తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా..

మంత్రుల బృందం (జీఓఎం)తో రాజకీయ పార్టీల అభిప్రాయాలు..
టీఆర్ఎస్: తెలంగాణపై ఎలాంటి పరిపాలనాపరమైన నియంత్రణలు పెట్టకూడదని, ఉమ్మడి రాజధాని కాలపరిమితిని ఐదేండ్లకు తగ్గించాలని, భద్రాచలాన్ని తెలంగాణలో అంతర్భాగంగానే ఉంచాలని, సీమాంధ్ర ప్రాంతంలో అనుమతులు లేకుండా కట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అంగీకరించమని పేర్కొన్నది.
బీజేపీ: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించాల్సి ఉన్నందున జాతీయపార్టీలతో అఖిలపక్షం నిర్వహించాలని పేర్కొంది.
కాంగ్రెస్: ఈ పార్టీ నుంచి హాజరైన రెండు ప్రాంతాల నేతలు వేర్వేరు వాదనలు వినిపించారు. సీడబ్ల్యూసీ తీర్మా నం ప్రకారం హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఒకరు, విభజన తర్వాత సమస్యలు ఉంటాయి కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒకవేళ విడదీయక తప్పదంటే హెచ్ఎండీఏని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, హైదరాబాద్ ఆదాయాన్ని రెండు ప్రాంతాలకు జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలని మరొకరు పేర్కొన్నారు.
ఏఐఎంఐఎం: హైదరాబాద్‌పై కేంద్ర పాలన రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యం కాదని, ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని పేర్కొంది. రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణలోని ముస్లింలు, దళితులకు ముప్పు ఉంది కానీ, సీమాంధ్రులకు లేదు. అందువల్ల రాష్ట్ర బిల్లుతోపాటు మతకలహాల నిరోధక బిల్లును కూడా తీసుకురావాలి.
సీపీఎం: భాషా ప్రయుక్త రాష్ట్రాలను కొనసాగించడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ విధానమని రాష్ట్ర విభజన, సమైక్య నిర్ణయంతో సంబంధం లేకుండా వివిధ ప్రాంతాలు, జిల్లాలు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న అసమానతలు తొలగిపోయే విధంగా కృషి చేయాలని పేర్కొంది.
ఐఎస్‌ఆర్‌సీపీ: సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను సమర్థిస్తూ తన అభిప్రాయాన్ని చెప్పింది.
సీపీఐ: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ శాంతిభద్రతల నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, జల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక మండలిని ఏర్పాటు చేసి దానికి చట్టబద్ధమైన అధికారాలివ్వాలని, 371డీ ప్రకరణను రెండు రాష్ట్రాల్లో కొనసాగించాలని పేర్కొంది.
టీడీపీ: జీఓఎం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి టీడీపీ హాజరుకాలేదు. కాంగ్రెస్ ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్దంగా వెళ్తుంది. సమన్యాయం చేసిన తర్వాతే విభజన చేయండి అంటూ చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు ‘తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలంటే’ అనే శీర్షికతో నివేదికను మంత్రుల బృందానికిచ్చారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని కోరారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సీమాంధ్రుల రక్షణ కోసం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, ఒకవేళ ఉమ్మడి రాజధానిని ప్రకటిస్తే దానికి హెచ్ఎండీఏ పరిధిని తీసుకోవాలని, భద్రాచలాన్ని తూర్పు గోదావరి జిల్లాలో చేర్చాలని పేర్కొన్నారు.
నాటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి.. రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు రెట్టింపవుతాయని, ఒక సమస్యను పరిష్కరించే క్రమంలో పెద్ద సమస్యను తెచ్చిపెట్టడం మంచిదికాదని వివరించారు.
అసెంబ్లీలో చర్చ
కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లు 2013, డిసెంబర్ 6న కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి వచ్చింది. ఆయన డిసెంబర్ 11న ఆ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపి 2014, జనవరి 23 (45 రోజులు)లోగా అసెంబ్లీ, శాసనమండలి అభిప్రాయాలను తెలపాలని గడువు విధిస్తూ రాష్ట్రానికి పంపాలని ఆదేశించారు. 2013, డిసెంబర్ 16న బిల్లును శాసనసభలో, శాసన మండలిలో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు బిల్లును సభలో ప్రవేశపెడుతున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అయితే సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల మధ్య సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. పరిస్థితులు అలానే కొనసాగడంతో సభను 2014, జనవరి 3కు వాయిదా వేశారు. ఈ మధ్యకాలంలో శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి శ్రీధర్‌బాబును తప్పించి శైలజానాథ్‌కు అప్పగించారు. దీంతో శ్రీధర్‌బాబు జనవరి 2న తన మంత్రిపదవికి రాజీనామా చేశారు.
జనవరి 7న తెలంగాణ, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో జనవరి 7న ఇందిరాపార్కులో సంపూర్ణ తెలంగాణ సాధనదీక్షను జేఏసీ నిర్వహించింది. జనవరి 8న రాష్ట్ర విభజన బిల్లుపై మొదటిసారిగా మంత్రి వట్టి వసంతకుమార్ చర్చను ప్రారంభిస్తూ ప్రసంగించారు. జనవరి 20న బిల్లుపై శాసనసభ్యులు క్లాజుల వారీగా తెలపాలని అభిప్రాయాలు, సవరణలను సీడీల రూపంలో నిక్షిప్తం చేసి దాన్ని శాసనసభకు అందించారు. ఇందులో 9,039 సవరణలు, అభిప్రాయాలు, సూచనలు ఉన్నాయి. జనవరి 22, 23 తేదీల్లో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాడు. గడువు ముగుస్తుండటంతో చర్చకు మరింత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయడంతో మరో వారం పొడిగిస్తూ (జనవరి 30 వరకు) రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. జనవరి 25న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బిల్లును తిరస్కరిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయవద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసే తీర్మానాన్ని రూల్ 77 కింద శాసనసభలో తేవడానికి వీలుగా స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రసంగిస్తూ బిల్లును తిప్పిపంపే అధికారం శాసనసభకు ఉందని, బిల్లును ముందే ఎందుకు తిప్పిపంపలేదని ప్రశ్నించారు
కిరణ్ సర్కారు బిల్లుపై చర్చించడానికి మూడువారాల గడువు కావాలంటూ మరో మారు రాష్ట్రపతికి లేఖ పంపింది. బిల్లును అడ్డుకోవడానికే ఈ కమిటీల ప్రయత్నాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. చివరి రోజు అయిన జనవరి 30న స్పీకర్ మాట్లాడుతూ 87 మంది సభ్యులు సభలో మాట్లాడారు. మిగిలిన వాళ్లు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలపాలన్నారు. దీంతో మొత్తం సభ్యుల అభిప్రాయం రికార్డయ్యింది. బిల్లు పై చర్చ ముగిసింది. బిల్లుకు 9,072 సవరణలు, ప్రతిపాదనలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. తర్వాత 77 రూల్ కింద ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానాన్ని చర్చకు తీసుకుంటున్నట్లు స్పీకర్ ప్రకటించాడు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఓటింగ్ పెట్టారు. తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించాడు. అయితే సభా నియమాల ప్రకారం ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. దానిపై చర్చ, తర్వాత ఓటింగ్ పెట్టాలి. కానీ సభా నియమాలను కాదని స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.
పార్లమెంటు ఆమోదం
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించిన నివేదిక 2014, ఫిబ్రవరి 1న అసెంబ్లీ కార్యదర్శి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అటునుంచి ఢిల్లీకి చేరుకుంది. ఫిబ్రవరి 3న ఢిల్లీకి చేరుకున్న ఆ నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పంపించారు. మంత్రుల బృందం అసెంబ్లీ నుంచి వచ్చిన 9,072 సవరణలను, 87 మంది సభ్యుల అభిప్రాయాలను, మండలి నుంచి వచ్చిన 1,157 సవరణలను, 54 మంది సభ్యుల అభిప్రాయాలను, కిరణ్‌కుమార్ రెడ్డి నుంచి వచ్చిన ఒక తీర్మానంతోపాటు, 10 అనధికారిక తీర్మానాలను, తమ దగ్గరకు వచ్చిన 18వేల ఈ-మెయిల్స్‌ను ఫిబ్రవరి 4న చర్చించి వాటిని కేబినెట్‌కు పంపింది.
తెలంగాణ బిల్లును ఆంధ్రప్రదేశ్ చట్టసభలు తిరస్కరించినప్పటికీ రాజ్యాంగం ప్రకారం వాటికి పార్లమెంటు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని హోంశాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 9న బిల్లు రాష్ట్రపతి దగ్గరకెళ్లింది.
ఫిబ్రవరి 12న తెలంగాణ బిల్లు విషయంలో రాజ్యాంగ సవరణ అవసరం లేదని న్యాయశాఖ తెలిపింది. అదేరోజున పోలవరం ముంపు గ్రామాల సంఖ్యను 134కు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ మరోసవరణ చేసింది. ఫిబ్రవరి 13న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. మూజువాణి ఓటుతో బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పునర్విభజన బిల్లు నెగ్గిందని స్పీకర్ ప్రకటించారు. ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లుపై చర్చ ప్రారంభమైంది. సీమాంధ్ర ఎంపీలు నిరసన తెలిపారు. బీజేపీ మద్దతిస్తున్నట్లు అరుణ్‌జైట్లీ ప్రకటించారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి తాము విశాలాంధ్రను సమర్థిస్తున్నామని, బిల్లుకు వ్యతిరేకమని పేర్కొన్నారు. బిల్లుపై వెంకయ్యనాయుడు 38 సవరణలు ప్రతిపాదిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశాడు.
రాజ్యసభలో బిల్లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి 6 హామీలు
1. 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సహాయం అందించేందుకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పిస్తారు. రాయలసీమ జిల్లాలు నాలుగు, ఉత్తర కోస్తా జిల్లాలు మూడింటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌కు ఐదేండ్ల పాటు ఈ హోదా ఉంటుంది.
2. రెండు రాష్ట్రాలతో పారిశ్రామీకరణ, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రోత్సాహకాలు ఉంటాయి.
3. రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలకు అందించే అభివృద్ధి ప్యాకేజీ ఒడిశాలోని కోల్హాపూర్-బాలాంగిర్-కలహండి, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాలకు అందించే ప్యాకేజీ తరహా ఉంటుంది.
4. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుంది.
5. సిబ్బంది, ఆర్థిక, ఆస్తుల పంపకం, అప్పుల బాధ్యత వంటి చర్యలు చేపట్టేందుకు నోటిఫైడ్ తేదీని అనుసరించి అపాయింటెడ్ (విభజన) తేదీని నిర్ణయిస్తారు.
6. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఏడాది ఏర్పడే వనరుల లోటును 2014 కేంద్ర బడ్జెట్ ద్వారా పూడుస్తారు.
రాజ్యసభ ఆమోదం తర్వాత బిల్లు న్యాయశాఖ నుంచి హోంశాఖకు, అటునుంచి రాష్ట్రపతి దగ్గరకు వచ్చింది.
2014, మార్చి 1న ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’పై రాష్ట్రపతి సంతకం చేశారు. దీంతో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014’గా రూపందాల్చింది.
రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన వెంటనే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ దీన్ని భారతీయ రాజపత్రం (ద గెజిట్ ఆఫ్ ఇండియా)లో ‘ద ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్-2014’ పేరుతో ముద్రించి దానికి చట్టబద్ధ హోదా కల్పించింది. పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ చట్టానికి 2014, మార్చి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. రిజిస్టర్డ్ నెం. డీఎల్-(S) 04/0007/2013-14 పేరుతో 71 పేజీల చట్టాన్ని గెజిట్‌లో పొందుపర్చారు. రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా అధికార గెజిట్‌లో చేరుస్తామని రాజపత్రంలో స్పష్టం చేశారు.
2014, మార్చి 4న కేంద్ర హోంశాఖ ‘జూన్ 2ను విభజన తేదీ (అపాయింటెడ్ డే)గా గెటిట్‌లో ప్రకటించింది.
జీఓఎంతో మంత్రిత్వశాఖ కార్యదర్శులు
మంత్రుల బృందం పోలీస్ టాస్క్‌ఫోర్స్, ఆర్థికశాఖ, భారతీయ రైల్వే, న్యాయ, శాసన వ్యవహారాలు, పౌర విమానయానం, జాతీయ రహదారులు-రవాణా, నౌకాయానం, సిబ్బంది వ్యవహారాలు-శిక్షణ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించడంతో రాష్ట్ర విభజన కసరత్తు చివరిదశకు చేరినట్లయ్యింది.
2013, అక్టోబర్ 8న ఏర్పాటైన మంత్రుల బృందం తనకు కేటాయించిన 11 విధివిధానాలపై అభిప్రాయాలను సేకరించి ఒక నిర్ణయానికి వచ్చే క్రమంలో రాయల తెలంగాణ హైదరాబాద్, పోలవరం ముంపు గ్రామాల అంశాలపై తీవ్ర ఒత్తిడిలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మంత్రుల బృందం 2013, డిసెంబర్ 4న చివరిసారిగా సమవేశమై రాష్ట్ర విభజన బిల్లును, రాష్ట్ర విభజన సిఫారసులతో కూడిన నివేదికను రూపొందించి డిసెంబర్ 5న కేబినెట్‌కు పంపింది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నివాసంలో ప్రారంభమైన మంత్రివర్గ సమావేశంలో తీవ్ర వాదోపవాదాల మధ్య 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికే కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాష్ట్రపతి, అట్నుంచి అసెంబ్లీకి పంపించారు.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
RELATED ARTICLES
-
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
-
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
-
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
-
Biology | First Genetic Material.. Reactive Catalyst
-
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
-
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !
Geography | ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
Economy | రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
SAT Preparation | SAT… Short and Digital
Group 2,3 Special | మహిళలు, బాలలు, ట్రాన్స్జెండర్ల చట్టాలు
General Essay – Groups Speical – AI | వస్తువుకు ప్రాణం.. కృత్రిమ మేధ మాయాజాలం