Indian Polity | పారదర్శక విధానాలు.. ప్రజానుకూల నిర్ణయాలు
శాసనసభ నిర్మాణం
- ప్రాచీన ప్రాథమిక రాజ్యాల్లో శాసనాలను తయారు చేయడానికి శాసనసభలు లేవు. చారిత్రక పరిణామ క్రమంలో రాచరిక వ్యవస్థలు బలహీన పడి చట్టాలను రూపొందించే పద్ధతి బలపడింది. ఫలితంగా సమాలోచనలు, చర్చల్లో వివిధ వర్గాలు పాల్గొన డానికి, వారి అభిప్రాయాలను క్రోడీకరించి నిర్ణయీకరణ ప్రక్రియలో పాల్గొనడానికి శాసనసభలను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది.
- ఆధునిక రాజ్యాలు ఎలాంటి రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ శాసనసభ తప్పనిసరిగా ఉంటుంది. ఇది ప్రభుత్వాంగాల్లోకెల్లా ముఖ్యమైంది.
- జర్మనీ దేశానికి చెందిన ‘ట్యూటన్’ అనే జానపద తెగ మొదటిసారిగా శాసన నిర్మాణ శాఖను ఏర్పాటు చేసిందని ప్రొఫెసర్ గార్నర్ అనే రాజనీతివేత్త పేర్కొన్నాడు.
- మొదటిసారిగా బ్రిటన్‌లో కులీన కుటుంబాలకు (నోబుళ్లు , క్లర్జీలు, బరో) చెందిన కామన్స్ ప్రతినిధులతో వైట్ సెగ్మెంట్ ఏర్పడింది. బరో ప్రతినిధులతో పార్లమెంట్ మొదటి సమావేశాన్ని క్రీ.శ.1265వ సంవత్సరంలో సైమన్ డి మాంట్‌ఫోర్డ్ ఏర్పాటు చేశారు. క్రీ.శ. 1295లో 1వ ఎడ్వర్డ్ ఒక మోడల్ పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా ఏర్పడిన పార్లమెంటు మేధావుల సలహా సంఘంగా, ఆర్థిక విషయాల్లో చక్రవర్తికి సలహానిచ్చే సంఘంగా పనిచేసింది. క్రమంగా ఇది గ్రేట్ నేషనల్ కౌన్సిల్‌గా ఏర్పడింది. 1వ ఎడ్వర్డ్ ఈ కౌన్సిల్లో రెండు సభలను ఏర్పాటు చేశాడు. ఈ రెండు సభలే ప్రభువుల సభగా, కౌన్సిల్ సభగా ఏర్పడ్డాయి. ఈ రెండు సభలు బ్రిటన్‌లో జరిగిన పరిణామాల వల్ల శాసన నిర్మాణ శాఖగా రూపొందాయి. తర్వాత కాలంలో చాలా దేశాలు బ్రిటన్ను ఆదర్శంగా తీసుకొని పార్లమెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే పార్లమెంటరీ పద్ధతికి బ్రిటన్ మాతృక వంటిది.
శాసనసభ నిర్మాణం -రకాలు - శాసనసభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని ఎన్నుకుంటారు. ఈ విధంగా ప్రజల ద్వారా ఎన్నికైన శాసనసభ తిరిగి ప్రజలకే బాధ్యత వహిస్తుంది. అయితే ప్రభుత్వాంగాల్లో అతి ముఖ్యమైన అంగంగా పరిగణించే శాసనసభల నిర్మాణం అన్ని దేశాల్లోనూ ఒకే రకంగా లేదు. శాసన నిర్మాణ శాఖలో ఒకే శాసనసభ ఉంటే దాన్ని ఏక శాసనసభ అని, రెండు శాసనసభలుంటే దాన్ని ద్వి శాసనసభ అని అంటారు.
ఏక శాసనసభ విధానం
- ఏక శాసనసభ విధానంలో కేవలం ఒకే సభ లేదా దిగువ సభ మాత్రమే ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో సార్వభౌమాధికారం అంతిమంగా ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి వారి అభీష్టాన్ని వ్యక్తపరచడానికి ఒకసభ మాత్రమే సరిపోతుందని ఏక శాసనసభా విధానాన్ని సమర్థించేవారి అభిప్రాయం.
- అమెరికాదేశ రాజకీయ నాయకుడు బెంజిమన్ ఫ్రాంక్లిన్ కూడా ఏక శాసనసభా విధానాన్ని సమర్థించాడు.
- ఇంగ్లండ్‌కు చెందిన జెరెమీ బెంథామ్ కూడా ఏకసభా విధానాన్ని సమర్థిస్తూ శాసన నిర్మాణ శాఖలో ఎగువసభ వ్యర్థమైంది నిరూపయోగమైందని వ్యాఖ్యానించాడు.
- భారతదేశంలో రాజ్యసభ లోక్‌సభ రూపొందించే శాసనాల రూపకల్పనలో కాలయాపన చేయడానికి మాత్రమే తోడ్పడుతుంది – రాజీవ్ రంజన్‌రాయ్
- డా. బీఆర్ అంబేద్కర్ ప్రకారం రాజ్యసభ అంతగా ప్రాముఖ్యం లేని సభ.
- ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలతోపాటు భారతదేశంలోని కొన్ని రాష్ర్టాలు ఏకశాసనసభ విధానాన్ని అమలు
పరుస్తున్నాయి.
ఏక శాసన సభ విధానం- ప్రయోజనాలు
- శాసనసభ నిర్మాణాన్ని సులభంగా ఏర్పాటు చేయవచ్చు
- ద్విసభా విధానంతో పోల్చితే ఏకసభా విధానంలో శాసనసభా నిర్మాణాన్ని సులభంగా ఏర్పాటు చేయవచ్చు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే దిగువ సభకు కావలసిన సభ్యులను ప్రజలు ఎన్నుకోవడంతో శాసనసభ నిర్మాణం పూర్తవుతుంది. శాసనసభా కార్యకలాపాలు శీఘ్రంగా జరుగుతాయి. చర్యలు సకాలంలో తీసుకోవడానికి వీలవుతుంది.
చట్ట నిర్మాణంలో కాలయాపనకు అవకాశం ఉండదు
ఒకే శాసనసభ ఉండటం వల్ల ఆ సభ ఆమోదించిన బిల్లును నేరుగా రాష్ట్రపతి ఆమోదించడంతో చట్టంగా రూపొందుతుంది. దీనివల్ల చట్ట నిర్మాణానికి కాలయాపన ఉండదు.
ఉదా: మనదేశ పార్లమెంట్లో సాధారణంగా ఒక బిల్లు ఒక సభలో ఆమోదం పొందిన తర్వాత రెండో సభలో కూడా అదే ప్రక్రియ ద్వారా ఆమోదం పొందాలి. ఒక్కోసారి బిల్లును ఆమోదించకుండా 6 నెలల వరకు బిల్లుకు ఆమోదం తెలపకుండా తమదగ్గరే ఉంచుకొని కాలయాపన చేసే అవకాశం ఉంటుంది.
సభా కార్యక్రమాలు పునరావృతం కావడానికి అవకాశం లేదు - ద్వి శాసనసభా విధానంలో ఒక సభ ఆమోదించిన ఒక బిల్లును రెండోసభ మరొకసారి శాసన ప్రక్రియను కొనసాగించి అట్టి బిల్లులో ఏవైనా తప్పులుంటే సవరిస్తుంది అనడం అంత సహేతుకమైనది కాదు. ఎందుకంటే ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే అనేక దశలను అధిగమించవలసి రావటం వల్ల దిగువసభ తొందరపాటుతో చట్టాలను ఆమోదిస్తుందని పేర్కొనడం సరైంది.
రాజ్య లక్షణాలను ప్రతిష్టంభన లేకుండా సమర్థవంతంగా సాధించగలుగుతుంది. - ద్వి శాసనసభా విధానంలో ఒక సభ ఆమోదించినదానికి రెండోసభలో ఏ దశలోనైనా ప్రతిష్టంభన ఏర్పడే అవకాశముంది. ఏకసభా విధానంలో శాసన నిర్మాణంలో జరిగే ప్రతిష్టంభనకు అవకాశాలు తక్కువ, ఎందుకంటే దిగువసభ ఒకే లక్ష్యంతో తన విధులను సాధించడానికి ప్రయత్నిస్తుంది.
అభ్యుదయ శాసన నిర్మాణానికి అవకాశాలు ఎక్కువ - ద్వి శాసనసభా విధానంలో ఎగువసభ కులీన వర్గాలవారికి, సంప్రదాయవాదులకి, ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులకు ప్రాతినిధ్యం కల్పించడం వల్ల సహజంగానే వారు అభ్యుదయకరమైన శాసన నిర్మాణానికి అడ్డుకట్టలు వేసే అవకాశం ఉంది.
ఉదా: వరకట్న నిషేధ చట్టానికి సంబంధించి బిల్లును రాజ్యసభ ఆమోదించలేదు. - అదే ఏకసభా విధానంలో అయితే దిగువసభకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. కాబట్టి సాధారణంగా ప్రజలు ఆమోదించే శాసనాలను లేదా ప్రజలకు ఉపయోగపడే విధంగా రూపొందిస్తారు. లేకపోతే వారి భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది.
- కార్యనిర్వాహక నియంతృత్వాన్ని అరికడుతుంది
- శాసన నిర్వాహక నియంతృత్వాన్ని అరికడుతుంది
- శాసన నిర్మాణ శాఖలో రెండు సభల కంటే ఒకే సభ ఉంటే అది సమర్థవంతంగా పనిచేయడంతోపాటు కార్యనిర్వాహకశాఖ నియంతృత్వన్ని అరికట్టగలుగుతుంది. ఎందుకంటే రెండు సభలుంటే సార్వభౌమాధికారం రెండు సభల మధ్య విభజితమవుతుందని, దాని వల్ల ఏ ఒక్క సభా సమర్థంగా పనిచేయలేదని కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తల అభిప్రాయం.
- రాజనీతి శాస్త్రవేత్త డా.విల్లోభి అభిప్రాయం ప్రకారం ఏకసభా విధానం సరళమైంది మాత్రమే కాక పౌరుల ప్రత్యక్ష ఎన్నిక ద్వారా అధికారికంగా తమకు ప్రాతినిధ్యం కల్పించుకుంటారు.
- అదే విధంగా రాజనీతి శాస్త్రవేత్త అయిన హెచ్.జె.లాస్కీ అభిప్రాయంలో ఏకసభా విధానంలో ఉన్న శాసనసభ ఆధునిక రాజ్యాల అవసరాలను తీర్చడానికి అనువుగా ఉంటుంది.
ఏక శాసన సభ లోపాలు
- శాసనసభా వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి 19వ శతాబ్దపు మొదటి దశాబ్దం వరకు ప్రాధాన్యత వహించిన ఏక శాసనసభా విధానం కొన్ని దేశాలకే పరిమితమైంది. ఏకశాసనసభ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న కొన్ని దేశాలు తిరిగి కొంతకాలం తర్వాత ద్వి శాసనసభా వ్యవస్థను చేపట్టడంతో ఏక శాసనసభా వ్యవస్థలో ఏవో కొన్ని లోపాలున్నాయని తెలుస్తుంది.
తొందరపాటు నిర్ణయాలను తీసుకునే అవకాశముంది - ఈ అవకాశం దిగువసభకు మాత్రమే ఉంది. ఈ సభ సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నిక కావడం, మళ్లీవారు ఎన్నిక కావడానికి ప్రజలకిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి సాధ్యాసాధ్యాలను ఆలోచించుకోకుండా, వాటి వల్ల వచ్చే పరిణామాలను ఊహించకుండా ముందుచూపు లేకుండా తొందపాటుతో నిర్ణయాలను తీసుకొని శాసనాలను రూపొందించే అవకాశం ఉంది. కొన్ని తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలను తిరిగి పునర్ విమర్శ చేసే అవకాశం ఉండకపోవడంతో ఈ నిర్ణయాల అమలు వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. శాసనసభ నియంతృత్వంగా వ్యవహరించే అవకాశం ఉంది
- ఏక శాసనసభా విధానంలో ఎన్నికైన సభ్యులు తమకు అనుకూలమైన శాసనాలను రూపొందించడానికి ప్రయత్నించవచ్చు. ఇలా చేసిన చట్టాలను విమర్శించి అడ్డుకట్టవేసే ఎగువసభ లేకపోవడంతో దిగువసభ నియంతృత్వంగా వ్యవహరించే అవకాశముంది. ఉదా: ప్రత్యేకించి ఏదైనా ఒక రాజకీయ పార్టీకే మెజారిటీ స్థానాలు లభ్యమైనపుడు ఈ విధంగా వ్యవహరించడానికి ఆస్కారముంది.
బాధ్యతా రహితంగా వ్యవహరించవచ్చు - ఏక శాసనసభా విధానంలో సభ్యులు సాధారణంగా యువకులై ఉండటంతో వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేక బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ప్రభుత్వ పటిష్టతకు భంగం కలిగించే అవకాశముంది. ఈ లోపాల కారణంగానే ప్రపంచంలో అనేక దేశాలు ద్విసభా విధానాన్ని పాటిస్తున్నాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 9(బి) ఏ విషయాన్ని విశదీకరిస్తుంది? 1) పంచాయతీరాజ్ సంస్థలు
2) పట్టణ పాలక సంఘాలు
3) సహకార సంఘాలు, సంస్థలు
4) కేంద్రపాలిత ప్రాంతాల పాలన
2. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఫ్రెంచి రాజ్యాంగం నుంచి కింది ఏ అంశాన్ని గ్రహించలేదు?
1) సమానత్వం 2) సౌభ్రాతృత్వం
3) సాంఘిక 4) గణతంత్రం
3. భారత రాజ్యాంగంలో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వాటిని ఎక్కడ పొందుపరిచారు?
ఎ) సమానత్వపు హక్కులో
2) స్వాతంత్య్రపు హక్కులో
3) పీడనాన్ని నిరోధించే హక్కులో
4) విద్య, సాంస్కృతిక విషయసూచిక హక్కులో
4. 17వ లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళా సభ్యుల సంఖ్య?
1) 78 2) 88
3) 98 4) 68
5. భారతదేశంలో మొదటిసారిగా కేంద్రస్థాయిలో ద్విసభా పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1892 కౌన్సిల్ చట్టం
2) 1909 కౌన్సిల్ చట్టం
3) 1919 భారత ప్రభుత్వ చట్టం
4) 1935 భారత ప్రభుత్వ చట్టం
6. భారత పార్లమెంటు రాజ్యసభ సభ్యుడి అర్హతలకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి?
1) భారత పౌరుడై ఉండాలి
2) ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారో ఆ రాష్ట్ర ఓటరుగా గుర్తింపు ఉండాలి
3) 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి
4) కొన్ని షరతులు లోక్‌సభ సభ్యులతో సమానంగా ఉంటాయి
7. కేంద్ర ప్రభుత్వం రాజేందర్ సింగ్ సచార్ కమిటీని ఏ అంశంపై ఏర్పాటు చేసింది?
ఎ) మైనారిటీల స్థితిగతులను పరిశీలించడానికి
2) జాట్ వర్గం స్థితిగతులను పరిశీలించడానికి
3) ముస్లింల స్థితిగతులను పరిశీలించడానికి
4) జైన, బౌద్ధ మతాల అభివృద్ధి పరిశీలన నిమిత్తం
8. భారత రాజ్యాంగంలో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వ శాసనాధికారం కానిదాన్ని గుర్తించండి?
ఎ) శాంతిభద్రతలు, ప్రజారోగ్యం
బి) వికలాంగులు, ప్రజారోగ్యం
సి) ఆల్కహాలిక్ లిక్కర్ పై చట్టాలు
4) విదేశీ వ్యవహారాలు, రక్షణ
9. భారత రాజ్యాంగంలో పేర్కొన్న ‘రెసిడ్యూరీ పవర్స్’ అధికారం ఎవరికి కల్పించారు?
1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి
2) గవర్నర్‌కు
3) పార్లమెంట్‌కు 4) రాష్ట్రపతికి
10. సుప్రీంకోర్టు తీర్పు అయోధ్య రామజన్మభూమి వివాదానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి?
1) తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం
2) ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం
3) ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం
4) పదకొండు మంది న్యాయమూర్తుల ధర్మాసనం
11. ఇటీవల సుప్రీంకోర్టు ఆధార్ చట్టబద్ధం, రాజ్యాంగ బద్ధమే అని ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
2) ఇందిరా సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
3) జోసఫ్ సన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
4) సైరా భాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
12. కేంద్ర ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వేర్వేరుగా జాతీయ షెడ్యూల్డ్ తెగల, కులాల కమిషన్లను రూపొందించింది?
1) 85వ రాజ్యాంగ సవరణ చట్టం
2) 98వ రాజ్యాంగ సవరణ చట్టం
3) 97వ రాజ్యాంగ సవరణ చట్టం
4) 89వ రాజ్యాంగ సవరణ చట్టం
సమాధానాలు
1-3 2-3 3-1 4-1
5-3 6-2 7-3 8-4
9-3 10-4 11-1 12-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు