Most people | ఎక్కువ మంది ఇటువైపే..
పదో తరగతి పూర్తయ్యింది.. ఇంటర్లో ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలి.. తర్వాత ఎటువెళ్తే కెరీర్ బెస్ట్‌గా ఉంటుంది.. ఏ రంగంలో భవిష్యత్తు బాగుంటుంది.. ఈ అంశాలు ఎప్పుడు ప్రశ్నలుగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేవి ఎక్కువమంది ఎంపిక చేసుకునే డాక్టర్, ఇంజినీరింగ్ కోర్సులు.. అయితే ఇవేకాకుండా ఉద్యోగ అవకాశాలకు కొదువలేని.. కాలంతోపాటు మారుతూ వస్తున్న టెక్నాలజీ, కామర్స్ వంటి రంగాలకు చెందిన కోర్సులు ఉన్నాయి.. ఇలా దేశ ఆర్థిక వ్యవస్థలో ఎగుడు దిగుడులున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మానవ వనరులు ఎప్పుడూ అవసరం ఉండే రంగాలు, వాటికి సంబంధించిన కోర్సుల గురించి తెలుసుకుందాం..
హెల్త్‌కేర్
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నది వైద్య ఆరోగ్య రంగం. ఉపాధికి, ఉద్యోగాలకు ఎప్పుడూ ఢోకా ఉండదు..! నిత్యం పెరుగుతున్న జనాభా, దాంతోపాటు జరుగుతున్న అభివృద్ధి, నగరీకరణ, మారుతున్న జీవన విధానాలవల్ల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. దీంతో వైద్య రంగంలో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ల వంటి నిపుణుల అవసరం ఎప్పటికీ ఉంటుంది. దీనికి తగ్గట్లుగానే ప్రభుత్వాలు కూడా వైద్యానికి సంబంధించి వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అదేవిధంగా వైద్యవిద్యకు సంబంధించిన కోర్సులు అభ్యసించేవారిని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి.
సంబంధిత కోర్సులు..
-ఇంటర్లో బైపీసీ ఉత్తీర్ణులైనవారు హెల్త్‌కేర్ రంగంలోకి ప్రవేశించవచ్చు. వారి ఆసక్తి, ప్రవేశపరీక్షలో వచ్చే మార్కులను బట్టి వివిధ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. అవి..
-ఎంబీబీఎస్, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్), బీడీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ), బీహెచ్ఎంఎస్ (హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ), బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ), బీఎంఎల్టీ (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ), బీఫార్మా, బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటీషియనిస్ట్, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఎడ్యుకేషన్
-సమాజ నిర్మాణానికి మూలస్తంభం విద్య. విద్యా విజ్ఞాన వ్యాప్తి చెందకుండా ఎవరి భవిష్యత్తునూ ఊహించలేం. చదువుకోవడం.. చదువు చెప్పడం అనేవి విద్యావ్యవస్థకు రెండు రెక్కల్లాంటివి. పాఠశాల స్థాయిలో జ్ఞానం పొందే విద్యార్థులు తమ భవిష్యత్తును చక్కగా మలుచుకుంటారు. ఇలా సమాజ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించే విద్యారంగం నేడు చాలా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది.
-విద్యావ్యవస్థలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంప్రదాయంగా వస్తున్న ఉపన్యాస పద్ధతికి ప్రాధాన్యత తగ్గిపోయి యాక్టివిటీ, లెర్నింగ్ బై డూయింగ్ వంటి ఆచరణ, ఆలోచనాత్మక పద్ధతుల్లో విద్యార్థులకు బోధించేలా పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. కొత్తదనంతో విద్యార్థులను ఆకట్టుకునేలా, పాఠ్యాంశ ప్రధాన ఉద్దేశాన్ని వారికి సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఉపాధ్యాయుడు కూడా నిత్య విద్యార్థిలా ఉండాల్సిందే.
-కొత్త పద్ధతులు, కోర్సులు, వాటికి తగిన సాంకేతిక పరిజ్ఞానంతో పాఠశాలలు, కాలేజీలు వస్తూనే ఉన్నాయి. ఇలా విద్యారంగంలో నిలదొక్కుకునేలా ఉపాధ్యాయ విద్యను అందించే కోర్సులు..
-ఇంటర్ విద్యార్హతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిగ్రీ అర్హతతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సులు ఉన్నాయి.
ఎనర్జీ
-ఇది అత్యంత లాభదాయకమైన రంగం. మన ప్రాథమిక అవసరాల నుంచి అన్ని రకాలైన వ్యాపారాలు, పనుల వరకు గ్యాస్, పెట్రోలియం, బొగ్గు, కరెంటు వంటి శక్తి వనరులు ప్రధాన అవసరాలు. ఇవి లేకుండా బతకడం కష్టమే అనడంలో సందేహం లేదు. ఇలా ఎనర్జీ, ప్రత్యామ్నాయ శక్తివనరుల వల్ల ఇంజినీర్లు, ఈ రంగంలో ఉండే టెక్నీషియన్లకు విస్తారమైన అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ రంగానికి సంబంధించిన ఉద్యోగాలకు నెలవైన కోర్సులు చేయడంవల్ల కెరీర్లో మంచి అవకాశాలను చేజిక్కించుకోవచ్చు.
సంబంధిత కోర్సులు
-బీటెక్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, న్యూక్లియర్ పవర్ టెక్నాలజీ, పవర్ సిస్టమ్ ఇంజినీరింగ్, మైన్ ఇంజినీరింగ్ కోర్సులతోపాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటి కోర్సులు చేయడం ద్వారా ఎనర్జీ రంగంలో ఉద్యోగాలు సంపాదించవచ్చు.
లా కోర్సులు
-చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సంస్థ తన చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం లీగల్ అడ్వైజర్లను నియమించుకుంటుంది. ఈ లీగల్ అడ్వైజర్లు సంస్థకు సంబంధించిన వివాదాలు, నేర కార్యకలాపాలు మొదలైన వాటిని పరిష్కరించే నైపుణ్యం కలిగి ఉండాలి. ఇందుకు వివిధ సంస్థలు లా కోర్సులు పూర్తిచేసిన వారిని లీగల్ అడ్వైజర్లుగా నియమించుకుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ప్రభుత్వ న్యాయవాదులుగా ఉద్యోగాలు పొందవచ్చు.
కోర్సులు
-ఇంటర్ అర్హతతో ఐదేండ్ల లా, డిగ్రీతో మూడేండ్ల ఎల్ఎల్బీ. వీటిలో అడ్మినిస్ట్రేటివ్ లా, సివిల్ లా, కన్జ్యూమర్ లా, క్రిమినల్ లా, సైబర్ లా, హ్యూమన్ రైట్స్ లా, చైల్డ్ లేబర్ లా, కాన్స్టిట్యూషనల్ లా, కార్పొరేట్ లా, క్రిమినాలజీ, ఫైనాన్షియల్ లా వంటి ప్రత్యేక కోర్సులు ఉంటాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఒకటి. ఉద్యోగ భద్రత కోరుకునే వారికి ఫస్ట్ ఆప్షన్‌గా ఇది ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కంప్యూటర్‌పై ఆధారపడి నడుస్తున్నది. వ్యాపార కార్యకలాపాలు, కమ్యూనికేషన్ వంటి వ్యవహారాలు ఇంటర్నెట్ ద్వారా వేగంగా పూర్తవుతున్నాయి. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను, ఆహార పదార్థాలను ఇంట్లోనే కూర్చుని తమవద్దకు తెప్పించుకుంటున్నారు. రోజురోజుకు మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌ల వంటివి నిత్యావసరాలుగా మారుతున్నాయి. టెక్నాలజీ అనేది జీవితంలో భాగంగా మారుతున్నది. దీంతో ఐటీ సేవలను అందించే టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ వంటి అనేక సంస్థలు వెలుస్తున్నాయి. తమకు కావాల్సిన నైపుణ్యాలున్న వారిని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా కాలేజీల్లోనే ఎంపికచేసుకుంటున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగాలపై ఎక్కుమంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఏ కోర్సులు చేయాలి..
సంప్రదాయ డిగ్రీలో భాగంగా బీఏ కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాచిలర్ ఆఫ్ కప్యూటర్ ఆప్లికేషన్స్ (బీసీఏ), బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్, హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్స్ వంటి కోర్సులు చేయవచ్చు.
బీటెక్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి కోర్సులు, వీటితోపాటు డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫార్మాస్యూటికల్స్
-జీవన విధానంలో వస్తున్న మార్పులవల్ల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తుండటంతో ఎప్పటికప్పుడు వాటికి తగిన ఔషధాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఈ రంగానికి సంబంధించిన నిపుణులకు డిమాండ్ ఉంది.
-ఔషధాల తయారీతోపాటు ప్యాకింగ్, పంపిణీ వంటి వాటికి మానవ వనరులు అంటే ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో పనిచేయడానికి, ఫార్మసీల్లో ఔషధాలను విక్రయించడానికి ఉద్యోగులు అవసరం. ఇందుకు సంబంధించిన కోర్సులు చేసినవారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
-హెటిరో, మెడ్‌ప్లస్, అపోలో వంటి ఫార్మాకంపెనీలు, దవాఖానలు నేరుగా స్టోర్లను ఏర్పాటు చేస్తున్నాయి.
చేయాల్సిన కోర్సులు
-డీ ఫార్మా, బీ ఫార్మా, బీ ఫార్మసీలో ఆనర్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాగ్నసీ, యునానీ, ఫార్మకాలజీ, ఆయుర్వేదిక్ ఫార్మసీ, ఎం ఫార్మా, వివిధ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇలా ఫార్మసీలో సుమారు 225 కోర్సులను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు అందిస్తున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?