తెలంగాణ ఉద్యమచరిత్ర-నిధుల మళ్లింపుతో దోపిడీ మొదలు
అన్యాయాలపై అసెంబ్లీలో ప్రస్తావన
ఆర్థికపరమైన అంశాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై 1958 మార్చి 1న శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొంటూ డా. మర్రి చెన్నారెడ్డి బడ్జెట్లోని అంకెలను బట్టి చూస్తే తెలంగాణలో రెండున్నరకోట్లు మిగులు ఉన్నట్లు, ఆంధ్రలో ఒక కోటి లోటు ఉన్నట్లు స్పష్టం కాగలదు. తెలంగాణ పట్ల ప్రభుత్వం శ్రద్దగా వ్యవహరించడం లేదనడానికి ఇదే నిదర్శనం.
తెలంగాణలో వివిధ పద్దుల కింద కేటాయింపబడిన మొత్తాలను వినియోగించడం లేదనడానికి కూడా ఇదే తార్కాణం. ఉదాహరణకు.. విద్యాశాఖ కింద కేటాయింపు కంటే అమలు జరిగిన ఖర్చు 63లక్షలు తక్కువగా ఉన్నదన్నారు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు కలిసి ఆంధ్రాలోని ఒక్క గుంటూరు జిల్లాతో విద్యావిషయంలో తులతూగజాలవు. ఇందువలన తెలంగాణలో విద్యపై ఇంకా ఎక్కువ ఖర్చుపెట్టడం అవసరమై ఉండగా, మంజూరు చేయబడిన డబ్బునే పూర్తిగా ఖర్చుచేయకపోవడాన్ని డా. మర్రి చెన్నారెడ్డి తప్పుపట్టారు. ఈ నాయకులందరూ ఎలా వ్యవహరించగలరో ముందుగానే ఊహించగలిగిన తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో తమకు రక్షణలు కావాలని కోరి, వాటిని సంపాదించుకున్నారు. అయితే ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి, దాని చర్యలు, ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వారి వైఖరి చాలా ఆశ్చర్యంగా ఉన్నాయని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాంతీయ సంఘం కార్యవిధానానికి సంబంధించిన నియమావళిని తయారు చేయడానికి ప్రభుత్వానికి 14 నెలలు పట్టింది. తెలంగాణ రీజినల్ కమిటీని నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటన జారీ చేసి నెలరోజులు దాటినప్పటికీ, ఆ కమిటీని సమావేశపరచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెన్నారెడ్డి విమర్శించారు. ఆంధ్రలో రూ.38.33 కోట్లు ఆదాయమైతే ఖర్చు రూ.40.05 కోట్లు. అంటే తెలంగాణలో మిగులు చూపుతున్నారు. తెలంగాణలో రీజనల్ కమిటీ ఎందుకులే అనే ఆలోచన రెవెన్యూ మంత్రికి ఉన్నట్లున్నది అని చెన్నారెడ్డి అన్నారు.
ప్రభుత్వం చేసే ఖర్చు ఉభయప్రాంతాల నిష్పత్తి ప్రకారం జరగాలని పెద్దమనుషుల ఒప్పందంలో అంగీకరించి దాని ప్రకారం రాష్ట్ర ఆర్థికశాఖ వ్యయాన్ని 2:1 నిష్పత్తిలో చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని 1957-58 బడ్జెట్ ప్రసంగంలో రెవెన్యూ మంత్రి కళావెంకట్రావ్ శాసనసభలో తెలిపారు.
ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు వేర్వేరుగా లెక్కలు, ఆదాయాలు, వ్యయాల పట్టికలు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి తయారుచేయడం కుదరదని అకౌంటెంట్ జనరల్‌కు కూడా ఇది వీలు కాదని రాష్ట్ర ఆర్థికశాఖ మూడు నియమాలను సూచించింది.
1. రాష్ట్రకార్యాలయాలు, శాఖాధిపతుల కార్యాలయాలు మొదలైన వాటి ఖర్చు ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాలకు 2:1 నిష్పత్తిలో కేటాయించారు. ఇది ఈ ప్రాంతాల జనాభా నిష్పత్తికి దగ్గరగా ఉన్నది.
2. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఆయా ప్రాంతాలకు గల రుణాలపై వడ్డీ ఆ ప్రాంతాలే భరించాలి. భవిష్యత్తులో తీసుకునే రుణాలపై వడ్డీ 2:1 నిష్పత్తి ప్రకారం భరించాలి.
3. రాష్ట్ర ఏర్పాటుకు ముందువరకు ఉన్న పెన్షన్ల భారం ఆయా ప్రాంతాలు భరించాలి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పెన్షన్లకు సంబంధించి పెరిగే అదనపు భారాన్ని 2:1 నిష్పత్తిలో భరించాలి.
1958-59 వరకు పై పద్ధతినే అనుసరించింది ప్రభుత్వం 1959 పిబ్రవరి 26న బడ్జెట్‌పై చర్చలో (డెమొక్రటిక్ పార్టీ నాయకునిగా) పాల్గొంటూ చెన్నారెడ్డి 1957-58లో ఆంధ్రలో రూ. 34 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి రూ.37 కోట్లు ఖర్చు చేశారని, తెలంగాణలో రూ. 23కోట్లు వ్యయం చేయాలని అంచనా వేసి రూ.18 కోట్లే ఖర్చు పెట్టారని ప్రభుత్వాన్ని విమర్శించారు. రెండో ప్రణాళికలో పేర్కొన్న దేవునూరు ప్రాజెక్టును ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు. ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాలకు లెక్కలు వేర్వేరుగా చూపిస్తామని ప్రభుత్వం నేటికి ఆ పనిచేయలేదని చెన్నారెడ్డి అన్నారు.
నిర్వహణ విధానం
భూమిశిస్తు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, అటవీ, వాహనాలపై పన్ను, అమ్మకపు పన్ను, సాధారణ పరిపాలన, న్యాయశాఖ, జైళ్లు, పోలీసులు, విద్య, వైద్యం, ప్రజారోగ్యం, వ్యవసాయం, పశుసంవర్థకశాఖ, కమ్యూనిటీ డెవలప్మెంట్, విద్యుచ్ఛక్తి స్కీమ్‌లకు సంబంధించిన ఇతర ఖర్చులు ప్రాంతాల వారీగా విడిగా చూపాలి. వివిధ శాఖల హెడ్‌క్వార్టర్స్‌లో అయ్యే ఎస్టాబ్లిష్మెంట్, కామన్ సర్వీసెస్‌కు సంబంధించిన వ్యయాన్ని 2:1 నిష్పత్తిలో పంచాలి. హెడ్‌క్వార్టర్స్‌లో అయ్యే ఇతర ఖర్చులు ప్రాంతాల వారీగా చూపాలి.
నిలదీసిన రావి నారాయణరెడ్డి
రావి నారాయణరెడ్డి చర్చలో పాల్గొంటూ తెలంగాణ- ఆంధ్ర ఎమోషన్ల ఇంటిగ్రేషన్ సమస్య గురించి చెప్పాల్సిఉంది. మనమంతా కూడా విశాలాంధ్ర కోసం పోరాడాం. ముక్కోటి ఆంధ్రులు భాయ్ భాయ్‌గా ఉండాలనే ఉద్దేశంతో పోరాడాం. విశాలాంధ్ర ఏర్పడి ఐదు సంవత్సరాలు కావస్తుంది. కాని ఎమోషనల్ ఇంటిగ్రేషన్ మాత్రం జరుగలేదు. ఇంతవరకు అనుమానాలు విపరీతంగానే ఉన్నాయి. దీనికి ఈ ప్రభుత్వాలు, సంజీవరెడ్డి అవలంభించిన విధానాలే ప్రధాన కారణం. ఆనాడు విశాలాంధ్ర కోసం పోరాడినపుడు మేం ఆశించాం. మా అన్నలైన ఆంధ్రులు త్యాగం చేసి తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తారని, సహాయం చేస్తారని, కానీ అలా జరుగలేదు. వేరొక విధంగా జరిగింది. తెలంగాణ సెక్యూరిటీస్, నిజాం ప్రభుత్వం నుంచి వచ్చినవి రూ. 12 కోట్లు. దీనిపై ఓవర్ డ్రాప్ట్ తీసుకున్నారు. రిజర్వ్‌బ్యాంకును ముందు అడిగితే ఇవ్వలేదు. అపుడు వాటిని మార్టిగేజ్ చేశారు. ఓవర్‌డ్రాప్ట్ కాకుండా రూ.8 కోట్లు తెచ్చుకున్నారు. అక్కడ ఆ డబ్బు చిక్కిపోయింది. 1956 నుంచి 1961 మార్చి వరకు తెలంగాణలోని ఆదాయాన్ని, ఖర్చును ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కతీస్తే మిగిలింది రూ. 12 కోట్ల సెక్యూరిటీస్. రూ.9 కోట్ల మిగులు కలిపితే రూ.21 కోట్లు తెలంగాణకు ఉన్నదనేది నిజం. ఆ డబ్బు ఎక్కడుందో చూపమని అడిగాం. నూతనంగా ఒక్క గ్రామాన్ని విద్యుదీకరణ చేయడానికి డబ్బు లేదంటున్నారు. మేము ఆర్థికమంత్రిని అడిగాం, ఆ రూ.21 కోట్ల నుంచి ఇక నాలుగైదు కోట్లు ప్రతి సంవత్సరం ఇవ్వండి. తర్వాత లెక్కలు చూసుకుందాం అని, కాని దానికి సిద్ధంగా లేరు. వీరి వేష్ అండ్ మీన్స్ పొజిషన్ చాలా అధ్వాన్నంగా ఉంది. ఇక్కడ డబ్బంతా తీసుకెళ్లి ఆంధ్రలో ఖర్చుపెట్టారు. వారికి ఏ అధికారం ఉందని నేను అడుగుతున్నాను అన్నారు.
ప్లానింగ్, అభివృద్ధికి టీఆర్సీ సబ్‌కమిటీ
తెలంగాణ రీజినల్ కమిటీతో నియమించబడిన ప్లానింగ్& డెవలప్మెంట్ సబ్‌కమిటీ అన్ని విభాగాల్లో కూడా తెలంగాణకు సంబంధించిన ఆదాయ, వ్యయాల వివరాలు విడిగా నిర్వహించాలని తన 23వ నివేదికలో 11.06.1959లో సూచించింది. దీని పర్యవసానంగా, ఆర్థికశాఖ అకౌంటెంట్ జనరల్‌తో రీజనల్ కమిటీ చర్చించి వివిధ శాఖల ఆదాయవ్యయాలకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి పద్ధతిలో నిర్వహించాలనే విషయమై ఒక విధానాన్ని రూపొందించింది. దీని ఆధారంగా ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యయాన్ని ఆ ప్రాంత ఆదాయం నుంచే భరించాలి. మరి కొన్నింటిని 2:1 నిష్పత్తిలో పంచాలి.
ఉదా: కేంద్ర ఎక్సైజ్ పన్నులు, ఎస్టేట్స్ పన్నుల ద్వారా సమకూరే ఆదాయాన్ని 2:1 నిష్పత్తిలో చూపాలి.
ఆదాయానికి సంబంధించిన లెక్కల విధానం
భూమిశిస్తు, ఎక్సైజ్ ఆదాయాలు ఆయా ప్రాంతాల వారీగా విడిగా చూపాలి. హైదరాబాద్ ఆదాయాన్ని తెలంగాణ ఆదాయ, వ్యయాల్లో చూపాలి. నీటి పారుదలకు సంబంధించిన ఆదాయాన్ని ఆయా ప్రాంతాలకు విడిగా చూపాలి. విద్యుత్‌శాఖ ఆదాయాన్ని ఆయా ప్రాంతాల వినియోగం ఆధారంగా విడిగా చూపాలి.
రిజిస్ట్రేషన్, వాహనాలపై పన్ను, అటవీశాఖ ఆదాయం, విద్య, ప్రజారోగ్యం, జైళ్లు, పోలీస్, వ్యవసాయం, పశుసంవర్థకశాఖ, సహకార రంగం మొదలైన శాఖలలో ప్రాంతాల వారిగా ఆదాయన్ని చూపాలి.
రోడ్డు ట్రాన్స్‌పోర్టు స్కీమ్‌ల ఆదాయం రీజినల్ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది.
అన్యాయాలపై అసెంబ్లీలో నిలదీసిన సుందరయ్య
1960 మార్చి నాటికి తెలంగాణ అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న డబ్బు రూ. 21.07 కోట్లని ఆర్థికమంత్రి వెల్లడించారు. 1961, జూలై 25న ప్రతిపక్షనేత పుచ్చలపల్లి సుందరయ్య గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొంటూ తెలంగాణకు ఉన్న సెక్యూరిటీస్, రెవెన్యూ, సర్ప్లస్లోని డబ్బు ఆంధ్రప్రాంతంలో ఖర్చు పెట్టడం జరిగింది. గవర్నర్ ప్రసంగంలో దీని గురించే తెలుపలేదు. తెలంగాణలో అనుకున్నదానికంటే నాలుగుకోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టామని, అన్ని సవ్యంగానే ఉన్నాయని మాత్రమే వెల్లడించారు. అయితే తెలంగాణకు ఉన్న రూ.12 కోట్ల సెక్యూరిటీలు, రెవెన్యూ సర్ప్లస్లోని రూ.12 కోట్లు, ఇంకొక నాలుగైదు కోట్లు అదనంగా కలిపి ఈ ఐదు సంవత్సరాలలో ఖర్చుపెట్టి ఉంటే తెలంగాణ ఇప్పటికంటే చాలా అభివృద్ధి జరిగి ఉండేదన్నారు.
పీవీ నరసింహారావు
పీవీ నరసింహారావు చర్చలో పాల్గొంటూ ఎంత ఖర్చు చేసినా తెలంగాణకు అది తక్కువే. తెలంగాణ వెనకబడిన ప్రాంతం కనుక ఇతర ప్రాంతాలతో సమానమైన స్థితికి వచ్చేవరకూ మనం చేస్తూనే ఉండాల్సిందేనని సుందరయ్య చెప్పింది చాలా ప్రశంసనీయమైన సెంటిమెంటు. దీనితో తాను ఏకీభవిస్తున్నానన్నారు. బై అండ్ లార్జ్ తెలంగాణ ప్రజలకు కావాల్సిన ముఖ్య అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఎంత తొందరగా చర్యలు తీసుకుంటే అంత తొందరగాను, తెలంగాణ, ఆంధ్ర ఉభయ ప్రాంతాల మధ్య ఎమెషనల్ ఇంటిగ్రేషన్, భావనాత్మకమైన ఏకీకరణ రావడానికి అవకాశం ఉంటుందని మనవి చేస్తున్నానన్నారు. తెలంగాణ ప్రాంతంలోని తెలంగాణ ప్రజానీకం ఎంతోకాలం నుంచి ఆశిస్తున్న పోచంపాడు ప్రాజెక్టుకు ఇప్పటికైనా మంజూరు వస్తుందని ఆశిస్తున్నాను. మంజూరు వచ్చినప్పటికీ మనం నాలుగుకోట్లే మూడవ పంచవర్ష ప్రణాళికలో కేటాయించుకున్నాం. ఇది తెలంగాణ ప్రజలకు సంతృప్తికరంగా లేదని మనవి చేస్తున్నానని అన్నారు పీవీ నరసింహారావు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు