1948 తర్వాత తెలంగాణ..
తెలంగాణ చరిత్ర, ఉద్యమానికి (స్వరూపానికి) సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించిన సిలబస్ ఆధారంగా అభ్యర్థుల అవగాహన కోసం 150 మార్కుల పేపర్‌పై ఎలాంటి పట్టు సాధించాలి? ఏయే అంశాలను ఎక్కువగా అధ్యయనం చేయాలి? మొదలైన అంశాలను ఏ కోణంలో ప్రిపరేషన్ ప్రారంభించాలి? లాంటి ప్రశ్నలను నివృత్తి చేసేందుకు సిలబస్ ప్రకారం విశ్లేషిద్దాం.
మూడు దశలు (మిత, అతివాద, గాంధీయుగం) భారత స్వాతంత్య్రోద్యమంలో ఉన్నట్లుగానే తెలంగాణ చరిత్రలో కూడా ఉన్నాయి. అవి.. 1) ది ఐడియా ఆఫ్ తెలంగాణ (తెలంగాణ భావన దశ) (1948-70)
2) మొబిలైజేషన్ దశ (సమీకరణ దశ) (1970-1990)
3) ఫ్రీడం ఆఫ్ తెలంగాణ (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ) (1990-2014)
ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70):
ఈ దశలో హైదరాబాద్ సంస్థానంలోని భిన్న సంస్కృతి, ప్రజల ఆహారపు అలవాట్లు ఉదా. పాయ, హలీం, కుల్చా మొదలైన ఆహారాలు, ఉర్దూ భాష వాటిపై అవగాహన అభ్యర్థులకు తప్పనిసరి. తెలంగాణ భౌగోళికాంశాలు అంటే సరిహద్దులు. సాలార్జంగ్-I సంస్కరణల్లో అతని రెవెన్యూ మంత్రి, జిలాబందీ, ఆర్థిక, విద్యా సంస్కరణలు చాలా ప్రాధాన్యతగలవి. తెలంగాణలోని ముఖ్య జాతరలు సమ్మక్క-సారక్క, ఏడుపాయల (మెదక్), గొల్లగట్టు (నల్లగొండ) మొదలైనవి, హస్తకళలు పోచంపల్లి-ఇక్కత్, వరంగల్-రత్నకంబళ్లు, మెదక్-అద్దకం పరిశ్రమ, ఖమ్మం-లేసుల పరిశ్రమ, నిర్మల్-కొయ్యబొమ్మలు, కరీంనగర్-వెండి నగిషీ (ఫిలిగ్రి) మొదలైనవి. జానపదులు ఖమ్మం, నల్లగొండ-జముకులకథ, శారద కథ (బుర్రకథలో ప్రసిద్ధిచెందినవారు సుంకర సత్యనారాయణ), చిరుతల భజన-కరీంనగర్ మొదలైనవి ముఖ్యాంశాలు.
తర్వాత ముల్కీ ఉద్యమం (1919, 1952, 1969, 1975, 1985ల్లో జరిగిన సంఘటనలు), పోలీస్చర్యపై వచ్చిన సుందర్‌లాల్ కమిటీ, 1952లో హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు పాత్ర, ఫజల్ అలీ కమిషన్-1953, చిన్న రాష్ర్టాలపై వివిధ నాయకుల అభిప్రాయాలు. 1956 పెద్ద మనుషుల ఒప్పందంపై ఆగస్టు 14న జరిగిన సంతకాలు, ప్రాంతీయ కమిటీ (1958) తీరు తెన్నులు లోతుగా అధ్యయనం చేయాలి.1969 ఉద్యమంలో ఆమోస్, స్త్రీల సత్యాగ్రహం (సదాలక్ష్మి పాత్ర), కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా, మదన్మోహన్ స్థాపించిన తెలంగాణ ప్రజాసమితి, జీవో 36, 8 సూత్రాలు, పంచ సూత్రాలపై లోతైన విషయసేకరణ, నూతన అంశాలపై నోట్స్ తయారుచేసుకుంటే 50 మార్కులు సాధించవచ్చు.
సమీకరణ దశ (1970-90):
జై ఆంధ్ర ఉద్యమం (1972), వివిధ జీవోలు-కమిటీలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఉల్లంఘనలు, సుందరేశన్ కమిటీపై 610 జీవో ఏర్పాటు, నక్సల్స్, రైతుకూలీ, సిరిసిల్ల, జగిత్యాల, ఇంద్రవెల్లి మొదలైన ఉద్యమాలు. ఆదివాసీలు, రాంజీగోండ్, కొమురం భీం, 1980లో వివిధ పార్టీల తీరుతెన్నులు, భాషాసంస్కృతులపై వలసవాదుల దాడులు మొదలైన అంశాలు ప్రామాణిక గ్రంథాల నుంచి వివరాలు సేకరించాలి. 1990 సరళీకరణ, ప్రైవేటీకరణ వాటి పర్యవసానాలు, అసమానతలపై గ్రాఫ్ మోడల్, వివిధ అంశాలు రూపొందించుకోవాలి. మేధోమథనాలు, చర్చలు చాలావరకు విశ్లేషణలతో కూడిన విషయసేకరణ చేసుకోవాలి.
రాష్ట్ర ఆవిర్భావ దశ (1990-2014):
భువనగిరి సమావేశంలో జరిగిన అంశాలు, పాల్గొన్న నాయకుల తీర్మానాలు ప్రత్యేకంగా నోట్స్ రాసుకోవాలి. వరంగల్ డిక్లరేషన్‌లో పొందుపర్చిన అంశాలేంటి? నాయకులు ఎవరు? వీటిని చాలావరకు సమకాలీన, తులనాత్మక అంశాలను గణాంక పద్ధతిలో, వరుసక్రమంలో రాసుకొని చదువుకోవాలి.
-2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, గిర్గ్లానీ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా పోరాటం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, చిదంబరం రెండు ప్రకటనలు (2009 డిసెంబర్ 9, 23), రాజకీయ జేఏసీ డిసెంబర్ 24, 2009న ఆవిర్భావం, వివిధ సంఘాలు, ఉద్యమ నాయకులు, విద్యార్థుల బలిదానాలు వీటిపై గ్రూప్-I తరహాలో కాన్సెప్ట్ పద్ధతిలో చదివితే మంచిది. మహిళల పాత్ర, కవులు, మేధావులు, కళాకారులు అన్ని వర్గాల పాత్ర, మిలియన్ మార్చ్, సాగరహారం, శ్రీకృష్ణ కమిటీ ప్రక్రియలు, పార్లమెంట్లో తెలంగాణ ఆవిర్భావ ప్రకటనలు 2014 ఎన్నికలు, తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు, కమలనాథన్ కమిటీ, ఉద్యోగుల విభజన మొదలైన అంశాలు కీలకం.
తెలంగాణ చారిత్రక నేపథ్యం-నైసర్గిక అంశాలు ఎలా చదవాలి?
భారతదేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2న 10 జిల్లాలు, 68 పట్టణాలు, 37 మున్సిపాలిటీలు, 42 రెవెన్యూ డివిజన్లు, 457 మండలాలతో (ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, వీఆర్‌పురం, భద్రాచలం, బూర్గంపాడు, కూనవరంలను, ఈ మండలాల్లోని 275 రెవెన్యూ గ్రామాలు, 1,88,412 మంది ప్రజలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు) 12వ పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది (దేశంలో విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రం రాజస్థాన్). తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం (అంటే దీనికి సముద్రతీరంగాని, ఇతర దేశాలతో సరిహద్దుగాని లేదు, ఇలాంటివి దేశంలో హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ మొదలైనవి ఉన్నాయి).
జిల్లాలు – ప్రాధాన్యతలు
కరీంనగర్ :
సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుతో వచ్చింది. (కరి అంటే ఏనుగు గతంలో ఈ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా సంచరించడంతో దీనికి కరినగరం అని పేరు వచ్చిందని కొందరి వాదన. పూర్వం కాకతీయులు దీనిని సబ్బినాడు అని పిలిచేవారు. 1905కు పూర్వం ఎల్గందుల జిల్లాగా ప్రసిద్ధి. సిల్వర్ఫిలిగ్రికి ప్రసిద్ధి. రైస్‌బౌల్ ఆఫ్ తెలంగాణ అని కూడా చెప్పవచ్చు.
మహబూబ్‌నగర్ :
దీనిని పాలమూరు అని లేదా రుక్మమ్మపేట అని పిలుస్తారు. ఈ పట్టణ ముఖ్యకేంద్రం నాగర్‌కర్నూల్. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1869-1911 మధ్యకాలంలో తన పేరుతో మహబూబ్‌నగర్ జిల్లాగా పేరు పెట్టారు.
వరంగల్ :
ఏకశిలానగరం, ఆంధ్రానగరిగా ప్రసిద్ధి చెందినది. కాకతీయులు, ముసునూరి వంశాల పాలకులకు ఇది రాజధాని. ఇది రత్నకంబళ్లకు ప్రసిద్ధి. మొదటి ప్రతాపరుద్రుడు కాకతీయరాజు ఈ పట్టణాన్ని నిర్మించి తన రెండో రాజధానిగా చేసుకున్నారు. కాకతీయుల్లో గొప్పరాజైన గణపతిదేవుడు హన్మకొండ నుంచి ఓరుగల్లుకు తన రాజధానిని మార్చారు. నోట్: హన్మకొండ నుంచి ఓరగల్లుకు రాజధానిని మార్చిన రాజు ఎవరు? అనే ప్రశ్నకు కచ్చితంగా గణపతిదేవుడు అని మాత్రమే రాయాలి. మొదటి ప్రతాపరుద్రుడు కేవలం ఈ పట్టణాన్ని నిర్మించి రెండో రాజధానిగా మాత్రమే చేసుకున్నారు.
ఖమ్మం :
దీనిని నృసింహాద్రి పేరుతో పిలిచేవారు. నారసింహాలయం నుంచి వచ్చింది. ఉర్దూ భాషలో కంబ అంటే రాతిస్తంభం కాబట్టి దీనికి ఖమ్మం, ఖమ్మం మెట్టుగా పేరు వచ్చింది. 1969 తొలి, మలి తెలంగాణ ఉద్యమానికి పునాది ఈ జిల్లా కావడం విశేషం. తొలి నిరాహార దీక్ష చేసిన విద్యార్థి రవీంద్రనాథ్ (1969 జనవరి), మలి ఉద్యమంలో కేసీఆర్ (2009 నవంబర్) నిరాహార దీక్షకు కేంద్రం ఈ జిల్లానే. కోయలు (గిరిజన జాతి) ఎక్కువగా ఉన్నారు. కిన్నెరసాని నది, వైరా చెరువు, భొగత జలపాతం ప్రసిద్ధిచెందిన ప్రాంతాలు.
ఆదిలాబాద్ :
దీనికి బీజాపూర్ సుల్తాన్ మహ్మద్ ఆదిల్షా పేరుతో ఆదిలాబాద్ అని పేరు వచ్చింది. మొదట ఇది ఆదిల్షా బాద్, ప్రాచీనకాలంలో ఇది ఏదులాబాద్ ఎడ్ల సంతలకు ప్రసిద్ధి. గోండ్ జాతులు ఎక్కువగా కలరు. వీరిలో పట్టుపురుగుల పెంపకానికి అనువైన మల్బరీ చెట్లు ఎక్కువగా ఉన్నాయి.
హైదరాబాద్ :
1948లో జిల్లాగా ఏర్పడింది. పోలీస్ చర్య (1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు) ఫలితంగా అతాఫ్-ఆ-బాల్డా, భగత్ జిల్లాలను కలిపి హైదరాబాద్ జిల్లాగా మార్చారు. 1591లో ఈ పట్టణాన్ని మీర్ మహ్మద్ అష్రఫాది అనే ఇరాన్ ఇంజినీర్ మహ్మద్ కులీ కుతుబ్‌షా కాలంలో నిర్మించారు. భాగమతి పేరుతో భాగ్యనగర్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం బిద్రి కళలకు ప్రసిద్ధి. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడి ప్రజల్లో హిందూ-ముస్లిం సోదరతత్వం ఎక్కువ. పాతబస్తీలోని ప్రజల జీవన ఆహారం పాయ. షీర్‌కుర్మా (సేమియా), హలీం ప్రసిద్ధి.
రంగారెడ్డి :
1978లో కొండా వెంకటరంగారెడ్డి పేరుతో ఏర్పడింది. జిల్లా కేంద్రం వికారాబాద్. గతంలో గుల్షానాబాద్ జిల్లాలో భాగంగా ఉంది. తెలంగాణ ఊటిగా ప్రసిద్ధిచెందిన అనంతగిరి కొండలు నెలకొని ఉన్నాయి.
మెదక్ :
ఇది మెతుకుసీమగా ప్రసిద్ధి. 1956లో మెదక్ జిల్లాగా ఏర్పడింది. 1977లో ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ది కూడా ఇదే జిల్లా. బర్రెంకల జయదేవుడు ఇక్కడి ప్రముఖ వ్యక్తి. పూర్తి వ్యవసాయ ఆధారిత గ్రామంతిమ్మానగర్ ఇక్కడే ఉంది. మంజీరా నది ఒడ్డున ఏడుపాయలలోని వనకనకదుర్గా ఆలయం ప్రసిద్ధి. మెదక్‌లోని చర్చి ఓ అద్భుతమైన వారసత్వ సంపద. డయోసిస్, వాటికన్‌ల తర్వాత స్థానం దీనిదే.
నిజామాబాద్ :
పూర్వం ఇందూర్ లేదా ఇంద్రపురిగా ప్రసిద్ధి. రాష్ట్రకూట రాజు ఇంద్రవల్లభ పేరుతో ఇందూరు అని పేరువచ్చింది. నిజాంరాజు పేరు మీదుగా నిజాంబాద్గా మార్చారు. క్రీ.పూ. 600లో అస్మక రాజ్యంగా పిలువబడిన ప్రాంతం ఇదే. వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని బోధన్ ఈ జిల్లాలోనే ఉంది. ప్రసిద్ధ 100 స్తంభాల శైవాలయం ఇక్కడే ఉంది.
నల్లగొండ :
పూర్వపు నీలగిరి జిల్లానే నేటి నల్లగొండ. స్వాతంత్య్ర సమరయోధులు, పోరాటయోధులకు పుట్టినిల్లు. నందికొండ కాలక్రమంలో నల్లగొండగా మారింది. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఈ జిల్లా ప్రసిద్ధి. భూదాన ఉద్యమం జరిగిన ప్రాంతం. ఇక్కత్ కళలకు ప్రసిద్ధి చెందిన పట్టణం పోచంపల్లి ఇక్కడే ఉంది. దేశంలోనే తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయం నాగార్జునసాగర్ (1982)లో నెలకొల్పారు. ఇది ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంది.
-తెలంగాణ రాష్ట్రగీతం అందె ఎల్లయ్య (అందెశ్రీ) రాసిన జయజయహే తెలంగాణ గీతం, రాష్ట్ర పక్షి పాలపిట్ట (ఇది ఒడిశా, బీహార్ రాష్ర్టాలకు కూడా ఉంది). రాష్ట్ర జంతువు కృష్ణజింక. రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు. దీనిని దసరా పండుగ సమయంలో బంగారం అని అంటారు. సమ్మక్క సారక్క జాతరలో బంగారం అని బెల్లాన్ని పిలుస్తారు. రాష్ట్ర పుష్పం తంగేడు. బతుకమ్మల్లో ప్రధాన ఆకర్షణ ఇదే. దీంతోపాటు గునుగు పూలను కూడా వినియోగిస్తుంటారు. రాష్ట్ర పండుగలు బతుకమ్మ, బోనాలు. తెలంగాణ ప్రజల ప్రధాన ఆహారం గటుక (జొన్న సంకటి). ప్రస్తుతం వరి అన్నం.
-రాష్ట్ర వృక్షం – జమ్మిచెట్టు – శాస్త్రీయ నామం ప్రాసొపిస్ సినరియా
-పుష్పం – తంగేడు (పూలుపూచే చెట్టు-తర్వార్)- శాస్త్రీయ నామం ట్రేనర్స్ కాషిమా
-పక్షి – పాలపిట్ట – శాస్త్రీయ నామం కొరాసియస్ బెంగలెన్సిస్
-జంతువు – కృష్ణజింక – శాస్త్రీయ నామం ఏక్సిస్ ఏక్సిస్
తెలంగాణ భావన
ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం క్షేత్రాల మధ్య ప్రాంతంగా త్రిలింగగా విద్యానాథుడు (కాకతీయుల చివరి రాజైన రెండో ప్రతాపరుద్రుని ఆస్థానంలోని కవి) తన ప్రతాపరుద్ర యశోభూషణంలో పేర్కొన్నారు. విద్యానాథుడే బహుశా అగస్త్యుడు (బాలభారతం, కృష్ణచరితం రచించినది, ఇతని శిష్యురాలు గంగాదేవి మధుర విజయం గ్రంథకర్త, విజయనగర రాజ్యంలో నివసించిన ఏకైక చరిత్రకారిణి) అయ్యుండొచ్చు. 1323 కాకతీయ రాజ్య పతనానంతరం అల్దాఉద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవి అమీర్‌ఖుస్రో (భారతదేశపు చిలుకగా ప్రసిద్ధిచెందిన కవి, చరిత్రకారుడు, సూఫీ మత సన్యాసి, సంగీత విద్వాంసుడుగా ప్రసిద్ధి. 3 రాజ్యాల్లో (బానిస, ఖిల్జీ, తుగ్లక్) బాల్బన్ నుంచి ఘియాజుద్దీన్ తుగ్లక్ వరకు 8 సుల్తాన్ల వరకు పనిచేశారు) తన రచనల్లో తిలింగగా పేర్కొన్నారు. మొఘల్ కాలంలోని అక్బర్నామా, ఐనీ అక్బరీ గ్రంథాలు రాసిన అబుల్‌ఫజల్ తెలంగాణగా పేర్కొన్నారు. మొత్తానికి తెలంగాణ పేరుతో తొలి శాసనం తెల్లాపూర్ (మెదక్)లో బయల్పడింది. తెలంగాణలోని రామగిరి, రాచకొండ, కందికొండ, దేవరకొండ మొదలైన ప్రాచీన దుర్గాల గురించి శాసనాల్లో వివరిచారు.
-శాతవాహనుల కాలం నాటి రుషభదత్తుడు చెక్కించిన తిష్యరష్మి శాసనం (భూస్వామ్య, విదేశీ విధానం గురించి వివరాలు), ఇక్ష్వాకుల కాలం నాటి తొలి సంస్కృత శాసనం ఎలిశ్రీ, విష్ణుకుండినుల తొలి తెలంగాణ శాసనం ఇంద్రపాలపురం తామ్రశాసనం, చాళుక్యుల ఏలేశ్వరం, రాష్ట్రకూటుల తొలి గద్యరూప శాసనం కొరవి, తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులకు చెందిన వేములవాడ-పర్బణి శాసనం, కళ్యాణి చాళుక్యుల పెద్దకడుమూరు వర్తక సంఘం శాసనం, ముదిగొండ చాళుక్యుల మొగల్ చెరువు శాసనం, కందూరు చాళుక్యుల మైలాంబిక పానగల్లు శాసనం, కాకతీయుల బయ్యారం శాసనం, చందుపట్ల కలువచెరు శాసనం, హన్మకొండ శాసనం (అచితేంద్రుడు చెక్కించినది), రేచర్ల వెల్మల పిల్లలమర్రి శాసనం (నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలోనిది). ఈ శాసనాలన్నీ తెలంగాణను పాలించిన వివిధ రాజవంశాలను, వారి క్రమాన్ని తెలుపుతున్నాయి. బహమనీలు, గోలకొండను కుతుబ్‌షాహీలు (1518-1687), నిజాం రాజులు లేదా అసఫ్‌జాహీ వంశం(1724-1948), మధ్యలో కొంతకాలం మొఘలుల ఆధీనంలో (1687-1724) పరిపాలించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు