నాణ్యమైన విద్యకు కేరాఫ్.. కెనడా
ప్రపంచీకరణ, నాణ్యమైన విద్య, పెరుగుతున్న ఆర్థిక అవసరాలతోపాటు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఉండటంతో విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. అయితే భారత్‌తోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులపట్ల అమెరికా, బ్రిటన్ అనుసరిస్తున్న కఠినమైన వీసా విధానం వారికి ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భారత్, ఇతర దేశాల విద్యార్థులను ప్రపంచంలోనే ఉన్నతమైన యూనివర్సిటీలను కలిగిన కెనడా తన సులభతరమైన వీసా విధానాలతో సాదరంగా ఆహ్వానిస్తున్నది. 2018 లెక్కల ప్రకారం కెనడాలో దాదాపు 5 లక్షల మంది విదేశీ విద్యార్థులుండగా.. అందులో 25 శాతం (అంటే 1.25 లక్షల మంది) భారత విద్యార్థులున్నారు.
సరస్సులు, మైదానాలు, కొండలు, జలపాతాలు, అడవులతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కలిగిన దేశం కెనడా. భౌగోళికంగా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశం. ఉత్తర అమెరికా ఖండానికి చెందిన ఈ దేశం ఆర్థికంగా, సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందినది. కెనడా జనాభా మాత్రం 3.6 కోట్లు మాత్రమే. రాజధాని ఒట్టావా. క్యుబెక్, ఒంటారియో, బ్రిటిష్ కొలంబియా, అల్బర్టా ముఖ్యమైన ప్రాంతాలు. కెనడాలో రెండు అధికారిక భాషలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఇంగ్లిష్‌తోపాటు ఫ్రెంచ్ కూడా మాట్లాడుతారు.
విదేశీ విద్యకు కెనడా ఎందుకు ఉత్తమం?
అత్యుత్తమ యూనివర్సిటీలు
-కెనడా విశ్వవిద్యాలయాలు ఉత్తమ బోధన, పరిశోధనలతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) చెబుతున్న లెక్కల ప్రకారం.. విద్యారంగంలో ఖర్చుకు సంబంధించి కెనడా ప్రపంచదేశాలతో పోలిస్తే చాలా ముందంజలో ఉంది.
ఫీజులు, నివాస ఖర్చులు తక్కువ
-నాణ్యమైన, అధునాతనమైన విద్య అందిస్తున్నప్పటికీ కెనడా యూనివర్సిటీల్లో బోధన రుసుములు అమెరికా, బ్రిటన్‌కంటే తక్కువగానే ఉంటాయి. కెనడాలోని విద్యాసంస్థలకు ప్రావిన్సెస్ గవర్నమెంట్ల నుంచి గ్రాంట్స్ వస్తున్నందున విద్యార్థులపై ఫీజుల భారం పెద్దగా ఉండదు. యూనివర్సిటీ, కోర్సు, ప్రావిన్స్‌లను బట్టి ఫీజులు మారుతాయి. సరాసరి ఒక విద్యార్థి ఏడాది ఫీజు రూ.6.5 లక్షల నుంచి 21 లక్షలు ఉంటుంది. నివాస ఖర్చులు కూడా ఉండే ప్రదేశాన్ని బట్టి సుమారుగా రూ.7 లక్షల నుంచి 12 లక్షలు అవుతాయి. 95 శాతం మంది విద్యార్థులకు క్యాంపస్‌లోనే వసతి దొరుకుతుంది.
పార్ట్ టైమ్ ఉద్యోగాలు
-ఇక్కడ చదివే విద్యార్థులు వారానికి 20 గంటలు క్యాంపస్లలోగాని, క్యాంపస్‌ల బయటగాని వర్క్ పర్మిట్‌తో పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. సెమిస్టర్ హాలిడేస్‌లో (అంటే వింటర్ లేదా సమ్మర్లో) ఎలాంటి వర్క్ పర్మిట్ లేకుండా ఫుల్ టైమ్ జాబ్ ( వారానికి 40 గంటలు) చేసుకోవచ్చు.
ఉపకార వేతనాలు
-కెనడాలో ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యాసంస్థలు అక్కడ చదువుకునే విదేశీ విద్యార్థులకు వారి అత్యుత్తమ ఫలితాల ఆధారంగా పలురకాల స్కాలర్షిప్లు ఇస్తున్నాయి. ఈ స్కాలర్షిప్లు ప్రతి యూనివర్సిటీకి వేర్వేరుగా ఉంటాయి. ఉపకారవేతనం కోసం యూనివర్సిటీకి నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. వివిధ రకాల స్కాలర్‌షిప్‌ల వివరాలు…
1. కెనడియన్ గవర్నమెంట్ స్కాలర్షిప్లు
2. ప్రభుత్వేతర స్కాలర్షిప్లు
3. ఇన్స్టిట్యూషన్ – స్పెసిఫిక్ స్కాలర్షిప్లు
ఉద్యోగ అవకాశాలు
-కెనడియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయిన విదేశీ గ్రాడ్యుయేట్లు అక్కడ మూడేండ్లు పని చేసుకోవడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWPP) ద్వారా అవకాశం కల్పిస్తారు. ఇక్కడి యూనివర్సిటీల్లో చదివిన 90 శాతం మంది విద్యార్థులు వారి చదువు పూర్తయిన 6 నెలలలోపే ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటున్నారు.
కెనడాలో స్థిరపడే అవకాశం
-కెనడాలో చదువుకుని ఉద్యోగంచేసే విదేశీ విద్యార్థులు అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి కెనడా ప్రభుత్వం సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్ ద్వారా వీలు కల్పిస్తున్నది. కెనడియన్ బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్-2018 సర్వే ద్వారా తెలిసిన నిజం ఏమిటంటే.. 51% మంది విదేశీ విద్యార్థులు కెనడాలో స్థిర నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నారు. చదువు పూర్తిచేసుకొని అక్కడ PGWPP ద్వారా పనిచేసిన వాళ్ళు శాశ్వత నివాసం (PR) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ (FSW), ఇతరవాటికి అర్హత సంపాదించాలి.
సంస్కృతి, వ్యవహారశైలి
-ప్రతి ఏడాది కెనడా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వేలమందికి ఉన్నత విద్య, వృత్తి నైపుణ్య ఉద్యోగ వీసాలు కల్పించడం ద్వారా తమ దేశానికి సాధరంగా ఆహ్వానిస్తున్నది. కెనడాలో ఉన్నత విద్యకోసం వచ్చిన విద్యార్థులకు అక్కడే చదువుతున్న వారు సహకరిస్తారు. కెనడా మొదటి నుంచి ద్విభాషా దేశం అయినప్పటికీ.. ఉన్నత విద్యకోసం, వృత్తినైపుణ్య ఉద్యోగాల కోసం వచ్చిన వారివల్ల ఇక్కడ రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. ఇక్కడ వివిధ రకాల భాషలు, జాతులవారు నివసిస్తున్నప్పటికీ ఎలాంటి వైరుధ్యభేదాలు లేకుండా ఒకరి మతాచారాలను మరొకరు గౌరవిస్తూ అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు.
ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు
-కెనడా ఇంగ్లిష్ మాట్లాడే దేశం కాబట్టి అక్కడ చదువుకోవడానికి వెళ్లేవారికి కచ్చితంగా ఇంగ్లిష్ భాషమీద పట్టుండాలి. ఇంగ్లిష్ భాషపై పట్టున్నట్లు నిరూపించుకోవడానికి మనదేశంలో రెండు వేర్వేరు టెస్టులు ఉన్నాయి. అవి..
1. IELTS,
2. TOEFL. వీటిలో ఏదైనా ఒక పరీక్ష రాసి తగిన మార్కులు తెచ్చుకుంటే చాలు.
బ్యాంకు రుణ సదుపాయాలు
-విదేశీ విద్యకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు చాలావరకు రుణ సదుపాయాలు కల్పిస్తున్నాయి. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే ముందు వారు ఇచ్చే గరిష్ఠ రుణం, వడ్డీ రేటు, తిరిగి చెల్లించడానికి ఇచ్చే కాలపరిమితి, పూచీకత్తు తదితర విషయాలను జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలి.
తెలంగాణ ప్రభుత్వ సహకారం
-తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విద్యానిధి, మహాత్మా జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి ద్వారా విదేశాలకు వెళ్లి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం…
https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.jsp వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.
సమగ్ర సమాచారం కోసం మరికొన్ని వెబ్సైట్లు
-https://cbie.ca/media/facts-and-figures/
-https://www.canada.ca/en/immigration-refugees-citizenship/services/study-canada.html
-http://www.ielts.org
-https://www.timeshighereducation.com
- Tags
- nipuna special
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు