భారత రాజ్యాంగ ప్రవేశిక – ప్రత్యేకతలు (పాలిటీ/గ్రూప్-II)

భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో స్వాతంత్య్రాన్ని, అంతస్థుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949, నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్‌లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాం.
రాజ్యాంగంలో అన్ని అంశాల సమాహారమే ప్రవేశిక. భారత రాజ్యాంగానికి సమగ్ర స్వరూపమే ప్రవేశిక. దీనిద్వారా రాజ్యాంగ గుణగణాలను సులభంగా అర్థంచేసుకోవచ్చు. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలకు ఇదే మూలాధారం..! ప్రజల పట్ల ఎలాంటి విధానాలను అవలంబించాలనే విషయాలను ప్రవేశిక వివరిస్తుంది.
-రాజ్యాంగ ప్రవేశికను పీఠిక అని, అవతారిక అని, రాజ్యాంగ మూలతత్వమని, రాజ్యాంగం ముందుమాట అని, భారత రాజ్యాంగ ఉపోద్ఘాతం అని, రాజ్యాంగ భూమిక (Preamble) అని అంటారు.
-ప్రపంచంలో ప్రవేశికను కలిగిన మొదటి రాజ్యాంగం: అమెరికా
-ప్రవేశికకు అమెరికా రాజ్యాంగం ఆధారం.
-రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను ప్రవేశికలో పొందుపర్చారు.
-రాజ్యాంగ పరిషత్‌లో మొదటి తీర్మానంగా లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ 1946, డిసెంబర్ 13న ప్రవేశపెట్టాడు. ఈ సందర్భంగా ఆయన భారతదేశ ప్రజలకు మనం చేసిన ప్రతిజ్ఞ లాంటిదని పేర్కొన్నాడు.
-నెహ్రూ ప్రతిజ్ఞలో పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అవకాశాల్లో అసమానతలను అంతం చేయడం మనముందున్న ప్రథమ కర్తవ్యం అని ప్రకటించాడు.
-లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని కేఎం మున్షీ భారత జాతి జాతకచక్రం అని వర్ణించాడు.
-రాజ్యాంగపరిషత్‌లో ఈ తీర్మానం 1947, జనవరి 22న ఆమోదం పొందింది. తర్వాత దీనిని ప్రవేశికగా పిలుస్తున్నారు.
-లక్ష్యాలు-ఆశయాల తీర్మానం రచయిత, నిర్మాత, ప్రవర్తకుడు, పితామహుడిగా నెహ్రూను అభివర్ణిస్తారు.
-భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది.
-ప్రవేశికలోని ఆశయాలను ఆధారంగా చేసుకొని భారతదేశ ప్రజలకు అనుగుణమైన విశిష్ట లక్షణాలతో కూడి న భావి భారత భవిష్యత్ రాజ్యాంగాన్ని రూపొందించారు.
-భారత ప్రజలమైన మేము అనే పదంతో ప్రారంభమై… మాకు మేము ఇచ్చుకుంటున్నాం అనే పదంతో ప్రవేశిక ముగించబడుతుంది. అంటే దీని అర్థం అధికారానికి మూలం ప్రజలు, రాజ్యాంగ అధికారానికి మూలం ప్రజలు.
-ఇది భారతీయులందరు సమాస్థాయి అవకాశాలు పొందడానికి అర్హులు అని తెలుపుతుంది.
-రాజ్యాంగ ప్రవేశికకు సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత (ఏకత) అనే పదాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
-సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం ప్రవేశిక ముఖ్య స్వరూపం.
-ప్రవేశికకు ఒకే ఒక సవరణ జరిగింది.
ప్రవేశిక-పదాల వివరణ -సార్వభౌమాధికారం
-దీన్ని ఇంగ్లీష్‌లో Sovereignty అంటారు. సావర్నిటి అనే ఆంగ్లపదం సుపరానస్ అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. సుపరానస్ అంటే అత్యున్నతమైన అని అర్థం. భారతదేశం సర్వసత్తాధికార రాజ్యం. అంటే మనదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం ఉండదు. భారతదేశం స్వేచ్ఛగా దేశ, విదేశాంగం విధానాన్ని రూపొందించుకొని అమలు జరుపుతుంది. భారతదేశం అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలైన కామన్వెల్త్, సార్క్ కూటముల్లో సభ్యత్వం కలిగి ఉన్నప్పటికీ అది ఐశ్ఛికం మాత్రమే కానీ నిర్బంధం కాదు. ప్రపంచంలో ఏ దేశం మన దేశ విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేయలేదు.
-భారతదేశంలో సార్వభౌమాధికారం ప్రజలకు ఉంది.
-ప్రజలు తమకున్న అధికారం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు.
సామ్యవాదం (Socialisam)
-సామ్యవాదం అంటే ఆదాయాలను సమానం చేయడం – జార్జ్ బెర్నార్డ్‌షా
-ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం, కార్మికులకు నిర్వహణలో భాగస్వామ్యం కల్పించడం.
-సామ్యవాదంలో సంపన్నులకు పన్నులు విధించి వసూలు చేసి పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
-రాజ్యాంగంలో సామ్యవాద భావనలు అంతర్లీనమై అమలు చేయబడుతున్నాయి.
-రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సామ్యవాదం ప్రవేశికలో లేదు. దీనిని 1976లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
-సామ్యవాద భావనలు ఆదేశిక సూత్రాల ద్వారా అమలవుతున్నాయి.
-1955లో జరిగిన ఆవడి కాంగ్రెస్ సమావేశంలో సామ్యవాద తరహా సమాజ తీర్మానం అమలు చేయబడుతుందని జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు.
-దేశంలో ప్రజాస్వామ్య సామ్యవాదం అమలులో ఉంది. సామాజిక ఆర్థిక న్యాయాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా సాధించడానికి భారతదేశం కృషి చేస్తుంది.
-సామ్యవాదం విస్తరించడానికి ప్రభుత్వం ప్రైవేట్ రంగంలోని ఆస్తులను జాతీయం చేసింది.
ఉదా: బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు.
-1978లో ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల నుంచి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం రాజ్యాంగంలో సామ్యవాద భావనగా భావిస్తారు.
-1991, జూలై 24న పీవీ నరసింహారావు ప్రభుత్వం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం (LPG) వలన నూతన ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల సామ్యవాద వేగం తగ్గింది.
-కొద్దిమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఉత్పత్తి శక్తులను నియంత్రణ చేసి సాధ్యమైనంత వరకు ప్రజలందరికీ కనీస అవసరాలైన ఆహారం, గృహం, వస్త్రం కల్పించవలసిన బాధ్యత కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.
లౌకిక తత్వం (Secular)
-ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో లౌకిక భావనలు ఉన్నాయి. అశోకుడు, కనిష్కుడు, హర్షుడు బౌద్ధమతం స్వీకరించి సర్వమత సమభావన అనుసరించారు.
-అక్బర్ ముస్లిం అయినప్పటికీ దీన్-ఇ-ఇలాహి మతాన్ని ప్రారంభించి అన్ని మతాల సారాంశం ఒక్కటే అని సర్వమత సహనం పాటించాడు.
-రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లౌకిక అనే పదం ప్రవేశికలో లేదు. లౌకిక అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు.
-లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయంలేని రాజ్యం అంటే రాజ్యానికి ప్రత్యేక మతం అంటూ ఉండదు. రాజ్యం దృష్టిలో అన్ని మతాలు సమానం. మతం ఆధారంగా విద్య, ఉద్యోగాల్లో ఎవరికీ ప్రత్యేక అవకాశాలు కల్పించబడవు. మత విషయాల్లో పౌరులకు స్వేచ్ఛ ఉంటుంది.
-లౌకిక భావనలు అమలుచేయడానికి రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కు అయిన మత స్వాతంత్య్రపు హక్కు 25వ నిబంధన నుంచి 28 నిబంధన వరకు మత స్వేచ్ఛ గురించి వివరిస్తున్నాయి.
-ఇరాన్, ఇరాక్, పాకిస్థాన్ దేశాలు ఇస్లాం మత రాజ్యాలు, ఐర్లాండ్ కూడా మత (రోమన్ క్యాథలిక్) రాజ్యం.
-ప్రపంచంలో ఏకైక హిందూ దేశమైన నేపాల్ కూడా 2006లో లౌకిక రాజ్యంగా మారింది.
ప్రజాస్వామ్యం (Democratic)
-ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో Democracy అంటారు. Demos, Cratia అనే రెండు గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది. Demos అంటే ప్రజలు, Cratia అంటే పాలన/అధికారం అని అర్థం.
-ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు నిర్వహించే ప్రభుత్వాన్ని (Govenment of the people, by the people, for the people) ప్రజాస్వామ్యం అని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ నిర్వచించాడు.
-ప్రజాస్వామ్యం రెండు రకాలు
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం: దేశ కార్యనిర్వాహక వర్గాన్ని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొని ప్రజలకు బాధ్యతవహించే ప్రభుత్వం.
ఉదా: స్విట్జర్లాండ్
పరోక్ష ప్రజాస్వామ్యం: దేశ కార్యనిర్వాహకవర్గాన్ని ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం.
ఉదా: భారతదేశం
-భారతదేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. దీనినే ప్రాతినిథ్య ప్రజాస్వామ్యం అంటారు.
-దేశంలో 18 ఏండ్లు నిండిన వయోజనులు తమకు కల్పించిన సార్వజనీన వయోజన ఓటుహక్కు ద్వారా తమ ప్రతినిధులను తాము ఎన్నుకుంటారు (326 నిబంధన).
-ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికీ ప్రత్యేక హోదా ఉండదు. అందరికీ సమాన అవకాశాలు (Rule of Law) ఉంటాయి.
-ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్.
-దేశంలో ధనిక, పేద, కుల, మత, ప్రాంతీయ వ్యత్యాసం లేకుండా భారత పౌరులు ఎవరైనా రాజకీయ పదవులు పొందవచ్చు.
గణతంత్ర వ్యవస్థ (Republic)
-గణతంత్ర వ్యవస్థ అంటే దేశ అధినేత వారసత్వంగా కాకుండా ఎన్నికల గణం చేత నిర్ణీత కాలానికి ఎన్నుకోవడం.
-గణం అంటే ఎన్నికల గణం (ప్రజలు), తంత్రం అంటే యంత్రాంగం అని అర్థం.
-భారత రాష్ట్రపతిని ప్రజలు పరోక్షంగా అంటే ఎన్నికల గణం ద్వారా 5 ఏండ్ల కాలానికి ఎన్నుకుంటారు (54వ నిబంధన).
-బ్రిటన్‌లో రాజు లేదా రాణికి వారసత్వ అధికారం లభిస్తుంది.
– భారతదేశంలో పండితుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్, రైతుబిడ్డ అయిన నీలం సంజీవరెడ్డి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కేఆర్ నారాయణన్, సిక్కు మతానికి చెందిన జ్ఞాని జైల్‌సింగ్, ఇస్లాం మతానికి చెందిన జాకీర్ హుస్సేన్, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, ఏపీజే అబ్దుల్ కలాం (రాజకీయాలకు చెందనివారు), మహిళ ప్రతిభా పాటిల్ రాష్ట్రపతులుగా ఎన్నికవ్వడం గణతంత్ర వ్యవస్థ ప్రత్యేకత.
RELATED ARTICLES
-
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
-
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
-
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
-
Biology | First Genetic Material.. Reactive Catalyst
-
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
-
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !
Geography | ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
Economy | రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
SAT Preparation | SAT… Short and Digital
Group 2,3 Special | మహిళలు, బాలలు, ట్రాన్స్జెండర్ల చట్టాలు
General Essay – Groups Speical – AI | వస్తువుకు ప్రాణం.. కృత్రిమ మేధ మాయాజాలం