Family system | కుటుంబ వ్యవస్థ – పరివర్తన
-మానవ సమాజంలో కుటుంబం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ, సమాజ నిర్మాణంలో ఒక ప్రాథమిక యూనిట్. మానవ సంబంధాల నిర్మాణం, పరస్పర ఆధారం, ప్రాథమిక, ద్వితీయ అవసరాలు తీర్చుకోవడం, తన అవసరాలు తీర్చుకోవడంతోపాటు ఇతరుల అవసరాలు తీరుస్తూ, ప్రేమ, వాత్సల్యం, తదానుభూతి వంటి మానసిక అవసరాలు, కూడు, గుడ్డ, విద్య, సామాజీకరణ వంటి భౌతిక, భౌతికేతర అవసరాలు పరస్పరం నిర్ధారణ అయిన, అనుమతి పొందిన విలువలు, కట్టుబాట్ల ద్వారా తీర్చుకోవడం అనేది కుటుంబ జీవనం నుంచి లేదా కుటుంబ వ్యవస్థ నుంచి ప్రారంభమవుతుంది.
-కుటుంబం శాశ్వతం, విశ్వవ్యాప్తం కానీ ఆయా సంస్కృతులను బట్టి కుటుంబ నిర్మాణం, విధులు వేర్వేరుగా ఉండవచ్చు. కానీ కుటుంబం అనే ప్రాథమిక సామాజిక సంస్థ సమాజంలో వచ్చిన మార్పులను బట్టి మార్పులకు లోనవుతుంది. ప్రస్తుతకాలంలో ఈ మార్పులు అనివార్యమయ్యాయి. అయితే కుటుంబ నిర్మాణంలో, ప్రకార్యాల్లో వస్తున్న మార్పులు ఎలా ఉన్నాయి, వాటి రుణాత్మక, ధనాత్మక పర్యవసానాలు ఎలా ఉన్నాయి, ఆయా మార్పులకు దారితీసిన కారణాలు వంటి అనేక అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. కాబట్టి ముందుగా అభ్యర్థులు కుటుంబం భావన, నిర్మితి, రకాలు, ప్రకార్యాలను దేశ సమాజం దృష్టిలో అధ్యయనం చేసిన తర్వాత కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులను, కారకాలను, పర్యవసానాలను అవగతం చేసుకుంటే ఏ ప్రశ్న వచ్చినా సమాధానం రాయవచ్చు.
ఉదాహరణ ప్రశ్నలు
-భారతదేశ కుటుంబ వ్యవస్థ విశిష్ఠతను తెలిపి, ప్రస్తుతం అందులో వస్తున్న మార్పులను విశదీకరించండి.
-భారతీయ కుటుంబ వ్యవస్థ మార్పులకు లోనవుతుందా పరీక్షించండి.
-భారతీయ కుటుంబ వ్యవస్థపై సామాజిక శాసనాల ప్రభావాన్ని పరిశీలించండి.
-ఆర్థికపరమైన వ్యవస్థల్లో వస్తున్న మార్పులు కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయా? వ్యాఖ్యానించండి.
5) భారతీయ కుటుంబ వ్యవస్థపై ధరిత్రీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణల ప్రభావాలను తెలుపండి.
6) ప్రస్తుత కాలంలో కుటుంబం తన విధులను నిర్వర్తిస్తున్నదా వ్యాఖ్యానించండి.
7) భారతీయ ఉమ్మడి కుటుంబ విశిష్ఠ లక్షణాలను తెలిపి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు అందుకుగల కారకాలను విశ్లేషించండి.
8) ప్రాథమిక, ఉమ్మడి కుటుంబం అనే భావనలను విశదీకరించి ఆయా కుటుంబ విధానాల్లోని ధనాత్మక, రుణాత్మక అంశాలను పేర్కొనండి.
కుటుంబం-ప్రాథమిక భావనలు
-కుటుంబం అనే పదం ఇంగ్లిష్‌లో ఫ్యామిలీగా పిలుస్తాం. ఈ ఇంగ్లిష్ పదం ఫేములస్ అనే రోమన్ పదం నుంచి వచ్చిందని, ఫేములస్ అంటే సేవకుడు అనే భావన ఉంది.
-ఫ్యామిలీ అనే ఇంగ్లిష్ పదాన్ని ఫెమిలియా అనే లాటిన్ పదం నుంచి తీసుకున్నారనే వాదన కూడా ఉంది. ఫెమిలియం అంటే కుటుంబం, సేవకులు లేదా బానిసలను కలిపి వ్యవహరించేవారు.
-సమాజశాస్త్ర పరిభాషలో కుటుంబం అంటే వైవాహిక, రక్తసంబంధం ద్వారా బంధుత్వాన్ని కలిగి ఉండి ఒకే గృహంలో నివసించే వ్యక్తుల సమూహం. అంటే కుటుంబం అనేది వైవాహిక, రక్తసంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తుల సమూహమని చెప్పవచ్చు.
-కుటుంబం ఒక సమూహం, ఆ సమూహం లైంగిక సంబంధాలతో కూడి చాలినంతవరకు సరిపడే విధంగా పిల్లలను కని, పెంచడం కోసం శాశ్వతంగా ఏర్పడింది.
– మెకైవర్
-కుటంబం కొందరు వ్యక్తుల సమూహం. ఇది వివాహ సంబంధం ద్వారా కానీ, రక్తసంబంధం ద్వారా కానీ, దత్తత ద్వారా కానీ ఒకే గృహాన్ని ఏర్పాటు చేసుకుని వారు ఒకరికొకరు తమ సాంఘిక పాత్రల ద్వారా పరస్పర అంతఃక్రియలు, భావ ప్రకటనల ద్వారా భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్న, చెల్లెలుగా, కొడుకు, కుమార్తెగా ఏర్పడి ఒక ఉమ్మడి సంస్కృతి నిర్మాణం చేసుకుంటారు.
– బర్జెస్, లాక్
-కుటుంబం సమాజంలోని ఒక ప్రాథమిక సంస్థ
-సామాజీకరణ విషయం ముఖ్యమైన, ప్రాథమిక సంస్థ
-ప్రాథమిక సమూహం అనే భావనను మొదటిసారిగా కూలే ప్రవేశపెట్టారు.
-సామాజిక నిర్మాణంలో కుటుంబం ఒక ప్రైమరీ యూనిట్
-1955కు ముందు కేవలం లైంగిక, ఆర్థిక సంబంధాల ఆధారంగా కుటుంబాన్ని నిర్వచించారు. వాటిన్నింటినీ తొలి నిర్వచనాలు లేదా ప్రాచీన నిర్వచనాలు అంటారు. 1955 తర్వాత పై అంశాల్లో విస్తృతంగా, సమగ్రంగా నిర్వచించారు. కాబట్టి తర్వాత నిర్వచనాలను ఆధునిక నిర్వచనాలని అంటారు.
-కుటుంబానికి సంబంధించి ఎడ్మండ్ లీచ్ నిర్వచనాన్ని సమగ్ర నిర్వచనంగా భావిస్తారు. దీని ప్రకారం కుటుంబానికి కింది లక్షణాలుండాలి.
-వివాహం ద్వారా ఏర్పడాలి.
-చట్టబద్ధమైన పితృత్వ, మాతృత్వాలుండాలి.
-దంపతుల మధ్య లైంగికరపమైన గుత్తాధిపత్యం ఉండాలి.
-దంపతుల మధ్య శ్రమ, సేవలపై ఒకరిపై ఒకరికి హక్కు ఉండాలి.
-సంతాన ప్రయోజనం కోసం సమిష్టి నిధిని ఏర్పాటు చేసుకోవాలి.
-స్టీఫెన్సన్ కింది నాలుగు ప్రమాణాలతో కూడినటువంటి నిర్వచనాన్ని తెలిపాడు. అవి..
-వివాహ ఒప్పందం
-భార్యభర్తల మధ్య ఉండే పరస్పర ఆర్థిక బాధ్యతలు
-కలిసి నివసించడం
-తల్లిదండ్రుల హక్కులు, బాధ్యతలు
-వైవాహిక సంబంధాలు, బాధ్యతలు, విధులు, కలిసి నివసించడం, తల్లిదండ్రులు వారి సంతానం మధ్య పరస్పర సంబంధాలు అనేవాటిపై ఆధారపడే సమూహమే కుటుంబం.
– రాబర్ట్ హెచ్ లూయీ
-ఒకే చోట నివసించడం, ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి అనే లక్షణాలను కలిగి ఉండే సమూహం కుటుంబం. సమూహంలో ఏ ఇద్దరైనా సామాజిక ఆమోదం పొంది లైంగిక సంబంధాన్ని కలిగి ఉండి సొంతబిడ్డలను కలిగి ఉండటం అనేవి కుటుంబం ప్రధాన లక్షణాలు.
– జార్జ్ పీటర్ ముర్డాక్
కుటుంబం లక్షణాలు
-కుటుంబ లక్షణాలు ప్రధానంగా 1) విశ్వవాప్తం 2) పరిమిత పరిమాణం 3) సమాజంలో కేంద్రస్థానం 4) కుటుంబ సభ్యుల బాధ్యతలు 5) సామాజిక నియమాలు 6) శాశ్వతం-తాత్కాలికం 7) నిర్ణీత ఆవాస స్థలం
-మజుందార్, మదన్‌లు కింది నాలుగు కుటుంబ లక్షణాలను తెలిపారు.
-వ్యవస్థీకృతమైన లైంగిక సంబంధం
-వంశానుక్రమం గురించి తెలుపడం
-కుటుంబ ఆర్థిక వ్యవస్థ
-ఒకేచోట నివసించడం
-పై లక్షణాలతో పాటు కుటుంబంలో 1) వివాహపు ఒప్పందం 2) పైతృక హక్కులు, బాధ్యతలు 3) దంపతులకు, వారి బిడ్డలకు ఏకనివాసం 4) భార్యభర్తల మధ్య పరస్పర ఆర్థిక సహకారం
-మెకైవర్, ఫేజ్‌లు తమ సొసైటీ అనే గ్రంథంలో కుటుంబానికుండే ముఖ్య లక్షణాలను తెలిపారు. అవి..
1) విశ్వవ్యాప్తం
2) ఆప్యాయత అనురాగాలు
3) అధ్యయన కేంద్రం
4) కేంద్ర స్థానం
5) పరిమితమైన పరిమాణం
6) సభ్యుల మధ్య బాధ్యతాయుత తత్వం
7) సాంఘిక క్రమం
8) శాశ్వతం, పరివర్తన
విశ్వవాప్తం
-అన్ని రకాల సమాజాల్లో ఉంటుంది. ప్రపంచమంతటా సర్వత్రా వ్యాపించి ఉంది.
-సమాజంలోని ప్రాథమిక సామాజిక సంస్థ, కుటుంబం లేకుండా సమాజమే లేదు.
-అన్ని కాలాల్లో, పరిణామ వికాసాల్లోనూ కుటుంబం సమాజంలో ఉంటుంది.
-మానవజాతి మనుగడకు కావాల్సిన అన్ని మూల అంశాలు కుటుంబంలో ఉంటాయి.
-జీవి శరీరానికి జీవకణం ఎలాగో సమాజానికి కుటుంబం అలాంటిదే.
-250 సమూహాలను అధ్యయనం చేసిన తర్వాత ముర్డాక్ కుటుంబం అనేది విశ్వవ్యాప్తం అనే భావనను పొందుపరిచాడు.
-అన్ని రకాల నాగరికతల్లో కుటుంబం ఉందని మాలినోవ్స్కీ పేర్కొన్నారు. ఇలా కుటుంబంలేని మానవ సమాజం లేదు.
ఆప్యాయత అనురాగాలు/ఉద్వేగపరమైన ఆధారం
-వైవాహిక, రక్తసంబంధం ద్వారా కుటుంబం ఏర్పడుతుంది. కాబట్టి వారి మధ్యగల ప్రేమానురాగాలు ఇందుకు పునాదిగా పనిచేస్తాయి.
-ఇలా ఉద్వేగాలు, సెంటిమెంట్లతో ఏర్పడి ఉంటుంది. సమాజాలు అయినటువంటి సమూహం, సంతానం, మాతృత్వం, పితృత్వం, సంరక్షణ లాంటి అంశాలు ప్రేమ, అనురాగాలు లాంటి అంశాలను కలిగి ఉంటాయి.
అధ్యయన కేంద్రం
-మానవుడు జన్మించినప్పుడు దైవిక ప్రాణిగానే పరిగణింపబడుతాడు. అతడికి సామాజిక విలువలు, కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు ఇలా సామాజిక అంశాలను తాను పెరుగుతున్నకొద్దీ నేర్చుకుంటాడు. దీన్నే సామాజీకరణం అంటారు.
-ఈ సామాజీకరణ వ్యక్తులకు భాష, నైపుణ్యాలు, వృత్తులు, సంస్కృతి వంటి ముఖ్యమైన సామాజిక అంశాలను నేర్పుతుంది. కుటుంబం ప్రాథమిక సామాజీకరణ సాధనంగా పనిచేస్తుంది.
-ఇది వ్యక్తికి అతిముఖ్యమైన అధ్యయన కేంద్రం కుటుంబం
పరిమితమైన పరిమాణం
-సమాజంలోని అన్ని సామాజిక సంస్థలు, సమూహాల కంటే కుటుంబం చిన్నది. ఉదా: మతం, విద్య, బంధుత్వం
కేంద్రస్థానం
-సమాజంలో అన్ని సంస్థల్లోనూ కుటుంబం కేంద్ర లేదా ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. అందుకే కుటుంబం సమాజాలకు ఒక ప్రాథమిక యూనిట్‌గా వ్యవహరిస్తాం.
-ప్రతి వ్యక్తి ముందుగా కుటుంబంలో సభ్యుడవుతాడు. ఆ తర్వాత సమాజ సభ్యుడవుతాడు.
-కుటుంబం సభ్యుల్ని తమ అవసరాలను తీర్చే ద్వితీయ సమూహాల్లో పాల్గొనేందుకు సమాయత్త పరుస్తుంది.
-ఇలా కుటుంబం సామాజిక నిర్మాణంలో కేంద్ర స్థానాన్ని కలిగి ఉంది. సమాజ నిర్మాణం కుటుంబాల కలయికవల్ల ఏర్పడుతుంది. కుటుంబం అనేది మొత్తం సమాజంపై ప్రభావాన్ని చూపుతుంది.
సభ్యులు మధ్య బాధ్యతాయుత తత్వం
-కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమానురాగాలుంటాయి. వాటికి తమ కుటుంబసభ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం బాధ్యతగా పాటుపడుతారు. ఇటువంటి బాధ్యత కుటుంబం చేపట్టడంవల్ల కుటుంబం సుస్థిరంగాను, ఒడుదొడుకులు లేకుండా సాఫీగా ఉంటుంది.
-ప్రతి కుటుంబసభ్యులకు ఒకరిపై మరొకరికి కచ్చితమైన బాధ్యతలు నిర్వచించాల్సినవి ఉంటాయి (తల్లిదండ్రుల పట్ల పిల్లలకు, పిల్లల పట్ల తల్లిదండ్రులకు).
-కుటుంబ సామరస్యత అనేది బాధ్యతలను ఎంత సౌమ్యంగా నిర్వర్తిస్తున్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది.
సాంఘిక నియంత్రణ/క్రమయుతం
-ఎలాంటి నడవడిక ఉండాలో ఉండకూడదో కుటుంబం తన సభ్యులకు జానపద రీతులు, ఆంక్షలు, సాంఘిక ప్రమాణాలు మొదలైనవాటిని పరికరాలుగా ఉపయోగించి బోధిస్తుంది.
శాశ్వతం, పరివర్తన
-కుటుంబాన్ని ఒక సామాజిక వ్యవస్థగా తీసుకుంటే అది మానవజాతి పుట్టుక నుంచి ఇప్పటివరకు శాశ్వతంగా ఉంటూ వస్తున్న వ్యవస్థ. కానీ కుటుంబం అనేది పరివర్తనం చెందుతుంది. కుటుంబంలో కొత్త సభ్యులు పుట్టడం, వయసుమీరినవారు గతించడం, వివాహం ద్వారా మళ్లీ కొత్త సభ్యులు రావడం జరుగుతుంది. ఇలా కుటుంబం మార్పులకు లోనవుతూ నిరంతరం కొనసాగుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు