తెలంగాణలో విష్ణుకుండినులు- సాంస్కృతిక సేవ ( గ్రూప్-2 హిస్టరీ)

తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
తెలంగాణలో పరిపాలన చేసిన రాజుల్లో విష్ణుకుండినులు ఒకరు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘కీసర’, దాని పక్కనే ఉన్న విద్యాక్షేత్రం ‘ఘట్కేసర్’లో పలు శాసనాలు బయల్పడ్డాయి. జైన, బౌద్ధ, వైదిక మతాల ఉత్థానపతనాలు, వారి కాలంలో పరిపాలన విధానాలు, వ్యాపారం, మతం, సాహిత్యం, శిల్పకళావైభవాలపై ఈ వారం ప్రత్యేకం….
విష్ణుకుండినులు- వారి సాంస్కృతిక సేవ
ఇక్షాకుల తర్వాత కళింగతో సహా ఆంధ్ర, తెలంగాణలను పరిపాలించిన వారు విష్ణుకుండినులు. క్రీ.శ. 5, 6 శతాబ్దాల్లో దక్షిణాపథ చరిత్రలో విష్ణుకుండినుల సామ్రాజ్యం ప్రముఖ పాత్ర వహించింది. శాలంకాయనుల తర్వాత విష్ణుకుండినులు ఆంధ్రదేశాన్ని క్రీ.శ. 5వ శతాబ్ది ఉత్తరార్ధం నుంచి క్రీ.శ.7వ శతాబ్ది పూర్వార్థం వరకు పరిపాలించారు. వీరి చరిత్రకు మూలాధారాలైన శాసనాలు రెండో విక్రమేంద్రవర్మ వేయించిన ‘చిక్కుళ్ల శాసనం’, మహారాజు ఇంద్రవర్మ వేయించిన ‘రామతీర్థ శాసనం’, మూడో మాధవవర్మ వేయించిన పొలమూరు, ఈపూరు, వేల్పూరు శాసనాలు. విష్ణుకుండినుల ఆరాధ్యదైవం‘శ్రీ పర్వతస్వామి’ (శివుడు).
విష్ణుకుండినుల రాజ్యస్థాపకుడు, మొదటి మహారాజు ‘మాధవవర్మ’. ఇతడు ‘పదకొండు అశ్వమేధయాగాలు’ చేసి రాజ్యవిస్తరణ చేసినట్లు తెలుస్తున్నది. విష్ణుకుండినులు బ్రాహ్మణులు. వారి మాతృభూమి కృష్ణానది దక్షిణ తీరాన ఉన్న వినుకొండ. రాజధాని విషయంలో చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. వారి మొదటి రాజధాని వినుకొండ అని, తర్వాత రాజధాని అమరపురం, ఆ తర్వాత ‘దెందులూరు’కు మార్చినట్లు చరిత్రకారుల అభిప్రాయం. విష్ణుకుండిన రాజుల్లో ముఖ్యుడు రెండో మాధవవర్మ. ఇతనికి ‘త్రికూట మలయాధిపతి’ అనే బిరుదు ఉంది. రెండో మాధవవర్మ తన 27వ పరిపాలనా సంవత్సరంలో వేయించిన ‘ఈపూరు తామ్రశాసనం’ విష్ణుకుండిన శాసనాల్లో మొదటిది. వీరి ఆరాధ్యదైవం శ్రీ పర్వతస్వామి అంటే శివుడు. విష్ణుకుండినుల వంశ పరిపాలనా కాలంలో మూడో మాధవవర్మ పాలనాకాలం సుదీర్ఘమైనది (క్రీ.శ.546-611). మూడో మాధవవర్మ కాలంలో కళింగ విష్ణుకుండినుల ఆధీనంలో ఉంది. కోసలాధిపతి హర్షుడు ఇతనికి సమకాలికుడు.
చివరకు కళింగ, పల్లవులతో జరిగిన యుద్ధాల కారణంగా వీరి సామ్రాజ్యం అంతరించింది. దీనికి కారణం చివరి రాజైన మూడో మాధవవర్మ కుమారుడైన మంచనభట్టారకుడు అసమర్థుడు కావడమే. కొద్ది కాలంలోనే చాళుక్యులు తీరాంధ్రను జయించి వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించారు.
# వాకాటక, విష్ణుకుండిన కుటుంబాల మధ్య వైవాహిక సంబంధాలుండేవి. వినుకొండకు సంస్కృతీకరణమే విష్ణుకుండియని బీఎన్ శాస్త్రి అభిప్రాయం. విష్ణుకుండినులు శాసనాల్లో శ్రీ పర్వతస్వామి పాదానుధ్యాతస్య, త్రికూట మలయాధిపతిబిరుదులతో పేర్కొనబడ్డారు.
# విష్ణుకుండినులు తొలుత అమరాబాదు ప్రాంత పాలకులుగా ఉండి, రాజ్యాన్ని విస్తరించుకొని ఇంద్రపురిని రాజధానిగా చేసుకున్నారు.
# శ్రీపర్వతం నాగార్జునకొండ ప్రాంతం అని, విష్ణుకుండినుల కులదైవం బుద్ధుడు గానీ, కార్తికేయుడుగానీ అయి ఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం. కానీ విష్ణుకుండిన ప్రభువుల్లో వైదికమత నిరతులు వేయించిన శాసనాల్లో మాత్రమే శ్రీపర్వత స్వామి ప్రశంస ఉంది.
# కీసరలో వెలసిన పురాతన శ్రీరామలింగేశ్వరాలయం విష్ణుకుండినుల పాలనా కాలం నాటిది (కేసరి రామలింగేశ్వరాలయం వీరి కాలం నాటిది).
# విష్ణుకుండినులు సింహలాంఛనులు. వీరి శాసన కడియాలపై గల రాజముద్రికల్లో లంఘించు సింహం ముద్రించి ఉంది. వీరి నాణెల్లో కూడా ఈ చిహ్నం కనిపిస్తుంది. కేసరి రామలింగేశ్వరాలయం వీరి రాజ చిహ్నం పేర నిర్మింపబడింది.
# నల్లగొండలో ఉన్న దొండపాడు గ్రామంలో నాణెల బిందె లభించింది. నాణెల తూకం 4920 తులాలు. ఈ నాణెలపై నోరు తెరుచుకొని లంఘించడానికి సిద్ధంగా ఉన్న భయంకర సింహరూపం, సింహం ముందు అడ్డంగా విచ్చుకత్తి, ‘సత్యాశ్రయ విషమసిద్ధి’ అనే పేరుతో చెక్కబడ్డాయి.
మతం
# వీరు శైవ మతస్థులు. అయినప్పటికీ బౌద్ధమతాన్ని కూడా ఆదరించారు. బౌద్ధమతంలో ‘వజ్రయాన’శాఖ కృష్ణానది దక్షిణాన ఈ కాలంలో ఆవిర్భవించింది. ఈ మత ప్రచారం వల్ల బౌద్ధమతానికి ఉన్న కీర్తి ప్రతిష్టలు, ప్రజాభిమానం నశించాయి. అహింస పరమధర్మంగా భావించే బౌద్ధులు ‘శక్తి పూజలు’ తాంత్రిక పూజలు, రహస్యకలాపాలు, మధు మాంస వినియోగాలు ఆచరించేవారు. బౌద్ధ సంఘారామ విహారాలు నీతి బాహ్యమై దుర్నీతులకు నిలయం అయ్యాయి. దీంతో బౌద్ధమతంపై ఆదరణ సన్నగిల్లింది.
# ఈ సమయంలో విష్ణుకుండిన ప్రభువులు బౌద్ధాన్ని ఆదరించి పోషించారు. ఇక్షాకు వంశం అంతరించిన పిదప పల్లవులు ఆంధ్రదేశం ఆక్రమించి వైదిక మతం విజృంభణకు కారకులయ్యారు.
# విష్ణుకుండినుల కాలంలో జైనం క్షీణదశలో ఉంది. జైనుల్లో దిగంబరులు, శ్వేతాంబరులు అనే రెండు శాఖలు ఉండగా, జైనమతం ఆంధ్రదేశంలో క్షీణించడానికి కాపాలిక జైనులు కారకులు. పల్లవులు వైదికమతాన్ని ఉద్ధరించి జైనమతానికి నీడలేకుండా చేశారు. జీనాలయాలు, బౌద్ధారామం విహారాలు ప్రభువుల ప్రోత్సాహంతో శైవ క్షేత్రాలుగా రూపు దిద్దుకున్నాయి.
# జైనమహర్షి రాసిన పూర్వ మీమాంస సూత్రాలపై కుమారిలభట్టు తంత్రవార్తిక మహాభాష్యం రాశాడు.
# విష్ణుకుండినుల కాలంలో వైదికమతం కూడా విజృంభించింది. శ్రీశైల మల్లికార్జుని ఆరాధనకు అగ్రస్థానం లభించింది.
న్యాయపాలన
‘పొలమూరు’ శాసనంలో వివరాలు కలవు. 3వ మాధవవర్మకు ‘అవసిత వివిధ దివ్యా’ అనే బిరుదు ఉంది. అంటే న్యాయతీర్పులో అందరూ సమానులే తన కన్న కుమారుడికి సైతం ‘మరణశిక్ష’ విధించినవారు. చట్టం ముందు అందరూ సమానులే అనేది వీరి నుంచే ఆవిర్భవించి ఉంటుంది.
వాణిజ్యం
వీరి కాలంలో 16 రకాల నాణెలు ఉన్నాయని ఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నాణెలకు రాగిపూత కలిగిన ఇనుమును ఉపయోగించారు. వివిధ వృత్తులకు సంబంధించిన ప్రజలు ఉండటం వల్ల కుటీర పరిశ్రమలు పెంపొందాయి. రెండో మాధవవర్మ త్రిసముద్రాధిపతి. కావున ప్రసిద్ధమైన రేవు పట్టణాలు విదేశీ వ్యాపారులతో కిక్కిరిసి ఉండేవి. వారికి సమస్త సదుపాయాలు కల్పించాడు.
శిల్పకళాసేవ
నాగార్జునకొండ శిథిలాలను బట్టి గర్భగుడి, అంతరాళం, మంటపం, ధ్వజస్తంభం, ప్రాకారం అనే విభాగాలతో దేవాలయ వాస్తు పరిపుష్టమైనది. ఈ ఆలయాలు అగమోక్త పద్ధతి ప్రకారం నిర్మించారని తెలుస్తోంది. ఏలేశ్వరం, చేజర్ల, ఉండవల్లిలో ఉన్న ఉద్దేశిక ఆలయాలు (ఆల య నమూనాలను)బట్టి నాటి ఆలయాలకు వృత్త, శాలా (గజవృష్ట) శిఖరాలుండేవి. వృత్త శిఖరాలు ద్రావిడ శైలిలో ఏక తలములై శిఖరముఖంలో చైత్య వాతాయనాలంకరణ ఉండేదని గ్రహిస్తున్నాం.
బొజ్జనకొండ బౌద్ధక్షేత్రంలో దొరికిన గుప్తరాజుల నాణెం వల్ల ఈ క్షేత్రం నాలుగైదు శతాబ్దాల్లో ప్రసిద్ధి వహించిందని చెప్పవచ్చు. భూమి స్పర్శముద్రతో బుద్ధ ప్రతిమలు ప్రజావస్తువులుగా ఉన్న ఈ మహాయాన బౌద్ధాలయాల్లో వజ్రాయాన చిహ్నాలు సహితం కన్పిస్తాయి. ఈ కొండ సమీపంలోనే లింగాలమెట్ట ఉంది. ఇచ్చటి కొండను భక్తులు అనేక ఉద్దేశిక స్తూపాలుగా మలిచారు. ఈ క్షేత్రమే నమూనాగా జావాలోని బోరోబుదురు ఆలయం నిర్మాణమైందని ఒక అభిప్రాయం (కేఆర్ సుబ్రహ్మణ్యం)
మొఘల్రాజపురంలోని ఐదు గుహల్లో మూడు అతిసామాన్యమైనవి. నాలుగోది దుర్గ గుహ. దీనిలో వెనుక గోడపై అర్ధనారీశ్వరమూర్తిని చెక్కినారు. ఐదోది శివతాండవ గుహ. ఇది మిగిలిన గుహలకంటే పెద్దది. అందమైనది. స్తంభ మంటపానికి వెనుక ఉన్న మూడు గర్భ గుహలు బశా త్రిమూర్తులకు అంకితం. ఐదో గుహముఖంపై నటరాజ విగ్రహం వల్ల ఈ గుహకు ఆపేరు వచ్చింది. ఈ శిల్పం చాలావరకు శిథిలమైంది. కపోతం మీద కూడలిలో దేవీ సహితులైన త్రిమూర్తులున్నారు. బెజవాడ దుర్గం కొండకు దిగువన ‘అక్కన్న మాదన్న’ గుహలు శిథిలావస్థలోఉన్నాయి. వీటికి ఎగువన ఉన్న పెద్దగుహ సైతం త్రిమూర్తులకు అంకితమే. కానీ ఇందులో క్రీ.శ రెండు మూడు శతాబ్దాల లిపిలోనున్న శాసనం ఈ గుహ చాలా ప్రాచీనమైనదనడానికి నిదర్శనం. బశా ఇది బౌద్ధుల, జైనుల విహారమై ఆ తర్వాత 5,6 శతాబ్దాల్లో హిందువులాక్రమించి ఉంటారు. ఈ త్రిమూర్తి గుహలు నాటి హిందూమతంలోని సామరస్యానికి నిదర్శనం.
ఉండవల్లిని మూడుగుహల్లో అనంతశాయి గుడి అనే పేర మధ్యస్థమై ఉన్న గుహ పెద్దది, ముఖ్యమైంది. ఇది నాలుగు అంతస్తుల గంభీర నిర్మాణం. రెండో అంతస్తులో కుడివైపు చివరిభాగంలో ఉన్న పెద్ద అనంతశాయి విగ్రహం వల్ల దీనికి పేరు వచ్చింది. దీని నిర్మాణం పల్లవుల మహామల్లపుర రాతిరథాలనునసరించిందనే అభిప్రాయంతో అంగీకరించేవారు నేడు అరుదు. క్రీ.పూ 2వ శతాబ్దంలో గుంటుపల్లిలో ప్రారంభమైన గుహవాస్తు ఉండవల్లిలో పరిపక్వతందడమేగాక పల్లవుల శైలికి వరవడి పెట్టిందని చాలా మంది ( గంగూలి, శివరామమూర్తి) అభిప్రాయం. విష్ణుకుండినుల నాణెలపై కన్పించే సింహం ప్రతిరూపం ఈ గుహాలయ స్తంభాలపై ప్రత్యక్షమవుతున్నది. గుహముఖంపై క్రీ.శ. 6వ శతాబ్ద లిపిలో ‘ఉత్పత్తి పిడుగు’ అనే లేఖనం ఉంది. స్తంభాల స్తూపత పల్లవ నిర్మాణం కంటే ప్రాచీనమైందని స్పష్టం చేస్తున్నది. అందువల్ల ఇది విష్ణుకుండినుల నిర్మాణమని నిర్ణయించవచ్చు. ఉత్పత్తి పిడుగు అనేది గుహలు తవ్విన శిల్పుల శ్రేణి పేరై ఉండవచ్చు. భైరవకొండ (నెల్లూరు జిల్లా)లో ఎనిమిది గుహాలయాలు ఉన్నాయి.
పరిపాలనా విధానం
# విష్ణుకుండినుల కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం దేశంరాష్ట్రాలుగా, విషయాలుగా విభజించబడ్డాయి. ఆనాడు భూమిని ‘వివర్తనం’ కొలిచేవారు.
# రాష్ట్రానికి అధిపతి రాష్ట్రికుడు. విషయానికి అధికారి విషయాధిపతి. (యజ్ఞవల్కస్మృతి ప్రకారం పాలన ఆధారపడి ఉండేది)
# విష్ణుకుండిన ప్రభువులు తమ వంశాభివృద్ధికి దేవాలయాలకు, వేద పండితులకు, విప్రులకు భూములను, అగ్రహారాలను దానం ఇచ్చేవారు. విజయయాత్రకు బయలుదేరేటప్పుడు, యుద్ధవిజయానంతరం, సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో బ్రాహ్మణులకు భూ, సువర్ణ, అగ్రహారాలను దానం చేసేవారు.
# నాల్గో మాధవవర్మ పొలమూరు గ్రామాన్ని గుడ్డివాడి విషయంలో మయింద వాటికలో నాలుగు వివర్తనాల భూమిని, గోదావరి నదిని దాటి తూర్పు తీర ప్రాంతాన్ని జయించిన సందర్భంలో చంద్రగహణ నిమిత్తం కున్నూరు గ్రామ వాస్తవ్యుడగు శివవర్మకు దానం ఇచ్చాడు.
సాహిత్యసేవ
# విష్ణుకుండిన ప్రభువులు తొలుత ‘ప్రాకృత భాష’ను ఆదరించినా గోవిందవర్మ పాలనాకా లం నాటికి ‘సంస్కృతం రాజభాష’గా మారింది.
# విక్రమేంద్రభట్టారక వర్మ ‘మహాకవి’, కవిపండిత పోషకుడు. వీరి కాలంలో సంస్కృతాంధ్ర భాషలు ప్రోత్సహించబడ్డాయి. తెలుగు చందో గ్రంథం ‘జనాశ్రయచ్ఛందో విచ్ఛితి’ వెలువడింది. దగ్గుపల్లి దుగ్గన నాసికతోపాఖాన్యం రాసెను. తెలుగులో తొలి జంటకవులు నంది మల్లయ్య, ఘంట సింగనలు రచించిన ప్రభోదయచంద్రోదయంలో 3వ మాధవవర్మ గురిం చి వివరించబడింది.
1. కుమారిలభట్టు – పూర్వమీమాంస
2. ప్రభాకర పండితుడు – షడ్దర్శనాల్లో ఒకటి రచించెను.
(అందులో ఒకటి పూర్వమీమాంస, ఇలాంటివే తెలుగులో
పంచమహాకావ్యాలు అనేవి ఉన్నాయి. దానిలో ఒకటి
ఆముక్తమాల్యద..
ఆముక్త + మాల్య +ద = ఆముక్తమాల్యద
అంటే ధరించి విడిచిన గులాబీ మాల (ఆముక్త (ధరించిన),
మాల్య(మాల), ద (దండ)) అని అర్థం. దీని అసలు పేరు
విష్ణుచిత్తీయం. ఈ గ్రంథంలో మాలదాసరి కథ చాలా
ప్రసిద్ధిగాంచింది.
3. ఘట్కేసర్ – గొప్ప విద్యా కేంద్రం. వీటిని ఘటికలు
అంటారు. (ఘటికలు అంటే హిందూ విద్యాకేంద్రాలు.
వీటిని తెలంగాణలో ప్రవేశపెట్టింది విష్ణుకుండినులు)
డా౹౹ మురళి,
అసిస్టెంట్ ప్రొఫెసర్ నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
-
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
-
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
-
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
-
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
-
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
-
English Grammar | We should all love and respect
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
Groups Special – Science | సహజ శక్తి అనంతం … కాలుష్య రహితం.. పర్యావరణ హితం
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Economy – Groups Special | అండమాన్లో అల్పం… దాద్రానగర్లో అధికం
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?