విటమిన్లకు రసాయన నామాలు ఎలా వచ్చాయి..?
మొక్కల్లో ఏ-విటమిన్ బీటా-కెరోటిన్ రూపంలో ఉండి కాలేయంలో ఏ-విటమిన్గా మారుతుంది. ఈ బీటా-కెరోటిన్నే ప్రోవిటమిన్-ఏ అని కూడా పిలుస్తారు. క్యారట్ ఆరెంజ్ రంగులో ఉండటానికి కారణం ఈ బీటా-కెరోటిన్ అనే పదార్థమే. పామాయిల్ పసుపు రంగులో ఉండటానికి కారణం విటమిన్-ఏ.
విటమిన్లు
– సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు (Corbohydrates), మాంసకృత్తులు (Proteins), కొవ్వులు (Lipids), ఖనిజమూలకాలు (Minerals), విటమిన్లు, నీరు అనే పోషకాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడింటిని స్థూలపోషకాలు అని, తరువాత రెండింటిని సూక్ష్మపోషకాలు అని అంటారు.
– సూక్ష్మపోషకాలైన విటమిన్ల గురించిన అధ్యయనాన్ని విటమినాలజి అంటారు.
– ఫ్రెడరిక్ హాఫ్కిన్స్ అనే శాస్త్రవేత్త పాలపై పరిశోధన చేసి విటమిన్లను అదనపు ఆహార కారకాలు అని పిలిచాడు.
– కాసిమిర్ ఫంక్ అనే శాస్త్రవేత్త ఈ అదనపు ఆహార కారకాలకు విటమిన్లు అని పేరుపెట్టాడు.
– జేసీ డ్రుమండ్ అనే శాస్త్రవేత్త విటమిన్లలోని e అక్షరాన్ని తొలగించి Vitaminsగా సూచించాడు. దీంతోపాటు విటమిన్లకు A, B, C, D, E అనే ఆంగ్ల అక్షరాలను పేర్లుగా పెట్టాడు.
– విటమిన్లను అంతర్జాతీయ ప్రమాణాల్లో (IU) కొలుస్తారు.
– ద్రావణీయతను ఆధారంగా చేసుకుని విటమిన్లను ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరిస్తారు. అవి..
1. కొవ్వులలో కరిగే విటమిన్లు (Fat soluble)- A, D, E, K
2. నీటిలో కరిగే విటమిన్లు (Water soluble)- B, C
విటమిన్-ఏ
– మెక్కల్లమ్ అనే శాస్త్రవేత్త దీన్ని గుర్తించాడు. ఈ విటమిన్ రసాయన నామం- రెటినాల్
– దీన్ని సాధారణంగా యాంటీజీరోఫ్తాల్మిక్ లేదా నివారిక విటమిన్ అని కూడా పిలుస్తారు.
లభించే పదార్థాలు
– ఇది క్యారట్ (అధికంగా కలిగిన పదార్థం), పాలు (ఆవు పాలలో ఎక్కువ), చేపల కాలేయ నూనె, కూరగాయలు, అన్ని రకాల ఆకు కూరలు (బచ్చలి కూరలో అధికంగా ఉంటుంది), పసుపు పచ్చని పండ్లు (బొప్పాయిలో అధికం) మొదలైన వాటిలో లభిస్తుంది.
– ఇది కంటి చూపు, గర్భధారణ, ఎముకల పెరుగుదలకు, చర్మం కాంతివంతంగా ఉండటానికి అవసరమవుతుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధులు
– రేచీకటి (నిక్టలోపియ): మసక చీకటిలో కళ్లు కనబడకపోవడం
– పొడికళ్లు (జీరోఫ్తాల్మియ): లాక్రిమల్ గ్రంథులు లేదా అశ్రుగ్రంథులు పనిచేయకపోవడం వల్ల కన్నీళ్లు ఉత్పత్తి కాకపోవడంతో కళ్లు పొడిగా మారుతాయి.
– డెర్మటోసిస్: చర్మం పైపొర పొలుసులుగా ఊడిపోతాయి.
విటమిన్-డీ
– మెక్కల్లమ్ అనే శాస్త్రవేత్త దీన్ని గుర్తించాడు. దీని రసాయన నామం- కాల్సిఫెరాల్.
– దీన్ని సాధారణంగా యాంటీ రికెటిక్ విటమిన్, సూర్యకాంతి విటమిన్, ఉచిత విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్ అంటారు.
లభించే పదార్థాలు
– కాడ్చేప కాలేయ నూనె, గుడ్డులోని పచ్చసొన, పాలు, వెన్న, కాలేయం (అధికంగా ఉంటుంది), సూర్యకాంతి మొదలైన వాటిలో ఈ విటమిన్ లభిస్తుంది.
– ఈ విటమిన్ చిన్న పేగులో కాపర్, కాల్షియం అయాన్ల శోషణలో కాల్షియం, ఫాస్పరస్ల జీవక్రియలో, ఎముకలు, దంతాలు గట్టిగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
– మానవ చర్మంలో ఉండే ఎర్గోస్టిరాల్ అనే రసాయన పదార్థం సూర్యరశ్మి సమక్షంలో (UV-B), విటమిన్-డీ తయారవుతుంది. ఎర్గోస్టిరాల్ను విటమిన్-డీకి ప్రోవిటమిన్ అంటారు.
లోపం వల్ల వచ్చే వ్యాధులు
– రికెట్స్: చిన్న పిల్లల్లో ఎముకలు మెత్తబడుతాయి.
– ఆస్టియో మలేషియా: పెద్దవారిలో ఎముకలు పెలుసుబారుతాయి.
– పిజియన్ చెస్ట్
అధికమవడం వల్ల..
– మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, వాంతులు, విరేచనాలు వస్తాయి.
విటమిన్-ఈ
– ఇవాన్స్, బిషప్ అనే శాస్త్రవేత్తలు ఈ విటమిన్కు టోకోఫెరాల్ అని నామకరణం చేశారు. దీని రసాయన నామం టోకోఫెరాల్.
– దీన్ని సాధారణంగా వంద్యత్వ నిరోధక (Anti sterility vitamine) విటమిన్, బ్యూటీ విటమిన్ అంటారు.
లభించే పదార్థాలు
– ఇది వృక్షసంబంధ నూనెలు (పత్తి గింజల నూనె, గోధుమ బీజతైలం, సోయాచిక్కుడు, మొక్కజొన్న గింజల నూనె, కుసుమ పువ్వు నూనె), పిక్కలు (Nuts- జీడిమామిడి, బాదం), తాజా ఫలాలు, మొలకెత్తే గింజలు మొదలైన వాటిలో లభిస్తుంది.
– ఇది కండర సంకోచంలో, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, జ్ఞానేంద్రియ వ్యవస్థ క్రియాత్మకతకు దోహదపడుతుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధులు
– వంద్యత్వం- లోపం వల్ల వంద్యత్వం ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా ఎలుకల్లో కనిపిస్తుంది.
– ఎర్రరక్త కణాల జీవిత కాలం తగ్గుతుంది.
– ఎన్సెఫలో మలేషియా- ఇది కోళ్లలో కలుగుతుంది.
– మైటోకాండ్రియాలో ఉండే విటమిన్- ఈ
– యాంటి క్యాన్సర్ విటమిన్లు- ఏ, సీ, ఈ
విటమిన్-కే
– డామ్ అనే శాస్త్రవేత్త దీన్ని ఆకుపచ్చని పత్రాల్లో గుర్తించాడు. దీని రసాయన నామం- ఫిల్లోక్వినోన్ లేదా నాఫ్తాక్వినోన్
– దీన్ని సాధారణంగా రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్, ప్రతిరక్త స్కందన నిరోధక విటమిన్ (యాంటీ హీమరేజిక్ విటమిన్) అంటారు.
– ఇది సర్జరీ సమయంలో రోగికి ఇచ్చే విటమిన్.
లభించే పదార్థాలు
– ఇది పచ్చని ఆకు కూరలు, కాలేయం, గుడ్లు, ఆవుపాలు మొదలైన వాటిలో లభిస్తుంది. పేగులోని ఇ-కోలై అనే బ్యాక్టీరియా కూడా ఈ విటమిన్ను సంశ్లేషిస్తుంది.
– డికుమెరిన్ (Dicoumarin) అనే పదార్థం రసాయనికంగా కే-విటమిన్ను పోలి ఉంటుంది. కానీ ఈ డికుమెరిన్-కే విటమిన్ చర్యను నిరోధిస్తుంది. ఈ డికుమెరిన్ అనే పదార్థం ఎక్కువగా మెలిలోటస్ అఫిసినాలిప్, మెలిలోటస్ ఆల్బా అనే మొక్కల్లో ఉంటుంది. దీని కారణంగా ఆ మొక్కలను ఆహారంగా తీసుకున్న పశువులు తీవ్ర రక్తస్రావంతో చనిపోతాయి.
– ఇది జీవరసాయన క్రియల్లో రక్త స్కందన కారకాలను తయారుచేసి గాయమైన ప్రాంతంలో 2-3 నిమిషాల్లో రక్తం గడ్డకట్టేందుకు, వృక్షాల్లో కిరణజన్య సంయోగ క్రియలో పాస్పారిలేషన్ చర్యల్లో, ఎలక్ట్రాన్ రవాణాలో కోఎంజైమ్ Qగా సహాయపడుతుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధి
– సాధారణంగా విటమిన్-కే లోపం జంతువుల్లో కానీ, మానవుల్లో కానీ ఏర్పడదు. కానీ అప్పుడే పుట్టిన శిషువుల్లో దీనిలోపం సాధారణంగా కన్పిస్తుంది.
– హీమరేజియా వ్యాధి: అధిక రక్తస్రావం, రక్తం గడ్డకట్టక పోవడం
బీ-విటమిన్లు
– విటమిన్-బీ అనేక రకాల విటమిన్లను కలిగి ఉంటుంది. వీటన్నింటిని కలిపి బీ-కాంప్లెక్స్ విటమిన్లు అంటారు.
లభించే పదార్థాలు
– ఇవి ప్రధానంగా కూరగాయలు, పప్పు ధాన్యాలు, దుంపలు, పుట్టగొడుగులు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, ఈస్ట్, ఇ.కొలై బ్యాక్టీరియా మొదలైన వాటిలో లభిస్తాయి.
రకాలు
– బీ-కాంప్లెక్స్ విటమిన్లు సుమారు 12 రకాల వరకు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి… B1, B2, B3, B5, B6, B7, B9, B12 విటమిన్లు.
B1- విటమిన్
– దీని రసాయననామం- థయమిన్. దీన్ని సాధారణంగా యాటీన్యూరైటిక్ విటమిన్ లేదా యాంటీ బెరిబెరి విటమిన్ అంటారు.
– ఇందులో సల్ఫర్ మూలకం ఉంటుంది. ఇది ఎక్కువగా బియ్యపు తవుడు పొరల్లో ఉంటుంది. పాలిష్ అధికంగా చేసిన బియ్యంలో ఈ విటమిన్ లోపిస్తుంది.
– ఇది కార్బొహైడ్రేట్ల జీవ క్రియలో, కణశ్వాస క్రియలో, ఆకలిని పెంచడంలో తోడ్పడుతుంది.
లోపం వల్ల వచ్చే వ్యాధులు
– బెరి బెరి వ్యాధి: మానవుడిలో తడి బెరిబెరి, పొడి బెరిబెరి అనే రెండు రకాల వ్యాధులు కలుగుతాయి. కండరాలు క్షీణించి కాళ్లు, చేతులు పక్షవాతం వల్ల పడిపోవడాన్ని బెరిబెరి అంటారు. దేహ కుహరంలోకి నీరు చేరి హృదయం ఉబ్బడం, కాలేయం నొక్కుకుని పోవడాన్ని తడి బెరిబెరి అంటారు.
– పాలీ న్యూరైటిస్: థయమిన్ లోపం వల్ల పక్షుల్లో నాడీ మండలం పక్షవాతానికి గురవడాన్ని పాలీన్యూరైటిస్ అంటారు.
B2- విటమిన్
– దీని రసాయన నామం- రిబోఫ్లావిన్. దీన్ని సాధారణంగా ఎల్లో ఎంజైమ్, యాంటీ కీలోసిస్ విటమిన్, యాంటీ గ్లాసైటిస్ విటమిన్ అంటారు.
– ఇది కణ ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు జరిగేందుకు అవసరమవుతుంది (శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ).
లోపం వల్ల వచ్చే వ్యాధులు
– కీలోసిస్ వ్యాధి: పెదవుల చివరలో పగుళ్లు ఏర్పడి రక్తస్రావం జరుగుతుంది.
– గ్లాసైటిస్ వ్యాధి: నాలుక, అంగిలి, పెదవులు పగిలి నోరు ఎరుపు రంగులోకి మారుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు