భారత సమాజం – నిర్మాణం
సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్, పబ్లిక్ పాలసీస్ (భారతీయ సమాజం -సామాజిక సమస్యలు, రాజ్యాంగం, పరిపాలన) టీఎస్పీఎస్సీ మారిన పరీక్షా విధానం, సిలబస్లో సోషియాలజీ అనేది ఇప్పుడు కీలక అంశం. గ్రూప్-1, 2, 3ల్లో 50 మార్కులకు ఈ కొత్త అంశాన్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభుత్వ పాలనలో పాల్గొనే ఒక అధికారికి సమాజం పట్ల అవగాహన, ప్రభుత్వ పథకాలు, వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక వసతులపై ఒక ప్రాథమిక అవగాహన అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొనే టీఎస్పీఎస్సీ సోషియాలజీ అంశానికి ప్రాధాన్యత ఇచ్చినది.
సమాజం అంటే ఏమిటి? మానవ సంబంధాలు ఎలా ఉంటాయి? కులాల వర్గీకరణ, మతవిధానాలు, సమాజంపై వాటి ప్రభావం, సామాజిక రుగ్మతలు వంటి అంశాలు ఈ అంశం కింద అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాలనా విధానం, ప్రభుత్వ పథకాలు, వాటి విధివిధానాలపై దృష్టిసారించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు.. ఉదా॥ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, బేటి బచావో, బేటి పడావో వంటి పథకాల ముఖ్య ఉద్దేశం, వాటి అమలు తీరు వంటి విషయాలను సూక్ష్మదృష్టితో అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
గూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 వంటి పరీక్షలకు సంబంధించి నూతనంగా ప్రవేశపెట్టిన పేపర్లలో భారతీయ సమాజం – సామాజిక సమస్యలు, రాజ్యాంగం, పరిపాలన అనేది ఒక ముఖ్యమైన పేపర్. గ్రూప్-1, గ్రూప్-2లకు సంబంధించి ఈ పేపర్ ప్రధానంగా మూడు విభాగాలను కలిగి ఉంది.
1. భారతీయ సమాజం, నిర్మితి, సామాజిక సమస్యలు
2. భారత రాజ్యాంగం
3. భారతదేశంలో పరిపాలనా వ్యవస్థ
భారతీయ సమాజం-సామాజిక సమస్యలకు సంబంధించిన విభాగం ప్రధానంగా ఆరు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. అవి…
1. భారతీయ సమాజం లక్షణాలు, నిర్మితి, పరివర్తనా ధోరణులు.
2. భారతీయ సమాజంలో సామాజికంగా,ఆర్థికంగా, రాజకీయంగా విచక్షణకు గురికాబడి, అభివృద్ధి రేఖకు సుదూరంగా ఉన్న బలహీనవర్గాలు, వారి సమస్యలు
3. బలహీనవర్గాల రక్షణ, సంక్షేమం కోసం రూపొందించిన రాజ్యాంగ నిబంధనలు
4. భారతీయ సమాజంలో గల ప్రధాన సామాజిక సమస్యలు
5. వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం భారత ప్రభుత్వం రూపొందించిన జాతీయ విధానాలు
6. వివిధ వర్గాలు ముఖ్యంగా బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించి, అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు
-గ్రూప్-1, గ్రూప్-2లకు సన్నద్దులయ్యే విద్యార్థులందరికీ పైన పేర్కొన్న అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. ఇప్పుడు ఆయా అంశాలను గురించి వివరంగా చర్చిద్దాం.
-భారతీయ సమాజం భిన్నత్వంలో ఏకత్వం గల సమాజం. అంటే భారతీయ సమాజం అనేది అనేక మతాలు, కులాలు, జాతులు, సంస్కృతులు, భాషల సమ్మిళిత వ్యవస్థ. భారతీయ సమాజం, సంస్కృతి అనేది కొన్ని తాత్విక, ధార్మిక, మతపరమైన పునాదులపై ఆధారపడి ఏర్పడింది. కాబట్టి భారతీయ సమాజ లక్షణాలను అవగాహన చేసుకోవాలంటే ధార్మిక, తాత్విక పునాదులను అర్థంచేసుకోవాలి.
అవి ప్రధానంగా వర్ణవ్యవస్థ, కులవ్యవస్థ, ఆశ్రమవ్యవస్థ, పురుషార్థాలు, ధర్మం, పునర్జన్మ అనే భావనలు. వీటితోపాటు భారతీయ సమాజంపైన వివిధ మతాలు అంటే ఇస్లాం, క్రైస్తవం బౌద్ధం, జైనం వాటి మత సిద్ధాంతాలు, సూత్రాల ప్రభావం ఎంతగానో ఉన్నది. కాబట్టి భారతీయ సమాజంపై ఆయా మతాల ప్రభావం ఏవిధంగా ఉందో సంపూర్ణ అవగాహన ఉండాలి. భారతీయ సమాజ నిర్మితికి సంబంధించి అందులో ఉన్న ప్రధాన భాగాలు – కుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, మత వ్యవస్థ, విద్యావ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మొదలైనవి.
భారతీయ సమాజంపై కుల, మత ప్రభావాలు
-భారతీయ సమాజంపై కుల వ్యవస్థ, కటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ లక్షణాలు, వాటి ప్రకార్యాలు, వాటిలోవస్తున్న పరివర్తనా ధోరణులపైన సంపూర్ణ అవగాహన అవసరం. ప్రపంచీకరణ నేఫథ్యంలో భారతీయ సమాజంలో, ముఖ్యంగా కుల, మత, కుటుంబ, వివాహ, విద్యా, రాజకీయ వ్యవస్థల్లో ఏర్పడుతున్న పరివర్తనా ధోరణులను గురించి అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇంతకుముందు చెప్పినట్లుగా భారతీయ సమాజం అనేది బహుజాతుల, కులాల, వర్గాల సమ్మేళనం.
అయితే చారిత్రకంగా కొన్ని కులాలను, వర్గాలను జనజీవన స్రవంతికి దూరంగా ఉంచారు. తద్వారా ఆయా కులాలు, వర్గాలకు చెందిన ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. అలాంటి వర్గాల అభ్యున్నతి కోసం స్వాతంత్య్రానంతర కాలంలో భారత ప్రభుత్వం వివిధ విధానాల ద్వారా, శాసనాలు, చట్టాలు, వివిధ అభివృద్ధి పథకాల ద్వారా వెనుకబడిన సమాజాన్ని అభివృద్ధి స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ విధంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు ప్రధానంగా – షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన కులాలు, మహిళలు, మైనార్టీలు, పిల్లలు, శారీరక లేదా మానసిక వైకల్యం కలిగిన వ్యక్తులు మొ దలైనవారు.
ఈ వర్గాలకు సంబంధించిన సమస్యలపైన విద్యార్థులకు సమగ్రమైన అవగాహన ఉండాలి. ఉదా॥ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి అంటరానితనం దానికి గల కారణాలు, ఆ సమస్యను రూపుమాపడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు తదితర అంశాలపై అవగాహన అవసరం. అదేవిధంగా గిరిజనుల సమస్యలు, గిరిజనాభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలు, చట్టాలకు సంబంధించిన అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా మైనార్టీ వర్గాలకు సంబంధించిన సమస్యలు, మహిళలకు సంబంధించిన సమస్యలు, బాలబాలికలకు సంబంధించిన సమస్యలు, శారీరక, మానసిక వైకల్యత గల వ్యక్తులకు సంబంధించిన సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉండాలి.
-స్వాతంత్య్రానంతర కాలంలో అన్నివర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో భారత రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల ద్వారా పైన పేర్కొన్న వర్గాలకు చెందిన ప్రజలకు కొన్ని ప్రత్యేక రాజ్యాంగపరమైన రక్షణలను కల్పించడం జరిగింది. వీటిపైన విద్యార్థులకు అవగాహన ఉండాలి. అంతేగాకుండా ఆయా వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతి కోసం ఉద్దేశించిన చట్టాలు, శాసనాలు, ప్రత్యేక పథకాలపైన కూడా అవగాహన ఉండాలి.
వెనుకబడిన వర్గాలు- ప్రత్యేక పథకాలు
-స్వాతంత్య్రానంతర కాలంలో మరీ ముఖ్యంగా రెండు దశాబ్దాలుగా భారత ప్రభుత్వం వివిధ సామాజిక వర్గాల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ధిష్ట జాతీయ విధానాలను రూపొందించింది. ఈ జాతీయ విధానాలు ప్రధానంగా మహిళలు, బాలలు, వృద్ధులు, వికలాంగులు, షెడ్యూల్డ్కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలకు సంబంధించినవి.
ఆయా సామాజికవర్గాలకు సంబంధించిన జాతీయ విధానాలను, అందులో గల ప్రధానాంశాలను గురించి అధ్యయనం చేయడం చాలా అవసరం. వీటితోపాటు విద్య, ఆరోగ్యం, ఉపాధిరంగాలకు సంబంధించిన జాతీయ విధానాలను గురించి కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఈ జాతీయ విధానాలకు సంబంధించిన సమాచారాన్ని చదివేటప్పుడు ఆయా విధానాల్లో గల ప్రధానాంశాలపైన దృష్టిని కేంద్రీకరించాలి. అయితే పైన పేర్కొనబడిన జాతీయ విధానాలతోపాటు, భారత ప్రభుత్వం గత ఐదు దశాబ్దాలుగా బలహీనవర్గాల అభ్యున్నతి కోసం రకరకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసింది. అయితే గత దశాబ్దకాలంగా ముఖ్యంగా 11, 12వ పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా కొన్ని వినూత్నమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. అదే విధంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా కొన్ని వినూత్నమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది.
ప్రధానంగా ఈ సంక్షేమ పథకాలన్నీ పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, అభివృద్ధి, వృద్ధులు, వికలాంగుల సంరక్షణ, సంక్షేమం, బలహీనవర్గాలకు చెందిన ప్రజల సాధికారత, మహిళా సాధికారత వంటి అంశాలపైన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఈ అంశాలన్నింటికీ సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలపైన విద్యార్థులకు సమగ్రమైన అవగాహన ఉండాలి. ఉదా॥ పేదరిక నిర్మూలన కోసం, ఉపాధి అవకాశాలను సృష్టించడం కోసం భారత ప్రభుత్వం రెండు పథకాలను ప్రవేశపెట్టింది.
1. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం
2. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన.
-అదేవిధంగా ఇటీవల కాలంలో 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనే పథకాన్ని ప్రారంభించారు. అదే విధంగా మహిళా శిశుసంక్షేమం, రక్షణ, సాధికారత కోసం కొన్ని ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నారు.
1. జననీ సురక్ష యోజన, 2. ఉజ్వల, 3. రాష్ట్రీయ మహిళా కోష్ 4. ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన, 5. స్వాధార్, 6. సపోర్టు టు ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ (స్టెప్) మున్నగునవి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాలను పెంపొందించడానికి కొన్ని ప్రత్యేక పథకాలు అమలవుతున్నాయి.
1. భారత్ నిర్మాణ్, 2. ఇందిరా ఆవాస్ యోజన,
3. స్వచ్ఛ భారత్ మిషన్ మొదలగునవి.
అదేవిధంగా భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది.
1. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన
2. ప్రధానమంత్రి జన్ధన్ యోజన
3. మేక్ ఇన్ ఇండియా
4. బేటి బచావో, బేటి పడావో మొదలైనవి.
-తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితులకు మూడెకరాల భూపంపిణీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, వృద్ధాప్య పెన్షన్ (ఆసరా) లాంటి సంక్షేమ పథకాలపైన విద్యార్థులకు అవగాహన ఉండాలి.
-ఈ విధంగా గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల కోసం సన్నద్దులయ్యే విద్యార్థులందరూ భారతీయ సమాజ లక్షణాలు, నిర్మితి, పరివర్తనా ధోరణులు, సమస్యలు, జాతీయ విధానాలు, వివిధ అభివృద్ధ్ది సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాల పట్ల సంపూర్ణ అవగాహన ఉండాలి.
భారత రాజ్యాంగంపై… సమగ్ర అవగాహన
-ఈ పేపర్లో రెండో భాగం భారత రాజ్యాంగం. ఈ విభాగానికి సంబంధించి విద్యార్థులు భారత రాజ్యాంగానికి సంబంధించిన పలు అంశాలపైన పట్టును సాధించాలి. మొట్టమొదట భారత రాజ్యాంగం ఆవిర్భావానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రూపకల్పనలో ప్రధానపాత్ర పోషించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ వేత్తలు, రాజ్యాంగానికి సంబంధించిన తాత్విక పునాదులు, రాజ్యాంగ పీఠిక, భారత రాజ్యాంగం లక్షణాలు, నిర్మితి, ప్రధాన రాజ్యాంగ సవరణలు మొదలైన అంశాలపట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాత భారత రాజ్యాంగంలోని ప్రధాన అంశాలైన ప్రాథమిక హక్కులు, నిర్ధేశిక సూత్రాలు, సమన్యాయం, ప్రాథమిక విధులు, సంక్షేమ రాష్ట్ర భావన మొదలగు అంశాలను గురించి క్షుణ్ణంగా చదవాలి.
వీటిని గురించి చదివేటప్పుడు ఆయా అంశాలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను గుర్తు పెట్టుకోవాలి. వీటితోపాటు పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి అధికారాలు, భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి వారి ఎన్నిక విధానం, అధికార్యాలు, ప్రకార్యాలు, పార్లమెంట్ నిర్మాణం, ప్రకార్యాలు, అధికారాలు తదితర అంశాల పట్ల లోతైన అవగాహనను ఏర్పరచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి, గవర్నర్ ఎంపిక విధానం, రాజ్యాంగాన్ని అనుసరించి వారి విధులు, అధికారాలు, శాసనసభ నిర్మాణం, విధులు, ముఖ్యంగా గవర్నర్ ప్రకార్యాలు, అధికారాలను గురించి క్షుణ్ణంగా చదివి విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకోవాలి.
న్యాయవ్యవస్థ – నిర్మాణం
-భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థతోపాటు అతి ముఖ్యమైన వ్యవస్థ న్యాయవ్యవస్థ. భారతదేశంలో న్యాయవ్యవస్థ నిర్మితి, ప్రకార్యాలు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, పరిపాలనా ట్రిబ్యునల్స్ సంబంధించిన ప్రకార్యాలు, అధికారాలను గురించి జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. అంతేగాకుండా భారతీయ సమాజంలో అత్యున్నత న్యాయస్థానాల పాత్ర ఏ విధంగా ఉన్నది, ప్రజల హక్కులను కాపాడటంలోనూ, ప్రజా సంక్షేమంలోనూ, బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించడంలోనూ, ప్రభుత్వ కార్యకలాపాలలో గల లోటుపాట్లను ఎత్తిచూపడంలోనూ, సమాజాన్ని అభివృద్ధ్ది దిశగా పయనిచేయించేట్లు చేయడంలోనూ, పౌర సమాజంలో క్రమశిక్షణను పాదుకొల్పడంలోనూ ఉన్నత న్యాయస్థానాల పాత్ర ఏ విధంగా ఉన్నదో విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకోవాలి. అదే విధంగా న్యాయవ్యవస్థ జవాబుదారీతనం, న్యాయవ్యవస్థ స్వతంత్రత మొదలైన అంశాలపైన కూడా అవగాహన కలిగి ఉండాలి.
స్థానిక ప్రభుత్వాలు.. అధికారాలు విధులు
-భారత రాజకీయ వ్యవస్థ ఫెడరల్ వ్యవస్థ. ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గల సంబంధాలు అనేవి కీలకమైనవి. భారత రాజ్యాంగంలో గల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య గల సంబంధాలకు సంబంధించిన ప్రస్తావన ఏయే రాజ్యాంగ నిబంధనలలో ఉన్నాయి ? వాటికి సంబంధించిన ప్రధాన అంశాలు ఏమిటి? ఫెడరల్ నిర్మితికి సంబంధించిన ప్రధాన సమస్యలు, సవాళ్లు ఏమిటి? వంటివాటికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని సేకరించుకుని, లోతైన అవగాహనను ఏర్పరచుకోవాలి. వీటితోపాటు భారతీయ రాజకీయ వ్యవస్థలో ప్రధానమైనవి స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలు.
అవి- పంచాయతీరాజ్ వ్యవస్థ, పురపాలక సంస్థలు, దీనికి సంబంధించిన 73వ, 74వ రాజ్యాంగ సవరణలను గురించి అన్ని కోణాలలో అధ్యయనం చేయాలి. ఈ రాజ్యాంగ సవరణలు భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా వ్యవస్థలు పటిష్టం కావడానికి ఏ విధంగా దోహదపడ్డాయి ? తద్వారా స్థానిక పరిపాలనా వ్యవస్థలకు సంక్రమించిన అధికారాలు ఏమిటి? ఈ వ్యవస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల బదలాయింపు ఏ విధంగా జరుగుతుంది? 73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా ఏరకమైన అధికారాలను, విధులను గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు సంక్రమింపజేయడం జరిగింది? మొదలైన అంశాల పట్ల సమగ్రమైన అవగాహనను కలిగి ఉండాలి.
వీటితోపాటు మరో ముఖ్యమైన అంశం- వివిధ రాష్ర్టాల మధ్య తలెత్తే వివాదాలు . మరీ ముఖ్యంగా వివిధ రాష్ర్టాల మధ్య జల వివాదాలు, వీటికి సంబంధించిన ప్రస్తావన రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నది ? ఇలాంటి వివాదాల పరిష్కారానికి భారత రాజ్యాంగం చూపుతున్న పరిష్కారమార్గాలు ఏమిటి? ఏయే రాష్ర్టాల మధ్య ఇలాంటి వివాదాలు తలెత్తాయి ? వాటికి రాజ్యాంగ పరిధిలో ఎలాంటి పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది? జల వివాదాలకు సంబంధించిన కమిషన్లు ఏమిటి ? మున్నగువాటికి సంబంధించి కూడా సమగ్రసమాచారాన్ని విద్యార్థులు సమకూర్చుకోవాలి.
గుడ్ గవర్నెర్స్- ఈ గవర్నెన్స్
-ఈ పేపర్లోగల మరో ప్రధాన విభాగం పరిపాలన. భారతదేశంలో పరిపాలనకు సంబంధించి పలు అంశాలను గురించి చాలా ఆసక్తిగా, లోతుగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా గ్రామీణ, నగర పరిపాలనా వ్యవస్థలైన పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపాలిటీలు, వాటి విధులు, అధికారాలు, అవి ప్రజలకు అందించే సేవలు మున్నగువాటి గురించి సమగ్రమైన అవగాహన అవసరం. అదేవిధంగా సుపరిపాలన (Good Governance), ఇ- గవర్నెన్స్ (E-Governance), స్మార్ట్ గవర్నెన్స్ అనే భావనలు, వాటి ఉపయోగాలను గురించి చదవాలి. అదే విధంగా భారత ఆర్థిక సంఘం కార్యకలాపాలు, దాని సిఫారసుల గురించి కూడా చదవాలి.
-జిల్లా పరిపాలనకు సంబంధించి కలెక్టర్ అధికారాలు, విధులు, అభివృద్ధి కార్యకలాపాలలో కలెక్టర్ పాత్ర, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, వాటి కార్యకలాపాలు, రాజకీయ వ్యవస్థకు, ప్రభుత్వాధికారులకు మధ్య గల సంబంధాలు మొదలై అంశాలపైనా సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి.
– పరిపాలనకు సంబంధించి పాటించాల్సిన నైతిక విలువలు, సిటిజన్ చార్టర్స్, పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుతంగా, పరిపాలనలో అవినీతిని నివారించడం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, లోక్పాల్, కేంద్ర విజిలెన్స్ కమిషన్, లోకాయుక్త, అవినీతి నిరోధక శాఖ కార్యకలాపాలు, పరిపాలనలో వాటి పాత్ర గురించి కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలి. వీటితోపాటు మరీ ముఖ్యంగా సమాచార హక్కుచట్టం, అందులోగల ప్రధానాంశాలు, పరిపాలనలో బాధ్యతాయుతత్వాన్ని పెంచడంలో ఈ చట్టం పాత్ర, సమాజంపై, పరిపాలనా వ్యవస్థపై ఈ చట్టం ప్రభావం తదితర అంశాల పట్ల కూడా సునిశిత అవగాహనను కలిగి ఉండాలి.
-భారత దేశంలో అభివృద్ధికి సంబంధించి వివిధ సముదాయాల పాత్ర ఏ విధంగా ఉన్నది? ముఖ్యంగా పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, స్వయంసహాయక బృందాలు, ఇతర ప్రైవేటు సంస్థలు ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయో వాటిని గురించి విశ్లేషణాత్మక అవగాహన అవసరం. దీనికి సంబంధించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలీటీ అనే భావన, దాని ఉపయోగాలు, ప్రభావం వంటివాటి గురించి కూడా సవివరంగా అవగాహన కలిగి ఉండాలి.
-చివరగా గ్రామీణ, నగర ప్రాంతాలలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను గురించి సమగ్రంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం, మహిళా సాధికారత కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, విద్య, ఆరోగ్యం, సామాజిక రక్షణ, సామాజిక బీమా సంబంధించిన పథకాలపైన దృష్టిని కేంద్రీకరించాలి.
చదవాల్సిన గ్రంథాలు – తెలుగు పుస్తకాలు
తెలుగు అకాడమి ప్రచురణలు ( బీఏ డిగ్రీ స్థాయి పుస్తకాలు)
1. భారతీయ సమాజం
2. భారతదేశంలో సామాజిక సమస్యలు
3. భారత రాజ్యాంగం – రాజకీయ వ్యవస్థ
4. భారతదేశ ఆర్థిక వ్యవస్థ
5. భారతదేశ పరిపాలనా వ్యవస్థ
ఇంగ్లీష్ పుస్తకాలు
1. India-2015 Year Book
Publication Division, Ministry of Information and Broadcasting, Govt. of India
2. Economic Survvey Report 2014-15 (Ministry of Finance Govt. of India
3. Indian Social System – Ram Ahuja
4. Social Problems in India – Ram Ahuja
5. Yojana Monthly Magazine
భారతదేశంలో సామాజిక సమస్యలు
-ఈ పేపర్లో ఉన్న మరో ముఖ్యమైన అంశం సామాజిక సమస్యలు. భారతీయ సమాజంలో గల సమకాలీన సమస్యలకు సంబంధించిన ప్రస్తావన ఈ భాగంలో ఉంటుంది. సమకాలీన భారతీయ సమాజంలోగల ప్రధాన సమస్యలు- పేదరికం, నిరుద్యోగం, బాలకార్మిక సమస్య, మహిళల పట్ల జరిగే హింస, ప్రాంతీయతత్వం, మతతత్వం, లౌకికవాదం, అవినీతి, కుల సంఘర్షణలు, వ్యవసాయ కార్మిక సమస్యలు, నగరీకరణ పర్యవసానాలు, పర్యావరణ క్షీణత, జనాభా విస్ఫోటనం, భూనిర్వాసితుల సమస్యలు మొదలైనవి. ఇలాంటి సమస్యలపైన సమగ్రమైన సమాచారాన్ని విద్యార్థులు సేకరించుకుని, విశ్లేషణాత్మక పద్ధతిలో అవగాహన చేసుకోవాలి. ఆయా సమస్యలకు సంబంధించి ఉపయోగించే ప్రధాన భావనలను, వాటికి గల కారణాలను,
వాటిని నివారించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న చట్టాలు, ఆయా చట్టాల సారాంశం, ఆయా సమస్యల పరిష్కారానికి మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు సూచించిన పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు, ఆయా సమస్యలతో సతమతమవుతున్న ప్రజల అభ్యున్నతికోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షే మ పథకాలు మొదలైనవాటిపై సమగ్ర సమాచారాన్ని సేకరించుకుని విశ్లేషించుకోవడం చాలా అవసరం.ఈ సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని, వాటికి గల కారణాలను, పర్యవసానాలను, పరిష్కారమార్గాలను కచ్చితంగా గుర్తించే సమర్ధతను పెంపొందించుకోవాలి. వీటితోపాటు ఇటీవలి కాలంలో భారతదేశంలోప్రాచుర్యంలో ఉన్న మానవాభివృద్ధ్ది, సామాజికాభివృద్ధి భావనలపైన కూడా సమగ్రమైన అవగాహనను కలిగిఉండాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు