హైదరాబాద్ సివిల్ సర్వీస్ ఎప్పుడు ఏర్పడింది?
తెలంగాణలో బహమనీల కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్య, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో జరిగిన అన్యాయాలకు ముల్కీ సమస్య నిలువుటద్దం. ఈ అంశంపై గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముల్కీ విధానం చారిత్రక నేపథ్యం, ముల్కీ నిబంధనలు, ఏ కాలంలో ఎలా అమలు చేశారో తెలుసుకుందాం..
ముల్కీ సమస్య-చారిత్రక నేపథ్యం
#విద్య ఉపాధి రంగాల్లో ముల్కీలకు ప్రాధాన్యం అనే అంశం అసఫ్‌జాహీల కాలం నుంచి అమలులో ఉంది. ముల్క్ అంటే ఉర్దూలో దేశం అని అర్థం. ముల్కీ అంటే దేశీయుడని అర్థం. చారిత్రకంగా చూస్తే దక్కన్ ప్రాంతంలో ముల్కీ, ముల్కీయేతర భావన బహమని, కుతుబ్‌షాహీల కాలం నుంచి ఉంది. మధ్యయుగాల్లో పర్షియా దేశం నుంచి వచ్చిన వారు బహమనీ రాజ్యంలో అనేక పదవులు పొందారు. వారిని అఫాఖీలుగా పిలిచేవారు. దక్కనీయులను ముల్కీలు అనేవారు. ఉన్నత స్థానంలో ఉన్న అఫాఖీలకు, ముల్కీలకు మధ్య ఘర్షణలు జరిగాయి. విద్య, ఉద్యోగ రంగాల్లో బయటి వారి (పర్షియన్స్) ప్రమేయాన్ని స్థానిక దక్కనీయులు నిరసించారు.
బహమనీ సుల్తాన్లు పర్షియా దేశానికి చెందినవారు కావడం వల్ల అఫాఖీలకు ప్రాముఖ్యం ఇచ్చి, స్థానిక దక్కనీయులపై పక్షపాతం చూపించారు. బహమనీ సుల్తాన్ల పాలనలో అఫాఖీలకు, దక్కనీయులకు మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత దక్కన్/హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన కుతుబ్‌షాహీల కాలంలో కూడా ముల్కీ, నాన్ ముల్కీ సమస్య కొనసాగింది. అక్కన్న, మాదన్న పరిపాలనా కాలంలో ముల్కీలకు ప్రాధాన్యం పెరిగింది. అందువల్ల అఫాఖీలు నిరాదరణకు గురయ్యారు. వారు కుతుబ్‌షాహీ పాలనను అంతమొందించడానికి మొఘల్ చక్రవర్తులకు సాయపడ్డారు. అందువల్ల అసఫ్‌జాహీ రాజులు ముల్కీ, నాన్‌ముల్కీ అంశంపై జాగ్రత్త వహించారు.
# ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ పరిపాలనా కాలంలో బయటి వారి నియామకాలకు వ్యతిరేకంగా స్థానికులు/ముల్కీలు విజ్ఞాపన పత్రం సమర్పించారు. దాని ఫలితంగా 1888లో నిజాం ప్రభుత్వం గెజిట్‌లో మొదటిసారిగా ఉద్యోగ నియామకాల్లో ముల్కీ ప్రస్తావన వచ్చింది. అంతేకాకుండా సంస్థానంలోని ఉద్యోగాలన్నీ అర్హతల మేరకు ముల్కీలకు ఇవ్వాలనే ప్రస్తావన కూడా ఉన్నది. వాస్తవానికి 1910లో ఆనాటి ప్రధానమంత్రి మహరాజా కిషన్ పెర్షాద్ ముల్కీలకు ప్రాధాన్యం ఇచ్చి కొంత మేరకు న్యాయం చేశాడు. మొదటి సాలార్జంగ్ పరిపాలనా కాలంలో స్థానికులకు, ముఖ్యంగా కులీన వర్గాలకు చెందిన యువకులకు మంచి విద్యావకాశాలు కల్పించి, ఉన్నత ఉద్యోగాల్లో నియమించడానికి ఒక ప్రత్యేక నోటిఫికేషన్‌ను జారీ చేశాడు. కానీ అది అమలు కాలేదు. అంతేకాకుండా నిజాం రాజ్యంలో సమర్థవంతమైన పరిపాలన అందించడానికి ఆయన మతం, ప్రాంతీయ, భాషా భేదాలు లేకుండా ఉత్తర భారతదేశం నుంచి సుశిక్షుతులైన, అనుభవం, సామర్థ్యం కలిగిన అనేకమంది అధికారుల్ని ఆహ్వానించి ఉన్నతోద్యోగాల్లో నియమించాడు. తత్ఫలితంగా ఉద్యోగ, విద్యారంగాల్లో స్థానికేతరుల ప్రభావం, ఆధిక్యం పెరిగింది.
# స్థానికులకు ప్రాధాన్యం కలిగించి ఉన్నతోద్యోగాల్లో నియమించడానికి రెండో సాలార్జంగ్ ప్రణాళికలు రూపొందించాడు. ఆనాటి ఆచారం ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో ముల్కీలు 52 శాతం ఉన్నప్పటికీ జీతంలో వారి వాటా 42 శాతం మాత్రమే. ముల్కీలను ఉన్నతోద్యోగాల్లో నియమించడానికి 1884లో ప్రధానమంత్రి రెండో సాలార్జంగ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్‌కు ఒక మెమొరాండం సమర్పించి ఆమోదం పొందాడు. కౌన్సిల్ తీర్మానం ప్రకారం హైదరాబాద్ నిజాం సివిల్ సర్వీస్ ఏర్పాటయ్యింది. 1885 జనవరిలో పోటీ పరీక్ష నిర్వహించి 34 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 1886లో ఫైనల్‌గా 11 మంది విజయం సాధించారు. 1884లో ఏర్పాటైన హైదరాబాద్ సివిల్ సర్వీస్ ఆ తర్వాత కూడా కొనసాగింది. ఆరో నిజాం కాలంలో స్థానికులకు ఉద్యోగ నియామకాల్లో ప్రాముఖ్యత కల్పించినప్పటికీ ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు, ఉద్యోగ అర్హతలు, అనుభవం కలవారు తగినంతగా లేనందున స్థానికేతరులు ప్రధానమంత్రి అనుమతితో ఉద్యోగాలు పొందారు. ఈ పరిస్థితులు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో కూడా కొనసాగాయి.
1884లో హైదరాబాద్ రాజ్యంలో పర్షియన్‌కు బదులు ఉర్దూను రాజభాషగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత విద్యావకాశాలు పెరగడం వల్ల అర్హత కలిగిన ముల్కీలకు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించాలని విద్యావంతులు కోరారు. సాలార్జంగ్ సంస్కరణల నేపథ్యంలో ఉద్యోగ రంగంలో స్థానికేతరుల ప్రభావం, 19వ శతాబ్దపు చివరి దశకాల్లో పెరిగింది. ఏడో నిజాం పరిపాలనా కాలంలో ముల్కీ, నాన్‌ముల్కీ అంశం రాజకీయ, పౌర సమాజంలో ప్రత్యేక అంశంగా చోటుచేసుకుంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1919లో ఒక ఫర్మానా జారీ చేసి అందులో ముల్కీ నిబంధనలను స్పష్టంగా రూపొందించాడు.
ముల్కీలను నాలుగు కేటగిరీలుగా విభజించాడు.
1. ముల్కీ పురుషుడికి జన్మించిన సంతానం.
2. హైదరాబాద్ సంస్థాన ప్రభుత్వంలో 15 సంవత్సరాలు పూర్తిచేసిన వారి సంతానం.
3. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి 15 సంవత్సరాలు హైదరాబాద్ రాజ్యంలో స్థిరనివాసం ఏర్పరుచుకొని మళ్లీ తమ ప్రాంతానికి తిరిగి వెళ్లనని ప్రమాణ పత్రంపై సంతకం చేసినవారు.
4. ముల్కీ పురుషుడి భార్య కూడా ముల్కీ అవుతుంది.
నిజాం సబ్జెక్ట్ లీగ్
# ముల్కీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికుల్ని నియమించాలని నిజాం ప్రభుత్వం నిర్ణయించింది. 1919 నిజాం ఫర్మానాలో సివిల్ సర్వీసెస్‌కు సంబంధించిన నియమ నిబంధనలను పొందుపరిచారు. అయినప్పటికీ ముల్కీ నిబంధనల అతిక్రమణ కొనసాగింది. నిజాం ప్రభుత్వంలోని కొన్ని శాఖల్లో స్థానికేతరులను నియమించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యనభ్యసించిన స్థానికులకు సరైన ఉపాధి అవకాలు లభించకపోవడం, ఉద్యోగ రంగాల్లో స్థానికుల ప్రమోషన్ల అవకాశాలు దెబ్బతిన్నాయి. స్థానికేతరుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన విద్యావంతులైన మేధావులు తమ హక్కుల పరిరక్షణ కోసం సమాయత్తమయ్యారు. దీనికి స్పందనగా తిరిగి 1930 దశకంలో నిజాం రాజు మరొక ఫర్మానా జారీ చేసి హైదరాబాద్ రాజ్యంలో ఉద్యోగ నియామకాలపై విద్యావంతులైన, నైపుణ్యం కలిగిన ముల్కీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసం స్థానిక ముల్కీలు నిజాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
# కొంతమంది విద్యావంతులు ముల్కీల హక్కుల పరిరక్షణ కోసం సంఘటితమై 1934లో ఒక సంస్థను స్థాపించారు. దీన్నే నిజాం సబ్జెక్ట్ లీగ్ (నిజాం ప్రజల సంఘం) అంటారు. ఆ తర్వాత ఈ సంస్థ 1935 నాటికి నిజాం ముల్కీ లీగ్‌గా రూపాంతరం చెందింది. ఈ సంఘంలో అనేకమంది హిందూ, ముస్లిం, పార్శీ మేధావులు చురుకైన పాత్ర నిర్వహించారు. వారిలో బూర్గుల రామకృష్ణారావు, మందుముల నర్సింగరావు, మీర్ అక్బర్ అలీఖాన్, మీర్ హస్నుద్దీన్ ముఖ్యులు. ‘హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్’ అనేది ముల్కీ సంఘం ప్రధాన నినాదం. ఈ సంస్థకు నిజాం మంత్రి మండలిలో రాజకీయ శాఖ నిర్వహించిన నవాబు సర్ నిజామత్ జంగ్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ సంస్థలో 18 మంది కార్యనిర్వాహక సభ్యులు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ముగ్గురు కార్యదర్శులు, ఒక కోశాధిపతి ఉన్నారు. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ వ్యవస్థను రూపొందించారు. నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 1938 రిపోర్టు ఆధారంగా 27 ఏప్రిల్ 1947న హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను స్థాపించారు.
ముల్కీ రూల్స్ ఉల్లంఘన
# నిజాం కాలంలో ముల్కీ ఉద్యమానికి, స్థానికుల ప్రాధాన్యతకు గుర్తింపు లభించింది. నిజాం అలీఖాన్ పాలన చివరి రోజుల్లో చెలరేగిన రజాకార్ ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, జాయిన్ ఇండియా ఉద్యమం రాజకీయ అనిశ్చితికి దారితీశాయి. 1948లో పోలీసు చర్య అనంతరం ఏర్పడిన మిలిటరీ ప్రభుత్వం, 1950లో వెల్లోడి ఆధ్వర్యంలో ఏర్పడిన పౌర ప్రభుత్వాల కాలంలో విద్య, ఉద్యోగ రంగాల్లో స్థానికులకు అన్యాయం జరిగింది. 1948-52 సంవత్సరాల మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నియమించిన మిలిటరీ, సివిల్ అధికారుల పాలనలో ఉంది. ఈ కాలంలో ముల్కీ నిబంధనలను అతిక్రమించి అనేకమంది స్థానికేతరులను ఉద్యోగాల్లో నియమించారు. నిజాం రాజు నామమాత్రంగా రాజ్యాధిపతిగా ఉండటం వల్ల స్థానికుల హక్కులను పరిరక్షించలేదు. అంతేకాకుండా 1949లో తీసుకున్న నిర్ణయం ప్రకారం విద్యా సంస్థల్లో ఉర్దూకు ప్రత్యామ్నాయంగా తెలుగును బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టారు. పరిపాలనా యంత్రాంగం ఆధునికీకరణ ఫలితంగా ఇంగ్లిష్‌ను పాలనా భాషగా ప్రవేశపెట్టారు. దాని ఫలితంగా స్థానికేతరులను పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లో నియమించారు. ఆ క్రమంలోనే ఉర్దూ భాష ప్రాధాన్యం తగ్గి అనేకమంది స్థానికులను ఉద్యోగాల నుంచి తొలగించారు. అదే సమయంలో కోస్తాంధ్ర, మరఠ్వాడా తదితర ప్రాంతాల నుంచి అనేకమంది ఉపాధి, ఆర్థిక అవసరాల కోసం తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చారు.
# పోలీస్ చర్యల తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో విద్యావ్యాప్తి, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను మిలిటరీ ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా 1949 జూన్‌లో రాష్ట్రంలోని సెకండరీ పాఠశాలలన్నింటిలో ప్రాంతీయ భాషలో తెలుగు మాధ్యమంలో విద్యాబోధన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పోలీస్ చర్యకు పూర్వం ఉర్దూ బోధనా భాషగా ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రాంతీయ భాషల్లో బోధించే ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు. అందువల్ల కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన నాన్‌ముల్కీలు ఉద్యోగాల్లో నియమితులయ్యారు. దాని పర్యవసానంగా తెలంగాణలోని విద్యాధికుల్లో నిరాశ, నిస్పృహలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ముస్లిం ఉద్యోగులు వేల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు.
# 1952లో మొదటి సాధారణ ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పటికీ విద్య, ఉపాధి రంగాల్లో స్థానికేతరుల ప్రాబల్యం తగ్గలేదు. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎనిమిది వేల ఉద్యోగాల్లో స్థానికేతరులదే మెజార్టీ. వాస్తవానికి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న కోస్తాంధ్ర వారికి ఇంగ్లిష్, తెలుగులో ప్రావీణ్యం ఉండటం వల్ల తెలంగాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్ని సంపాదించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. హైదరాబాద్ రాజ్యంలో ముల్కీ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ అక్రమ మార్గంలో అనేకమంది ముల్కీ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాల్లో చేరారు. ఆనాడు స్థానికేతరుల ప్రవేశంతో హైదరాబాద్ ప్రభుత్వ యంత్రాంగంలో లంచగొండితనం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. నెల్లూరి కేశవస్వామి తన చార్మినార్ కథల సంపుటిలో ఒకచోట ఇలా అంటాడు ‘మా బంధువుల్లో ఒకాయన యూనియన్ మిలిటరీతో పాటు సివిల్ టీంలో నల్లగొండకు తహసీల్దార్‌గా వచ్చాడు. ఆయనేదో నాకు దారి చూపిస్తాడన్న నమ్మకం ఉండేది. కానీ తర్వాత్తర్వాత తెలిసింది.. సివిల్ టీంలో వచ్చినవారంతా రామాయణంలోని కిష్కింధాపుర నివాసుల వారసులనీ, రావణుడి మరణానంతరం లంకను కొల్లగొట్టినట్టే ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్నంతా దోచుకున్నారనీ, తమ చేతికందిందల్లా వీలైనంత మట్టుకు తామే స్వాహా చేశారని అప్పటి నుంచే తెలంగాణలో ఇచ్చి పుచ్చుకునే ఆచారం ప్రబలంగా పాకిందని’.
# ఉద్యోగులతో పాటు కృష్టా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, వ్యవసాయం మీద ఆధారపడిన వివిధ వృత్తుల వాళ్లు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు వచ్చి స్థిరపడ్డారు. నిజాం కాలంలో అమల్లో ఉన్న ‘ల్యాండ్ కొలనైజేషన్ స్కీమ్’ను ఉపయోగించుకొని నల్లరేగడి భూములు, నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూములను తక్కువ ధరలకే కొనుగోలు చేసి వ్యవసాయ రంగంపై ఆధిపత్యాన్ని ఏర్పరుచుకున్నారు. తెలంగాణలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో అంటే ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో కోస్తాంధ్ర కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాల రైతాంగం నూతన గ్రామాలను ఏర్పరుచుకొని స్థిరపడ్డారు. అందువల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కొత్తూరు, కమ్మగూడెం, గుంటూరుపల్లి, రెడ్డిపల్లి లాంటి ఆంధ్రా సెటిలర్ల నివాస స్థలాలు ఏర్పడ్డాయి. వైరా, పాలేరు, మూసీ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రాంతాల్లో స్థానికేతర రైతులు భూములు కొనుగోలు చేసి వ్యవసాయ రంగం ఆధునీకరణకు తోడ్పడ్డారు.
ముల్కీ ఉద్యమం
# నిజాం పరిపాలనా కాలంలో ప్రారంభమైన ముల్కీ పరిరక్షణ ఉద్యమం 1950 దశకంలో ఒక ప్రత్యేక ఉద్యమంగా మారింది. 1948 పోలీస్ చర్య తర్వాత ఏర్పడిన మిలిటరీ పాలన సమయంలో ముల్కీ నిబంధనలను ఉల్లంఘించారు. పాత ఉద్యోగులు, ముఖ్యంగా ముస్లింల పట్ల అనుమానం, వివక్ష పెరిగాయి. దాని ఫలితంగా అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం, అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం జరిగింది. అంతే కాకుండా మిలిటరీ పాలనలో నాన్ ముల్కీల (ఆంధ్రుల) ప్రభావం పెరిగింది.
అడపా సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు