Qutb Shahis Industries | కుతుబ్‌షాహీల పరిశ్రమలు – నిర్మాణాలు
-సమకాలీన తెలుగు రచనలు, కుతుబ్‌షాహీల ఫర్మానాలు, విదేశీ బాటసారుల రచనల్లో గోల్కొండ రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వజ్రాల, నేత, కలంకారీ అద్దకం, తివాచీలు, నౌక నిర్మాణం, సురేకారం, ఇనుము – ఉక్కు మొదలైన పరిశ్రమల గురించి ప్రస్తావన ఉంది.
-వజ్రాల పరిశ్రమ: యావత్ ప్రపంచంలోనే గోల్కొండ గనుల్లో తవ్వి, శుద్ధి చేసిన వజ్రాలకు విశేష గుర్తింపు లభించింది. వీరి రాజ్యంలోని కృష్ణా నది తీరంలోని కొల్లూరు (గుంటూరు జిల్లా), రామళ్లకోట (కర్నూలు) గనులు మేలురకపు వజ్రాలకు నిలయాలు. ఈ గనులు కుతుబ్‌షాహీల రాజ్యస్థాపనకు ముందే ఉన్నాయి. విజయనగర రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించే కాలంలో సుమారు క్రీ.శ. 1460 ప్రాంతంలో ఈ గనుల్లో తవ్వకం జరిగేదని ఫ్రెంచ్ బాటసారి టావెర్నియర్ పేర్కొన్నారు.
-విలియం మెథోల్డ్ కొల్లూరు గనిని సందర్శించినప్పుడు అక్కడ సుమారుగా 30 వేల మంది పనివారు ఉన్నారని రాయగా, టావెర్నియర్ పర్యటించేనాటికి పనివారి సంఖ్య 60 వేలని పేర్కొన్నాడు. కుతుబ్‌షాహీల వజ్రపు గనులు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్, హోప్, పిట్, పిగాట్, షాహ్-తాజ్-ఎ మొదలైన వజ్రాలకు నిలయాలుగా పేరొందాయని విదేశీ యాత్రికులు ఫ్రాన్సిస్కో పెరీరా, జాక్వెడి కోత్రే (స్పెయిన్), నికోలో-డి-కాంటి (ఇటలీ), టావెర్నియర్, బెర్నియర్, థెవ్నాట్ (ఫ్రాన్స్ దేశస్థులు) మొదలైన వారు తమ రచనల్లో ప్రస్తావించారు.
-హైదరాబాద్ నగరాన్ని 1645లో సందర్శించిన టావెర్నియర్ నగరంలోని చార్మినార్‌కు పశ్చిమ దిశలోని కార్వాన్ ప్రాంతంలో వజ్రాలకు సానపట్టే పనివారు, వారి దుకాణాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. గోల్కొండ రాజ్యంలో లభించే వజ్రాల సైజు పెద్దగా ఉందేదని, మేలు రకం వజ్రాలు ఇక్కడ లభించేవని రాశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో 1656లో కొల్లూరు గనిలో దొరికిందని అభిప్రాయం. టావెర్నియర్ ఔరంగజేబ్ కాలంలో కోహినూర్ వజ్రాన్ని 1665లో చూశానని రాశాడు. కోహినూర్ వజ్రం బరువు 106 క్యారెట్లు. ప్రస్తుతం ఇది ఇంగ్లండ్‌లోని ఇంపీరియల్ రచెగాలియా మ్యూజియంలో ఉంది.
నేత పరిశ్రమ
-గోల్కొండ రాజ్యంలో నేసిన వస్ర్తాలు ఐరోపా మార్కెట్లలో మంచి గిరాకీ పొందాయి. ఆనాటి నేత కార్మికులు స్థానిక అవసరాలను తీర్చడమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాలకు సరఫరా చేసేవారు.
-నేతబట్టలు రెండు రకాలు. ఒకటి తానులుగా విక్రయించే తెలుపు, ఎరుపు, నీలం రంగు బట్టలు. ఇవి గుండ్రని చుట్టలుగా చుట్టి అమ్మేవారు. ఇంకోటి మస్లిన్, కాలికో (మందం బట్ట) నేసిన వస్ర్తాల రకాలు. అద్దకపు వస్ర్తాన్ని చింట్జ్ అనేవారు. చిత్రాలు ముద్రించిన బట్టలను పింటాడో అనేవారు. మచిలీపట్నంలో కలంకారీ పనివారు అధికం. ఇక్కడి వస్ర్తాల ధర కొంత తక్కువ. నరసాపురంలో కాలికో వస్ర్తాలు కొంచెం చౌకగా లభించేవి. గోల్కొండ నేతపనివారు తాను నేసిన వస్ర్తాలు, బట్టలకు తానుగుడ్డ, లుంగీ, సాలెంపూరీ, వలంపూరీ మొదలైన పేర్లతో పిలిచేవారు.
తివాచీ పరిశ్రమ
-చిన్న, పెద్ద సైజు తివాచీలకు దక్కన్లో మంచి గిరాకీ ఉండేది. వీటి తయారీకి అవసరమైన ముడిసరుకు తెలంగాణలో పుష్కలంగా లభించేది. వరంగల్ తివాచీల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది. వరంగల్‌లోని మెట్టవాడ, గిర్మాజీపేట మొదలైన చోట్ల ఈ తివాచీలు అల్లే కుటుంబాలు అధికంగా ఉండేవి. సర్ జార్జ్ వాట్ అనే రచయిత ఇండియన్ ఆర్ట్ ఎట్ ఢిల్లీ, కలకత్తా అనే గ్రంథంలో వరంగల్ తివాచీలు నేసేవారి పనితనాన్ని, వారు వాడే రంగులను ప్రశంసించాడు.
నౌకా నిర్మాణ పరిశ్రమ
-విదేశీ వ్యాపారానికి ప్రాచీనకాలం నుంచే ఆంధ్రదేశం ప్రసిద్ధిగాంచింది. కుతుబ్‌షాహీల కాలంలో ఓడలు, నౌకలపై సముద్ర వ్యాపారం కొనసాగేది. గోదావరి తీరంలోని నర్సాపురం, భీమునిపట్నం, పులికాట్, మచిలీపట్నం నౌకా నిర్మాణ కేంద్రాలు. ఈ విషయాన్ని విదేశీ యాత్రికులు విలియం మెథోల్డ్, షోరర్ తమ రచనల్లో పేర్కొన్నారు.
సురేకారం పరిశ్రమ
-గోల్కొండ రాజ్యంలోని కొన్ని ముఖ్య పరిశ్రమల్లో మందుగుండు సామగ్రి తయారుచేయడంలో ఉపయోగించే సురేకారం ముఖ్యమైంది. దీన్ని ఎక్కువగా మచిలీపట్నం, నర్సాపురం, పులికాట్ మొదలైన పట్టణాల్లో తయారు చేసేవారని, ఫిరంగులు, తుపాకుల్లో దాన్ని వాడేవారని విదేశీ యాత్రికులు, రచయితలు పేర్కొన్నారు. ఒక మణుగు సురేకారం ధర 1665లో 41/2 రూపాయలు ఉండేది.
కుతుబ్‌షాహీల కాలంలోని నిర్మాణాలు
-హైదరాబాద్ (1590-91): గోల్కొండ సుల్తానుల్లో మహమ్మద్ కులీకుతుబ్‌షా (1580-1612) గొప్పవాస్తు కళాభిమాని. ఇతను హైదరాబాద్ నగరాన్ని 1590-91లో నిర్మించడం ఆరంభించాడు. ఈ నగరం మధ్యయుగ దక్కన్ చరిత్రలోనే కాకుండా యావత్ ఆసియా ఖండంలోనే ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. గోల్కొండ రాజధానిలో జనాభా విపరీతంగా పెరిగినందువల్ల సుల్తాన్ మూసీ నది దక్షిణ ప్రాంతాన ఒక కొత్త నగర నిర్మాణానికి పునాది వేశాడు. ఈ మహాసుందర నగర నిర్మాణంలో సుల్తాన్‌కు అన్ని విధాలా సహకరించిన వ్యక్తి మీర్ మోమిన్ మహమ్మద్ అస్త్రబాది.
మీర్ మోమిన్ మహమ్మద్ అస్త్రబాది
-ఇతడు దక్షిణ ఇరాన్‌లోని జిలాలీ రాష్ట్రంలో మూసవీ కుటుంబానికి చెందినవాడు.
-మీర్ మోమిన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. మంచి రచయిత, పాలనావేత్త, ఆధ్యాత్మికవేత్త, సూఫీ మేధావి, అలీం, అధ్యాపకుడు, గొప్ప వాస్తు ఇంజినీర్.
-1581లో మహ్మద్ కుతుబ్‌షా ఆస్థానం చేరి తన తెలివితేటలు, విశ్వసనీయత ద్వారా సుల్తాన్ అభిమానం పొంది 1585లో గోల్కొండ ప్రధానమంత్రిగా నియమితులయ్యాడు.
హైదరాబాద్ నగర ప్రణాళిక
-నగర నిర్మాణానికి మోమిన్ తన దేశంలోని (ఇరాన్) ఇస్పాన్-ఇ-నౌ పట్టణం నమూనాలో కట్టాలని ప్రణాళిక చేశాడు. దీనికి సుల్తాన్ సమ్మతించగా, దాని నిర్మాణానికి ప్రపంచం నలుమూలల నుంచి వాస్తు నిర్మాణంలో దిట్టలైన మేస్త్రీలు, రాళ్లు చెక్కేవారిని, పనివారిని ఆహ్వానించాడు.
-మోమిన్ హైదరాబాద్ నగర నిర్మాణ ప్రణాళికను రూపొందించేటప్పుడు తన అనుభవాన్ని ఉపయోగించాడు. తన ప్రణాళిక త్రిభుజాకారంలో రూపొందించాడు. ప్రధాన భవనాలు చార్మినార్ పరిసరాల్లో ఉండేటట్లు ప్రణాళిక తయారు చేశాడు. చార్మినార్ కేంద్ర బిందువుగా ఇతర మార్కెట్లు, భవంతులు, కమాన్లను గుర్తించాడు. ఇరాన్‌లోని సఫాయిద్ నగరంలోని మైదాన్-ఇ-నక్షజహాన్ మాదిరిగా చార్మినార్‌ను కూడలిగా రూపొందించాడు. నాలుగు దిశలా మార్గాలు కలిసే కూడలిని చార్మినార్ నిర్మాణానికి అనువైన ప్రదేశంగా ఎంపిక చేశాడు. ఉత్తర దిశ నుంచి మూసీనది వరకు, దక్షిణ దిశ మార్గం కోహీర్ వరకు, తూర్పు మార్గం బంగాళాఖాతం వరకు, పశ్చిమదిశ మార్గం గోల్కొండ దాని అవతల భాగాలకు విస్తరించి ఉండేటట్లు ప్రణాళిక చేశాడు. చార్‌కమాన్ లేదా జులుఖాన్ అనే అద్భుత కట్టడాన్ని మీర్ మోమిన్ చార్మినార్‌కు ఉత్తర దిశన 80 గజాల దూరంలో కట్టించాడు. మహమ్మద్ కులీ కుతుబ్‌షా కాలంలోనే ఈ కొత్త పట్టణంలో అనేక తోటలు పెంచారు. భవనాలు, సరాయిలు, రహదారులు, మసీదులు, అఘర్ఖానాలు నిర్మించారు. దీంతో హైదరాబాద్ నగర జన సమృద్ధితో వర్థిల్లింది. పర్షియా దేశం నుంచి అనేక మంది కవులు, అలీంలు, కళాకారులు ఈ నగరానికి వచ్చి స్థిరపడ్డారు.
-హైదరాబాద్ పట్టణ నిర్మాణానికి పునాదివేసే సందర్భంగా సుల్తాన్ భగవంతుణ్ని తన నగరానికి శాంతి, సమృద్ధి ప్రసాదించమని, ఇక్కడి ప్రజలందరూ కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా, ఒక చెరువులోని చేప పిల్లల్లాగా, స్నేహభావంతో, ప్రేమతో ఐక్యంగా ఉండి సహజీవనం చేయాలని ప్రార్థించాడు.
-హైదరాబాద్ నగరం నిర్మించిన 25 ఏండ్లకు అంటే 1616లో అజ్ఞాత రచయిత రాసిన తారీఖ్-ఇ-కుతుబ్‌షాహీ గ్రంథంలో హైదరాబాద్ అందచందాలను, ఆహ్లాద వాతావరణాన్ని కింది విధంగా వర్ణించాడు.
-ఈ నగరం నిజంగా భూతల స్వర్గం
-ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు
-వృద్ధుడు ఈ పట్టణానికి వస్తే అతడు తన యవ్వనం తిరిగి పొందుతాడు.
-హైదరాబాద్ నగరంలో మంచితనానికి కొదువే లేదు. అదృష్టం ఇక్కడే స్థిరపడింది. దుఃఖం, బాధలు ఇక్కడికి చేరవు.
-ఇదేవిధంగా ఔరంగజేబ్ వెంట 1687లో హైదరాబాద్ వచ్చిన మహమ్మద్ సాఖీ అనే చరిత్రకారుడు హైదరాబాద్ ఆహ్లాదకర ప్రదేశమని, ఇక్కడి గాలి, నీరు, వాతావరణం, మానవుల హృదయాన్ని పవిత్రం చేసి, పగను, ద్వేషాన్ని దూరం చేసి, మనుషుల మధ్య ప్రేమను, సోదర భావాన్ని పెంచి దీర్ఘాయువు ప్రసాదిస్తుందని పొగిడాడు. హైదరాబాద్‌ను సందర్శించిన విదేశీ యాత్రికులైన టావెర్నియర్, బెర్నియర్, విలియ్ మెథోల్డ్లు ఇక్కడి నీరు, గాలి, చెట్లు, పర్వతాలు, నేల స్వర్గతుల్యమని, భూమిపై ఇదొక స్వర్గమని ప్రశంసించారు.
దారుషిఫా- 1595 (ది హౌస్ ఆఫ్ క్యూర్)
-సుల్తాన్ మహ్మద్ కులీకుతుబ్‌షా కాలంలో రోగులకు వైద్య సౌకర్యం కోసం నేటి సాలార్జంగ్ మ్యూజియం సమీపంలోని దారుషిఫా వద్ద 1595లో ఒక యునానీ దవాఖానను నిర్మించాడు. ఇక్కడ పేదలు, శ్రీమంతులకు ఉచితంగా వైద్యం చేసేవారు. ఇది రెండంతస్థుల భవనం. ఇక్కడ దేశ, విదేశాల నుంచి వచ్చిన యునానీ వైద్యులు ఉండేవారు. రోగులకు ఉచితంగా మందులు, భోజనం ఏర్పాటు చేశారు. గోల్కొండకు నాలుగు లీగుల దూరంలోని ఒక గ్రామంలో డచ్ దేశానికి చెందిన పీటర్ డిలాన్ అల్లోపతి వైద్యం చేసే వాడని, అతని ఇంట్లో తాను ఉన్నానని టావెర్నియర్ తన పుస్తకంలో రాశాడు. అంతఃపురంలో రాణికి గాని, ఇతరులకు గాని అనారోగ్యం కలిగినప్పుడు పీటర్ డిలాన్ చికిత్స కోసం అక్కడికి వెళ్లేవాడు. రాణి తెర వెనుక నుంచి చెయ్యి బయటకు పెడితే డిలాన్ చికిత్స చేసేవాడు. దీనికి ఫీజు 50 పగోడాలు చెల్లించారని పేర్కొన్నాడు.
హిందూ ఆలయాల్లో కూడా ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఉదాహరణకు నేటి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని సూర్యనారాయణ స్వామి ఆలయం, ద్రాక్షారామం ఆలయాల్లో రోగులకు ఉచిత ఆయుర్వేద చికిత్స చేసేవారు. నవనాథ చరిత్రలో రచయిత గౌరన సిద్ధులు మఠాల్లో రోగులకు చేసే సేవలను వర్ణించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు