Indian Polity | సమర్థులతో కమిటీలు.. పరిపాలనలో పర్యవేక్షణ

- శాసనాలు రూపొందించటం, విత్త పాలన, పరిపాలనను పర్యవేక్షించడం పార్లమెంటరీ వ్యవస్థలో ముఖ్య విధి. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యయ పరిణామం, నానాటికీ సాంకేతికమవుతున్న పాలనా ప్రక్రియ మొదలైన అంశాలన్నీ పార్లమెంటుకున్న విలువైన కాలంపై ఒత్తిడి తెస్తున్నాయి. అందువల్ల పార్లమెంటు తరఫున నిపుణులైన, సమర్థులైన కొంతమంది సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పరిపాలనపై నిరంతర నియంత్రణ కొనసాగించడం జరుగుతుంది. ప్రభుత్వ పాలనపై, ప్రభుత్వ విత్త నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించడానికి ఈ కమిటీలు ఉపయోగపడుతాయి.
- భారత రాజ్యాంగంలో పార్లమెంటు కమిటీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను ఏర్పరచలేదు. కానీ ప్రకరణ 88, 105లో వీటి పరోక్ష ప్రస్తావన ఉంది.
- స్వాధికారాల గురించి ప్రస్తావించిన ఈ ప్రకరణలో, స్వాధికారాలు పార్లమెంటు కమిటీలకు కూడా వర్తిస్తాయని పేర్కొనడం జరిగింది.
లక్షణాలు – నిర్మాణం - ఈ కమిటీలు సభ ద్వారా ఎన్నుకోబడతాయి లేదా సభాధ్యక్షులతో ఎంపిక చేయబడతాయి.
- ప్రతి కమిటీ ఒక చైర్మన్ అధ్యక్షతన పని చేస్తుంది.
- కమిటీ తన నివేదికను స్పీకర్‌కు లేదా చైర్మన్‌కు సమర్పిస్తుంది.
- ప్రతి కమిటీ లోక్‌సభ/రాజ్యసభలతో సమకూర్చిన కార్యాలయాన్ని వినియోగించుకుంటుంది.
- పార్లమెంటరీ కమిటీ సభ్యత్వం ఆయా పార్టీల సంఖ్యా బలానికి అనుగుణంగా నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతిలో ఉంటుంది.
- పార్లమెంటు కమిటీల్లోని సభ్యులను ఆయా సభల్లో ఒక తీర్మానం ద్వారా ఎన్నుకోవడంగాని లేదా సభాధ్యక్షులచేత నియమించబడటం గాని జరుగుతుంది.
- ఆర్థిక కమిటీలోని సభ్యులందరూ నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతిలో ఎన్నికవుతారు.
- ఈ కమిటీల చైర్మన్‌ను సంబంధిత సభాధ్యక్షుడు నియమిస్తారు. ఒకవేళ సభాధ్యక్షుడు కమిటీలో సభ్యుడైతే అతడే ఆ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తాడు.
- కమిటీలోని మొత్తం సభ్యుల్లో 1/3 వంతును కోరంగా పరిగణిస్తారు.
- తమకు సహాయపడటానికి కొన్ని ఉపకమిటీలను కూడా పార్లమెంటరీ కమిటీలు నియమించుకోవచ్చు.
పార్లమెంటరీ కమిటీలు-రకాలు
భారతదేశంలో రెండు రకాల కమిటీలున్నాయి.
1. స్థాయీ కమిటీలు (Standing Committee)
2. తాత్కాలిక కమిటీలు (Adhoc Committee)
స్థాయీ కమిటీలు - ప్రతి సంవత్సరం లేదా సమయానుకూలంగా ఆయా సభల ద్వారా ఎన్నుకోబడతాయి. ఇవి నిరంతరం పని చేస్తుంటాయి. సభ్యులు మాత్రం మారుతుంటారు. వీటిలో లోక్‌సభ, రాజ్యసభల నిష్పత్తి 2:1 లో ఉంటుంది.
తాత్కాలిక కమిటీలు - అవసరాన్ని బట్టి ఆయా సమయాల్లో ఏర్పడతాయి. వీటిని సభాధ్యక్షులు సభల తీర్మానం ద్వారా ఏర్పాటు చేస్తారు. ఇవి తమ నివేదికను సమర్పించగానే రద్దవుతాయి.
స్థాయీ కమిటీలు రెండు రకాలు
ఎ. సాధారణ కమిటీలు (Ordinary Committes)
బి. ఆర్థిక కమిటీలు (Financial Committees) - ఆర్థికేతర విషయాలను పరిశీలించే కమిటీలను సాధారణ కమిటీలంటారు. ఆర్థిక విషయాలను మాత్రమే పరిశీలించే కమిటీలను ఆర్థిక కమిటీలు అంటారు.
స్థాయీ కమిటీలను విధుల పరంగా కింది విధంగా వర్గీకరించవచ్చు. - విచారణ కమిటీలు- విజ్ఞాపన కమిటీ, స్వాధికారాల కమిటీ, ఎథిక్స్ కమిటీ.
- నియంత్రణ, పర్యవేక్షణ కమిటీలు- ప్రభుత్వ వాగ్దానాలపై కమిటీ, దత్త శాసనాలపై కమిటీ, షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల సంక్షేమ కమిటీ, మహిళా సాధికారిక కమిటీ, లాభదాయక పదవులపై కమిటీ.
- రోజువారీ కార్యక్రమాలు, సభా వ్యవహారాల కమిటీలు- రూల్స్ కమిటీ, సభ్యుల గైర్హాజరు కమిటీ, ప్రైవేట్ మెంబర్స్ బిల్లుపై కమిటీ, సభా వ్యవహార సలహా కమిటీ.
- హౌస్ కీపింగ్ కమిటీలు లేదా సేవా కమిటీలు- జనరల్ పర్పస్ కమిటీ, హౌస్ కమిటీ, లైబ్రరీ కమిటీ, సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల కమిటీ.
ఆర్థిక కమిటీలు
ప్రభుత్వ ఖాతాల కమిటీ - ఇది పార్లమెంటరీ కమిటీల్లో అతి ప్రాచీనమైన కమిటీ. ఈ కమిటీని 1921లో ఏర్పాటు చేశారు. ఇది పార్లమెంటరీ సంయుక్త కమిటీ. ఇందులో మొత్తం 22 మంది సభ్యులుంటారు. 15 మంది లోక్‌సభ నుంచి, ఏడుగురు రాజ్యసభ నుంచి ఆయా సభల సభ్యుల ద్వారా నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతిలో ఒక సంవత్సర కాలానికి ఎన్నికవుతారు.
- సాధారణంగా రెండు సంవత్సరాల వరకు కొనసాగుతారు. మంత్రులు ఈ కమిటీల్లో ఉండటానికి అర్హులు కాదు. ఈ కమిటీ చైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్ నియమిస్తారు.
- అయితే 1967లో ప్రారంభమైన ఒక సంప్రదాయం ప్రకారం లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక సభ్యుడిని చైర్మన్‌గా నియమిస్తున్నారు.
ప్రభుత్వ ఖాతాల కమిటీ-విధులు
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను ఆధారంగా చేసుకొని కింది అంశాలను పరిశీలిస్తుంది. - ఖాతాల్లో చూపిన వ్యయం, చట్టబద్ధంగా ఉద్దేశించబడిన అంశాల కోసం ఖర్చు పెట్టారా లేదా అని పరిశీలించడం.
- పార్లమెంటు ఆమోదించిన ఉపకల్పన బిల్లును అనుసరించి ప్రభుత్వ వ్యయం ఉన్నదో లేదో పరిశీలించడం.
- పునర్ వ్యయం నిబంధనల మేరకు అర్హత కలిగిన అధికారుల ఆజ్ఞానుసారంగా జరిగిందో లేదో పరిశీలించడం.
- ప్రభుత్వ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికలను పరిశీలించడం.
- ఈ కమిటీకి సాంకేతిక, ఇతరత్రా సలహాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అందిస్తారు. అందుకే ఇతన్ని ఈ కమిటీకి స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా పరిగణిస్తారు.
అంచనాల కమిటీ (Estimates Committee)
అంచనాల కమిటీని 1950లో ఆనాటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్ సిఫారసు మేరకు పార్లమెంటు ఏర్పాటు చేసింది. ఇందులో 30 మంది సభ్యులుంటారు. సభ్యులందరూ ఒక సంవత్సర కాలానికి లోక్‌సభ నుంచి మాత్రమే ఎన్నికవుతారు. - మంత్రులు ఇందులో సభ్యులుగా ఉండరాదు. ఈ కమిటీ చైర్మన్‌ను స్పీకర్ నియమిస్తారు.
- సంప్రదాయంగా మూడు సంవత్సరాలు కొనసాగుతారు. అనగా 1/3వ వంతు మంది పదవీ విరమణ చేస్తారు.
విధులు - ప్రభుత్వ అంచనాలను దృష్టిలో పెట్టుకుని పొదుపును పాటించడం, వ్యవస్థలను అభివృద్ధిపరచడం, పాలనా రంగంలో సంస్కరణలను సూచించడం.
- పొదుపును పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం.
- ఆయా అంచనాల కింద కేటాయించిన నిధులు, దాని పరిధిలో ఉందో లేదో పరిశీలించడం.
- అంచనాలు ఏ రూపంలో పార్లమెంటుకు సమర్పించాలో సూచించడం.
- అంచనాల సంఘం తన నివేదికను లోక్‌సభకు సమర్పిస్తుంది. ప్రస్తుత చైర్మన్ ఎం.ఎన్.జోషి
గమనిక: ప్రభుత్వ ఖాతాల కమిటీని అంచనాల కమిటీని ‘కవలల కమిటీ’ అంటారు. కారణం ఈ రెండు కమిటీల విధుల్లో తేడా ఉండకపోవడమే. - అలాగే దీన్ని ‘నిరంతర పొదుపు కమిటీ’ అని కూడా అంటారు.
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (Committee on Public Undertakings)
- ఈ కమిటీ 1964లో కృష్ణ మీనన్ కమిటీ సలహా మేరకు ఏర్పాటు చేశారు. మొదట్లో 1974 వరకు ఇందులో 15 మంది సభ్యులు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం 22 మంది సభ్యులున్నారు. ఇందులో 15 మంది లోక్‌సభ నుంచి, ఏడుగురు రాజ్యసభ నుంచి నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతిలో ఎన్నికవుతారు. కమిటీ చైర్మన్‌ను స్పీకర్ నియమిస్తారు. మంత్రులు సభ్యులుగా ఉండొద్దు.
విధులు - ప్రభుత్వరంగ సంస్థల నివేదికలను, ఖాతాలను పరిశీలించుట
- ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను పరిశీలించుట
- ప్రభుత్వరంగ సంస్థలు తమ కార్యకలాపాలను వ్యాపార సరళిని సమర్థంగా నిర్వహిస్తున్నాయో లేదో పరిశీలించుట, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఇతర విధులను నిర్ణయించుట.
సాధారణ కమిటీలు
సభా వ్యవహారాల సలహా కమిటీ - ఉభయ సభలకు వేర్వేరుగా ఈ కమిటీలుంటాయి.
- లోక్‌సభలో ఈ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు.
- రాజ్యసభలో ఈ కమిటీలో 11 మంది సభ్యులు ఉంటారు.
- నిర్ణీత కాలపరిమితి ఉండదు.
- వీరిని ఆయా సభాధ్యక్షులు నియమిస్తారు.
- ఈ కమిటీలకు ఆయా సభాధ్యక్షులే హోదారీత్యా చైర్మన్‌గా ఉంటారు.
- శాసన సంబంధమైన సభా కార్యకలాపాలకు ఎంత సమయాన్ని వినియోగించాలో ఈ కమిటీ నిర్ణయిస్తుంది.
విజ్ఞాపన కమిటీ - లోక్‌సభలో 15 మంది, రాజ్యసభలో 10 మంది సభ్యులుంటారు.
- ఈ కమిటీ చైర్మన్లను ఆయా సభా కమిటీ అధ్యక్షులే నియమిస్తారు.
- నిర్ణీత కాలపరిమితి ఉండదు.
- ఉభయ సభలకు, పౌరులు సమర్పించిన విజ్ఞాపనలు పరిశీలించి వాటిని ఏ విధంగా పరిష్కరించాలో సూచన చేస్తుంది. ఈ కమిటీని ‘అంబుడ్స్‌మన్’ లేదా ‘నిఘా కమిటీ’ అంటారు.
సభా హక్కుల కమిటీ - లోక్‌సభలో 15 మంది, రాజ్యసభలో 10 మంది సభ్యులుంటారు.
- ఉభయసభలకు వేర్వేరుగా కమిటీలుంటాయి. సభ్యులను సభాధ్యక్షులు నియమిస్తారు. ఈ కమిటీ అర్ధ న్యాయ సంబంధమైన విధులను నిర్వహిస్తుంది.
- నిర్ణీత కాలపరిమితి ఉండదు.
- విస్తృత అధికారాలను కలిగి ఉంటుంది.
- పార్లమెంటు సభ్యుల హక్కులను హోదాలను పరిరక్షిస్తుంది.
ప్రభుత్వ హామీల కమిటీ - ఉభయ సభలకు విడివిడిగా ప్రభుత్వ హామీల కమిటీ ఏర్పాటు జరుగుతుంది. లోక్‌సభలో 15 మంది, రాజ్యసభలో 10 మంది సభ్యులుంటారు.
- ఒక సంవత్సర కాలపరిమితి ఉంటుంది.
- ప్రశ్నోత్తరాల సమయంలో బిల్లుల మీద, తీర్మానాల మీద, చర్చలు జరిగేటప్పుడు మంత్రులు అనేక రకాలైన హామీలు
ఇస్తుంటారు. - ఈ హామీల అమలు, మొదలగు విషయాలను పరిశీలిస్తుంది.
దత్తశాసనాల కమిటీ (నియోజిత శాసనాల కమిటీ) - ఈ కమిటీ కూడా ఉభయ సభలకు వేర్వేరుగా ఉంటుంది. ప్రతి సభలోను వీరిని ఆయా సభాధ్యక్షులు నియమిస్తారు.
- 15 మంది సభ్యులుంటారు, మంత్రులు ఇందులో సభ్యులుగా ఉండొద్దు.
- ఒక సంవత్సర కాలపరిమితి ఉంటుంది.
- పార్లమెంటు కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేసిన శాసనపరమైన అంశాలను, వాటి నిర్మాణంలో ఉన్న చట్టబద్ధతను పరిశీలించడం, లోగడ రూపొందించిన చట్టాల సవరణకు సంబంధించిన ఉత్తర్వులను సభకు సమర్పించేందుకు తగిన అవకాశాలు ఉండేటట్లు చూడటం ఈ కమిటీ ముఖ్య విధులు.
- ఈ కమిటీని జి.వి.మౌలాంకర్ ‘పార్లమెంటు విధుల రక్షణకర్త’గా పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ సంఘం - ఇది ఉభయ సభలతో కూడుకున్న సంయుక్త కమిటీ. ఇందులో మొత్తం 30 మంది సభ్యులుంటారు. వీరిలో 20 మంది లోక్‌సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తారు.
- ఒక సంవత్సర కాలపరిమితి ఉంటుంది.
- సభ్యులను ఆయా సభలు ఎన్నుకుంటాయి. రాజ్యాంగపరంగా చట్టపరంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలకు కల్పించిన రక్షణలను, సౌకర్యాలను ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు తెన్నులను పరిశీలిస్తుంది.
ప్రైవేటు మెంబరు బిల్లుల కమిటీ - ఇది లోక్‌సభకే ఉద్దేశించిన ప్రత్యేక కమిటీ. ఒక సంవత్సర కాలపరిమితి ఉంటుంది. రాజ్యసభలో ఈ కమిటీ ఉండదు.
- డిప్యూటీ స్పీకర్‌తో కలుపుకొని 15 మంది సభ్యులుంటారు.
- డిప్యూటీ స్పీకర్ ఈ కమిటీకి చైర్మన్‌గా ఉంటారు.
- ప్రైవేటు మెంబర్ల బిల్లులను పరిశీలించి సూచనలిస్తుంది.
రూల్స్ కమిటీ - లోక్‌సభకు, రాజ్యసభకు వేర్వేరు కమిటీలుంటాయి. లోక్‌సభలో 15 మంది సభ్యులు, రాజ్యసభలో 16 మంది సభ్యులుంటారు.
- కాలపరిమితి ఉండదు. ఆయా సభాధ్యక్షులే ఈ కమిటీలకు హోదారీత్యా చైర్మన్లుగా ఉంటారు.
- ఈ కమిటీ సభా కార్యక్రమాలకు సంబంధించిన నియమ నిబంధనలపై తగిన సవరణలను సూచిస్తుంది.
జనరల్ పర్పస్ కమిటీ - ఉభయ సభలకు విడివిడిగా ఈ కమిటీలుంటాయి. స్పీకర్ లేదా చైర్మన్లు వీటికి అధ్యక్షత వహిస్తారు. కాలపరిమితి ఉండదు.
- ఇందులో ఇతర సభ్యులతో పాటు డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్లు, స్థాయీ సంఘాల చైర్మన్లు సభ్యులుగా ఉంటారు.
- ఆయా పార్లమెంటు కమిటీల పరిధిలోకి రాని విషయాలను, అవసరాన్ని బట్టి ఈ కమిటీకి నివేదిస్తారు.
లైబ్రరీ కమిటీ - ఇది సంయుక్త కమిటీ. తొమ్మిది మంది సభ్యులుంటారు. లోక్‌సభ నుంచి ఆరుగురు, రాజ్యసభ నుంచి ముగ్గురు సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తారు.
- ఈ కమిటీ పార్లమెంటు లైబ్రరీ, అందులోని వసతులు, సేవలకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తుంది.
- ఒక సంవత్సర కాలపరిమితి ఉంటుంది.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
Previous article
SEBI Recruitment 2023 | సెబీలో ఆఫీసర్ గ్రేడ్-ఏ ఉద్యోగాలు
Next article
Geography | పాంథాల్సా నుంచి పంచ మహా సముద్రాల వరకు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు