Changed the course of history | చరిత్రగతిని మార్చిన దీక్ష
సుదీర్ఘమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. అయితే, మలిదశ ఉద్యమాన్ని మహోద్యమంగా మార్చిందీ, తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన ఘటన ఒక్కటే.. అదే కే చంద్రశేఖర్‌రావు దీక్ష. తెలంగాణ ఏర్పాటుపై నాన్చివేత ధోరణి అనుసరిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యతను సృష్టించింది.. తెలంగాణ సమాజాన్ని పూర్తిగా ఏకం చేసిందీ కేసీఆర్ దీక్షే. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఘటనపై తెలంగాణ ఉద్యమ చరిత్ర విభాగంలో పోటీ పరీక్షల్లో తప్పక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం ఈ వ్యాసం..
కేసీఆర్ అరెస్టు, విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా టీఆర్ఎస్తోపాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. రాజధాని సహా తెలంగాణ అంతటా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఉద్యోగుల పెన్‌డౌన్‌తో ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిరసన కేంద్రాలుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడికిపోయింది. వేలాది ప్రభుత్వ దిష్టిబొమ్మలతో ర్యాలీలు నిర్వహించి దహనం చేశారు. జిల్లాస్థాయి, హైకోర్టు స్థాయిల్లోని న్యాయవాదులు సైతం తమ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు బొగ్గుబాయిలోకి దిగకుండా నిరసన వ్యక్తంచేశారు. ఈ విధంగా ఎక్కడ చూసినా ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా రోడ్లపై ఆటపాటలతో నిరసన తెలిపారు. తెలంగాణలోని అన్ని చోట్ల ప్రధాని, ముఖ్యమంత్రి సహా కేంద్ర, రాష్ట్రమంత్రులు, కాంగ్రెస్, సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మలను శవయాత్రలు చేస్తూ దహనం చేశారు. కేసీఆర్ దీక్షకు సంఘీభావంగా అనేక చోట్ల దీక్షా శిబిరాలు వెలిశాయి. వేలాది ఉద్యమకారులను ప్రభుత్వం అరెస్టు చేసింది. కేసులు పెట్టింది, లాఠీచార్జి చేసింది. ప్రభుత్వం ఎన్ని రకాల నిర్బంధాలు చేసినా తెలంగాణవాదులు వెనక్కి తగ్గలేదు. మొత్తంగా ఉద్యమం తారాస్థాయికి చేరింది.
క్షీణించిన కేసీఆర్ ఆరోగ్యం-నిమ్స్‌కు తరలింపు
ఖమ్మం దవాఖానలో కేసీఆర్ ఆరోగ్యం క్రమంగా ఆందోళనకరంగా మారింది. కేసీఆర్‌కి మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైన సౌకర్యాలు ఖమ్మం దవాఖానలో లేకపోవడంతో కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై పెరుగుతున్న ఒత్తిడి మూలంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పదేపదే సమావేశం నిర్వహించి తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవహారాల్లో సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్ జోక్యం చేసుకోవాలని కేసీఆర్‌తో అధిష్టానమే నేరుగా చర్చలు జరపాలని లేఖ రాశారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు సమావేశమైన విషయం తెలుసుకున్న విద్యార్థులు అక్కడికి చేరుకొని తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ హెచ్చరించారు. ఆ మరుక్షణమే విలేకరుల సమావేశం ద్వారా ఎమ్మెల్యే శంకరరావు మాత్రమే విద్యార్థి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది.
ఈ విషయాన్ని స్థానిక మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హోంమంత్రికి చెప్పారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి నిమ్స్‌కు తరలించడం ఉత్తమమని వైద్యులు సూచించగా, ప్రభుత్వం 2009 నవంబర్ 3న కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే బంద్‌లు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడికిపోయింది. విద్యార్థుల బలిదానాలు రోజురోజుకు ఎక్కువయ్యాయి. కేంద్రప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడి పెరిగింది. ప్రజలు కాంగ్రెస్ నేతలను, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలతోపాటు అన్ని యూనివర్సిటీల విద్యార్థులు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. పార్టీలకతీతంగా అన్ని రంగాల ప్రజలు, నేతలు స్పందించారు. కేసీఆర్ ప్రాణాలు కాపాడుకోవాలని, బలిదానాలు ఆగిపోవాలని ఇష్టదైవాలను ప్రార్థించారు.
తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రాజకీయాలకతీతంగా వందలమంది కేసీఆర్‌ను పరామర్శించి వెళ్లారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నిమ్స్ ఆవరణలో మీడియా పాయింట్ ఏర్పాటు చేసుకుని పరామర్శకు వచ్చిపోయేవారి స్పందనను ఎప్పటికప్పుడు బయటిప్రపంచానికి తెలియజేశారు. తెలంగాణ ధూం.. ధాం కళాకారులు నిమ్స్ ఆవరణలోని చెట్లకింద తెలంగాణ గీతాలను ఆలపించారు. ఓయూ జేఏసీ కేసీఆర్ నిరాహార దీక్షకు మద్దతుగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఓయూ జేఏసీ నాయకులంతా కేసీఆర్‌ను కలిసి తమ సంఘీభావం తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో జరిగిన పరిణామాలు
అప్పటి సీఎం రోశయ్య 2009, డిసెంబర్ 2న ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ దీక్ష, తెలంగాణ ఉద్యమం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సోనియా, మన్మోహన్లకు నేరుగా నివేదికలు అందించారు. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ అంశం మా పరిధిలో లేదు. అది కేంద్రం పరిష్కరించాల్సిన అంశం, సోనియాగాంధీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని మేం కోరాం. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ వాదులందరికీ ఆమోదయోగ్యమే అని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టడానికి 2009 డిసెంబర్ 2న బి. వినోద్‌కుమార్ నాయకత్వంలో ఏర్పాటైన టీఆర్ఎస్ బృందం ఢిల్లీకి వెళ్లింది. ఈ బృందం డిసెంబర్ 3న గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ఎంపీలను కలిసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేసింది.
వారు సానుకూలంగా స్పందించారు. అనంతరం టీఆర్ఎస్ బృందం యూపీఏ భాగస్వామ్యపక్షాలకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్, ఆర్ఎల్డీ అధినేత అజిత్‌సింగ్, రఘువంశ్ ప్రసాద్‌సింగ్ తదితరులను కలిసి, తెలంగాణ అంశం, యూపీఏ హామీ, కేసీఆర్ దీక్ష గురించి వివరించారు. డిసెంబర్ 4న బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, పార్లమెంట్లో అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, ఇతర బీజేపీ నేతలు అరుణ్‌జైట్లీ, ప్రకాశ్ జవదేకర్లతో టీఆర్ఎస్ బృందం విడివిడిగా సమావేశమై.. తెలంగాణ రాష్ట్రసాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరింది. దానికి బీజేపీ కూడా సానుకూలంగా స్పందించింది. అదేరోజు టీడీపీ నాయకుడు నామా నాగేశ్వర్రావును సైతం టీఆర్ఎస్ బృందం కలిసి ప్రతిపక్షం కూడా ఉద్యమంలో కలిసి రావాలని కోరింది.
ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలోనే ఆత్మహత్యలు విరివిగా జరిగాయి. నవంబర్ 29న కేసీఆర్ అరెస్ట్ విషయం తెలిసి హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీకాంతాచారి.. తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలై డిసెంబర్ 3న మరణించాడు. అన్ని పార్టీలు తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకున్నాయి. డిసెంబర్ 4న ఓయూ జేఏసీ చంద్రబాబును కలిసి టీడీపీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని, కేంద్రం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా చొరవతీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తెలుగుదేశం పార్టీ విద్యార్థులకు స్పష్టత ఇవ్వకపోవడంతో.. పార్టీలోని తెలంగాణ, ఆంధ్రా నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తెలంగాణవాదుల తీవ్ర నిరసనల మధ్య సీఎం రోశయ్య కేసీఆర్‌ను పరామర్శించి, దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కేసీఆర్ స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప తన దీక్ష విరమణకు మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. ఎవరు ఎన్ని విధాలుగా విజ్ఞప్తి చేసినా నిమ్స్ నుంచి తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర జరుగుతుంది. అంతవరకు దీక్ష కొనసాగుతుంది అని స్పష్టం చేశారు.
విద్యార్థుల మహోద్యమం
కేసీఆర్ దీక్షకు మద్దతుగా విద్యార్థులు చేసే ఉద్యమాన్ని ఎదుర్కొనలేక ప్రభుత్వం 15 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. యూనివర్సిటీల్లోని హాస్టళ్లు, మెస్‌లను మూసివేయించింది. అప్పటివరకు రోజుకు 20 నుంచి 30 మంది విద్యార్థులు మాత్రమే రిలే దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది విద్యార్థులు స్వయంగా రిలే దీక్షలో పాల్గొన్నారు. హాస్టళ్లు, మెస్‌లను మూసివేయడంపై విద్యార్థులు, ప్రజాసంఘాలు హైకోర్టులో పిటిషన్ వేశారు. మెస్‌లను మూసివేస్తే తిండిలేక విద్యార్థులు క్యాంపస్ వదిలి తమ గ్రామాలకు వెళ్తారని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే విద్యార్థుల మహోజ్వలమైన చరిత్రాత్మకమైన పోరాటం, వారి త్యాగాలను చూసిన ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు నిత్యం విద్యార్థులకు సరిపడా ఆహారాన్ని సరఫరా చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో క్యాంటీన్ నడిపే అశోక్ విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేయడంలో కీలకపాత్ర పోషించారు. చాలా స్వచ్ఛంద సంస్థల సహకారం మూలంగా మెస్‌లలో విడివిడిగా భోజనం చేసే విద్యార్థులు.. ఆర్ట్స్ కాలేజీ, క్యాంపస్ రోడ్లపై సామూహికంగా భోజనాలు చేశారు. విద్యార్థుల ప్రజావ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు మెస్‌లను వెంటనే తెరవాలని తీర్పు ఇచ్చింది.
కేసీఆర్ దీక్షపై తప్పుడు సమాచారం
కేసీఆర్ కఠోర దీక్ష ఖమ్మం జైలులోనే కొనసాగింది. క్రమంగా కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ప్రభత్వం ఖమ్మం జైలు నుంచి జిల్లా ప్రభుత్వాస్పత్రికి 2009 నవంబర్ 30న తరలించింది. జిల్లా అధికారుల వ్యవహారశైలిని చూసిన తర్వాత ఖమ్మం జైలులో కేసీఆర్‌కి ప్రాణహాని ఉంటుందని తెలంగాణవాదులు పదేపదే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం హాస్పిటల్లో పోలీసు అధికారులు, డాక్టర్లు కేసీఆర్‌కు టాబ్లెట్ ఇచ్చారు. అది గొంతులో అడ్డుపడగా నీళ్లు తాగండని చెబుతూ పండ్లరసం గ్లాసును ఆయన చేతికి అందించారు. దాన్ని మఫ్టీలో ఉన్న ఒక పోలీస్ వీడియోలో రికార్డు చేశాడు. అప్పుడే లోపలికి వచ్చిన హరీష్‌రావు ఇక్కడేం జరుగుతుందని నిలదీశారు. ఆ వీడియో క్లిప్పింగ్‌ని అప్పటికప్పుడు మీడియాకు విడుదల చేసి కేసీఆర్ దీక్ష విరమించారని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసింది. ఆ కుట్రను తిప్పికొడుతూ కేసీఆర్ దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. కానీ అప్పటికే టీవీ చానళ్లలో కేసీఆర్ జ్యూస్ తాగే వీడియో క్లిప్పింగ్‌లు చూసిన ఓయూలోని కొందరు విద్యార్థులు ఆవేశంతో కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు.
దీక్ష విరమణపై నలువైపులా నుంచి నిరసనలు వెల్లువలా మొదలయ్యాయి. తామే ఇకపై ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఓయూ విద్యార్థులు స్పష్టం చేశారు. ఓయూలోని విద్యార్థి సంఘాలు తమ సిద్ధాంతాలు, జెండా, ఎజెండాలను పక్కన పెట్టి ఓయూ జేఏసీని 2009 నవంబర్ 30న ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ఆర్ట్స్ కాలేజీ ఉద్యమ కేంద్రంగా మారింది. ఇకపై రాజకీయాలకతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థి జేఏసీ ప్రకటించింది. కేసీఆర్ దీక్ష విరమించినా మేం కొనసాగిస్తాం. సొంతంగా ఉద్యమాన్ని చేపడుతాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మా ప్రాణాత్యాగాలకైనా వెనుకాడేది లేదని ఓయూ జేఏసీ ప్రకటించింది. దీన్ని మిగతా విశ్వవిద్యాలయ విద్యార్థులు అనుసరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేవరకు తమ చదువులకు స్వస్తిచెప్పి ఉద్యమబాట పట్టాలని నిర్ణయించుకున్నారు.
విద్యార్థి జేఏసీకి బాసటగా నిలుస్తామని ప్రజాసంఘాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టిన దృశ్యాలను, కొందరు మేధావులు కేసీఆర్‌పై చేసిన విమర్శలను సీమాంధ్ర మీడియా రెండురోజులపాటు పదేపదే చూపించింది. ఈ విషయం తెలిసి కేసీఆర్ అదేరోజు రాత్రి మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వం, పోలీసులు చేసిన కుట్రను ప్రజలకు వివరించి నేను దీక్ష విరమించలేదు. పోలీసులు బలవంతంగా భగ్నంచేసేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదు. మీడియాలో వస్తున్న అవాస్తవాలను దయచేసి విద్యార్థులు నమ్మవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, బతికుండి తెలంగాణ సాధిద్దాం అని కేసీఆర్ విద్యార్థులకు, ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు