Muslim Invasion of Orugallu | ఓరుగల్లుపై ముస్లిం దండయాత్రలు
రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289-1323)
-రుద్రమదేవికి మగసంతానం లేకపోవడంతో తన కూతురు ముమ్మడమ్మ కుమారుడైన రెండో ప్రతాపరుద్రుడిని తన వారుసుడిగా ప్రకటించింది.
-కాకతీయ సింహాసనం అధిష్టించిన తర్వాత కూడా చాలా ఏండ్లపాటు అతడిని కుమార రుద్రదేవుడనే పిలిచేవారు.
-రుద్రమదేవి మరణానికి ప్రతీకారంగా అంబదేవుడిని అణచడానికి ప్రతాపరుద్రుడు నాయంకర విభాగాన్ని పునర్ వ్యవస్థీకరించి సైన్యాన్ని పటిష్టం చేశాడు.
-నాయంకర వ్యవస్థలో భాగంగా మొత్తం 77 మంది నాయకులను నియమించి వారికి ఎంతెంత సైన్యాన్ని పోషించాలో, వారి ఆధ్వర్యంలో ఉన్న భూములేవో, గ్రామాలేవో వివరించి సైనికులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయించాడు.
-అంబదేవుడిని, అతని మిత్రులైన పాండ్య, యాదవ సేనలను ఎదుర్కోవడానికి త్రిముఖ వ్యూహాన్ని రూపొందించాడు.
-క్రీ.శ. 1291లో మనుమ గన్నయ్య, అన్నయదేవుడి నేతృత్వంలో భారీ సైన్యాన్ని అంబదేవుని కేంద్రస్థానమైన త్రిపురాంతకం పైకి పంపాడు.
-ఈ యుద్ధంలో కాకతీయ చక్రవర్తి సైన్యాలు అఖండ విజయాన్ని సాధించాయనీ త్రిపురాంతకంలో కాకతీయ సేనాధిపతి ఇందలూరి అన్నయ్య వేయించిన క్రీ.శ. 1291 నాటి శాసనం తెలియజేస్తుంది.
-అంబదేవుడిని ఓడించిన తర్వాత ప్రతాపరుద్రుడు నెల్లూరుపై దండెత్తాడు. నెల్లూరు రాజు రాజగండ గోపాలుడికి అండగా వచ్చిన పాండ్య రాజులను ఓడించాడు.
-రుద్రమదేవి చివరికాలంలో కృష్ణానది దక్షిణాన కోల్పోయిన ప్రాభవాన్ని ప్రతాపరుద్రుడు నిలబెట్టాడు.
-ప్రతాపరుద్రుడి మూడో దండయాత్ర అంబదేవుడికి మద్దతుగా నిలిచిన దేవగిరి యాదవరాజులపై జరిగింది. ఈ యుద్ధంలో ప్రతాపరుద్రుడు కృష్ణా, తుంగభద్రల ప్రాంతాన్ని దేవగిరి రాజుల నుంచి వశం చేసుకున్నాడు.
ఢిల్లీ సుల్తాన్ సైన్యాల దండయాత్రలు
-మొదటి దండయాత్ర: అల్లావుద్దీన్ ఖిల్జీ సుల్తాన్ అయిన తర్వాత క్రీ.శ. 1303లో మొదటిసారిగా ఓరుగల్లు రాజ్యంపైకి తన సైన్యాన్ని పంపాడు.
-ఢిల్లీ సుల్తాన్ సేనాధిపతులైన మాలిక్ ఫక్రుద్దీన్ జునా, కారాకు చెందిన ఝాజాలు సైన్యానికి నాయకత్వం వహించారు.
-వీరు తమ సేనలతో తెలంగాణలో ప్రవేశించగానే నేటి కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి వద్ద జరిగిన చరిత్రాత్మక యుద్ధంలో కాకతీయ సేనాధిపతులైన పోతుగంటి మైళి, రేచర్ల ప్రసాదిత్యుడు సుల్తాన్ సేనలను తరిమికొట్టారు.
-ఈ యుద్ధం గురించి తెలుగు రచన వెలుగోటి వారి వంశావళి తెలుపుతుంది.
రెండో దండయాత్ర
-ఓటమి అనంతరం ప్రతీకార వాంఛతో అల్లావుద్దీన్ ఖిల్జీ భారీ సైన్యాన్ని మాలిక్కపూర్, ఖ్వాజాహాజీల నాయకత్వంలో తెలంగాణ పైకి పంపాడు.
-1309 అక్టోబర్ నెలలో ఢిల్లీ నుంచి బయలుదేరిన సుల్తాన్ సైన్యం దేవగిరి మీదుగా వరంగల్ భూభాగాల్లోకి ప్రవేశించింది.
-క్రీ.శ. 1310 ఫిబ్రవరి వరకు ఇరుపక్షాల మధ్య జరిగిన భీకర యుద్ధంలో చివరకు ప్రతాపరుద్రుడు ఓడిపోయి అల్లావుద్దీన్ ఖిల్జీకి ప్రతియేటా కప్పం చెల్లించడానికి ఒప్పుకొని సంధి చేసుకున్నాడు.
-సామంతరికాన్ని అంగీకరించిన ప్రతాపరుద్రునికి వ్యతిరేకంగా అతని సామంతులు తిరుగుబాట్లు లేవదీశారు.
-వీరిలో నెల్లూరు తెలుగుచోళ నాయకుడు రంగనాథుడు, వైదుంబ నాయకుడు గండికోట మల్లిదేవుడు ముఖ్యులు.
-వీరిని అణచడానికి ప్రతాపరుద్రుడు జుట్టయలెంక గొంకయరెడ్డి నేతృత్వంలో సైన్యాన్ని పంపాడు. ఇతడు వారిని అణచివేసి చక్రవర్తి అభిమానం పొందాడు.
-క్రీ.శ. 1311లో పాండ్యరాజ్యంపై ఢిల్లీ సేనలు దండెత్తగా, సుల్తాన్ కోరిక మేరకు ప్రతాపరుద్రుడు తన సైన్యంతో కలిసి యుద్ధంలో పాల్గొన్నాడు. ప్రతాపరుద్రుని సేనాని ముప్పిడి నాయకుడు ఈ దండయాత్రలో కీలకపాత్ర పోషించాడు.
-1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణంతో అతని సైనికులు ఢిల్లీ తిరిగివెళ్లారు. అప్పుడు ఒంటరిగా మిగిలిన ప్రతాపరుద్రుని సేనలు నెల్లూరు పాలకుడితో, హొయసాల రాజైన మూడో భళ్లాలునితో, పాండ్యరాజైన వీరపాండ్యునితో పోరాడాల్సి వచ్చింది.
-ప్రతాపరుద్రుడి సేనాధిపతి పెదరుద్రుడు హొయసాల, చంద్రగిరి పాలకులను ఓడించాడు. కాంచీనగరం కాకతీయుల వశమైంది.
-పాండ్యులు కాకతీయ సైన్యాలను ఎదుర్కోవడానికి రాగా, ప్రతాపరుద్రుడు స్వయంగా యుద్ధరంగంలోకి దిగాడు.
-ఈ యుద్ధంలో కాకతీయుల విజయానికి గుర్తుగా కాకతీయ సేనాధిపతి దేవర నాయకుడు క్రీ.శ. 1317లో కావేరి ద్వీపంలో శలకలపాడు గ్రామంలోని శ్రీరంగనాథునికి కొన్ని దానాలు సమర్పించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి.
-ఈ విధంగా ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1312-1316 వరకు దక్షిణాపథంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పాడు.
మూడో దండయాత్ర (1318)
-అల్లావుద్దీన్ ఖిల్జీ మరణం తర్వాత సుల్తాన్ అయిన అతని కుమారుడు కుతుబుద్దీన్ ముబారక్ షా క్రీ.శ. 1318లో దక్షిణాపథంలో తన తండ్రికాలంలో సామంతులుగా ఉన్న రాజ్యాధినేతలపైకి దండెత్తాడు.
-మొదట దేవగిరి రాజ్యంపై దండెత్తిన తర్వాత ఆ వెంటనే తన సేనాధిపతి అయిన ఖుస్రూఖాన్ను రెండో ప్రతాపరుద్రుని పైకి పంపాడు.
-ఈ యుద్ధంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరి ప్రతాపరుద్రుడు ముబారక్షా సామంతుడిగా ఉండటానికి అంగీకరించాడు.
నాలుగు, ఐదో దండయాత్రలు (1323)
-ఘియాజుద్దీన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ అయిన తర్వాత అతని కుమారుడు ఉలూఘ్ఖాన్ (జునాఖాన్) నేతృత్వంలో సైన్యాన్ని క్రీ.శ. 1323లో వరంగల్ పైకి పంపాడు.
-అయితే మొదటి ప్రయత్నంలో ఉలూఘ్ఖాన్ కాకతీయ సేనల చేతిలో ఓడిపోయాడు.
-తన తండ్రి ఆదేశాలతో అదే ఏడాది ఓరుగల్లుపై రెండోసారి దండెత్తాడు. రెండో ప్రతాపరుద్రుడు, అతని సైన్యాలు వీరోచితంగా పోరాడినప్పటికి ప్రతాపరుద్రుడు బందీగా చిక్కాడు. వరంగల్ కోట, దాని సిరిసంపదలు ఢిల్లీ సేనల దాడికి గురయ్యాయి.
-ప్రతాపరుద్రుడిని ఎక్కువ రోజులు వరంగల్లోనే ఉంచితే, అతని మీద అభిమానంతో ప్రజలు తిరుగుబాటు చేయవచ్చని ఆలోచించిన ఉలూఘ్ఖాన్.. అతన్ని ఢిల్లీకి పంపాడు.
-సుల్తాన్ సైన్యం ప్రతాపరుద్రుడిని ఢిల్లీకి తీసుకువెళ్తుండగా దారిలో సోమోద్భవ (నర్మద) నదీతీరంలో ఆయన కన్నుమూశాడని ముసునూరి ప్రోలయనాయకుడి (1330) విలసదానపత్ర శాసనం పేర్కొంటుంది.
-ప్రతాపరుద్రుడు సహజంగా మరణించలేదని, స్వచ్ఛందంగానే భగవదైక్యం చెందాడని క్రీ.శ. 1423లో రెడ్డిరాణి అని తల్లి వేయించిన కలువచేరు తామ్రశాసనం తెలుపుతుంది.
-ప్రతాపరుద్రుడి మరణంతో కాకతీయవంశం అంతరించింది. తెలంగాణ, ఓరుగల్లు ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి.
-ఓరుగల్లు పేరు సుల్తాన్పూర్గా మారింది.
కాకతీయుల పరిపాలనా వ్యవస్థ
-క్రీ.శ. 1163 నుంచి క్రీ.శ. 1323 వరకు ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతీయుల పరిపాలనా పద్ధతులు తర్వాతి పాలకులకు మార్గదర్శకమయ్యాయి. కాకతీయులు తమకంటే ముందు భారతదేశ దక్షిణాపథంలో ఆచరణలో ఉన్న సంప్రదాయబద్దమైన రాజరిక వ్యవస్థనే ఆచరించారు. అన్ని హిందూ రాజ్యాల్లో మాదిరిగానే తండ్రి అనంతరం కుమారుడే సింహాసనంపై వారసత్వపు హక్కు కలిగి ఉన్నాడు. కాకతీయులు శూద్రులైనప్పటికి రాజధర్మాన్ని ప్రాచీన రాజనీతిజ్ఞులు సూచించిన సూత్రాలను అనుసరించి పాలించారు.
-మాండలిక వ్యవస్థ కాకతీయుల కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ఒక నూతన పద్ధతి. బలవంతులైన మాండలికులను ప్రోత్సహించి వారితో స్నేహం చేశారు.
-వీరిది వికేంద్రీకృత రాచరికం. ఆనాటి సామంత విధానం లేదా భూస్వామ్య విధాన ప్రాబల్యం పెరగడమే దీనికి నిదర్శనం. వీరి కాలంలో రాజే సర్వాధికారి. అయినప్పటికీ సర్వాధికార చిహ్నాలైన మహారాజాధిరాజ, పరమేశ్వర మొదలైన బిరుదులను ధరించలేదు. సామంత పాలకులు ధరించే సమదిగత పంచమహశబ్ద, మహామండలేశ్వర అనే బిరుదులను కొనసాగించారు.
-పీవీ పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయం ప్రకారం.. కాకతీయులు ఒక కొత్త రకమైన రాచరికాన్ని అమలుపర్చారు. సామంత పాలకుల అంతర్గత పాలనా వ్యవహారాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. వారి అధికారం పెరగకుండా చూస్తూ తమచేత నియామకమైన రాజోద్యోగులను రాజ్యమంతటా వివిధ పదవుల్లో కొనసాగించారు.
-కాకతీయుల కాలంలో సామంత ప్రభువుల తిరుగుబాటు ఒకేసారి క్రీ.శ. 1290లో కాయస్థ అంబదేవుని తిరుగుబాటులో కనిపిస్తుంది. దీనికి కారణం వీరు సామంత పాలకులను తమతో పాటుగా సహ పాలకులుగా భావించడమే.
-తాము జయించిన ప్రాంతాల్లో స్థానిక సంప్రదాయాలను గౌరవించి కొనసాగించారు.
-రాజు మంత్రిమండలి ద్వారా పరిపాలనా వ్యవహారాలు నిర్వహించేవాడు. రాజ్యం సప్తాంగ సమన్వితం అనే సిద్ధాంతాన్ని అమలుచేశారు. మంత్రుల ఎంపికలో అనుభవానికి, విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇచ్చారు.
-సమకాలీన రచనలైన నీతిసారం, నీతిశాస్త్ర ముక్తావళి, ప్రతాపరుద్ర యశోభూషణం, రాజ్య నిర్వహణ, రాజధర్మ, రాజు-విధులు, అధికారాలు, కోటలు, రక్షణ, మంత్రులు, ఉన్నతాధికారులు మొదలైన విషయాలను పేర్కొన్నాయి.
-మంత్రిమండలిలో ప్రధానులు, అమాత్యులు, ప్రగ్గడలు, సామంతులు, దండ నాయకులు మొదలైనవారు సభ్యులుగా ఉండేవారు. మల్యాల హేమాద్రిరెడ్డి గణపతిదేవుని మహాప్రధానిగా, రెండో ప్రతాపరుద్రుని కాలంలో ముప్పిడి నాయకుడు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. గణపతి దేవుని కాలానికి చెందిన శివదేవయ్య రాసిన పురుషార్థసారం అనే గ్రంథం రాజు ప్రతిదినం విధిగా మంత్రులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించేవాడని పేర్కొంటుంది.
-రాజ్య వ్యవహారాలన్నింటిని (సైనిక, పౌర విభాగాలను) 72 నియోగాలు (తరగతులు)గా విభజించారు. వీటిపై అధికారిని బహత్తర నియోగాధిపతి అనేవారు. గణపతి దేవుని కాలంలో కాయస్థ గంగయసాహిణి, రుద్రమాంబ పాలనా కాలంలో (త్రిపురారి) పొంక మల్లయ్య ప్రగడలు ఈ పదవిని నిర్వహించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు