హైదరాబాద్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్
1956లో ఆధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు నుంచే తమకు జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ ప్రాంత ఉద్యోగులు స్పందించడం మొదలుపెట్టారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులు, హైదరాబాద్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ను ఏర్పాటుచేసుకుని తమ హక్కుల కోసం పోరాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్నాయాలపై ఎప్పటికప్పడు హెచ్ఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులైన గోవిందరాజ్ పిైళ్లె, సురేంద్రనాథ్ నాగర్చెట్టి దృష్టికి తీసుకెళ్లేవారు. సురేంద్రనాథ్, కేఆర్ ఆమోస్ కలిసి ఉద్యోగుల సమస్యలను వివరిస్తూ రిప్రజెంటేషన్స్ తయారుచేసి సంబంధింత శాఖ మంత్రులకు, ఉన్నతాధికారులకు ఇచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించేవారు. 1953లో హైదరాబాద్ ప్రభుత్వంలో (సెక్రటేరియట్) ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్‌లో టైపిస్టుగా ఆమోస్ చేరారు. హెచ్ఎన్జీఓ కార్యదర్శి సురేంద్రనాథ్ కూడా పరిశ్రమల శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా ఉండేవారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఏదో రకంగా ఆంధ్ర అధికారుల వివక్షకు లేదా వేధింపులకు గురికాని తెలంగాణ ఉద్యోగి లేడంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగుల సమస్యలను వేధింపులను గురించి 1958లో ఏర్పడిన తెలంగాణ రీజినల్ కమిటీ దృష్టికి హెచ్ఎన్జీవో నాయకులైన సురేంద్రనాథ్, ఆమోస్లు తీసుకెళ్లేవారు. ఉద్దేశపూర్వకంగానే ఆంధ్ర నాయకులు ప్రాంతీయ కమిటీ పరిధిలోకి ఉద్యోగుల అంశం రాకుండా రాష్ట్రపతి ఉత్తర్వులు తయారుచేయించారు. ప్రాంతీయ కమిటీ ఉద్యోగుల గురించి ఎప్పుడైనా సిఫారసు చేసినా ప్రభుత్వం పట్టించుకునేది కాదు. పైగా ఉద్యోగుల సంగతి మీకెందుకని ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, ఆంధ్ర మంత్రులు ఎదురు ప్రశ్నించేవారు.
టీఎన్జీఓ ఆవిర్భావం
తమ హక్కుల కోసం తామే పోరాడాలని నిర్ణయానికి వచ్చిన కేఆర్ ఆమోస్ 1964-65లో హైదరాబాద్ ఎన్జీఓ యూనియన్ను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్‌గా (టీఎన్జీఓ) మార్చారు. ఆయనే ఆ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా 1969 వరకు కొనసాగారు.
సర్వీస్ రూల్స్ ఉల్లంఘనపై పోరాటం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి తెలంగాణ ఉద్యోగులకు ఇబ్బందులు, అన్యాయాలు మొదలయ్యాయి. తొలి నాళ్లలోనే ఆంధ్ర అధికారుల వివక్షాపూరిత ఉత్తర్వులు, ఆదేశాలకు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆయా విషయాల్లో కోర్టుల తీర్పులను కూడా ఆంధ్ర అధికారులు ఖాతరు చేయలేదు. తెలంగాణ ప్రాంతీయ కమిటీది అరణ్య రోదనే అయ్యింది.
నాన్‌ముల్కీ ఉద్యోగుల తొలగింపుకై జీఓ
టీఎన్జీఓ అధికారుల సంఘం 1964-65 నాటి నుంచి తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై గొంతువిప్పింది. ముఖ్యమంత్రికి, సంబంధిత మంత్రులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. తెలంగాణ రక్షణలు ఉల్లంఘించబడుతున్నాయని సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యాలయాల్లో తెలంగాణ వారికి కేటాయించిన ఉద్యోగాల్లో ఆంధ్రవారిని నియమిస్తున్నారని ఆమోస్ ఆధ్వర్యంలోని టీఎన్జీఓలు ఆందోళన చేయడంతో 1968, ఏప్రిల్ 30న ముల్కీలకు కేటాయించిన ఉద్యోగాల్లో నియమితులైన నాన్ ముల్కీలను వెనక్కి పంపాలని సెక్రటేరియట్, శాఖాధిపతులను ఆదేశిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.
1969 ఉద్యమ మార్గదర్శులు
తొలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ అంతటికి వ్యాపింపజేసిన ఘనత కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రంలోని తెలంగాణ ఉద్యోగ నాయకులు, వారికి మార్గదర్శకత్వం వహించిన టీఎన్జీఓ పాల్వంచ అధ్యక్షుడు వీఎల్ నరసింహారావు, ఇల్లందుకు చెందిన కొలిశెట్టి రామదాసు, ఉపాధ్యాయ సంఘం నేత కే రామసుధాకర్ రాజులకు దక్కుతుంది. వీఎల్ నరసింహారావు 1963 నుంచి కొత్తగూడెంలోని ఎలక్ట్రిసిటీ బోర్డులో, తర్వాత కేటీపీఎస్‌లో ఉద్యోగిగా పనిచేశారు.
కొలిశెట్టి రామదాసు
1969 ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా ఆపకూడదనే ఆలోచనచేసి మొదటిసారిగా కార్యాచరణకు పూనుకున్నది ఖమ్మం జిల్లా, ఇల్లందు దగ్గరి గేటుకారేవల్లికి చెందిన కొలిశెట్టి రామదాసు. ఆంధ్ర ఆధిపత్య వాదులతో ఇబ్బందులు, వివక్ష, నిర్లక్ష్యానికి, అవమానాలకు గురైన తెలంగాణ వారికి, 1954-56లో విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని విఫలమై అసంతృప్తికి, అశాంతికి గురైన ఇంకెందరికో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఆలోచన 1956 నుంచే ఉండి ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ దాన్ని అమలు చేయడానికి కష్టాలనెదుర్కోవడానికి సిద్దమై ఒక్కొక్కరిని చేరదీసి, జిల్లాలన్ని తిరిగి, నాయకులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులను కలిసి 1969 జనవరిలో ఖమ్మంలో డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్‌తో రెండు వారాలు ఆమరణ దీక్ష చేయించిన మార్గదర్శి కొలిశెట్టి రామదాసు.
అప్పటి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని నాయకత్వం వహించిన మర్రి చెన్నారెడ్డి, పురుషోత్తమరావు, డా. మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డి, కేఆర్ ఆమోస్, ముశ్చర్ల సత్యనారాయణ, ఆ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించిన నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, వీబీ రాజు, జలగం వెంగళరావు వంటి వారికి మాత్రమే కొలిశెట్టి రామదాసు గురించి తెలుసు.
రామదాసు ఖమ్మం ఆర్ట్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి అప్రెంటిస్‌గా సింగరేణి బెల్లంపల్లి బొగ్గు గనుల్లో కొంతకాలం పనిచేశారు. తర్వాత పై చదువులకోసం మద్రాసు వెళ్లారు. అక్కడ రెండేండ్లు ఉండి డిప్లొమా చేసి ఇల్లందుకు వచ్చారు. రామదాసు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే నాయకుడిగా పనిచేయడంతో ఇల్లందులో బాగా ప్రజాదరణ ఉండేది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు