సత్యాగ్రహం సమరోత్సాహం

1930 ఏప్రిల్ 6న తన పిడికిలి నిండా ఉప్పుతీసి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమానికి నాందిపలికారు. తమిళనాడులో సీ రాజగోపాలచారి నాయకత్వంలోని బృందం తిరుచిరాపల్లి నుంచి పయన్నూర్ వరకు ఉప్పు సత్యాగ్రహ యాత్ర చేసి చట్టాన్ని ఉల్లంఘించారు. ఆంధ్రలో వివిధ జిల్లాల్లో ఉప్పు సత్యాగ్రహం కోసం అనేక శిబిరాలు వెలిశాయి. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి సత్యాగ్రహులు వివిధ గ్రామాల మీదుగా తీర ప్రాంతాలకు చేరుకుని విజయవంతంగా పనిపూర్తిచేశారు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాంధీజీని ప్రభుత్వం అరెస్టు చేయలేకపోవడాన్ని స్థానికులు ప్రజల్లో ధైర్యం నూరిపోయడానికి వినియోగించుకున్నారు. మనల్ని చూసి ప్రభుత్వం బెదిరిపోతుంది. ఉప్పు సత్యాగ్రహం ఆరంభించినప్పటి నుంచీ ప్రభుత్వమనేది కనిపించకుండా పోయింది. ఇప్పుడున్నది గాంధీ ప్రభుత్వమే అని వారు ప్రజలను ఉత్సాహపరిచారు.
– ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఏప్రిల్ 14న జవహర్లాల్ నెహ్రూ, మరికొంతమంది కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వం అరెస్టు చేసింది. దీంతో మద్రాస్, కలకత్తా, కరాచీ నగరాల్లో నిరసన ప్రదర్శనలు, ఘర్షణలు జరిగాయి. ఏప్రిల్ 23న పెషావర్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక ఏండ్లుగా ప్రజల్లో పనిచేసి రెడ్‌షర్ట్స్ పేరుతో ప్రసిద్ధి చెందిన ఖుదాయి ఖిద్మత్ గార్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ శాసనోల్లంఘన ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోయారు. పెషావర్ నగరం వారానికిపైగా ఉద్యమకారుల చేతుల్లో ఉండిపోయింది. పెషావర్ ఉద్యమానికి చారిత్రక ప్రాధాన్యం లభించడానికి మరో కారణం రెండు గఢ్వాలి సైనిక పటాలాలు నిరాయుధులైన ప్రదర్శనకారులపై కాల్పులు జరపడానికి నిరాకరించడమే.
– శాసనోల్లంఘన ఉద్యమాన్ని అణచివేసే విషయంలో ప్రభుత్వం అనుసరించిన వ్యూహం విఫలమైంది. ఈ ఉద్యమంలో జోక్యం చేసుకోకుండా వదిలివేయడం ద్వారా దానిని నాశనం చేయవచ్చని ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా, గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం ఆలోచన, ఆచరణ రీత్యా సరైనదికాదనీ, అది తప్పకుండా విఫలమవుతుందని ప్రభుత్వం ఆశించింది. సామూహిక స్థాయిలో అహింసాయుత శాసనోల్లంఘన జరపడమనే గాంధీ వ్యూహం ప్రభుత్వానికి కాళ్లు చేతులు ఆడనీయలేదు. కొడితే పాపం, కొట్టకపోతే పొరపాటు అన్నట్టుగా ప్రభుత్వ పరిస్థితి మారిపోయింది. తాను చేసిన చట్టాలను నిర్దయగా, బాహాటంగా ఉల్లంఘిస్తున్న ఒక ఉద్యమాన్ని అణచివేయకపోతే అది తన అధికారాన్ని తానే వదులుకున్నట్టుగా అవుతుంది. ప్రజలను నియంత్రించలేని బలహీనతకు సంకేతమవుతుంది. ఒకవేళ ఉద్యమాన్ని అణచివేస్తే, అహింసామార్గంలో సాగుతున్న నిరాయుధులైన ప్రజలపై కర్కశంగా దాడిచేసిన నిరంకుశ ప్రభుత్వంగా పేరుపడుతుంది. ఎక్కువగా స్పందిస్తే ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతున్నదంటూ కాంగ్రెస్ గగ్గోలు పెడుతుంది. కాదని వదిలేస్తే విజయం మాదేనంటూ విజయధ్వానాలు చేస్తుంది అంటూ మద్రాస్ పౌరుడు ఒకరు చేసిన వ్యాఖ్య 1930లలో ప్రభుత్వ మానసిక స్థితికి అద్దం పడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ సందిగ్ధ స్థితి ప్రభుత్వ ఆధిపత్యం బలహీనపడటానికి దారితీసింది.
– ఉద్యమం దేశం నలుమూలలకు వ్యాప్తి చెందుతుండటంతో బలప్రదర్శనకు దిగడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేకుండా పోయింది. అధికారులు, గవర్నర్లు, సైనికుల నుంచి ఒత్తిడి పెరిగిపోతుండటంతో వైస్రాయ్ మే 4న గాంధీజీ అరెస్టుకు ఆదేశాలు జారీచేశాడు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించే తన కార్యక్రమంలో భాగంగా దరిశన ఉప్పు కేంద్రంపై దృష్టిపెట్టబోతున్నానని గాంధీజీ ప్రకటించడంతో ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. ఈ వార్త తెలియగానే దేశం అట్టుడికిపోయింది. బాంబేలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో సాధారణ ప్రజలతోపాటు వేలాదిమంది జౌళి, రైల్వే కార్మికులు వచ్చి చేరడంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. వస్త్ర వ్యాపారులు ఆరు రోజులపాటు హర్తాళ్ నిర్వహించారు. కలకత్తా, ఢిల్లీలో దాడులు, కాల్పులు జరిగాయి. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జౌళి కార్మికులు మే 7న సమ్మెకు పిలుపునిచ్చారు. సాధారణ ప్రజలను కలుపుకుని మద్యం దుకాణాలను తగులబెట్టారు. న్యాయస్థానాలు, పోలీసు స్టేషన్లు, మున్సిపల్ భవనాలు, రైల్వే స్టేషన్ వంటివాటిపై దాడులు చేశారు. మొత్తం నగరాన్ని స్వాధీనం చేసుకుని దాదాపు పరోక్ష ప్రభుత్వాన్ని నడిపారు. సైనిక శాసనాన్ని అమలు చేయడం ద్వారా మే 16 తరువాత ప్రభుత్వం మళ్లీ నగరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది.
– మొత్తం ఉప్పు సత్యాగ్రహాన్ని మలుపు తిప్పిన సంఘటన మే 21న జరిగింది. అహింసాయుత మార్గంలో ధీరత్వాన్ని ప్రదర్శించిన ఈ సంఘటన దేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు, దక్షిణాఫ్రికా పోరాటంలో గాంధీజీ సహచరుడైన ఇమామ్ సాహెబ్, గాంధీజీ కుమారుడు మణిలాల్ ముందువరుసలో సాగుతుండగా 2000 మంది సత్యాగ్రహులు పోలీసుల దిగ్బంధంలో ఉన్న దరిశన ఉప్పుకేంద్రం వైపు సాగారు. వాళ్లు దగ్గరకు రాగానే పోలీసులు లాఠీలతో సత్యాగ్రహులు కుప్పకూలిపోయే వరకూ విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించారు. గాయపడిన వారిని వారి సహచరులు తాత్కాలికంగా తయారు చేసిన స్ట్రెచర్లపై పక్కకు తీసుకుపోగానే మరో వరుస సత్యాగ్రహులు ముందుకు రావడం, పోలీసులు వారిని విపరీతంగా కొట్టడం, వారిని పక్కకు తొలగించగానే మరోగుంపు ముందుకు రావడం…
ఇలా కొంత సమయం గడిచిన తరువాత సత్యాగ్రహులు అక్కడే బైఠాయించి పోలీసుల చేతుల్లో లాఠీదెబ్బలు తినడం ప్రారంభించారు. కనీసం ఒక్క చెయ్యి కూడా ఆత్మరక్షణ కోసం పైకి లేపకపోడం విచిత్రం. ఉదయం 11 గంటల సమయానికి గాయపడినవారి సంఖ్య 320కి చేరింది. ఇద్దరు సత్యాగ్రహులు కన్నుమూశారు. సత్యాగ్రహులు కనబరిచిన అపూర్వమైన సాహసం, అహింసాయుత ప్రతిఘటన సామాన్యమైనది కాదని అమెరికన్ పాత్రికేయుడు వెబ్ మిల్లర్ అభిప్రాయపడ్డాడు. దరిశన సత్యాగ్రహం ఆయనను నిశ్చేష్టుడిని చేసింది. దాదాపు 20 దేశాల్లో 18 ఏండ్లకుపైగా పాత్రికేయుడిగా పనిచేసిన నేను, అంతర్యుద్ధాలను, దాడులను, ఘర్షణలను, వీధి పోరాటాలను, తిరుగుబాట్లను అనేకం చూశాను కానీ ఉప్పు సత్యాగ్రహంలోని ఈ కొత్త విధానాన్ని ప్రజలు ఎంతో ఉత్సాహంగా స్వీకరించారు అని ఆయన పేర్కొన్నారు.
– దేశవ్యాప్తంగా ఇది అమలుజరగడం ప్రారంభమైంది. బాంబే శివార్లలోని వాడల్లో ఉన్న అనేకమంది ఉప్పు తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. కర్ణాటకలో సానికట్టా ఉప్పు కేంద్రంపై దాడి చేసి లాఠీలను, బుల్లెట్లను ఎదుర్కొన్నారు. మద్రాసులో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించే ఉద్యమంలో పోలీసులకు, ప్రతిఘటనకారులకు మధ్య అనేకసార్లు ఘర్షణలు చెలరేగాయి. ఒరిస్సాలోని బాలాసోర్, పూరీ, కటక్ జిల్లాల్లో చట్ట వ్యతిరేకంగా ఉప్పు తయారుచేసే కార్యక్రమం ఉధృతంగా సాగింది.
నిలిచిన శాసనోల్లంఘనం
– వైస్రాయ్ జూలై 9న ప్రకటన చేస్తూ అధినివేశ ప్రతిపత్తి గురించి మరోసారి హామీ ఇచ్చి రాజీమార్గంగా రౌండ్‌టేబుల్ సమావేశాన్ని సూచించారు. కాంగ్రెస్‌కు, ప్రభుత్వానికి మధ్య శాంతిని నెలకొల్పే మార్గాలను అన్వేషించడానికి తేజ్ బహదూర్ సప్రూ, ఎంఆర్ జయకర్ కృషి చేస్తారంటూ 40 మంది కేంద్ర శాసనసభ్యులు చేసిన సూచనను కూడా వైస్రాయ్ అంగీకరించారు. దీంతో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ యరవాడ జైలులో ఉన్న గాంధీజీని కలిసి ఒప్పందానికి సంబంధించిన అవకాశాలపై చర్చించారు. నవంబర్‌లో లండన్‌లో జరిరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారతీయ ప్రతినిధులు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వం శాంతిని సాధించాలని ఆశిస్తున్న పక్షంలో సంబంధిత చర్చల్లో కాంగ్రెస్ ఒక భాగస్వామిగా లేకుండా శాంతి సాధ్యం కాదన్నది సారాంశం. రౌండ్ టేబుల్ ముగింపు దశలో బ్రిటన్ ప్రధాని ఇందుకు సంబంధించిన అవకాశాలను ప్రస్తావించారు. ఆ ఏడాదిలో జరిగే మలివిడత రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జనవరి 25న గాంధీజీని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను విడుదల చేస్తున్నట్టు వైస్రాయ్ ప్రకటించారు.
– కాంగ్రెస్ మూడువారాలపాటు అంతర్గత చర్చలు జరిపింది. లండన్ నుంచి తిరిగివచ్చిన వారితోనూ, విభిన్న రాజకీయ వర్గాల నాయకులతోనూ సుదీర్ఘంగా చర్చలు సాగించింది. అనంతరం వైస్రాయ్‌తో చర్చలు ఆరంభించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గాంధీజీకి అధికారం అప్పగించింది. 45 రోజులు సంప్రదింపులు జరిగిన అనంతరం 1931 మార్చి 5న గాంధీ-ఇర్విన్ మధ్య ఒప్పందం కుదిరింది.
– కాంగ్రెస్ తరపున గాంధీజీ, ప్రభుత్వం తరపున లార్డ్ ఇర్విన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. హింసాయుత ఘటనల్లో శిక్షలు పడినవారు మినహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలనే నిబంధన అందులో ఉన్నది. తీరప్రాంత ప్రజలకు ఉప్పును తయారుచేసుకునే హక్కు, ప్రజలు శాంతియుతంగా పికెటింగ్ చేసుకునే హక్కును కూడా ప్రభుత్వం గుర్తించింది. పోలీసుల అకృత్యాలపై బహిరంగ విచారణ జరిపించాలన్న గాంధీజీ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే విచారణకు గాంధీజీ పట్టుబట్టిన అంశాన్ని ఒప్పందంలో రికార్డు చేశారు. కాంగ్రెస్ తన వంతుగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకావడానికి కాంగ్రెస్ నాయకులు సంసిద్ధత వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
-
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
-
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
-
Groups Special – Polity | ఎలక్టోరల్ కాలేజీతో ఎంపిక.. మహాభియోగంతో తొలగింపు
-
Economy | పశువైద్య సేవా సౌకర్యాలను అందించే టోల్ ఫ్రీ నంబర్
-
Indian Culture And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
-
General Studies – Groups Special | ఆదిత్య-ఎల్ 1 మిషన్
Latest Updates
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
DSC Special – Social | భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతం?
IELTS Exam | Language Tests for Overseas Education
Group 2,3 Special | వెట్టి చాకిరీ నిర్మూలనకు తీర్మానం చేసిన ఆంధ్ర మహాసభ?
Job updates | Job Updates 2023
Scholarships | Scholarships for 2023
Current Affairs | ఏ దేశంలో ‘గాంధీ వాక్’ నిర్వహిస్తారు?
NIMS Admissions 2023 | నిమ్స్‌లో ఎంపీటీ కోర్సు ప్రవేశాలు
JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు