నీళ్లు నిధులు నియామకాలు కమిషన్ల కథా కమామిషు
దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల్లో దేశంలోనే అత్యంత అరుదైనదిగా గుర్తింపు పొందింది. శతాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ.. ఆంధ్ర వలస పాలకుల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత 1956, నవంబర్ 1 నుంచి 2014, జూన్ 1 వరకు అనేక రకాలుగా దోపిడీకి, వివక్షకు, విధ్వంసానికి గురైంది. ఈ విషయాలను అప్పటి ప్రభుత్వాలు నియమించిన కమిటీలు పేర్కొన్నాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, 2, 3 పరీక్షల్లో 1956 నుంచి 2014 వరకు నీళ్లు, నిధులు, నియామకాల్లో రాష్ర్టానికి జరిగిన అన్యాయాలకు సంబంధించి వివిధ కమిటీల నివేదికల గురించి ప్రత్యేకంగా పేర్కొంది. సిలబస్‌లో వాటిని చేర్చడానికి ప్రధాన ఉద్దేశం నేటి తెలంగాణ యువత. రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణకు జరిగిన నష్టాన్ని భర్తీచేసేందుకు, మరింత బాధ్యతాయుతంగా ఆలోచించేందుకు భావి ఉద్యోగులకు ఆయా అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని ఈ అంశాలను సిలబస్‌లో చేర్చారని స్పష్టమవుతున్నది.
ఉమ్మడిలో తెలంగాణ ఆర్థికం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా 41.75 శాతం విస్తీర్ణంతో మొదటి స్థానం, జనాభా పరంగా 40.69 శాతంతో రెండో స్థానంలో ఉంది. అయినా రాజకీయంగా పాలనలో ఉద్యోగాల పరంగా ప్రభుత్వంలో సరైన భాగస్వామ్యం లేకపోవడంతో తెలంగాణ ప్రాంతం వెనకబాటుతనానికి గురైంది. రాష్ట్ర జనాభాకు వచ్చే ఆదాయంలో తెలంగాణ వాటా ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో చివరివరుసలో నిలిచింది.
నీళ్ల దోపిడీ
-భౌగోళికంగా, శీతోష్ణస్థితి పరంగా తెలంగాణ వ్యవసాయానికి అత్యంత అనుకూలమైనది. కృష్ణా, గోదావరితో సహా అనేక నదులు, ఉపనదులు తెలంగాణ మీదుగా ప్రవహిస్తున్నాయి. పశ్చిమకనుమల్లో జన్మించిన నదులు, బంగాళాఖాతంలో కలువడానికి ఇక్కడినుంచే ప్రవహిస్తున్నాయి. అయితే ఈ నదుల్లోని నీటి వినియోగంలో మాత్రం వలస పాలకులు అవలంబించిన స్వార్థపూరిత విధానాల వల్ల పచ్చని తెలంగాణ ఎడారిగా మారింది. వ్యవసాయాన్ని, కుటుంబాలు, గ్రామాలను వదిలి ఇతర రాష్ర్టాలకు, దేశాలకు వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
బచావత్ ట్రిబ్యునల్
– మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య కృష్ణానది నికర జలాల పంపిణీకి సంబంధించి 1969లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులు షంషేర్ బహదూర్, డీఎం బండారి.
-బచావత్ ట్రిబ్యునల్ తన ప్రాథమిక తీర్పును 1973 డిసెంబర్లో, తుది తీర్పును 1976 మే నెలలో ఇచ్చింది.
– బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాలు తెలంగాణ, సీమాంధ్ర మధ్య కూడా నిర్దిష్ట ప్రాతిపదికన కేటాయించాలి. కానీ సీమాంధ్రకు అనుకూలంగా ఏకపక్షంగా జరిగింది.
– కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణ 68.5 శాతం వరకు ఉన్నప్పటికీ, నీటి కేటాయింపులు 34.26 శాతం మాత్రమే. అదే కోస్తాంధ్ర దీనికి విరుద్ధంగా కేవలం 13.11 శాతం పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నప్పటికీ 47.90 శాతం వాటా ఉంది. దీన్నిబట్టి వలస పాలనతో తెలంగాణకు ఎంత నష్టం జరిగిందో తెలుస్తుంది.
2004లో కృష్ణాజలాల కేటాయింపుపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు.
– ఈ ట్రిబ్యునల్ గుర్తించిన నికర జలాలు 2,582 టీఎంసీలు.
– కృష్ణానది జలాల్లోని తెలంగాణ వాటాను ఆంధ్ర పాలకులు ప్రకాశం బ్యారేజ్, నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, రాజోలిబండ డైవర్షన్ స్కీం, పులిచింతల ప్రాజెక్టుల ద్వారా దోచుకొనిపోయారు.
గోదావరి జలాల దోపిడీ
– గోదావరి జలాల పంపిణీకి సంబంధించి 1969లో బచావత్ అధ్యక్షతన డీఎం బండారి, డీఎం సేన్లతో కూడిన ఒక ట్రిబ్యునల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
– ఈ ట్రిబ్యునల్ తన తుది తీర్పును 1980లో వెల్లడించింది.
– ఆంధ్రప్రదేశ్‌కు 1480 టీఎంసీల నికర నదీ జలాలను ట్రిబ్యునల్ కేటాయించింది.
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణ 79 శాతం వాటాను కలిగి ఉండగా, కోస్తాంధ్ర 21 శాతం వాటా మాత్రమే ఉంది. అయితే నదీ జలాల వినియోగంలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా కనబడుతుంది.
కేటాయింపులు ఇలా..
ప్రాజెక్టుపేరు కేటాయింపులు(టీఎంసీల్లో)
ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ 350
గోదావరి లోయ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ 330
నిజాం సాగర్ ప్రాజెక్ట్ 58
దేవనూరు ప్రాజెక్ట్ 38
-ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా 1956లో రాష్ర్టాల పునర్విభజన చట్టంలో ఈ ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేయాలని పార్లమెంట్ ఆదేశించింది. అయితే నేటికి అవి పూర్తికాలేదు.
నిధుల మళ్లింపు
– పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర సాధారణ పరిపాలన, ఉమ్మడి రాష్ట్ర స్థాయి కార్యాలయాల నిర్వహణ కోసం అయ్యే ఖర్చులో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు 2 : 1 నిష్పత్తిలో ఉండాలి. ఈ ఖర్చు పోగా మిగిలిన నిధులను తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి. అయితే వాస్తవంలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది.
కుమార్ లలిత్ కమిటీ-1969
– 1969, జనవరి 19న జరిగిన అఖిలపక్ష ఒప్పందం మేరకు తెలంగాణ మిగులు నిధుల వివరాలు, ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల వివరాలను అధ్యయనం చేయడానికి కుమార్ లలిత్ కమిటీని నాటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి ఏర్పాటు చేశారు.
– ఈ కమిటీ 1969, మార్చిలో తన నివేదికను అందించింది.
– 1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చి 31 వరకు తెలంగాణ మిగులు నిధులకు సంబంధించిన గణాంకాలను ఈ కమిటీ అందించింది.
-ఈ కాలంలో తెలంగాణలో మిగులు నిధులు ఎక్సైజ్డ్యూటీతో కలిపి చూస్తే తెలంగాణ రెవెన్యూ ఖాతాలో రూ. 102 కోట్లు మిగులు ఉన్నాయి. నికర మిగులు రూ .63.62 కోట్లు.
– 1956-68 మధ్య కాలంలో మొత్తం పెట్టుబడి (Investment) రూ. 1464 కోట్లు కాగా, ఇందులో తెలంగాణకు కేవలం రూ. 526 కోట్లను మాత్రమే కేటాయించారు.
జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ- 1969
– కుమార్ లలిత్ కమిటీ నివేదికలో అనేక తప్పిదాలు, పొరపాట్లున్నాయని మిగులు నిధులను గణించడంలో శాస్త్రీయ పద్ధతిని అవలంబించలేదని, విలీనం నాటికే తెలంగాణ వద్ద ఉన్న మిగులు నిధులతో సహా అన్ని రకాల ఖాతాలను (Accounts) లోతుగా పరిశీలిస్తే తెలంగాణ మొత్తం మిగులు నిధులు రూ. 107.13 కోట్ల వరకు ఉంటుందని తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆరోపించింది.
– భారీ నీటిపారుదల, సాధారణ పాలన, గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాలను ప్రాంతాల మధ్య విభజించటానికి కుమార్ లలిత్ కమిటీ జనాభాను ఆధారం చేసుకొని సీమాంధ్ర, తెలంగాణను 2 : 1 నిష్పత్తిలో పరిగణలోకి తీసుకుంది. దీనిప్రకారం సీమాంధ్రకు 67.07 శాతం, తెలంగాణకు 33.3 శాతం కేటాయింపులు జరగాలి. అయితే 1961లో తెలంగాణ జనాభా వాటా 35.3 శాతం. దీనివల్ల గణాంకాల్లో తేడా వస్తున్నది.
– ఈ వివాదాలకు పరిష్కారం చూపే ఉద్దేశంతో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ అష్టసూత్ర పథకంలో భాగంగా వశిష్ట భార్గవ కమిటీని ఏర్పాటు చేసింది.
– ఈ కమిటీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగులు నిధులు, ఇతర ఆర్థిక వనరుల కేటాయింపు, రాబడి, వ్యయాలు, పెట్టుబడులు వంటి అంశాలను నిర్ధారించడానికి పెద్ద మనుషుల ఒప్పందం, అఖిలపక్ష ఒప్పందం, తెలంగాణ ప్రాంతీయ కమిటీ నివేదిక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక గణాంకాలు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన మేధావుల అభిప్రాయాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నది.
– ప్రభుత్వానికి అందించిన 123 పేజీల నివేదికలో ఈ కమిటీ ప్రధానంగా పేర్కొన్న అంశాలు
– 1956-68 మధ్య తెలంగాణ మిగులు నిధులు రూ. 28.34 కోట్లు.
– తెలంగాణ ఖర్చు చేయాల్సిన నిధులను వెచ్చించలేదు.
– దీర్ఘకాలం మిగులు నిధులు వాడనందువల్ల తెలంగాణలో వెనుకబాటుతనం పెరిగిందని అందువల్ల కేంద్ర ప్రభుత్వం 4వ పంచవర్ష ప్రణాళికలో తెలంగాణకు అదనంగా రూ. 45 కోట్లను కేటాయించింది.
– 1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చి 31 వరకు ప్రాంతాల ఆర్థిక వ్యవహారాలు, ఆదాయాలు, వ్యయాల ఆధారంగా వడ్డీలను వసూలు చేయాలని, ఈ వడ్డీలను ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య 2 : 1 నిష్పత్తిలో పంచాలని కమిటీ సూచించింది.
– భార్గవ కమిటీ అధ్యయనంలో ప్రధాన అంశాలు
1. ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉండటం
2. తలసరి ఆదాయం తక్కువగా ఉండటం
3. బడుగు, బలహీన వర్గాల జనాభా ఎక్కువగా ఉండటం
4. పన్ను భారం ఎక్కువగా ఉండటం
– ఈ అంశాల దృష్ట్యా రాష్ట్రం మొత్తం కేటాయింపుల్లో తెలంగాణకు 40 శాతం తగ్గకుండా కేటాయింపులు ఉండాలని కమిటీ సూచించింది.
– కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి జరిగే కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 40 శాతానికి తగ్గకుండా తెలంగాణకు వాటా తప్పనిసరిగా ఉండాలని కమిటీ కోరింది.
– పెద్దమనుషుల ఒప్పందాన్ని యథాతధంగా అమలు చేయాలని భార్గవ కమిటీ నివేదించింది.
610 జీవో ఏం చెబుతుంది?
– 1976 అక్టోబర్ 18 నుంచి 5, 6 జోన్లలో జోనల్, జిల్లా నియమకాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా నియమించిన తెలంగాణేతరులను 1986 మార్చి 31లోపు వెనక్కి పంపాలి. అవసరమైతే వారికోసం ఇతర ప్రాంతాల్లో సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలి.
– అక్రమ నియామకాలు, ప్రమోషన్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత అభ్యర్థులు పెట్టుకున్న అప్పీల్లన్నింటినీ 1986, మార్చి 31 నాటికి పూర్తిగా పరిష్కరించాలి.
– ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకాలు, ప్రమోషన్లు ఇతర ఉల్లంఘనలను రాష్ట్ర సచివాలయ విభాగాలు 1986, జూన్ 30లోపు పునఃపరిశీలించాలి.
-బోగస్ సర్టిఫికెట్ల ద్వారా తెలంగాణలోని ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజీల్లో పేరు నమోదు చేసుకొని అక్రమ మార్గాల ద్వారా ఉద్యోగాలు పొందినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
– రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ఇతర రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో ఉండే ఉద్యోగాల నియామకంలో అన్ని ప్రాంతాలవారికి జనాభా ప్రాతిపదికన సమన్యాయం జరగాలి.
Note: రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగాలు పొందిన స్థానికేతరులను తిరిగి వెనక్కి పంపడానికి ఉద్దేశించిన 1985, డిసెంబర్ 5న జారీ చేసిన జీవో 564ను వెంటనే సమర్థవంతంగా అమలు చేశారు. కానీ 1986 మార్చి 31 నాటికి అమలు పూర్తికావాల్సిన జీవో 610 మాత్రం నేటికీ అమలు కాలేకపోవడాన్ని బట్టి వివక్ష తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
వాంఛూ కమిటీ-1969
– ముల్కీ నిబంధనలను కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో సరైన సూచనలు చేసేందుకుగాను నాటి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ కైలాస్నాథ్ వాంఛూ అధ్యక్షతన నిరెన్డే, ఎంపీ సెతల్వాడ్లతో కూడిన కమిటీని ఏర్పాటుచేసింది.
– 1969, మార్చి 28న ఏర్పాటు చేసిన ఈ కమిటీ తన నివేదికను 1969, సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి అందించింది.
కమిటీ ప్రధాన సూచనలు
– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆ రాష్ర్టానికి చెందినవారికి ప్రాధాన్యమిస్తూ చట్టాన్ని రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది.
– అయితే రాష్ట్రంలోని ఒక ప్రాంతం వారికి ప్రాధాన్యతనిచ్చే విధంగా చట్టాన్ని రూపొందించే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు.
– ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి అవకాశం లేదని, దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణకు కూడా అవకాశం లేదని వాంఛూ కమిటీ తన నివేదికలో పేర్కొన్నది.
ఏకపక్ష నియామకాలు
– తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసే సమయంలో జరిగిన పెద్దమనుషుల ఒప్పందంలో విద్యా, ఉద్యోగవకాశాలకు సంబంధించి అనేక రక్షణలు కల్పించారు. అయితే ఆచరణలో మాత్రం అవి పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయి.
– స్థానిక ఉద్యోగాలు స్థానికులకే అని స్పష్టంగా పేర్కొనే ముల్కీ నిబంధనలకు ఆంధ్ర వలస పాలకులు చరమగీతం పాడి అక్రమ మార్గాల ద్వారా తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొట్టారు. ఫలితంగా తెలంగాణ నిరుద్యోగ యువత అనివార్యంగానే నక్సలైట్లుగా మారి రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– వశిష్ట భార్గవ కమిటీ తన నివేదికలో తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 4500 అని పేర్కొన్నది.
ముల్కీ నిబంధనలు
– హైదరాబాద్ సంస్థానంలో పౌర సేవలు, ఉద్యోగాల ఎంపికకు సంబంధించి నాటి నిజాం 1919లో ముల్కీ నిబంధనలను (ఫర్మానా) రూపొందించారు.
– ముల్క్ అంటే దేశం. మల్కీ అంటే ఆ దేశంలో నివాసమున్న పౌరులు.
– ముల్కీ నిబంధనల ప్రధాన ఉద్దేశం స్థానికులకు స్థానిక ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం రక్షణగా ఉండటం.
ముల్కీ అంటే?
– పుట్టుకతోనే హైదరాబాద్ రాజ్యానికి చెందినవారు
– ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి భార్య (వేరే ప్రాంతమైనప్పటికీ)
– ప్రభుత్వ సర్వీసు 15 ఏండ్లపాటు కలిగి ఉన్న వ్యక్తి సంతానం.
– స్థానికంగా నివాసం ఉంటున్నట్లు హైదరాబాద్ రాజ్యం నుంచి గుర్తింపు పత్రం పొందినవారు.
– ముల్కీగా ఉన్న మహిళ, ముల్కీయేతర వ్యక్తిని వివాహం చేసుకొని హైదరాబాద్ రాజ్యంలోనే నివాసం ఉన్నట్లయితే ఆమెకు ముల్కీ హక్కులు ఉంటాయి.
– ఒకవేళ తండ్రి ముల్కీ అయితే సంతానానికి ముల్కీ వర్తిస్తుంది.
– ముల్కీ నిబంధనల ఉల్లంఘనలతోనే తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్రుల హస్తగతమయ్యాయి.
– ముల్కీ నిబంధనలు ఉల్లంఘనకు గురికావడంవల్ల 1956 నుంచి 1968 వరకు 22 వేల తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్రుల వశమైనట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది.
– 1969 తెలంగాణ ఉద్యమానికి ముల్కీ నిబంధనల ఉల్లంఘనే ప్రధాన కారణం.
– 2009లో కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకోవడం వెనుక ప్రధాన కారణం కూడా ఉద్యోగాలకు సంబంధించిందే.
– ముల్కీ నిబంధనల ఉల్లంఘన రాష్ట్ర ఏర్పాటుకు కారణమైంది.
– 1969 ఉద్యమ తీవ్రతను గమనించి 1969, జనవరి 19న నాటి ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
– ఈ సమావేశం ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందిన స్థానికేతరులను వెంటనే తొలగించాలని ఆంధ్ర ప్రాంతానికి అక్రమంగా తరలించిన నిధులను తిరిగి తెలంగాణకు తేవాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా స్వయంప్రతిపత్తి కలిగిన, ప్రభుత్వ సహాయంతో నడిచే సంస్థలన్నింటిల్లో ముల్కీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని తీర్మానించింది.
– అఖిలపక్షం నిర్ణయాలను అమలుచేయడానికిగాను ప్రభుత్వ ఉత్తర్వు 36 (జీవో 36)ను 1969 జనవరి 21న జారీ చేసింది
– ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యోగులు కోర్టులకు వెళ్లారు.
– సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 16న ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని తీర్పుచెప్పింది. దీనికి వ్యతిరేకంగా 1972లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది
– ఈ ఉద్యమంతో నాటి ముఖ్యమంత్రి పీవీ నర్సింహారావు రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.
-జై ఆంధ్ర ఉద్యమ తీవ్రతను తగ్గించేందుకుగాను 6 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు.
6 సూత్రాల పథకం – పరిణామాలు
1. ముల్కీ నిబంధనలు రద్దయ్యాయి
2. స్థానికత కాలం 15 నుంచి 4 ఏండ్లకు తగ్గింది
3. తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దు
4. జోనల్ వ్యవస్థ
5. రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆదాయ వ్యయాలను చూపే పద్ధతి రద్దు అయ్యింది.
– ఆరు సూత్రాల పథకానికి రాజ్యాంగబద్ధతను కల్పించేందుకుగాను 1975 అక్టోబర్ 8న జీఎస్ఆర్ 524 (ఈ) సంఖ్య గల ఉత్తర్వును జారీ చేశారు. దీనినే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని పిలుస్తారు.
– 32వ రాజ్యాంగ సరవణ ద్వారా 6 సూత్రాల పథకానికి రాజ్యాంగబద్ధత కల్పించారు.
జయభారత్ కమిటీ-1984
– రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణలో స్థానికేతరులు నియమించబడ్డారని టీఎన్జీవోలు అధికారిక సమాచారం. ఆధారాలతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు నివేదించారు.
– దీనిపై సమగ్ర నివేదిక అందించేందుకుగాను 1985లో జయభారత్‌రెడ్డి అధ్యక్షతన ఉమాపతి, కమలనాథన్లతో (అందరూ ఐఏఎస్‌లే) కూడిన ఒక కమిటీని వేసింది.
– ఈ కమిటీ 1985లో 36 పేజీల నివేదికను సమర్పించింది
– 1975, అక్టోబర్ 18 నుంచి 1981, జూన్ 30 వరకు 58,962 మంది స్థానికేతరులు తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొట్టారని ఈ కమిటీ పేర్కొంది.
– జయభారత్‌రెడ్డి కమిటీ సిఫార్సులను పరిశీలించడానికి నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం సుందరేశన్ కమిటీని నియమించింది.
– ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1985 డిసెంబర్ 30న ప్రభుత్వం 610 జీవోను విడుదల చేసింది.
గిర్గ్లానీ కమిటీ
– 610 జీవో అమలుతీరును అధ్యయనం చేయడానికిగాను 2001 జూన్ 25న గిర్గ్లానీ ఏకసభ్య కమిషన్‌ను నియమించారు.
– ఈ కమిటీ తన తుది నివేదికను 2004 సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి అందించింది.
– 6 సూత్రాల పథకం అమలులో జరిగిన అవకతవకలు, ఉల్లంఘనలను గిర్గ్లానీ కమిటీ గుర్తించింది.
కమిటీ గుర్తించిన ప్రధాన అంశాలు
– జోనల్, జిల్లా స్థాయిలో ఉన్న ఓపెన్ కేటగిరీ పోస్టులను నాన్‌లోకల్ కోటాగా వక్రీకరించారు.
– లోకల్ కేటగిరీ పోస్టుల పేస్కేళ్లను పెంచి స్టేట్ క్యాడర్‌గా మార్చారు.
– ముందుగా ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఖాళీలను నింపడానికి బదులు రిజర్వ్ కేటగిరీ ఖాళీలను నింపడంతో స్థానికులకు నష్టం, స్థానికేతరులకు లాభం జరిగింది.
– సెక్రటేరియట్ వంటి రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో ఖాళీల భర్తీ చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన సమన్యాయం జరగలేదు.
-స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థల్లో రాయలసీమలో ప్రొద్దుటూరు పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థలో మాత్రమే 6 సూత్రాల పథకాన్ని అమలుచేసి, తెలంగాణలో మాత్రం దాని ఊసెత్తలేదు.
– స్థానికులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులను ఓపెన్ కేటగిరీగా మార్చి స్థానికేతరులకు అవకాశం కల్పించారు.
– బదిలీలు, డిప్యూటేషన్లు, ఫారెన్ సర్వీసుల రూపంలో తెలంగాణ ప్రాంతంలో స్థానికేతరులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందారు.
-మొత్తంగా చూస్తే తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఏకపక్షంగా ఆంధ్ర వలస పాలకులు తమ ప్రాంతాలకు తరలించుకొని వెళ్లారని వారు అధికారంలో ఉండగా వేసిన వివిధ కమిటీలు నివేదించడాన్ని బట్టి చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎంత తల్లడిల్లిందో అర్థమవుతున్నది.
మాదిరి ప్రశ్నలు
1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భౌగోళికంగా అతిపెద్ద ప్రాంతం ?
a. కోస్తాంధ్ర b. ఉత్తరాంధ్ర
c. రాయలసీమ d. తెలంగాణ
2. తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ?
a. నీళ్ల దోపిడి b. నిధుల మళ్లింపు
c. అక్రమ నియామకాలు d. పైవన్నీ
3. బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
a. 1959 b. 1969
c. 1979 d. 1981
4. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావడానికి ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ తప్పనిసరిగా పూర్తికావాలని పేర్కొన్న కమిషన్?
a. ఫజల్ అలీ కమిషన్ b. సర్కారియా కమిషన్ c. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1956
d. ఆంధ్రప్రదేశ్ చట్టం-1956
5. కర్నూలు భూస్వాములు ఏ జలాశయం నీటిని బాంబులతో పేల్చి అక్రమంగా దోచుకెళ్లారు?
a. పులిచింతల b. రాజోలిబండ
c. జూరాల d. శ్రీశైలం
6. గోదావరి నది పరివాహక ప్రాంతంలో తెలంగాణ భూ భాగం ఎంత శాతం?
a. 33% b. 60% c. 70% d. 79%
7. తెలంగాణ నిధులను ఆంధ్రా ప్రాంతానికి ఖర్చుచేసిన అంశంలో అధ్యయనం చేయడానికి వేసిన కమిటీ ?
a. కుమార్ లలిత్ కమిటీ b. భార్గవ కమిటీ c. వాంఛూ కమిటీ d. పైవన్నీ
జవాబులు: 1-డి, 2-డి, 3-బి, 4-సి, 5-బి, 6-డి, 7-డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు