నిజాం-ఉల్-ముల్క్ కలం పేరు ఏమిటి? (గ్రూప్-1,2,3 తెలంగాణ హిస్టరీ)
తెలంగాణ చరిత్రలో అసఫ్‌జాహీల యుగం చాలా కీలకమైన ఘట్టం. నియంతృత్వానికి, వెట్టిచాకిరీకి, ఖాసీం రజ్వీ అరాచకాలతో తెలంగాణ సమాజం ఎంత పీడనకు, దోపిడీకి గురైందో… అలాగే తెలంగాణ అభివృద్ధికి సూచిక కూడా అసఫ్జాహీలే. నాణేనికి రెండు పార్శాలు ఉన్నట్లే అసఫ్‌జాహీల చరిత్రను రెండు కోణాల్లో చదవాల్సి ఉంటుంది. జమీందార్లు, జాగీర్లదార్ల చేతుల్లో అణచివేత ఒక వైపు పరిశీలిస్తే.. హైదరాబాద్ గడ్డపై అభివృద్ధి కోణాలు మరోవైపు చూడవచ్చు. సాలార్జంగ్ సంస్కరణల పథం ఒకవైపు చదువుతూనే.. సాలార్జంగ్కాలంలో నాన్‌ముల్కీ వ్యవస్థను చదవాల్సి ఉంటుంది. మీర్‌మహబూబ్ అలీఖాన్, మీర్ఉస్మాన్ అలీఖాన్‌ల కాలంలో జరిగిన విద్యాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, సమాచార రంగం లో వచ్చినవిప్లవాత్మక మార్పులను గమనించాల్సి ఉంటుంది. గ్రూప్-2లోని సెకండ్ పేపర్, 4వ పేపర్‌ను చదివేటప్పుడే ఇక్కడ ఉన్న లింకప్ అనేది అర్థం చేసుకోని చదవాలి. తెలంగాణ ఉద్యమ పేపర్ అర్థం చేసుకోవాలంటే నిజాంల కాలంలో జరిగిన అభివృద్ధి కోణాలు, ఆంధ్రాపాలకుల కాలంలో జరిగిన దోపిడీని బేరీజువేస్తు చదివితే… ఉద్యమ కోణం అర్థమవుతుంది. తెలంగాణ చరిత్ర అర్థం కావాలంటే ముందు అసఫ్‌జాహీల చరిత్ర అర్థం కావాలి.
అసఫ్జాహీలు
క్రీ. శ 1687లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండపై దాడి చేసి ఆక్రమించాడు. నాటి నుంచి క్రీ.శ 1724 వరకు గోల్కొండ రాజ్యం మొగల్ సామాజ్య్రం లో అంతర్భాగంగా కొనసాగింది. ప్రభుభక్తి పరాయణుడైన అబ్దుల్జ్రాక్ లారీ, అబుల్ హసన్ తరఫున వీరోచితంగా పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పో యింది. గోల్కొండ సేనాపతి అబ్దుల్లాపాణి మొగలులు ఇచ్చిన లంచానికి ఆశపడి, అర్ధరాత్రి వేళ కోట తూర్పు ద్వారం తెరవడంతో,మొగల్ సైన్యాలు గోల్కొండ కోటలోకి ప్రవేశించాయి. ఇది మొగల్ సామ్రాజ్యంలో 21వ సుభా (సుభా అనగా మొగల్ సామ్రాజ్యంలో రాష్ట్రం) గా కొనసాగింది.
మొగలు సామ్రాజ్యంలో దక్కన్
క్రీ. శ 1686లో బీజాపూర్, 1687లో గోల్కొండలను మొగల్‌సేనలు ఆక్రమించాయి. క్రీ. శ 1724 వరకు గోల్కొండ మొగలుల ఆధీనంలో ఉంది. దక్కన్ రాజధాని ఔరంగాబాద్, మొగల్ సామ్రాజ్యంలోని దక్కన్లో ఖాందేశ్, బీదరు, బీరార్, బీజాపూర్, హైదరాబాద్, ఔరంగాబాదు మొదలైన 6 భాగాలు ఉండేవి. మొగల్రాజప్రతినిధిని సుబేదారు అనేవారు.
దక్కన్ రాజప్రతినిధులు
ఖాన్- ఇ- జహాన్ జఫర్ జంగ్
గాజుద్దీన్ ఫిరోజ్ జంగ్
మౌజం
దుల్ ఫిఖర్ ఖాన్
నిజాం ఉల్ ముల్క్
హుస్సేను అలీఖాన్
ముబారిజ్ ఖాన్
నిజాం ఉల్ ముల్క్ (గమనిక: క్రీ. శ 1724 నుంచి స్వతంత్ర పాలకునిగా వ్యవహరించాడు.)
నిజాం – ఉల్-ముల్క్ (క్రీ.శ. 1724- 1748)
ఇతని అసలు పేరు మీర్ ఖమ్రెద్దీన్. ఇతనినే అసఫ్‌జా, నిజాంఉల్ముల్క్, చిన్కిలిచ్ఖాన్, ఫతేజంగ్ అనే బిరుదులతో ప్రసిద్ధి పొందాడు. మీర్ ఖమ్రుద్దీన్ పూర్వీకులు టర్కీ దేశస్థులు. జీవనాధారం కోసం భారతదేశానికి వలస వచ్చారు. ఖమ్రుద్దీన్ మాతామహుడైన సమీదుల్లాఖాన్ మొగలు చక్రవర్తియైన షాజహాన్ మంత్రివర్గంలో పని చేశాడు. ఖమ్రుద్దీన్ పితామహుడైన ఖాజా ఆబిద్‌ఖాన్ టర్కీ నుంచి భారతదేశానికి షాజహాన్ కాలంలో వచ్చాడు. ఖాజా అబిద్‌ఖాన్ శవాన్ని హిమాయత్ సాగర్ సమీపంలో ఖననం చేశారు. ఖాజా అబిద్‌ఖాన్ కుమారుడైన మీర్ షహాబుద్దీన్ కుమారుడే మీర్ ఖమ్రుద్దీన్ (షహాబుద్దీన్ బిరుదులు- ఫిరోజ్జంగ్, ఘాదీఖాన్)ఖమ్రుద్దీన్ పాండిత్యం, యుద్ధవిద్యలు, వినయ విధేయతలు, రాచ కార్యనిర్వాహణ మొదలైనవి ఔరంగజేబ్‌ను సహితం ఆకట్టుకున్నాయి. ఔరంగజేబు ఇతనికి చిన్కిలిచ్ఖాన్ అనే బిరుదునిచ్చాడు. ఫరూక్సియార్ ఇతని శక్తి సామర్థ్యాన్ని గుర్తించి, ఫతేజంగ్ నిజాం ఉల్ ముల్క్ బిరుదునిచ్చి గౌరవించాడు.
అంతేకాకుండా దక్కను సుబేదారుగా నియమితుడై, తన పదవీ బాధ్యతల్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు. నాటి ఢిల్లీ పాలకుడైన మహమ్మద్‌షా, నిజాం ఉల్‌ముల్క్ సమర్థతను గుర్తించి, దక్కను సుబేదారు పదవిని వదిలి పెట్టి, ఢిల్లీలో ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని కోరాడు. కానీ నిజాం ఉల్ ముల్క్ ఒప్పుకోలేదు. చివరకు మహమ్మద్ షా కొలువులో మంత్రి గా పని చేశాడు. ఆ తర్వాత మొగలుల కొలువును వదిలివేశాడు. (స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించే ఉద్దేశంతో)
అసఫ్‌జా మొగలు కొలువును వదిలి వేయడం ప్రతిభ/ నిజాయితీ వలసపోయినట్టు అయిందని చరిత్రకారుడైన కాఫీఖాన్ వెల్లడించిన అభిప్రాయంతో ఇతని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.
నాటి దక్కన్ సుబేదారైన ముబారిజ్‌ఖాన్‌ను క్రీ.శ 1724లో షకర్ఖేడా వద్ద నిజాంఉల్ ముల్క్ ఓడించాడు. దక్కను శాశ్వత సుబేదారుగా నిజాం ఉల్ ము ల్క్ను నియమించాడు. నాటి మొగలు చక్రవర్తి మహమ్మద్ షా (మహమ్మద్ షా రంగీలాగా ప్రసిద్ధి). మొగల్ చక్రవర్తి నిజాంఉల్ ముల్క్‌ను అసఫ్‌జా బిరుదుతో సత్కరించాడు. అసఫ్ జాహీలు మొగలుల సార్వభౌమాధికారాన్ని నామమాత్రంగా అంగీకరించారు.
తొలి నిజాం అసఫ్‌జా తన రాజ్యంలో మొగలుల విధానాన్నే అనుసరించాడు. అతని రాజ్యంలో ఆరు సుభాలుండేవి. అవి బీదర్, బీరార్, బీజాపూర్, ఖాందేశ్, ఔరంగాబాద్, హైదరాబాద్ ఈ ప్రాంతాల నుంచి ఏడాదికి 18 కోట్ల 5 లక్షల, 17 వేల, 291 రూపాయల ఆదాయం వచ్చేది. నిజాంఉల్ ముల్క్ తనతోపాటు తనకు పూర్వం సహకరించిన హిందువులు, మహమ్మదీయుల్ని హైదారబాద్‌కు తీసుకొచ్చాడు. వారికి (సైనికసేవలందించే నిమిత్తం) కొన్ని జాగీర్లు ఇచ్చాడు. ఇంకా వారిని రెవెన్యూ, ఆర్థిక మొదలైన శాఖల్లో నియమించారు. (గమనిక: అభ్యర్థులు ముల్కీ, నాన్ ముల్కీ అంశాల్ని అర్థం చేసుకోవడానికి ముందు ఈ అం శాలపై అవగాహన పెంపొందించుకో కోవాలి.
తొలి నిజాం- మహారాష్ర్టులు
మహారాష్ర్టులు శివా జీ కాలం నుంచి ఇతర ప్రాంతాలపై తాము దాడులు జరపకుండా ఉండే నిమిత్తం, ఆ ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశ్ముఖి అనే పన్నుల్ని వసూలు చేసేవారు. ఈ పన్నుల విషయమై క్రీ. శ 1727లో , క్రీ.శ 1729లో మహారాష్ర్టులతో సంఘర్షణకు దిగాడు. నిజాం క్రీ. శ 1728లో మహారాష్ర్టుల చేతిలో పాల్కేడ్ వద్ద (పీష్వా బాజీరావు కాలంలో) ఓడిపోయి ముషిగాం సంధికి అంగీకరించడమే కాకుండా వారికి చౌత్, సర్దేశ్ముఖి పన్నుల్ని కూడా చెల్లించాడు. నిజాం ఆ తర్వాత కాలంలో క్రీ. శ 1731లో మహారాష్ర్టులతో వార్నా సంధి చేసుకున్నాడు.
దురాయి-సరాయి సంధి
మహమ్మద్ షా ఆదేశాల ప్రకారం..నిజాం ఉల్ ముల్క్ మహారాష్ర్టులపై యుద్ధం చేసి భోపాల్ యుద్ధంలో ఓడిపోయి, దురాయి- సరాయి వద్ద సంధి (క్రీ.శ 1738లో) చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం యుద్ధ నష్టపరిహారంగా మహారాష్ర్టులకు లక్ష రూపాయల్ని, కొన్ని ప్రాంతాల్ని ఇవ్వడానికి నిజాం అంగీకరించాడు. (మాళ్వామీద, అదే విధంగా నర్మద, చంబల్ నదుల మధ్య ప్రాంతంపై పీష్వాకు అధికారమివ్వడం). క్రీ. శ1739లో నాదిర్ షా (పర్షియా) ఢిల్లీ మీద దండెత్తాడు. ఎలాంటి దయ, జాలి లేకుండా సామాన్య ప్రజల్ని చంపినాడు. అలాంటి సమయంలో మొగలు చక్రవర్తి ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లాడు. నిజాం- నాదిర్షాను కలుసుకొని, యుద్ధ దోపిడీని ఆపి స్వదేశానికి తిరిగి వెళ్లవల్సిందిగా అతన్ని కోరాడు. నిజాం రాజకీయ విజ్ఞతను, మంచితనాన్ని, వినయవిధేయతల్ని గ్రహించిన నాదిర్షా, ధన కనక వస్తువుల్ని తీసుకొని వెళ్లిపోయాడు. ఆఫ్ఘన్రాజ్య సింహాసనాన్ని అధిష్టించిన అహ్మద్ షా అబ్దాలీ, ఢిల్లీపై దాడికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్నాడు. మహమ్మద్ షా, వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా నిజాంను కోరాడు. చక్రవర్తి సాయం చేయాలనే ఉద్దేశ్యంతో తన సైన్యాలతో ఢిల్లీకి బయలుదేరాడు నిజాం. కానీ క్రీ. శ 1748లో బుర్హన్‌పూర్‌లో మరణించాడు.
తొలి నిజాం ఘనత
విజ్ఞాన ఖని, రాజకీయ పరిజ్ఞాని, పరిపాలనాదక్షుడు. దక్కన్‌ను స్వతంత్రంగా 24 ఏండ్లు పాలించాడు. రాజధాని ఔరంగాబాద్ పండితులకు నిలయం. కవుల్ని, పండితుల్ని పోషించాడు. నిజాం ఉల్ ముల్క్ స్వయం గా కవి. షాకిర్(సంతృప్తుడు) అనే కలం పేరుతో కవితల్ని రాశాడు. అరబ్బీ, ఫారసీ, ఉర్దూ భాషలను పోషించాడు.
అసఫ్‌జాహీ వంశ స్థాపకుడు-నిజాం-ఉల్-ముల్క్
చివరి, ఏడో నిజాం- మీర్ ఉస్మాన్ అలీఖాన్
రాజధాని: హైదరాబాద్
రాజభాష: పర్షియా (తర్వాత ఉర్దూ)
నిజాం అలీఖాన్: వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్యసహకార పద్ధతిని అంగీకరించిన మొదటి పాలకుడు
నాసిరుద్దౌలా: వహాబీ ఉద్యమం
అఫ్జల్ ఉద్దౌలా: స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు కలదు, సిపాయిల తిరుగుబాటు జరిగింది.
మహబూబ్ అలీఖాన్: చాందా రైల్వే పథకం, ముల్కీ ఉద్యమం, లార్డ్ రిప్పన్ హైదరాబాద్ సందర్శన
ఉస్మాన్ అలీఖాన్: గొప్ప భవనాల నిర్మాత, చెరువుల నిర్మాత, చివరి అసఫ్‌జాహీ పాలకుడు.
పాలకులు- నిర్మాణాలు
సలాబత్‌జంగ్ : చౌమొహాల్లా ప్యాలెస్
నిజాం అలీఖాన్ : మోతీ మహాల్, గుల్షన్ మహాల్, రోషన్ మహాల్, రెసిడెన్సీభవనం, గన్‌ఫౌండ్రీ ఏర్పాటు
సికిందర్ జా: కోఠీ మహిళా కళాశాల, సికింద్రాబాద్
అఫ్జల్ ఉద్దౌలా : అఫ్జల్‌గంజ్ వంతెన, నయాపూల్ వంతెన
మహబూబ్ అలీఖాన్ : నిజాం కళాశాల స్థాపన, నాంపల్లి రైల్వేస్టేషన్, చంచల్‌గూడ జైలు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మాణాలు
ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, అలీ సాగర్, బోధన్ చక్కర ఫ్యాక్టరీ, సిర్పూర్ పేపర్ మిల్, చార్మినార్ సిగరెట్ కంపెనీ, ఆజంజాహీ మిల్లు, వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ, హైకోర్టు భవనం, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అసఫ్‌జాహీ లైబ్రెరీ, యునాని ఆస్పత్రి, జూబ్లీహాల్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు