Ayushman Bharat | ఆయుష్మాన్ భారత్
భారత్‌లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలకు మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తూనే ఉన్నాయి. కానీ, ఇప్పటికీ ఆధునిక వైద్యసదుపాయాలు అందుబాటులోలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వీరందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ఆయుష్మాన్ భారత్ వంటి కొత్త పథకాలను అమలుచేస్తున్నారు. దేశంలో ఆరోగ్యరంగం స్థితిగతులపై పోటీపరీక్షల్లో తరుచుగా ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో నిపుణ పాఠకులకోసం ఈ వ్యాసం..
ఇటీవల వెలువడిన నీతిఆయోగ్ ఆరోగ్యరంగంలో రాష్ర్టాల ప్రదర్శన నివేదిక, 2018-19 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం దేశంలోని ఆరోగ్యరంగం స్థితిగతులను ప్రతిబింబిస్తున్నాయి.
-దేశం ఆరోగ్యరంగంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. జాతీయ ఆరోగ్య విధానం-2017, ఆయుష్మాన్ భారత్ పథకం లాంటి విధానాల ద్వారా దేశ ప్రజలందరికీ ఉన్నతస్థాయి వైద్య సౌకర్యాలను అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం.
దేశంలో ఆరోగ్యరంగంపై వ్యయం
-దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆరోగ్య రంగానికి కేవలం 1.4 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యరంగానికి సంబంధించిన పరిశోధన కోసం ప్రజారోగ్యానికి ఇచ్చే మొత్తంలో కేవలం 1 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. భారత్‌లో ప్రజలు వైద్యంపై చేస్తున్న ఖర్చు వారి ఆదాయాల్లో దాదాపుగా 65 శాతంగా ఉంది. ప్రపంచంలో మరేదేశంలోని ప్రజలు వైద్యం కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడంలేదు. స్థూల దేశీయోత్పత్తిలో ఆరోగ్యరంగ వాటాను ప్రస్తుతం ఉన్న 1.4 శాతం నుంచి 2.5 శాతానికి పెంచాలని నూతన జాతీయ వైద్య విధానం నిర్దేశించింది.
దేశంలో ఆరోగ్య బీమా సదుపాయం
-కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రీయ స్వాస్త్య బీమా యోజన పథకం ద్వారా గ్రామీణ స్థాయిలో 13 శాతం ప్రజలకు, పట్టణస్థాయిలో 12 శాతం ప్రజలకు మాత్రమే జీవిత బీమా సౌకర్యం కల్పించారు. ఇటీవల జాతీయ నమూనా సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలో దాదాపు 80 శాతం మంది ప్రజలకు ఎలాంటి జీవిత బీమా సౌకర్యం లేదనే వాస్తవం వెల్లడైంది.
ఆరోగ్యరంగ వ్యవస్థలో వివిధ అంశాల నిష్పాదన
-సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశ నిష్పాదన నిర్దేశించుకున్న గమ్యానికి దరిదాపులో ఉంది. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో మాతృ మరణాల తగ్గింపు లక్ష్యం 139 కాగా, ఈ అంశంలో దేశంలో నిష్పాదన 167గా ఉంది. అదేవిధంగా ఐదేండ్లలో శిశుమరణాల రేటు తగ్గింపు లక్ష్యం 42 కాగా, భారత్ నిష్పాదన 49గా ఉంది.
-ఇటీవల ప్రపంచ ఆకలి నివేదికలో 118 దేశాల్లో భారత్ 78వ స్థానాన్ని పొందింది. దేశంలో అంటువ్యాధుల్లో 28 శాతం వ్యాధులు, సాధారణ వ్యాధుల్లో 60 శాతం వ్యాధులు ఉన్నాయి.
-దేశంలో ముఖ్యంగా రెండు ఆరోగ్య సంబంధిత అంశాలను పరిపుష్ఠం చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి..
1. ఆరోగ్య సంబంధిత సౌకర్యాలను కల్పించలేకపోవడం
2. జీవన సంబంధిత వ్యాధులు (డయాబెటిస్, హృద్రోగాలు)
-దేశంలో మానసిక అనారోగ్యం కూడా ప్రజల్లో పెరుగుతుంది. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం…
-స్త్రీలలో ప్రతి నలుగురిలో ఒకరు, దాదాపు 10 శాతం మంది పురుషులు డిప్రెషన్‌కు గురవుతున్నారని తేలింది.
-సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో నిర్దేశించిన కొన్ని వ్యాధులను తగ్గించడంలో దేశ నిష్పాదన మెరుగైన స్థితిలో ఉంది.
-ఉదాహరణకు పోలియో వ్యాధిని నిర్మూలించడం, కుష్ఠు వ్యాధిని తగ్గించడం, ఎయిడ్స్ వ్యాధి కేసుల్లో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో సగానికి చేరుకున్నాయి.
జాతీయస్థాయిలో కార్యక్రమాలు
-దేశంలో జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ప్రోగ్రామ్‌ల ద్వారా వైద్యరంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలను సాధించండం కోసం కృషి జరుగుతుంది.
-జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా కింది ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నారు.
1) RMNCH +A Services (RMNCH +A సేవలు)
2) Communicable Diseases Programm (అంటువ్యాధుల నివారణ కార్యక్రమం)
3) అంటువ్యాధులు కాని వ్యాధుల నివారణ ప్రోగ్రామ్
4) గ్రామీణ, పట్టణ స్థాయిల్లో ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధిచేయడం
5) సార్వత్రిక రోగ నిరోధక ప్రోగ్రామ్
6) మానసిక ఆరోగ్యం
ఆయుష్మాన్ భారత్
-దేశ ప్రజలందరికీ నాణ్యమైన, మెరుగైన సకల వైద్య సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం 2018-19 బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.
-దేశంలో ఏడాదికి ఆరోగ్య సేవల కోసం రూ. 5 లక్షల కోట్లు ఖర్చవుతుంది. దేశంలో 60 శాతం ప్రజలు వైద్యచికిత్సల కోసం వ్యక్తిగతంగానే డబ్బు ఖర్చు చేస్తున్నారు. దేశ ప్రజలకు రోజురోజుకి వైద్యచికిత్సల కోసం వెచ్చించే ఖర్చు భారం అవుతుంది. ఈ పరిస్థితిని నివారించడానికిగాను కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకువచ్చింది.
-ఈ పథకాన్ని మొదటి దశలో 50 కోట్ల మంది ప్రజలతో ప్రారంభించి, అంతిమంగా 130 కోట్ల మందికి విస్తరించాలన్నది కేంద్రప్రభుత్వ లక్ష్యం.
-ఈ పథకం అర్హుల ఎంపికకు 2011 నాటి సామాజిక, ఆర్థిక, కుల జనాభా గణన (ఎస్ఈసీసీ) ఆధారం.
-ఈ పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి వార్షిక వైద్యఖర్చుల కోసం రూ. 5 లక్షలు కేటాయిస్తారు.
-ఆయుష్మాన్ భారత్ అనేది కేంద్ర ప్రాయోజిత పథకం. కానీ అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.
-ఈ పథకంలో పేరు నమోదు చేసుకున్న వ్యక్తి దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా వైద్యసౌకర్యాలను పొందవచ్చు.
-ఈ పథకం అమలుకు అవసరమయ్యే నిధుల కోసం వైద్య సుంకాన్ని అదనంగా 1 శాతం పెంచాలని కేంద్రం భావిస్తుంది.
-ఈ పథకంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడానికి 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా నిర్ధారించింది.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలపై ప్రభావం
-ఆయుష్మాన్ భారత్ పథకంవల్ల ప్రైవేటు రంగానికి ఎక్కువ లబ్ధి చేకూరి, ప్రభుత్వ రంగం బలహీనపడుతుందన్న వాదన ఉంది. అయితే దీన్ని కేంద్రప్రభుత్వం అంగీకరించడం లేదు.
-ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో ఇటువంటి పథకం వల్ల ప్రజలు వైద్యంపై వెచ్చించే డబ్బులో 55 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్తుందని కేంద్ర చెబుతుంది.
-ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగాలు అనే తేడాలేదు. ఎక్కడైనా మెరుగైన వైద్యసేవలు పొందవచ్చు. దీనివల్ల ప్రభుత్వరంగం కూడా తన శక్తిసామర్థ్యాలను పెంచుకొని ప్రైవేటు రంగంతో పోటీపడే పరిస్థితిని కల్పించినట్లు అవుతుంది.
-ప్రస్తుతం దేశంలో మూడువంతుల జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కానీ వైద్యుల్లో మూడువంతుల మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం వల్ల ప్రజలు అధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యరంగం విస్తురిస్తుందనే ఆశావాద దృక్పథాన్ని ప్రభుత్వం కలిగి ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో భారత్ కృషి
1) అంతర్జాతీయ టీకా సంస్థ ఏర్పాటు: ఐక్యరాజ్య అభివృద్ధి ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) సహకారంతో ప్రపంచ దేశాలు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో అంతర్జాతీయ టీకా సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ ద్వారా ప్రజలకు ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులకు సరికొత్త టీకా మందును కనుగొనడానికి పరిశోధనలు చేయడం జరుగుతుంది. ఇందుకుగాను భారత్ ప్రతి ఏటా 50,000 డాలర్లు అందిస్తుంది.
2) ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ వైద్యవిధానాలను వ్యాప్తిచేయడం: కేంద్రప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థలకు జరిగిన సహకార ప్రాజెక్టు ఒప్పందం ద్వారా దేశంలో కొన్ని వ్యాధుల నివారణకు వినియోగిస్తున్న సంప్రదాయ విధానాలను ప్రపంచానికి అందిస్తుంది.
3) ప్రపంచ ఆరోగ్య నెట్వర్క్: ఈ నెట్వర్క్ ద్వారా భారత్ సహా మొత్తం 9 దేశాలు కలిసి గర్భిణుల ఆరోగ్యాన్ని పెంపొందించడం, కొత్తగా జన్మించిన పిల్లల మరణాల సంఖ్యను తగ్గించడానికి కృషిచేయడం జరుగుతుంది.
ఆరోగ్యరంగ సమస్యలు
-దేశంలో వైద్యరంగంలో పనిచేసే వృత్తి నిపుణుల సంఖ్య తగినంతగా లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దేశంలో ప్రతి 1000 మంది జనాభాకు 2.5 నర్సులు ఉండాలి. కానీ, భారత్‌లో ప్రతి 1000 మంది జనాభాకు 1.5 నర్సులు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా భారత్‌లో ప్రతి 1000 మంది జనాభాకు కేవలం ఏడుగురు డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
-ఆరోగ్యరంగానికి సంబంధించిన వృత్తి నిపుణులు అందరూ పట్టణ పరిసర ప్రాంతాల్లోనే దృష్టి సారించడం
-పారామెడికల్, వైద్య పరిపాలన సంబంధిత నిపుణుల కొరత కూడా ఉంది.
జాతీయ ఆరోగ్య విధానం -2017
-దేశ ప్రజలందరికి సార్వత్రిక ఆరోగ్య అందుబాటును అందించాలనే దృక్పథంలో 2017లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా జాతీయ ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం కొన్ని వైద్య లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేస్తుంది.
ఉద్దేశాలు
1. సార్వత్రిక ఆరోగ్య అందుబాటును వేగవంతంగా సాధించడం
2. ప్రభుత్వ వైద్య వ్యవస్థలపై ప్రజలకు నమ్మకాన్ని పునరుద్ధరించడం
3. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వైద్య లక్ష్యాలను మిళితం చేయడం
4. ప్రత్యేకమైన పరిమాణాత్మక ఉద్దేశాలు, లక్ష్యాలను కలిగి ఉండటం
ప్రాథమిక భావనలు
1. వైద్య సంబంధిత వృత్తిలో ప్రావీణ్యతను, సమగ్రతను, నైతికతను పెంపొందించడం
2. వైద్యం పొందడంలో సమానత్వాన్ని పెంపొందించడం
3. వైద్య ఖర్చులు భరించకలిగే స్థాయిలో ఉంచడం
4. సార్వత్రిక ఆరోగ్య అందుబాటును అందించడం
5. రోగి కేంద్రీకృత, నాణ్యమైన సేవలను అందించడం
6. జవాబుదారీతనాన్ని పెంపొందించడం
7. ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థల మధ్య సమ్మిళిత భాగస్వామ్యం
8. బహుళత్వాన్ని పెంపొందించడం
9. వికేంద్రీకరణ చేయడం
10. కాలానుగుణంగా వైద్య వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం
ముఖ్యాంశాలు
-దేశ ప్రజల జీవన ఆయుఃప్రమాణాన్ని 2025 నాటికి 70 ఏండ్లకు పెంచాలి (ప్రస్తుతం 67.5 ఏండ్లు ఉంది).
-స్త్రీల సంతాన సాఫల్యతా రేటును 2025 నాటికి జాతీయ, ప్రాంతీయ స్థాయిలో 2.1 శాతానికి తగ్గించాలి.
-2020 నాటికి రక్షిత మంచినీటి సౌకర్యాన్ని, పరిశుభ్రతను కల్పించాలి.
-పొగాకు వాడకంలో వాటాను 2020 నాటికి 15 శాతం, 2025 నాటికి 30 శాతం తగ్గించాలి.
-2025 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆరోగ్యరంగ వ్యయాన్ని 1.4 శాతం నుంచి 2.5 శాతానికి పెంచాలి.
-ఆరోగ్య రంగ వ్యయంలో రాష్ర్టాల వాటాను 2020 నాటికి బడ్జెట్లో 8 శాతం కంటే ఎక్కువ కేటాయించాలి.
-2025 నాటికి జాతీయ స్థాయిలో, రాష్ర్టాల స్థాయిలో కుటుంబ నియంత్రణను 90 శాతానికిపైగా అమలు చేయాలి.
-2017 నాటికి కాలా అజార్, లింఫోటిక్ ఫైలేరియాసిస్ వ్యాధులను నిర్మూలించాలి. అదేవిధంగా 2018 నాటికి కుష్ఠువ్యాధి నిర్మూలనకు కలిసి కృషి చేయాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు