నది- జీవన వాహిని

భూమి ఉపరితలంపై (భూపటలం) ప్రవహిస్తూ భూస్వరూపాలను వేరుచేస్తూ జరిగే ప్రక్రియను నదులు అంటారు. భూమిపై వర్షం సంభవించినప్పుడు కొంత నీరు భూమిలోకి ఇంకిపోతే, మరికొంత నీరు వాతావరణంలోకి ఆవిరైపోతుంది. మిగిలిన నీరు మొదటగా చిన్న చిన్న పిల్ల కాలువల రూపంలో ప్రారంభమై పెద్ద పాయలు (Gullies)గా ఏర్పడి తదనంతరం వాగులు (Streams) కలిసి నదులుగా చివరకు సముద్రంలో కలుస్తాయి.
– నది పుట్టిన చోటును నదీ జన్మస్థానం అని, నది ప్రవహించే మార్గాన్ని నది ప్రవాహమార్గం అని, నది సముద్రంలో కలిసే చోటును నదీ ముఖద్వారం అని అంటారు.
– పెద్ద నదిలో కలిసే చిన్న నదులను ఉపనదులు (Tributaries) అంటారు.
– ప్రధాన నదిని, దాని ఉపనదులను కలిపి నదీ వ్యవస్థ (River System) అంటారు.
– నిరంతరంగా కొనసాగే నదీక్రమక్షయ ప్రక్రియ మూడు విధాలుగా జరుగుతుంది.
1. నదీక్రమక్షయం (Erosion)
2. నదీరవాణా (Transportation)
3. నదీనిక్షేపణ (Deposition)
– ఈ మూడు విధాలుగా జరిగే ప్రక్రియల వల్ల భూఉపరితలంపై రకరకాల మార్పులు చోటుచేసుకుని వివిధ భూస్వరూపాలు ఏర్పడతాయి.
నదీక్రమక్షయం
– నదులవల్ల జరిగే క్రమక్షయాన్ని నదీ క్రమక్షయం అంటారు.
– క్రమక్షయం అంటే నేలపై పొర కొట్టుకుపోవడం.
– నది ప్రవాహ మార్గంలో ఇది ప్రధాన కార్యక్రమం.
– దీనివల్ల లోయలు, జలపాతాలు (దుముకుడు గుంతలు-Watefalls) మొదలైనవి ఏర్పడతాయి.
నదీ రవాణా
– నదీ ప్రవాహంలో కొట్టుకునిపోయే పదార్థాలను నదీభారం అంటారు. దీన్ని ప్రధానంగా రెండు రకాలుగా పేర్కొనవచ్చు. అవి..
1. దృశ్యభారం: కంటికి కంపించే భారాలు. ఉదా: రాళ్లు, ఇసుక, మట్టి, చెత్త, చెదారం మొదలైనవి.
2. అదృశ్యభారం: కంటికి కనిపించని రసాయనభారాన్ని అదృశ్యభారం అంటారు. ఉదా: నీటిలో కరిగిఉండే రసాయన లవణాలు.
– వీటినే నదీ రవాణా అని పిలుస్తారు.
నదీ నిక్షేపణ
– నదిలో నీటి పరిమాణం తగ్గడం, నదీభారం పెరగడం వంటి వాటి మూలంగా నది తాను రవాణా చేస్తున్న భారాన్ని నిక్షేపణ చేస్తుంది.
– నిక్షేపణ భూస్వరూపాలకు ఉదాహరణ- ఇసుక తిన్నెలు, వరద మైదానాలు.
– నదీభారం నాలుగు రకాలుగా రవాణా అవుతుంది. అవి..
1. సాల్టేషన్: నది ప్రవాహంలో పెద్దపెద్ద బండరాళ్లు ప్రవాహ వేగ ప్రభావంతో దొర్లుకుంటూ పోవడం. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ.
2. ట్రాక్షన్: నదిలో ఉండే చిన్నరాళ్లు (Cobbles), గులకరాళ్లు (Gravel) మొదలైనవి నది ప్రవాహ వేగానికి కొట్టుకుని పోవడం. ఇదికూడా ఒకవిధంగా నెమ్మదిగా జరిగే ప్రక్రియ.
3. సస్పెన్షన్: సన్నని ఇసుకమట్టి మొదలైన వాటిని నది చాలా దూరం వరకు సునాయాసంగా తీసుకుని వెళ్లగలుగుతుంది. ఇది వేగంగా జరిగే ప్రక్రియ.
4. ద్రావణం: సున్నపురాయి, ఉప్పు మొదలైనవి నీటిలో కరిగి అదృశ్య భారంగా రవాణా చెందించబడతాయి.
– భూస్వరూపశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన డబ్ల్యూఎం డేవిస్ అభిప్రాయం ప్రకారం… నదుల గమనాన్ని మానవుని జీవిత దశలతో పోల్చాడు. అవి…
1. యవ్వనదశ
2. ప్రౌఢదశ
3. వృద్ధదశ
– ఈ దశల్లో నదుల క్రమక్షయం, నిక్షేపణలవల్ల ఏర్పడే భూస్వరూపాలు నది మూడు దశల్లో వివిధ రకాలుగా ఏర్పడతాయి.
1. యవ్వన దశలో ఏర్పడే భూస్వరూపాలు
2. ప్రౌఢదశలో ఏర్పడే భూస్వరూపాలు
3. వృద్ధదశలో ఏర్పడే భూస్వరూపాలు
పాట్హోల్స్
– నది ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్నప్పుడు నది నీరు సుడులు తిరుగుతూ ప్రవహిస్తుంది. పదునైన రాళ్లు ఆ సుడుల్లో ఇరుక్కొని నదీగర్భంలో గుండ్రని గుంటలను ఏర్పరుస్తాయి. వీటినే పాట్హోల్స్ అంటారు.
రాతి బల్లలు
– మృదు, కఠిన శిలలు ఒకదానిపై ఒకటి క్షితిజసమాంతరంగా అమరిఉన్నప్పుడు ప్రవాహవేగానికి మృదు శిల క్రమక్షయం చెందగా మిగిలిన కఠినశిల బల్లలా బయటకు కనిపిస్తుంది. దీన్నే రాతి బల్ల అంటారు.
జలపాతాలు
– మృదు, కఠినశిలలు ఒక క్రమపద్ధతిలో ఒకదాని కింద మరొకటి అమరి ఉన్నప్పుడు అవి క్రమక్షయం చెందడంలో వైరుద్యం ఏర్పడి జలపాతాలు ఏర్పడతాయి.
– జలపాతం వద్ద నీరు పైనుంచి కిందికి దూకినప్పుడు ఏర్పడిన మడుగును దుముకుడు మడుగు అంటారు.
– జలపాతాల ఎత్తు, ఆకృతి, పరిమాణం, కోణం, ప్రవాహ నీటి పరిమాణాలు భిన్న స్థాయిలో ఉంటాయి. కాబట్టి వివిధ రకాలైన జలపాతాలు ఏర్పడతాయి.
ఉదా: కాటరాక్ట్ జలపాతాలు- నీరు నిటారుగా కిందకు దూకుతూ ఏర్పడేభారీ జలపాతాలు.
– క్యాస్కెడ్ జలపాతాలు- నిటారుగా కాకుండా శిలల కాఠిన్యతలో తేడాలవల్ల ఏర్పడిన మెట్లవంటి నిర్మాణాల మీదుగా నీరు కిందికి దూకినప్పుడు చిన్న పరిమాణంతో ఏర్పడే జలపాతాలు.
ఉదా:
– నయాగరా జలపాతం: ప్రపంచంలో అతిపెద్ద జలపాతం. ఇది కెనడా, అమెరికా దేశాల సరిహద్దులో ఉంది.
– ఏంజెల్ జలపాతం: ఇది ప్రపంచంలో అతి ఎత్తయిన జలపాతం. చురుణ్ నదిపై ఉన్న ఈ జలపాతం దక్షిణ అమెరికాలోని వెనెజులాలో ఉంది.
– టుడైలా జలపాతం: ఇది టుగెలా నదిపై ఉంది. దక్షిణాఫ్రికాలో ఉన్న దీని ఎత్తు 947 మీ.
దేశంలో ఎత్తయిన జలపాతాలు
– కుంచికల్ జలపాతం: దేశంలో ఎత్తయిన జలపాతం. వరాహినదిపై ఉన్న ఈ జలాతం ఎత్తు 455 మీ. ఇది కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉంది.
– బరేహిపాని జలపాతం: బుద్ధ బలాంగ్ నదిపై ఉన్న జలపాతం ఎత్తు 399 మీ. ఇది సిమ్లిపాల్ నేషనల్ పార్కులో ఉంది.
యవ్వనదశలో ఏర్పడే భూస్వరూపాలు
– V ఆకారపులోయ: నది యవ్వనదశలో క్రమక్షయం వల్ల నదిలోయ లోతు పెరగడంతో V ఆకారపు లోయ ఏర్పడుతుంది. ఇది రెండు రకాలు.
i. గార్జ్: నదులు తాను ప్రవహించే లోయను మరింతలోతుగాను, వెడల్పుగా పెంచుకోవడంవల్ల నదికి ఇరువైపుల నిట్టనిలువు గోడల మాదిరి ఏర్పడే భూస్వరూపాన్ని గార్జ్ అంటారు.
ఉదా: బైసన్గార్జ్- గోదావరి నది వల్ల ఏర్పడింది (తెలంగాణ)
కొలరాడోగార్జ్- కొలరాడో నది వల్ల ఏర్పడింది (అమెరికా)
ii. అగాథధరులు: గార్జ్ల విస్తృత రూపమే అగాథధరులు. అధోముఖ కోత ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే ఎత్తయిన గోడలు కలిగి లోతైన, పొడవైన నదిలోయను అగాథధరులు అంటారు.
– అధోముఖ, పక్కకోతలు రెండూ ఇంచుమించు సమానంగా ఉన్నప్పుడు అగాథధరులు ఏర్పడతాయి.
ఉదా: కొలరాడో నదిపై ఉన్న గ్రాండ్ కాన్యన్. ఇది ప్రపంచంలో అతిపెద్ద అగాథధరి. దీని లోయ పొడవు 2 కి.మీ. మొత్తంగా ఇది 482 కి.మీ. పొడవుతో విస్తరించింది.
– సింధునది పైన ఉన్న బుంజి అగాథధరి. ఇది 17,000 అడుగుల పొడవు విస్తరించింది.
రాష్ట్రంలోని జలపాతాలు
– కుంటాల జలపాతం: తెలంగాణలో ఎత్తయిన (45 మీ.) జలపాతం. ఇది ఆదిలాబాద్లో ఉన్నది.
– పొచ్చెర జలపాతం, గాయత్రి జలపాతం
– ఇది ఆదిలాబాద్లో, కడెం నదిపై ఉన్నాయి.
– మిట్టి (సప్తు గుండాల) జలపాతం- ఆసిఫాబాద్
– పొధార జలపాతం- ఆసిఫాబాద్
– కనకాయి జలపాతం- ఆదిలాబాద్
– కుండ్రాయి జలపాతం- ఆదిలాబాద్
– గౌరీ జలపాతం- పెద్దపల్లి
– సబితం జలపాతం- పెద్దపల్లి
– చింతామణి జలపాతం- జయశంకర్ భూపాలపల్లి
– భక్తలహరి జలపాతం- జయశంకర్ భూపాలపల్లి
– బొగత జలపాతం- ములుగు జిల్లా
– ఇది నల్లందేవి వాగుపై వాజేడు మండలం పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్నది. ఇది చీకుపల్లి వాగులో కలుస్తుంది. దీన్ని తెలంగాణ నయాగార జలపాతం అంటారు.
– భీమునిపాద జలపాతం- మహబూబాబాద్
– పాండవుల జలపాతం- మహబూబాబాద్
– మల్లెల తీర్థం జలపాతం- నాగర్ కర్నూల్
– పోచారం జలపాతం- మెదక్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు