కాకతీయలు – శిల్పకళాసేవ

– దక్షిణ భారతదేశాన తెలంగాణలో 12వ శతాబ్దం నుంచి తెలుగుభాషా ప్రాంతాలను సమైక్యపరిచి, ద్రవిడ సంస్కృతికి (తెలంగాణ+ ఆంధ్రా సంస్కృతికి) రూపురేఖలు దిద్దిన మహనీయులు కాకతీయులు. దాదాపు 300 ఏండ్లపాటు తురుష్కుల దాడుల నుంచి హిందూ మతాన్ని, హైందవ సంస్కృతిని కాపాడి, విజయనగర రాజులకు (స్వర్ణయుగానికి) మార్గదర్శకులయ్యారు. కాకతీయ శిల్పాలు భారతీయ వాస్తు శిల్పకళా పరిణితిలో స్వర్ణఘట్టానికి సజీవ నిదర్శనాలు. కదనరంగంలోనే కాదు, కళారంగంలోనూ కాకలు తీరిన కాకతీయులు ఉద్దండ దండయాత్రలు చేస్తూ.. సామ్రాజ్యాన్ని మహావైభవంగా తీర్చిదిద్ది, శిల్పకళకు, కవితాకళకు చెక్కు చెదరని పందిళ్లు వేసినారు కాకతీయులు.
-కాకతీయులు మొదట పశ్చిమ చాళుక్యుల సాంప్రదాయాన్ని అనుసరించినప్పటికీ అందులో నూతన లక్షణాలను ప్రవేశపెట్టి ఒక వినూత్న, విలక్షణమై సాంప్రదాయాన్ని సృష్టించారు. కాకతీయ శిల్పంలో అసామాన్య ధృడత్వం, సూక్ష్మ పరిశీలన, సౌందర్య పిపాస కన్పిస్తుంది. నాటి శిల్పులు బ్రహ్మాండమైన శిలలను పండ్లవలె అతిసునాయాసంగా ఎత్తి స్తంభాలుగా, ద్వారాలుగా తీర్చిదిద్దారు. కఠిన వజ్రతుల్యాలైన ఈ శిలలపై నగిషీ పనులను మలిచారు. లోహాతి కఠినములైన ఈ శిలలు శిల్పుల చేతుల్లో వెన్నవలె మెత్తపడినాయి. ఓరుగల్లు కోటలోని స్వయం భూ దేవాలయంలో తలవిరిగి, మెడ నుంచి తొడల వరకు మాత్రమే మిగిలిన దేవుని విగ్రహం అపూర్వ సృష్టి శిల్పాల్లో చూపిన సున్నితమైన పనితనం కాకతీయ శిల్పకళా ఔన్నత్యం చాటుతుంది.
-కాకతీయులు ఆలయాలు రెండు రకాలు. అవి…
1. ఏక విమాన ఆలయాలు లేదా ఏకశిల ఆలయాలు
2. త్రికూట ఆలయాలు అనే రెండు రీతుల్లో నిర్మించారు.
-పెద్ద ఆలయాల్లో రాయి, ఇటుకలు రెండూ వాడారు. ఆలయపు దిగువ భాగాలు రాతితోను, విమానాలు ఇటుకలు, గచ్చుతో కట్టారు.
త్రికూట ఆలయాలు
8 1. హన్మకొండలోని రుద్రేశ్వరాలయం (వేయిస్తంభాలగుడి) ప్రతాపరుద్రుడు నిర్మించాడు.
-2. పానగల్లు (నల్లగొండ)లోని సూర్య ఆలయం లేదా ఛాయా సోమేశ్వరాలయం (కాకతీయుల సామంతులు కందూరు చోళులు నిర్మించారు.)
వేయి స్తంభాల గుడి
-కాకతీయుల కాలంలో తెలంగాణ వారి కళా సృష్టికి నిదర్శనం. సహస్ర స్తంభ దేవాలయం 1163వ సంవత్సరంలో రుద్రదేవుడు లేదా ప్రతాపరుద్ర-1 హన్మకొండలో నిర్మించాడు. ఈ ఆలయం త్రికూట ఆలయం. ఇందులో మూడు ఆలయాలు ఉన్నాయి. అవి..
-తూర్పున: ఈశ్వరాలయం (శివుడు)
-దక్షిణాన: వైష్ణవాలయం (విష్ణువు)
-పశ్చిమాన: సూర్య దేవాలయం (సూర్యుడు)
-ఈ మూడు ఆలయాలు ఒకే దేవాలయంగా నక్షత్ర ఆకారంలో ఉన్నాయి. వాటి మధ్యభాగంలో విగ్రహాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. లోపల గ్రానైట్ రాతితోనూ, ద్వార బంధాలు బసాల్టు రాతితోనూ (ఈ రాయి ఆకుపచ్చ గౌర వర్ణాల మిశ్రమంతో ఉంది), నల్లరాతిని మణిహారాలుగా మార్చిన నైపుణ్యం వర్ణణాతీతం. ప్రధాన ఆలయంలో విగ్రహాలు లేవు.
ఏకశిల లేదా ఏకశాల ఆలయాలు
-పాలంపేటలోని పెద్ద ఆలయం ఏక విమానం ఉన్న ఆలయం. దీనిని గణపతిదేవుని కాలంలో రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఇతను రేచర్ల వంశస్థుడు. ప్రధాన శిల్పాచార్యుడైన రామప్ప పేరుమీదుగా ఇది రామప్పగుడి అయ్యింది. ఈ దేవాలయంలో అందమైన శిల్పాల అల్లికతో శోభిల్లుతున్న స్తంభాలు, నర్తకీమణులు మృదంగ వాయిద్యాలతో, పుష్పమాలలు ధరించిన సుందరీమణులు, నృత్య భంగిమలతో నిల్చిన వేణుగోపాల మూర్తి, కమల మాలాంకృత పరుశుధారి అయిన భైరవమూర్తి, ఢమరుకం, ఘంట, త్రిశూలం ధరించిన అపస్మారక పురుషునిపై తాండవ నృత్యం చేస్తున్న నటరాజ మూర్తి కమలాన్ని ధరించిన సూర్యుడు, మదనికా విగ్రహాలతో ఈ దేవాలయంలోని మండపాలు అలరిస్తున్నాయి. ఆలయగోడలపై పార్వతీకల్యాణ దృశ్యం, క్షీరసాగర మదనం చెక్కబడ్డాయి. నల్లరాతిపై 12 యక్షిణి విగ్రహాలు సజీవంగా ఉన్నాయి. గుడి పైకప్పులో పద్మాలంకృత త్రికోణ ఆకార శిలాశిల్పాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఏనుగులు ఘన స్వాగతం పలుకుతున్నాయి.
నాగిని శిల్పం
-రామప్పగుడిలో ఉన్న శిల్ప కళాఖండం అన్నింటికీ పతాకం వంటిది నాగిని శిల్పం. సౌందర్యానికి సంకేతం ఈ మూర్తులు. ఈ శిల్పాలకు వ్రదనిక అని పేరు. నాగిని చేతుల్లో సర్పం, కంఠం చుట్టూ మరోసర్పం ఉన్నాయి. శిరస్సుపై రుద్రఫణి ఉంది. శరీరంపైన అతిపలుచని వస్ర్తాలు ఉండీ ఉండనట్లుగా మలచబడిన శిల్పాలు శిల్పి ప్రతిభకు తార్కాణం. కాకతీయ శిల్పులు దేవతారూపాలను కూడా విగ్రహాలుగా నిలబెట్టక త్రిభంగ సూత్రం పాటించారు. త్రిభంగ అంటే రూప సౌందర్యం స్పష్టంగా కన్పించేందుకు కాలుమడతవేసి కానీ, ఎత్తికానీ, తల ఒక వైపునకు, నడుము ఇంకోవైపునకు ఉండి ప్రదర్శించే నాట్యభంగిమ, ఓరుగల్లులోని స్వయంభూ దేవుని విగ్రహం ప్రస్తుతం న్యూఢిల్లీలోని మ్యూజియంలో ఉంది.
వరంగల్లు కోటలోని దేవాలయాలు
-ఓరుగల్లు కోటలో వీరభద్ర, మందలమ్మ, రామ, విష్ణు, వేంకటేశ్వర, స్వయంభూ, సేలశంభు, జంగమేశ్వర దేవి అనే పేర్లతో పిలువబడే 12 ఆలయాలు ఉన్నాయి. ఇంకనూ కటక్పూర్ లేదా కటాక్షపురంలో రెండు చిన్న త్రికూఠ ఆలయాలు ఉన్నాయి.
సహస్ర లింగ : దేవాలయం
-గణపతిదేవుడు ఓరుగల్లులో నిర్మించినసహస్ర లింగ దేవాలయం చెప్పుకోదగినది. ఇది శైలిలో పాలంపేట ఆలయానికి దగ్గరగా ఉంది. కొందరు దీన్నిఐవోలు ఆలయంతో పోల్చారు.
ఘణపూర్ దేవాలయ సముదాయం
-వరంగల్ జిల్లాలోని పాలంపేటకు 6 మైళ్ల దూరంలో ఉన్న ఘణపూర్ గ్రామం మధ్యలో ఉన్న మట్టికోట లోపల 260 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక ప్రాంగణంలో దాదాపు 22 దేవాలయాల సముదాయం ఉంది.
కాళేశ్వర ఆలయ ప్రత్యేకత
-కాళేశ్వరాలయానికి ముక్తేశ్వరాలయం అని పేరు. ఈ ఆలయంలో ఒకే వేదికపై రెండు శివలింగాలు ప్రతిష్ఠించబడినవి.ఒక శివలింగానికి కాళేశ్వరుడు, రెండో లింగానికి ముక్తేశ్వరుడు అని పేర్లు ఉన్నాయి. ఈ ఆలయానికి పిరమిడ్ ఆకారంలో శిఖరం నిర్మించబడి ఉంది (అది ప్రస్తుతం లేదు). ఈ ఆలయానికి ఉత్తరంగా మరొక చిన్న గుడి ఉండేది. అందులో అన్నపూర్ణ దేవి ప్రతిమ ఉండేది. ఇప్పటికీ ఈ ఆలయంలో గణపతి, మత్య్సావతారం, చతుర్ముఖలింగం, సూర్య, విష్ణు, నంది మొదలైన విగ్రహాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రసిద్ధక్షేత్రంగా అభివృద్ధి చెందిన దేవాలయం ఇది. కాబట్టి విద్యానాథుడు దీన్ని త్రిలింగ దేశానికి ఒక సరిహద్దుగా కీర్తించాడు.
కాకతీయ కాలంలో జైన ఆలయం
-పద్మాక్షి దేవాలయం: హన్మకొండపై జైనులు పద్మాక్షి దేవాలయం నిర్మించారు. (తొలి కాకతీయులు జైన మత ఆరాధకులు). ఇందులో ఆమె తన యక్షిణితో నిలబడి ఉంది. (దిగంబర విగ్రహం ప్రతిష్ఠించారు) ఈ దేవాలయం చుట్టు అనేక సహజ గుహలు, గాడులు ఉన్నాయి. ఇవన్నీ జైనుల బసదులుగా ఉపయోగపడేవి.
-ఇక్కడ ఉన్న యక్షిణిని పద్మాక్షి అని పిలుస్తున్నారు. ఈమె పార్శనాథుని యక్షిణి. ఈ దేవాలయం మూడోగోవిందుడు (రాష్ట్రకూట రాజులలో ప్రసిద్ధుడు) కాలంనాటిదే ఉండవచ్చు. నాడు ఇతని కాలంలో విజయకీర్తి శిష్యుడైన ఆర్యకీర్తి , భోగరాజు మేనల్లుడు అయిన విమలాదిత్యునికి పట్టిన శని దోషాలను వదలగొట్టినందుకు ఒక దానాన్ని పొందినట్లుగా రాగి శాసనంలో పేర్కొనబడింది. కాకతీయుల కాలంలో ఈ యక్షిణిని పద్మాక్షిగా మార్చారు. పార్వనాథుని హన్మకొండలో ఇలయ్య లేదా ఐలయ్య అని పిలుస్తారు.
భద్రకాళి దేవాలయం
-ఇది మరోగొప్ప దేవాలయం. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే బతుకమ్మ పండుగ కనులపండువగా అత్యంత వైభవంగా జరుగుతుంది. అనంతరం పక్కనే ఉన్న చెరువులో బతుక్మలు నిమజ్జనం అవుతాయి.
కాకతీయ సామంతులు నిర్మించిన ఆలయాలు
-పిల్లలమర్రి: రేచెర్ల వంశస్థులు పిల్లలమర్రిలో ముక్కంటి ఆలయంగా పిలువబడే నామలింగేశ్వర, కాచేశ్వర, కామేశ్వర అనే త్రికూట ఆలయం, ఎరుకేశ్వర ఆలయం నిర్మించారు. పిల్లలమర్రి నల్లగొండ జిల్లా సూర్యాపేటకు మూడు మైళ్ల దూరంలో ఉంది.
-కాళేశ్వర ఆలయం: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం కాళేశ్వరంలోని కాళేశ్వరాలయం. త్రిలింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. త్రిలింగాలు
1. కాళేశ్వరం – కరీంనగర్ (తెలంగాణ)
2. శ్రీశైలం – కర్నూల్ (రాయలసీమ)
3. ద్రాక్షారామం – రాజమండ్రి (ఆంధ్రా)
-ఇది గోదావరి, దాని ఉపనది ప్రాణహిత సంగమించే ప్రదేశంలో ఉంది. కరీంనగర్ (యలగందుల) పట్టణానికి 130 కి.మీ.దూరంలో ఉంది. 1171 సంవత్సరంలో కాకతిరుద్రుడు లేదా మొదటి ప్రతాపరుద్రుని మంత్రి గంగాధరుడు కాళేశ్వరాలయం నిర్మించినట్లు తెలుస్తున్నది. రెండో ప్రోలరాజు శైవమత గురువైన రామేశ్వర దీక్షితులు ఇక్కడ స్థిరపడి ఉపాల మఠం అనే శైవ మఠాన్ని స్థాపించినట్టు శాసనాల ద్వా రా తెలుస్తోంది. 1379లో రెండో హరిహరరాయల కుమారుడుదేవరాయలు దిగ్విజయ యాత్రచేసి కాళేశ్వరం వచ్చి తన విజయాలకు గుర్తుగా ఇక్కడ ఉత్సవం జరిపి, తులాపురుషదానం చేశాడని తెలుస్తోంది.
ఓరుగల్లు కోటపై కొన్ని ముఖ్యాంశాలు
-ఓరుగల్లు కోట నిర్మాణంలో కాకతీయుల గొప్ప వాస్తు శిల్పకౌశలం ప్రతిఫలిస్తుంది. ఓరుగల్లు కోట ఏకశిల నగరం చుట్టూ నిర్మించబడింది. మూడు ప్రాకారాలతో ఈ కోట శతృదుర్భేధ్యమై దాదాపు రెండు వందల సంవత్సరాలపాటు శత్రువుల ధాటికి తట్టుకొని నిల్చింది.
1. మొదటి, రెండు ప్రాకారాలు పుట్టకోట, మట్టితోనూ..
2. మూడో ప్రాకరం కంచుకోట రాతితోను నిర్మించబడినాయి.
-ఈ కోటలో కాకతీయుల ఆరాధ్యదైవమైన స్వయంభూ శివుని దేవాలయం ఉండేది. ఈ కోటకు నాలుగువైపులా నాలుగు శిలా నిర్మిత కీర్తి తోరణాలు ఉండేవి. కాకతీయ శిల్పుల అసమాన శిల్పకళా నైపుణ్యానికి ఇవి చక్కని ఉదాహరణలు.
సంగీత-శిల్పకళపై ముఖ్యాంశాలు
-దేవాలయాల సముదాయాలు: ఘణపూర్
-ఏకశాల లేదా ఏకకూఠ శైలికి గొప్ప తార్కానం: రామప్పదేవాలయం
-త్రికూఠ శైలి: వేయిస్తంభాల దేవాలయం-హన్మకొండ
-ఉద్యాననగరం: హన్మకొండ
-చిత్రకళలు నెలకొన్న దేవాలయం: పిల్లలమర్రి (సూర్యాపేట)
-నటులకు నిలయంగా ప్రసిద్ధి చెందింది: ఓరుగల్లు
-నాగిని శిల్పాలు: రామప్ప దేవాలయంలోని మదనిక శిల్పాలు
-ప్రసూతి వైద్యశాలలు: మల్కపురంశాసనంలో వివరాలు ఉన్నాయి. గణపతి దేవుని గురువు విశ్వేశ్వర శంబు నిర్మించాడు.
-రజుఖండక సంగీత పరికరం: ధర్మసాగరం శాసనం
-పేరణి నాట్యం: జాయపసేనాని
-మాచల్దేవి: గొప్ప నాట్యకారిణి
లలితకళలు
-సాహిత్యంతోపాటు లలితకళలు కూడా అభివృద్ధి చెందాయి. నాట్యం-సంగీతం మంచి ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవాలయాలు, రాజులు సంగీత విద్వాంసులను, నటీనటులను, నాట్యకత్తెలను పోషించారు.
-వారు వివిధ వాయిద్యాలతో పాటలు పాడుతూ ఉంటే దేవదాసీలు నాట్యం చేస్తూ ఉండేవారు. కేతన దశకుమారచరిత్ర, తిక్కన నిర్వచనోత్తర రామాయణం, గోనబుద్దారెడ్డి రంగనాథరామాయణం, జాయపసేనాని నృత్యరత్నావళి మొదలైన అనేక గ్రంథాలు ఆ కాలంలో వాడుకలో ఉన్న నాట్య, గీత వినోదాలను తంత్రి వాద్య విశేషాలను వివరిస్తుంది. జాయపసేనాని నృత్యంలోని మెళకువలను, శైవధర్మ సూత్రాలను సమన్వయం చేస్తూ నృత్యరత్నావళిని రచించాడు. రామప్ప దేవాలయం నాట్య భంగిమలు నృత్యరత్నావళిలోనివే. మల్కాపురం శాసనంలో నాట్యకత్తెల ప్రస్తావన ఉన్నది.
RELATED ARTICLES
-
GEOGRAPHY | పర్వతాల ఊయలగా వేటిని పేర్కొంటారు?
-
Telangana History & Culture | 1952 ముల్కీ ఉద్యమం మొదటిసారి ఎక్కడ ప్రారంభమైంది?
-
General Science Physics | సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు?
-
Indian Polity | ఉభయ సభల ప్రతిష్టంభన.. ఉమ్మడి సమావేశం
-
Telangana History & Culture | పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి?
-
Chemistry | ఒక ద్రావణపు pH విలువ 5 అయితే దాని [OH-] అయాన్ గాఢత?
Latest Updates
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Indian Polity | జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
Telangana Government Schemes | ప్రజల పాలిట వరాలు.. అభివృద్ధికి ప్రతీకలు
TS EAMCET | టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Current Affairs | దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది?
MSTC Recruitment | ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 52 మేనేజర్ పోస్టులు
Telangana Current Affairs | షీ భరోసా సైబర్ ల్యాబ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
SSC CHSL Preparation 2023 | ఉమ్మడిగా చదివితే.. ఉద్యోగం మీదే!
ISRO Recruitment | ఇస్రోలో 303 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు
Indian Navy MR Recruitment 2023 | ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ పోస్టులు