Indian History | ‘ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’ను ఏర్పాటు చేసింది ఎవరు?
శాసనోల్లంఘన కమిటీ
- గాంధీ అరెస్ట్ తదనంతరం 1922లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ లక్నోలో సమావేశమై, భవిష్యత్ కార్యాచరణను సూచించడానికి హకీం అజ్మల్ ఖాన్ నేతృత్వంలో శాసనోల్లంఘన కమిటీని నియమించింది.
- ఈ కమిటీలో సభ్యులు: 1) అన్సారీ 2) మోతీలాల్ నెహ్రూ 3) విఠల్ భాయ్ పటేల్ 4) రాజగోపాలచారి 5) కస్తూరి రంగన్
గయ కాంగ్రెస్ సమావేశం – కాంగ్రెస్ చీలిక - 1922, డిసెంబర్లో చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన గయలో కాంగ్రెస్ వార్షిక సమావేశం జరిగింది. దీనిలో 1923, నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో పాల్గొని శాసనసభల్లో ప్రవేశించి ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని ‘మార్పు కోరే పక్షం’ భావించగా, శాసనసభ ప్రవేశం సహాయ నిరాకరణోద్యమ స్ఫూర్తికి విరుద్ధమని ‘మార్పు కోరని’ పక్షం భావించింది. దీంతో ఈ సమావేశానికి కాంగ్రెస్ రెండుగా చీలింది.
స్వరాజ్య పార్టీ (1923)
- గయలో కాంగ్రెస్ పార్టీ చీలిక తర్వాత సీఆర్ దాస్ ఐఎన్‌సీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్‌లోని మార్పు కోరే పక్షంతో కలిసి సీఆర్ దాస్ అధ్యక్షుడిగా, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా, కేల్కర్, విఠల్‌భాయ్ పటేల్, లాలాలజపతి రాయ్ జయకర్ వంటి ప్రముఖులు సభ్యులుగా 1923, డిసెంబర్ 31న కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ ఏర్పడింది. ఈ పార్టీ వ్యవహారిక నామమే స్వరాజ్య పార్టీ. ఈ పార్టీ సహాయ నిరాకరణను కొనసాగించింది.
- ముఖ్య లక్షణాలు
- స్వరాజ్య అంటే సంపూర్ణ స్వాతంత్య్రం కాదు. కేవలం అధినివేధ ప్రతిపత్తి.
- నూతన చట్టంలో ప్రజలు తమకు కావాల్సిన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నట్లు ప్రభుత్వాన్ని అంగీకరింపజేయడం.
- శాసనసభల్లో ఉంటూ ప్రజలకు శ్రేయస్కరం కాని శాసనాలను ప్రతిఘటించడం లేకపోతే ఆ చట్టాలను భారతీయులకు అనుకూలంగా వచ్చే విధంగా సవరణలు చేయడం. దీన్నే స్వరాజ్య పార్టీ ఎండ్ లేదా మెండ్ విధానం అని కూడా పిలుస్తారు.
- ఆ విధంగా చేయడం ద్వారా 1919 చట్టానికి బదులుగా మరో చట్టాన్ని తీసుకురావడం.
- ఇది ఆశించిన ఫలితాలను ఇవ్వకపోతే తిరిగి గాంధీ నాయకత్వాన్ని అంగీకరించడం.
- గాంధీ నిర్మాణాత్మక కార్యక్రమాలను కొనసాగించడం.
1923 ఎన్నికలు
- ఈ పరిస్థితుల్లో 1923లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఐఎన్‌సీ ప్రత్యేక సమావేశంలో మార్పు కోరే వర్గానికి, మార్పు కోరని వర్గానికి మధ్య అంగీకారం కుదిరింది. దీని ప్రకారం శాసనసభలకు పోటీ చేసేవారిని కాంగ్రెస్‌లో ఉంటూనే ప్రత్యేక పార్టీగా పరిగణించాలని భావించారు.
- 1919 రాజ్యాంగ చట్టం ద్వారా 1923, నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించారు.
- 1923లో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర శాసనసభలోని 101 సీట్లకు 48 స్థానాలను స్వరాజ్య పార్టీ కైవసం చేసుకుంది.
- ఫలితంగా మోతీలాల్ నెహ్రూ కేంద్ర శాసనసభలో మొదటి భారతీయ ప్రతిపక్ష నాయకుడిగా, విఠల్‌భాయ్ పటేల్ కేంద్ర శాసనసభ స్పీకర్‌గా 1925లో ఎన్నికయ్యారు.
- స్వరాజ్య పార్టీ సెంట్రల్ ప్రావిన్స్‌లో పూర్తి మెజార్టీ, బెంగాల్లో మెజార్టీతో పాటు బొంబాయి, ఉత్తరప్రదేశ్‌లో కూడా కొంత విజయం సాధించింది.
- ఈ ఎన్నికలో పరాజయం పొందిన మితవాదులు..
- ఎస్ఎన్ బెనర్జీ (బెంగాల్)
- శేషగిరి అయ్యర్ (మద్రాస్)
- పరాంజపే (బొంబాయి)
- చింతామణి (ఉత్తరప్రదేశ్)
- కేంద్ర శాసనసభలో 24 మంది సభ్యులు గల స్వతంత్ర వర్గానికి నాయకత్వం వహించింది- మహ్మద్ అలీ జిన్నా
- 1923-24 మధ్యకాలంలో మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో..
1) చిత్తరంజన్ దాస్ కలకత్తా మేయర్‌గా ఎన్నికయ్యారు.
2) జవహర్ లాల్ నెహ్రూ అలహాబాద్ మున్సిపాలిటీకి అధ్యక్షుడయ్యారు.
3) బాబు రాజేంద్రప్రసాద్ పాట్నా మున్సిపాలిటీకి అధ్యక్షుడు అయ్యారు.
4) సీఆర్ దాస్, సుభాష్ చంద్రబోస్‌ను 1923లో కలకత్తా చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు.
5) వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్ మున్సిపాలిటీ అధిపతి అయ్యారు.
పార్టీ భవితవ్యం
- 1926లో తిరిగి ఎన్నికలు జరిగాయి. స్వరాజ్య పార్టీ మూడు సమూహాలుగా
చీలిపోయింది.
1) పాత స్వరాజ్య పార్టీ
2) ప్రతిస్పందనకారులు: దీన్ని ఏర్పాటు చేసింది- జయకర్, కేల్కర్, ముంజి
3) ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ- మదన్ మోహన్ మాలవీయ
1926 ఎన్నికల ఫలితాలు
- స్వరాజ్య పార్టీ 40 స్థానాలను గెలుచుకుంది.
- మద్రాస్ బ్రాహ్మణాధిపత్య పార్టీలు ముందు నిలిచాయి.
- స్వరాజ్య పార్టీ బెంగాల్లో విజయం సాధించగా, సెంట్రల్ ప్రావిన్స్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో ఓడిపోయారు.
- బీహార్, ఒరిస్సాల్లో రెస్పాన్సివిస్టులు విజయం సాధించారు.
మద్రాస్ ప్రావిన్స్ స్వరాజ్య పార్టీ
- 1923లో సత్యమూర్తి, శ్రీనివాస్ అయ్యంగార్ ఆధ్వర్యంలో ఏర్పడింది. దీనికి శ్రీనివాస అయ్యంగార్ మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
- ఇది 1923, 1934 ఎన్నికల్లో పోటీ చేసి మద్రాస్ ప్రావిన్స్‌లో మెజారిటీ స్థానాలు పొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇది తర్వాత అఖిల భారత స్వరాజ్య పార్టీలో, తర్వాత ఐఎన్సీలో కలిసిపోయింది.
స్వరాజ్య పార్టీ ప్రధాన విజయాలు
- ప్రజా భద్రతా బిల్లు- 1928ను ఓడిపోయేలా చేశారు.
- ముద్దిమాన్, లీ కమిషన్ రిపోర్టులపై ఆందోళన నిర్వహించారు.
సీఆర్ దాస్
- దేశబంధుగా ప్రసిద్ధిచెందారు.
- సుభాష్ చంద్రబోస్‌కు రాజకీయ గురువు.
- ఈయన ఇచ్చిన నినాదం- గ్రామాలకు తరలండి
- స్థాపించిన పత్రికలు-
1) నారాయణ్- బెంగాలీ పత్రిక
2) ఫార్వర్డ్/ లిబర్టీ- ఆంగ్లపత్రిక
నోట్: దాస్‌ను అలీపూర్ జైల్లో ఉంచారు. - 1925, జూన్‌లో సీఆర్ దాస్ మరణించారు.
ఫ్లాగ్ సత్యాగ్రహ
- శాంతియుతంగా శాసనోల్లంఘన గురించి ప్రచారం చేయడమే ఫ్లాగ్ సత్యాగ్రహ. దీన్ని నాగ్‌పూర్, జబల్పూర్లో చేపట్టారు. ఇందులో భాగంగా బ్రిటిష్ పరిపాలనకు గల న్యాయబద్ధతను ప్రశ్నించడం, జాతీయ పతాకాన్ని ఎగురవేసే హక్కును అనుభవించడం వంటివి చేపట్టారు.
ముద్దిమాన్ కమిటీ (1924)
- సర్ అలెగ్జాండర్ ముద్దిమాన్ అధ్యక్షుడిగా, 8 మంది ఇతర సభ్యులతో 1919 చట్టంలోని లోపాలను తెలుసుకోవడానికి, ద్వంద్వ ప్రభుత్వాన్ని అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేశారు. దీని అసలు పేరు సంస్కరణల విచారణ కమిటీ. ఇది 1919 చట్టంలోని లోపాలతో కూడిన నివేదికను సమర్పించగా, కేంద్ర శాసనసభ ఈ రిపోర్టును తిరస్కరించింది.
దీనిలోని ప్రముఖ సభ్యులు..
1) ఆర్థర్ ప్రూమ్ 2) హెన్రీస్ స్మిల్
3) మహ్మద్ అలీ జిన్నా 4) మహ్మద్ షఫీ
5) విజయ్‌చంద్ మహబ్ 6) పరాంజపే
7) శివస్వామి అయ్యర్
8) తేజ్ బహదూర్ సప్రూ
సైమన్ కమిషన్ (1927, నవంబర్ 28) - బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ కాలంలో సర్ జాన్ సైమన్ అధ్యక్షతన, 6 మంది ఇతర సభ్యులతో 1919 భారత ప్రభుత్వ చట్టం అమలు పరిశీలన, నూతన రాజ్యాంగ సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకతపై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బ్రిటన్ ప్రధాని స్టాన్లీ బాల్డిన్ ఈ కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్‌ను వైట్ కమిషన్ అని కూడా పిలుస్తారు. ఈ కమిషన్‌కు పూర్తి చట్టబద్ధత ఉండటం వల్ల దీన్ని ‘ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్’ అని అంటారు.
- ఇతర సభ్యులు:
1) క్లెమెంట్ అట్లీ
(ఈయన తర్వాతి కాలంలో
బ్రిటిష్ ప్రధాని అయ్యాడు)
2) ఎడ్వర్డ్ కాడోగన్ 3) హార్డ్ షోర్న్
4) లేన్-ఫాక్స్
5) డొనాల్డ్ హోవార్డ్
6) హోరీ లాసన్
విచారణ జరిపిన అంశాలు
- ప్రభుత్వ పనితీరు
- విద్యావ్యాప్తి, పాలనలో ప్రాతినిథ్య వ్యవస్థ వృద్ధి, దానికి అనుబంధంగా ఉన్న ఇతర అంశాలు
- బాధ్యతాయుత ప్రభుత్వం ఎంత వరకు సాధ్యం అన్న అంశం
- బాధ్యతాయుత ప్రభుత్వ స్థాయిని మరింతగా విస్తృతం చేయడం, మార్చడం, నియంత్రించడం
- రాష్ర్టాలకు, ప్రభుత్వానికి మధ్యగల సంబంధాలు
- కమిషన్ భారత రాజ్యాంగ రూపకల్పనపై తన నివేదికను సమర్పిస్తుంది.
- 1928, ఫిబ్రవరి 3న కమిషన్ భారత్‌లో మొదటగా బొంబాయిలో అడుగుపెట్టింది. ఈ కమిటీకి సహకరించడానికి శంకర్ నాయర్ అధ్యక్షుడిగా, నవాబ్ అలీఖాన్, హరిసింగ్ గౌర్, ఎంసీ రాజా సభ్యులుగా ఇర్విన్ అఖిల భారత కమిటీని ఏర్పాటు చేశారు.
మాదిరి ప్రశ్నలు
1. కింది వారిలో ‘మార్పు కోరే పక్షం’గా గుర్తించబడినవారు?
1) చిత్తరంజన్ దాస్
2) మోతీలాల్ నెహ్రూ
3) కేల్కర్ 4) పై అందరూ
2. స్వరాజ్య పార్టీ స్థాపన కాలంలో బ్రిటిష్ వైస్రాయ్?
1) ఇర్విన్ 2) రీడింగ్
3) వెల్లింగ్టన్ 4) చేమ్స్‌ఫర్డ్
3. 1923లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో 101 సీట్లలో స్వరాజ్య పార్టీ గెలుచుకున్నవి?
1) 48 2) 38 3) 68 4) 78
4. 1923-24 మధ్య కాలానికి సంబంధించి కింది వాటిని జతపర్చండి?
1. వల్లభాయ్ పటేల్ ఎ. కలకత్తా మేయర్
2. జవహర్ లాల్ నెహ్రూ బి. అలహాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు
3. బాబు రాజేంద్ర ప్రసాద్ సి. పాట్నా మున్సిపాలిటీ అధ్యక్షుడు
4. చిత్తరంజన్ దాస్ డి. అహ్మదాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
5. కింది వారిలో చంద్రబోస్‌కు రాజకీయ గురువుగా ప్రసిద్ధి చెందింది?
1) గోపాలకృష్ణ గోఖలే
2) చిత్తరంజన్ దాస్
3) బాబు రాజేంద్ర ప్రసాద్
4) మహాత్మాగాంధీ
6. కింది వాటిలో సరైనవి?
1) 1919 చట్టంలోని లోపాలను తెలుసుకోవడానికి, ద్వంద్వ ప్రభుత్వాన్ని అధ్యయనం చేయడానికి ముద్దిమాన్ కమిటీని ఏర్పాటు చేశారు
2) దీని అసలు పేరు సంస్కరణల
విచారణ కమిటీ
3) 1 4) 1, 2
7. 1928, ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ మొదట దేశంలో ఏ నగరంలో అడుగుపెట్టింది?
1) బొంబాయి 2) మద్రాస్
3) కలకత్తా 4) ఢిల్లీ
8. ‘సైమన్ కమిషన్ నియామకం పుండుపైన కారం చల్లినట్లుంది’ అని వ్యాఖ్యానించింది?
1) బాలగంగాధర్ తిలక్ 2) అనీ బీసెంట్
3) గాంధీ 4) సుభాష్ చంద్రబోస్
9. ‘ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’ను ఏర్పాటు చేసింది ఎవరు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) సుభాష్ చంద్రబోస్
3) బీఆర్ అంబేద్కర్ 4) 1, 2
10. సైమన్ గో బ్యాక్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది?
1) యూసఫ్ మెహరాలీ 2) అనీ బీసెంట్
3) టంగుటూరి ప్రకాశం
4) లాలా లజపతి రాయ్
11. కింది వారిలో ముద్దిమాన్ కమిటీలో సభ్యులు?
1) శివస్వామి అయ్యర్
2) తేజ్ బహదూర్ సప్రూ
3) మహ్మద్ అలీ జిన్నా 4) పై అందరూ
సమాధానాలు
1-4, 2-2, 3-1, 4-3,
5-2, 6-4, 7-1, 8-2,
9-4, 10-1, 11-4.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు