సహాయ నిరాకరణ ఎందుకు మొదలెట్టారు..?

బ్రిటిష్ ప్రభుత్వం ఖిలాఫత్ నాయకులకు నమ్మకద్రోహం చేసిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయనిరాకరణోద్యమం చేపట్టాలని ఖిలాఫత్ నాయకులకు గాంధీజీ సూచించారు. 1920 జూన్ 9న అలహాబాద్‌లో సమావేశమైన ఖిలాఫత్ కమిటీ గాంధీజీ సలహాను ఆమోదించి, ఈ ఉద్యమానికి సారథ్యం వహించాలని ఆయనని కోరింది.
– పంజాబ్‌లో ప్రభుత్వం అమలుచేసిన దుర్మార్గంపై తమ విచారణ కమిటీ నివేదిక చూసిన తర్వాత హంటర్ కమిటీ నివేదికపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ పరిస్థితుల్లో సహాయనిరాకరణ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. 1920 మేలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను తేల్చుకోవడానికి సెప్టెంబర్‌లో ఒక ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
– 1920 ఆగస్టు 1న ఉద్యమం ప్రారంభమైంది. జూన్ 22న గాంధీజీ వైస్రాయ్కి జారీచేసిన నోటీసు కాలపరిమితి ముగియడంతో కార్యాచరణ ప్రారంభమైంది. ఆగస్టు 1న బాలగంగాధర తిలక్ కనుమూశారు. ఆ సంతాప దినాన్ని, ఉద్యమ ఆరంభాన్ని కలుపుకుని దేశవ్యాప్తంగా ప్రజలు హర్తాల్ నిర్వహించారు. చాలా మంది ఉపవాస దీక్షలో ఉంటూ ప్రార్ధనలు నిర్వహిచారు. సెప్టెంబర్‌లో కలకత్తాలో కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం సహాయ నిరాకరణను ఆమోదించింది.
– అదే ఏడాది డిసెంబర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణకు సంబంధించిన ప్రధాన తీర్మానాన్ని సీఆర్ దాస్ ప్రవేశపెట్టారు. ఈ ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలు, విదేశీ వస్ర్తాలను బహిష్కరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, గౌరవ పదవులను వదులుకోవడంతోపాటు ప్రభుత్వ సర్వీసుల నుంచి వైదొలగడం వరకు సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని విస్తరించాలని నిర్ణయించారు. పన్నులు చెల్లించకపోవడాన్ని కూడా ఒక అంశంగా ఉండాలని తీర్మానించారు.
– నిర్మాణాత్మక కార్యక్రమాల్లో భాగంగా దేశ స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటవుతాయి. వివాదాలను పరిష్కరించడానికి పంచాయత్‌లు ఏర్పాటు చేస్తారు. చేతితో వడకడం, నేయడం వంటి వాటిని ప్రోత్సహిస్తారు. హిందూ ముస్లిం ఐక్యతను పెంపొందించడం, అస్పృశ్యతను వదులుకోవడం, అహింసను సంపూర్ణంగా అమలుచేయాలని, దీనిద్వారా ఏడాదిలోగా స్వరాజ్యం అవతరిస్తుందని గాంధీ హామీ ఇచ్చారు. ఈ విధంగా నాగ్‌పూర్ సమావేశంలో కాంగ్రెస్ ఒక రాజ్యాంగేతర ప్రజా ఉద్యమానికి సిద్ధపడింది. విప్లవ భావజాలం ఉన్న చాలా తీవ్రవాద గ్రూపులు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించాయి.
– ఈ హామీని పరిపూర్ణం చేసుకోవడానికి కాంగ్రెస్‌లో మౌలికమైన మార్పులు ఎన్నో అవసరమయ్యాయి. సంస్థాగతంగా చాలా మార్పులు జరిగాయి. స్వపరిపాలనను చట్టబద్ధమైన, న్యాయ సమ్మతమైన మార్గాల ద్వారా సాధించాలన్న కాంగ్రెస్ లక్ష్యం శాంతియుత విధానాల్లో, సక్రమమైన మార్గాల్లో స్వరాజ్యాన్ని సాధించడంగా మారింది.
– అయితే విద్యాసంబంధ బహిష్కరణతో పోలిస్తే న్యాయవాదులు న్యాయస్థానాలను బహిష్కరించే కార్యక్రమం అంతగా విజయవంతం కాలేదు. అయితే దాని ప్రభావం విస్తృతంగా, వినూత్నంగా ఉంది. దేశంలో ప్రముఖ న్యాయవాదులైన సీఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, ఎంఆర్ జయకర్, సైఫుద్దీన్ కిచ్లూ, వల్లభాయ్ పటేల్, సీ రాజగోపాల చారి, అసఫ్ అలీ వంటివారు ఆర్థికంగా ఎంతో లాభదాయకమైన తమ వృత్తిని తృణప్రాయంగా విడిచిపెట్టడమనేది స్ఫూర్తినిచ్చింది. ఈ కార్యక్రమంలో బెంగాల్ ప్రథమ స్థానంలో ఉంటే ఆ తరువాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్‌లు ఉన్నాయి.
– అయితే, ఈ మొత్తం ఉద్యమంలో అత్యంత విజయవంతమైన కార్యక్రమం విదేశీ వస్త్ర బహిష్కరణ, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి విదేశీ వస్ర్తాలను సేకరించి వాటిని తగులపెట్టేవారు. 1921 ప్రథమార్ధంలో దేశవ్యాప్తంగా గాంధీజీతో పర్యటించిన ప్రభుదాస్ గాంధీ తాము ప్రయాణిస్తున్న రైలు ప్రతి చిన్న స్టేషన్లో కొద్ది నిమిషాలపాటు ఆగడం, గాంధీజీని చూడటానికి వచ్చిన ప్రజలకు విదేశీ వస్ర్తాలను బహిష్కరించాల్సిందిగా చెబుతూ, ఆ క్షణంలో కనీసం తలమీద ఉన్న టోపీనైనా త్యజించాల్సిందిగా పిలుపునివ్వడం, వెంటనే అక్కడికక్కడే టోపీలు, దుప్పట్లు, తలపాగాలతో ఒక పెద్ద బట్టల పోక తయారవడం, తమ రైలు ముందుకు సాగిపోతుండగా వెనుకన ఆ బట్టల పోకలు తగులబడటం వంటి దృశ్యాలను కళ్లకు కట్టినట్టు వర్ణించేవారు. విదేశీ వస్ర్తాలను అమ్మే దుకాణాల ముందు పికెటింగ్ నిర్వహించడం కూడా బహిష్కరణోద్యంలో భాగంగా సాగింది. 1920-21 మధ్యకాలంలో దేశంలోకి 121 కోట్ల విలువైన విదేశీ వస్ర్తాలు దిగుమతి అయితే, 1921-22 నాటికి అది 57 కోట్లకు పడిపోయింది.
– కార్యక్రమంలో ముందుగా అనుకోనప్పటికీ కల్లు దుకాణాల ముందు ధర్నాలు నిర్వహించడం మహోధృతంగా సాగింది. దీంతో ప్రభుత్వ ఆదాయం విపరీతంగా పడిపోయింది. ఈ కారణంగా మద్యం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుపుతూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించుకోవాల్సి వచ్చింది.
– బీహార్, ఒరిస్సా ప్రభుత్వాలు మద్యపాన ప్రియులైన చారిత్రక ప్రముఖులు మోజెస్, అలెగ్జాండర్, జూలియర్ సీజర్, నెపోలియన్, షేక్స్పియర్, గ్లాడ్‌స్టోన్, టెన్నీసన్, బిస్మార్క్ పేర్లను కూడా ప్రచారానికి వాడుకుంది.
– విజవాడలో 1921 మార్చిలో జరిగిన అఖిలభారత జాతీయ కాంగ్రెస్ సమావేశం రాబోయే మూడు నెలలపాటు కార్యకర్తల నిధుల సేకరణ, సభ్యత్వ నమోదు, చరఖాల పంపిణీ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలంటూ ఆదేశించింది. దీంతో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. కోటిమందిని సభ్యులుగా చేర్పించాలన్న లక్ష్యం నెరవేరనప్పటికీ కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 50 లక్షలకు చేరుకుంది. తిలక్ స్వరాజ్య నిధి సేకరణ కోటి రూపాలయల లక్ష్యాన్ని దాటింది. జాతీయోద్యమానికి ఖాకీ… ఒక యూనిఫామ్‌గా మారిపోయింది. మధురైలో విద్యార్థుల సమావేశాన్ని ఉద్దేశించి గాంధీజీ ప్రసంగిస్తున్నప్పుడు ఖాదీ బాగా ఖరీదుగా ఉందంటూ కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనికి బదులుగా ఆయన దుస్తులను మితంగా ధరించడమే అందుకు సరైన సమాధానమిచ్చాడు. ఆరోజు నుంచి ధోతీ, కుర్తాలను విడిచిపెట్టి లంగోటీకే పరిమితమై జీవితాంతం అర్ధనగ్న సన్యాసిగానే ఉన్నారు.
– 1921 జూలైలో మహమ్మద్ అలీ ప్రభుత్వానికి ఒక కొత్త సవాలును విసిరారు. జూలై 8న కరాచీలో జరిగిన ఖిలాఫత్ సమావేశంలో ఆయన ముస్లింలు బ్రిటిష్ సైన్యంలో కొనసాగడం మత నాయకులను ఉల్లంఘించడమే నంటూ ఒక ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్య చేసినందుకు మహ్మద్ అలీని, మరికొంతమంది నాయకులను ప్రభుత్వం అరెస్టు చేసింది.
– రోజువారీ వ్యవహారాలను చూసుకోవడానికి కాంగ్రెస్‌కు 15 మంది సభ్యులతో కూడిన వర్కింగ్ కమిటీ ఉంటుంది. ఈ ప్రతిపాదనను మొదటిసారి 1916లో తిలక్ ప్రవేశపెట్టినప్పుడు మితవాదవర్గం దాన్ని వ్యతిరేకించింది. ఏడాది పాటూ పనిచేసే ఒక ప్రత్యేక సంఘం లేకుండా ఒక ఉద్యమాన్ని స్థిరంగా కొనసాగించడం అసాధ్యం. ప్రాంతీయ స్థాయిలో భాషా ప్రాతిపదికన ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీలు కూడా ఏర్పాటవుతాయి. అవి ఆయా స్థానిక భాషల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలను అమలుచేస్తాయి. గ్రామ, మొహల్లా, వార్డు కమిటీల ఏర్పాటు ద్వారా కింది స్థాయి వరకు కాంగ్రెస్ తన సంస్థాగత విస్తృతిని పెంచుకుంటుంది. పేదలు కూడా సభ్యులు కావడానికి వీలుగా వార్షిక సభ్యత్వ రుసుమును నాలుగు అణాలకు తగ్గించారు. ప్రజలు విస్తృత స్థాయిలో భాగస్వాములు కావడంతో కాంగ్రెస్‌కు ఆదాయం కూడా లభిస్తుంది. ఇతరత్రా అంశాల్లో కూడా సంస్థాగతమైన నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడం, ప్రజా స్వామీకరించారు. సాధ్యమైనవంత వరకు కాంగ్రెస్ హిందీ భాషను ఉపయోగిస్తుంది.
– సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టడం కాంగ్రెస్‌కు ఒక కొత్త శక్తిని సమకూర్చింది. 1921 జనవరి నుంచి అది దేశవ్యాప్తంగా చెప్పుకోదగ్గ విజయాలను సాధించడం ప్రారంభమైంది. అలీ బ్రదర్స్ (ఖిలాఫత్ నాయకులు)తో కలిసి గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించారు. ఇందులో భాగంగా వందల సమావేశాల్లో ప్రసంగించారు. రాజకీయ కార్యకర్తలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. మొదటి నెలలోనే దాదాపు 90 వేలమంది విద్యార్థులు పాఠశాలలు, కాలేజీలను విడిచిపెట్టి దేశవ్యాప్తంగా వెలసిన 800లకు పైగా జాతీయ పాఠశాలలు, కలాశాలల్లో చేరారు. ఈ రకమైన విద్యాసంబంధిత బహిష్కరణలు బెంగాల్లో అత్యంత విజయం సాధించాయి. కలకత్తా విద్యార్థులు పావిన్స్ అంతటా సమ్మెను విజయవంతం చేసి ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు తప్పనిసరి పరిస్థితుల్లో తమ సంస్థలతో ప్రభుత్వానికి ఉన్న సంబంధాన్ని తెంపుకునేట్టు చేశారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో సీఆర్ దాస్ ప్రధానపాత్ర పోషించారు. సుభాష్ చంద్రబోస్ కలకత్తాలోని నేషనల్ కాంగ్రెస్‌కు ప్రిన్సిపాల్ అయ్యారు. ఈ దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా స్వదేశీ స్ఫూర్తి మరింత బలపడింది. ఈ విద్యాపరమైన బహిష్కరణలో బెంగాల్ తరువాత స్థానంలో పంజాబ్ నిలిచింది. మొదట్లో కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన లాలా లజపతిరాయ్ పంజాబ్‌లో ఈ ఉద్యమానికి సారధ్యం వహించాడు. బొంబాయి, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, అస్సాంలలో ఉద్యమం ఎంతో క్రియాశీలంగా సాగితే మద్రాస్‌లో స్పందన కరువైంది.
RELATED ARTICLES
-
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
-
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
-
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
-
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
-
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
-
English Grammar | We should all love and respect
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
Groups Special – Science | సహజ శక్తి అనంతం … కాలుష్య రహితం.. పర్యావరణ హితం
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Economy – Groups Special | అండమాన్‌లో అల్పం… దాద్రానగర్‌లో అధికం
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?