శాఖలో పనిచేయడానికి కావాల్సిన సిబ్బందిని తయారుచేసుకొనేందుకు 1870లో ఇంజినీరింగ్ కళాశాల రాజ కుటుంబంలోని పిల్లల కోసం 1873లో మదర్సా-ఇ-అలియా, రాజ కుటుంబం కోసం మదర్సా-ఇ-ఐజాను 1878లో ప్రారంభించారు.
-తర్వాత 1887లో మదర్సా-ఇ-అలియా, చాదర్‌ఘాట్ స్కూల్ విలీనమై నిజాం కళాశాల ఏర్పాటయ్యింది.
-వీటితో పాటు సాలార్జంగ్ సర్సయ్యద్ అహ్మద్‌కు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ స్థాపనకు ఆర్థిక సహాయం అందించాడు.
-హైదరాబాద్ రాజ్య అధికారులైన వకార్-ఉల్-ముల్క్, మొహనేన్-ఉల్-ముల్క్ అలీఘర్ యూనివర్సిటీ ప్రగతిలో చాలా చురుగ్గా సేవలు అందించారు.
-సాలార్జంగ్ పాలనలో జిల్లాలో అనేక పాఠశాలలు ఏర్పాటయ్యాయి. నగరాల్లో కూడా పాఠశాలలు నెలకొల్పారు.
-నిజాం రాజ్యంలో 162 పాఠశాలలు ఉండేవి. అందులో పర్షియన్ పాఠశాలలు 105, మరాఠి పాఠశాలలు 34, ఆంగ్ల పాఠశాలలు, కళాశాలలు 4, తెలుగు పాఠశాలలు 19 ఉన్నాయి.
-రవాణాభివృద్ధి: రోడ్డు, రైల్వే, జలమార్గాల అభివృద్ధికి కృషి చేశాడు.
-హైదరాబాద్‌ను అన్ని ప్రధాన పట్టణాలతో కలుపుతూ రహదారులను నిర్మించాడు.
-1870లో హైదరాబాద్, వాడి, గుల్బర్గా మీదుగా మద్రాస్ నుంచి బాంబే వరకు రైల్వే లైన్ నిర్మించడానికి బ్రిటిష్‌వారితో చందా రైల్వే పథకం అనే ఒప్పంద పథకం కుదుర్చుకున్నాడు.
-దీనిలో భాగంగా 1874లో హైదరాబాద్‌లో మొదటి రైల్వేలైన్ సికింద్రాబాద్-వాడీల మధ్య నిర్మించబడింది.
-సాలార్జంగ్ కాలంలోనే బకింగ్ హోమ్ కాల్వకు బ్రిటిష్‌వారు తవ్వారు. బకింగ్హోమ్ కాల్వ కృష్ణా డెల్టాలోని కొమ్మునూరు నుంచి మద్రాస్‌కు వంద కిలోమీటర్లు దక్షిణాన ఉన్న మరక్కనం వరకు ఉంది.
-సాలార్జంగ్ పారిశ్రామీకరణ ప్రోత్సహిస్తూ హైదరాబాద్‌లో పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటుచేశాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?