సెక్షన్ 142 ప్రతికూల ప్రభావాలు-సానుకూల ఫలితాలు ( పాలిటీ)
భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో గత 30 ఏండ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్‌కు క్షమాభిక్ష ప్రసాదించడంలో ఆలస్యం జరిగింది. ఈ కారణంగా అతనికి సంపూర్ణ న్యాయం అందించాలనే ఉద్దేశంతో.. రాజ్యాంగంలోని అధికరణ 142 ప్రకారం తనకు సంక్రమించిన విశేష అధికారాలను వినియోగించు కున్న సుప్రీంకోర్టు.. పెరారివాలన్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు 142 అధికరణను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది.
అధికరణ 142-సుప్రీంకోర్టు విశేష అధికారాలు చరిత్ర
#డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చైర్మన్‌గా ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగ ముసాయిదాలోని అధికరణ 118లో సుప్రీంకోర్టు విశేష అధికారాలను ప్రస్తావించారు. అయితే దీన్ని అధికరణ 142గా మార్పుచేసి, ఎలాంటి చర్చ లేకుండానే 1949 మే 27న రాజ్యాంగసభ ఆమోదించింది.
అధికరణ 142-వివరణ
# ఏదైనా ఒక అంశం కార్యనిర్వాహక, శాసనవ్యవస్థల జాప్యంవల్ల పెండింగ్‌లో ఉంటే, దానివల్ల ఒక వ్యక్తికి సంపూర్ణ న్యాయం జరుగకపోతే సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు లేదా డిక్రీల ద్వారా అతనికి సంపూర్ణ న్యాయం చేయవచ్చు. అలా జారీచేసిన ఆదేశాలు దేశమంతటా చెల్లుబాటు అవుతాయి.
గమనిక: 1. అధికరణ 142 అనేది సుప్రీంకోర్టుకు న్యాయ క్రియాశీలత అనే విశేష అధికారాలను కల్పిస్తుంది.
2. అధికరణ 142 అనేది అధికరణ 32 (రాజ్యాంగ పరిహారపు హక్కు)కు సప్లిమెంటరీ నిబంధన వంటిది.
3. దీన్ని కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల్లో ఏర్పడిన శూన్యతను భర్తీ చేయడానికి భారత అత్యున్నత న్యాయస్థానం వినియోగిస్తుంది.
అధికరణ 142- పరిధి
#అధికరణ 142 ప్రకారం భారత సర్వోన్నత న్యాయస్థానానికి విస్తృతమైన అధికారులు లభిస్తున్నప్పటికీ, వివిధ సందర్భాల్లో దాని పరిధి గురించి సుప్రీంకోర్టు వివరించింది.
1. ప్రేమ్‌చంద్ గార్గ్ వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్ – ఉత్తరప్రదేశ్ కేసు 1962
సుప్రీంకోర్టు తీర్పు: అధికరణ 142 ప్రకారం ఇచ్చే ఆదేశాలు ప్రాథమిక హక్కులకు లోబడే ఉంటాయి. అప్పటికే ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలకు అనుగుణంగానే అమలు చేస్తారు. అధికరణ 142 ఎట్టి పరిస్థితుల్లోనూ అధికరణ 32ను అధిగమించదు.
2. యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు- 1980
సుప్రీంకోర్టు తీర్పు: సాధారణ చట్టాల్లోని అంశాలు ఒకవేళ రాజ్యాంగ ఉల్లంఘనకు కారణమైతే, అప్పుడు అలాంటి చట్టాలకు అధికరణ 142 లోబడి ఉండదు.
3. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు – 1981
సుప్రీంకోర్టు తీర్పు: అధికరణ 142 కేవలం అనుబంధ స్వభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. కానీ అది అప్పటికే అమలవుతున్న చట్టాన్ని భర్తీ చేయదు. అధికరణ 142 ప్రకారం కొత్త చట్టం ఏర్పాటు సాధ్యం కాదు.
1. ప్రజలకు సంపూర్ణ న్యాయం అందించడంలో, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో అధికరణ 142 ద్వారా సుప్రీంకోర్టు క్రియాశీలంగా వ్యవహరిస్తుంది.
2. కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖలు తమ కార్యకలాపాలు నిర్వహించడంలో విఫలమైనప్పుడు ఉన్నత న్యాయస్థానం ఆ పాత్రను పోషిస్తుంది.
3. రాజ్యాంగ పరిరక్షకునిగా శాసనపరమైన అంతరాలను పూడ్చడంలో సుప్రీంకోర్టుకు అధికారాలను కల్పిస్తుంది.
4. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విధానంలో సమతుల్యతను పాటించడానికి, ఒకదానికి ఒకటి సహకరించుకుంటూ నియంత్రించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
అధికరణ 142 – ప్రతికూల ప్రభావాలు
1. సుప్రీంకోర్టు తన అధికార పరిధులను దాటి ప్రవర్తించవచ్చు. తద్వారా న్యాయ క్రియాశీలత అనేది న్యాయ అతి క్రియాశీలతగా మారే ప్రమాదం ఉంది. దానివల్ల రాజ్యాంగం ప్రకారం కల్పించిన అధికారాల విభజన సూత్రం దెబ్బతింటుంది.
2. మితిమీరిన న్యాయ క్రియాశీలతవల్ల రోజువారీ పరిపాలనా వ్యవహారాలు దెబ్బతింటాయి.
3. న్యాయశాఖ పరిధి దాటి ప్రవర్తించినప్పుడు శాసన, కార్యనిర్వాహక శాఖలు నిష్క్రియాత్మకం అవుతాయి.
4. అధికరణ 142 ప్రకారం సుప్రీకోర్టు ఇచ్చే తీర్పులు ఒక్కోసారి జవాబుదారీతనం లేకుండా ఉంటాయి.
ఉదా: ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించకుండానే ఢిల్లీలోని కొన్ని ప్రదేశాల్లో తిరిగే ఈ-రిక్షాలను నిషేధించమని ఆదేశాలివ్వడం.
అధికరణ 142 – సానుకూల ఫలితాలు
1. యూనియన్ కార్బైడ్ కేసు – 1988
#భోపాల్ గ్యాస్ విపత్తు బాధితులకు తగిన నష్టపరిహారం అందించడం కోసం సముచిత ఆదేశాలను జారీచేయడానికి అధికరణ 142ను సుప్రీంకోర్టు ఆయుధంగా వినియోగించుకుంది.
2. బొగ్గు గనుల కేటాయింపు
#1993 నుంచి అక్రమార్కులకు కేటాయించిన బొగ్గు బ్లాకులను రద్దు చేయడానికి, చట్టవిరుద్ధంగా ఉత్పత్తి చేసిన బొగ్గుపై జరిమానాలు విధించడానికి సుప్రీంకోర్టు 2014లో అధికరణ 142ను వినియోగించింది.
3. హైవేలపై మద్యం అమ్మకాలు నిషేధం
#సుప్రీంకోర్టు 2016లో అధికరణ 142ను ఉపయోగించుకుని హైవేలకు 500 మీటర్ల పరిధిలోపల మద్యం విక్రయించడాన్ని నిషేధిస్తూ తీర్పు చెప్పింది.
4. అధికరణ 142ను వినియోగించుకునే సుప్రీంకోర్టు తాజ్‌మహల్ పరిసరాలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది.
5. జైళ్లలో ఐపీసీ సెక్షన్ 436ఎ ప్రకారం అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నవారి సంక్షేమం కోసం, హక్కుల కోసం ప్రభుత్వాలకు మార్గదర్శకాలను విడుదల చేయడంలో సుప్రీకోర్టు 142 అధికరణనే వినియోగించుకుంది.
క్షమాభిక్ష ప్రసాదించడంలో రాష్ట్రపతి, గవర్నర్‌కు మధ్య తేడాలు
అంశం రాష్ట్రపతి గవర్నర్
అధికరణ 72 161 ఉరిశిక్ష రద్దు అధికారం ఉంది అధికారం లేదు
మార్షల్ కోర్టువిధించిన శిక్షలు – రద్దు చేయగలరు రద్దు చేయలేరు
పార్డన్ (శిక్షలను పూర్తిగా రద్దు చేయడం) – అధికారం ఉంది అధికారం ఉంది
కమ్యుటేషన్ (శిక్ష రకాన్ని మార్చడం) – అధికారం ఉంది అధికారం ఉంది
రెమిషన్ (శిక్ష కాలాన్ని తగ్గించడం) – అధికారం ఉంది అధికారం ఉంది
రెస్పైట్ (ప్రత్యేక కారణంవల్ల శిక్ష నుంచి
ఉపశమనం కలిగించడం) – అధికారం ఉంది అధికారం ఉంది
రిప్రైవ్ (శిక్ష అమలును
తాత్కాలికంగా వాయిదావేయడం) – అధికారం ఉంది అధికారం ఉంది
గమనిక: దేశంలో అత్యధికంగా క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన రాష్ట్రపతి – ప్రతిభాపాటిల్
పీ శ్రీరామ్‌చంద్ర
గ్రూప్స్ మెంటార్
హైదరాబాద్
8008356825
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు