మూడంచెల రాతి కోటలు- గొలుసు కట్టు చెరువులు
రాచరికంలో మహిళను సింహాసనం ఎక్కించిన మొట్టమొదటి రాజ వంశం కాకతీయులు. వీరి పాలనలో రాజ్యరక్షణతోపాటు నీటిపారుదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వీరు తవ్వించిన గొలుసుకట్టు చెరువులు ఈ నాటికి వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాకతీయుల కాలంనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, నీటిపారుదల వ్యవస్థ గురించి తెలుసుకుందాం
సామాజిక పరిస్థితులు
# ఆనాటి సమాజంపై మత ప్రభావం ఎక్కువ. మత రంగంలో వచ్చిన మార్పులు, సంక్షోభాలు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. మధ్య యుగాల్లో కనిపించే మరో లక్షణం సంప్రదాయక నాలుగు వర్ణాలకు తోడుగా సామాజిక అవసరాలు తీర్చడానికి అనేక కులాలు, ఉపకులాలు రూపొందాయి. ప్రతి కులానికి, కొన్ని కట్టుబాట్లు, నిబంధనలు ఏర్పడ్డాయి. ఆ నిబంధనలను అమలు పరచడానికి కుల సమయాలు తలెత్తాయి. కాకతీయ యుగం సామాజిక వ్యవస్థకు ఒక ప్రత్యేక లక్షణం కుల సంఘాలు. కుల సమయం కులంలోని మానవ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. బ్రాహ్మణ సమయానికి ‘మహాజనులు’, వైశ్య సంఘానికి ‘నకర’ సాలి మున్నూరు, తెలికివేపురు, పంచాణం మొదలైనవి ఇతర సమయాలు. ఈ సమయాలకు విశేష అధికారులున్నాయి. ఇవి ఆ కులం, వృత్తిని సంరక్షించడమే కాకుండా వారి నుంచి పన్నులు వసూలు చేశారు. క్రీ.శ. 10, 11 శతాబ్దాల నాటి శాసనాల్లో అష్టాదశ వర్గాలు, 18 సమయాలంటూ సమాజాన్ని పేర్కొన్నాయి.
ఆర్థిక వ్యవస్థ
#గణపతి దేవుడి విజయాల ఫలితంగా సారవంతమైన తీరాంధ్రపై కాకతీయుల అధికారం నెలకొంది. కోశాగారానికి వ్యవసాయ పన్నుల ద్వారా వర్తకపు పన్నులు, సుంకాల ద్వారా పుష్కలంగా అదాయం చేకూరింది. సమకాలీన చరిత్రకారులు, బాటసారులు వీరి రాజ్య సిరి సంపదలను, సహజ వనరుల గురించి పేర్కొన్నారు.
#కాకతీయ చక్రవర్తులు వారి సామంతులు వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధచూపారు. నీటివనరులను చెరువులు, కాలువలు మొదలైన వాటి రూపంలో నిర్మింపజేశారు. కొన్ని ప్రాంతాలుగా అడవులను నరికించి వ్యవసాయ భూమిగా మార్చారు. వ్యవ సాయం విదేశీయ వ్యాపారం, పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి.
వ్యవసాయం
#వ్యవసాయ భూమిని మాగాణి, మెట్ట అని రెండు రకాలుగా విభజించినట్లు, సమకాలీన ఆధారాల వల్ల తెలుస్తుంది. మాగాణిలో నీరు నేల, తోట అని మెట్టలో వర్షాధార పంటలైన మొక్కజొన్న, ఆవాలు, ఆముదాలు, నువ్వులు పండించేవారు. సేద్యపు భూములను ‘అచ్చుకట్టు’ భూములనేవారు. వీటి నుంచి పండే పంటలపై ‘అరి’ అనే పన్ను భూమిశిస్తు వచ్చేది. వ్యవసాయ పన్నులను సిద్దాయం లేదా పంగము, పన్ను, కానిక, దరిశనము, వెన్ను పన్ను, నీరుడి, అర్థాయం, పుల్లరి (గడ్డి భూములపై వసూలు చేసే పన్ను) మొదలైన పన్నులు ఉండేవి. పన్నును ధన లేదా ధాన్య రూపంలో చెల్లించేవారు. దేవాలయాలకు, బ్రాహ్మణులకు ఇచ్చిన భూములపై పన్ను మినహాయింపు ఉండేది. వీరు నూతన గ్రామాలను నిర్మించే వారు. గణపవరం, గన్పూర్, మహాదేవపురం, రుద్రవరం, బయ్యారం, ముప్పవరం మొదలైన గ్రామాలు పేరుగాంచాయి.
-కొత్తగా నిర్మించిన గ్రామాలను ఆనుకొని ఉన్న భూములను సాగుచేసిన వారికి కొన్ని ప్రత్యేక పన్నుల నుంచి మినహాయింపు నిచ్చేవారు.
నీటిపారుదల వ్యవస్థ
వ్యవసాయానికి నీరు అందించే విష యంలో కాకతీయ రాజులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం ముమ్మరంగా జరిగింది. పెద్ద చెరువులను సముద్రాలు అనేవారు. ఒక చెరువు నిండిన తరువాత మిగతా నీరు కింది చెరువుల్లోకి ప్రవహించేటట్లు ఏర్పాట్లు చేశారు. వీటినే గొలుసుకట్టు చెరువులు అనేవారు. వారు తవ్వించిన చెరువుల్లో ముఖ్యమైనవి.
కేసముద్రం లేదా కేసరి తటాకం
సెట్టికెరెయ చెరువు కేసరి సముద్రం
అనుమకొండ చెరువు పాకాల చెరువు
రామప్ప చెరువు ఘన్పూర్ చెరువు
లక్నవరం చెరువు బయ్యారం చెరువు
కుంద సముద్రం ండ సముద్రం
# వ్యవసాయానికి నీటిని అందించడంలో చెరువులతోపాటు ఊటకాలువలు ముఖ్య పాత్ర పోషించాయి. ఆనాటి శాసనాల్లో కొని ఊట కాలువల ప్రస్తావన ఉంది. ఉదా: గొలుసు కాలువ, రావిపాటి కాలువ, మూసెటి కాలువ.
# ప్రతియేటా చెరువులు పూడికలు తీయించే వారు. చెరువులు, కాలువలకు, తూములకు మరమ్మతులు చేయించేవారు. ఈ పనులు చేసినవారికి ప్రతి పుట్టి ధాన్యానికి ఒక కుంచం ధాన్యం చెల్లించాలని శాసించి అమలు చేశారు. దీన్నే దశబంధ లేదా దశవంధమాన్యం అనేవారు. చెరువు కింద ఉన్న భూమిలో కొంత భూమిని దశవంధ మాన్యంగా ఈ విధులు నిర్వహించేవారికి ఇచ్చేవారు.
పరిశ్రమలు
# వ్యవసాయంతోపాటు అనేక పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. వరంగల్లులో రత్న కంబళ్లు, ముఖ్మల్ వసా్త్రలను తయారు చేసేవారు. పంచలోహాలతో అనేక రకాల వసా్త్రలను తయారుచేసేవారు. ఆనాడు యుద్ధాల్లో ఉపయోగించే ఆయుధసామాగ్రి స్థానికంగా తయారయ్యేది. నిర్మల్లో తయారైన కత్తులు విదేశాల్లో కూడా ప్రచారంలోకి వచ్చాయి. గోల్కొండలో వజ్రాల గనులున్నట్లు మార్కోపోలో తెలిపాడు.
-రాయలసీమలో కూడా వజ్రాలగనులు న్నాయి. దంతపు పెట్టెలను, రంగుల రాట్నాలను తయారు చేసేవారు. తోలు బొమ్మలాటకు బొమ్మలు తయారుచేసి రంగులు వేయటం పెద్ద పరిశ్రమగా అభివృద్ధి చెందింది. కాకతీయుల కాలంలో వృత్తి శ్రేణులు, వర్తకశ్రేణులు ఆర్థిక కార్యకలా పాల్లో వర్తక, వ్యాపారంలో కీలకపాత్ర పోషించాయి. శ్రేణి పెద్దని శ్రేష్టి అనేవారు. శ్రేణి సభ్యుల సమస్యలను శ్రేణి పరిష్కరించేది.
-విదేశీ వ్యాపారానికి మెట్టుపల్లి ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. అయితే కృష్ణపట్నం, హంసలదీవి, మచిలీపట్నం రేవులు కూడా విదేశీ వాణిజ్యాన్ని జరుపు తుండేవి. వర్తక వ్యాపారం చేసుకునేవారు ప్రభుత్వ అనుమతి పొందేవారు. వర్తక వ్యాపారం కోమట్ల చేతిలో ఉన్నప్పటికీ ఇతర కులాల వారుకూడా వర్తకంలో ఉన్నారు.
ప్రాక్టీస్ బిట్స్
1. కాకతీయులు వ్యవసాయ భూమిని ఎన్నిరకాలుగా విభజించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
2. కాకతీయుల కాలంలో సేద్యపు భూములైన అచ్చుకట్ట భూములపై వసూలు చేసే పన్నులను ఏమనేవారు.?
ఎ) కానిక బి) అరి
సి) సిద్ధాయం డి) దరిశనము
3. కాకతీయుల కాలంలో భూమిపై విధించే పన్నును ఏమని పిలిచేవారు?
1) పంగము 2) కానిక
3) సిద్ధాయం 4) దరిశనము
ఎ) 1, 2 బి) 2, 4
సి) 1, 4 డి) 1, 2, 3, 4
4. ఉప్పు సంచులపై చెల్లించే పన్నును ఏమని పిలిచేవారు?
ఎ) ఇల్లరి బి) ముదార సి) పుల్లరి డి) మడిగ సుంకం
5. పరిశ్రమలపై విధించే పన్నుల గురించి ఏ శాసనంలో వివరించారు?
ఎ) ఓరుగల్లు బి) పాలంపేట
సి) దుర్గి డి) అనుమకొండ
6. ఘన్పూర్ చెరువును ఎవరి కాలంలో తవ్వించారు?
ఎ) గణపతిదేవుడు బి) రుద్రమ దేవి
సి) గణపాంబ డి) రేచర్ల రుద్రుడు
7. కింది చెరువులను అవి తవ్వంచిన వారితో జతచేయండి?
1) బయ్యారం చెరువు a) జగదల ముమ్మడి
2) రామప్ప చెరువు b) రుద్రదేవుడు
3) పాకాల చెరువు c) రేచర్ల రుద్రుడు
4) అనుమకొండ చెరువు d) మైలాంబ
ఎ) 1-a, 2-b, 3-c, 4-d
బి) 1-d, 2-c, 3-a, 4-b
సి) 1-d, 2-a, 3-b, 4-c
డి) 1-d, 2-b, 3-c, 4-b
8. కాకతీయుల కాలంనాటి వాస్తు శిల్ప కళా ప్రధాన లక్షణాలు ఏవి?
1) ఎత్తయిన అధిష్ఠానం
2) శిల్పాలతో చెక్కిన స్తంభాలు
3) జలాలంకృతాలైన పిట్టగోడలున్న మండపాలు
4) తోరణ స్తంభాలు
ఎ) 1, 2 బి) 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 3
9. జాయప సేనాని రచించిన నృత్యరత్నావళి కళా రీతులు ఏ ఆలయం గోడలపై చెక్కారు?
ఎ) అనుమకొండ వేయిస్తంభాల గుడి
బి) స్వయంభూలింగ దేవాలయం
సి) పిల్లలమంరి ఏకేశ్వరాలయం
డి) పాలంపేట రామప్ప దేవాలయం
10. విద్యానాథుడు, గుండయభట్టు ఎవరి ఆస్థానంలో కవులు?
ఎ) గణపతి దేవుడు బి) రుద్ర దేవుడు
సి) ప్రతాపరుద్రుడు డి) రుద్రమదేవి
11. కాకతీయుల కాలంలో తెలుగుదేశంలో విలసిల్లిన సంఘ సంస్కరణ మతాలు ఏవి?
1) వీర శైవం 2) వీర వైష్ణవం
3) జైనం 4) బౌద్ధం
ఎ) 1, 2 బి) 1, 2, 3, 4 సి) 1, 3 డి) పైవేవీకాదు
12. కాకతీయుల రాజధాని ఓరుగల్లులో నివసించే వివిధ కులాల ప్రజల ఇండ్ల పట్టికను, అష్టాదశ ప్రజ అనే 18 కుల సంఘాలను గురించి పేర్కొన్న గ్రంథాలు?
1) క్రీడాభిరామం 2) ప్రతాప చరిత్ర
3) పండితారాధ్య చరిత్ర
4) నృత్యరత్నావళి
ఎ) 2, 3 బి) 1, 2
సి) 3, 4 డి) పైవేవీకాదు
13. కాకతీయుల కాలంలో అష్టాదశ ప్రజ అనే 18 కుల సంఘాలుండేవి వీటిని ఏమనేవారు?
ఎ) మహాజనులు బి) నరకం సి) సమయాలు డి) కులసంఘాలు
14. కాకతీయుల కాలంలో వేశ్యలు ఒక కులంగా రూపొందారు. వీరు చెల్లించే పన్నును ఏమని పిలిచేవారు? (బి)
ఎ) గద్యాణం బి) గుణాచారి
సి) మడిగ సుంకం డి) ముదార
15. కాకతీయుల కాలంనాటి ముఖ్యనాణెం ఏది?
ఎ) గద్యాణం బి) రూక
సి) చిన్నం డి) అడ్డుగ
16. కాకతీయుల కాలంలో వస్తువు విలువను నిర్ధారించి, చెల్లించవలసిన సుంకాన్ని నిర్ధారించే వారిని ఏమని పిలిచేవారు?
ఎ) సుంకరి బి) కాలగాడు
సి) ఫలదారు డి) తీర్పరి
17. కాకతీయుల కాలంలో గ్రామాల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలుగా ఎవరు వ్యవహరించేవారు?
ఎ) ఆయగార్లు బి) నియోగులు సి) పారుపత్యం గారు డి) పై ఎవరుకాదు
18. నాడు ధర్మ విషయంలో పరమ ప్రామాణి కులుగా అత్యంత ధర్మపరులుగా ప్రసిద్ధి చెందిన వారు?
ఎ) ప్రాడ్వివాకులు బి) మహాజనులు
సి) ఆయగార్లు డి) నియోగులు
సమాధానాలు
1-ఎ 2-బి 3-డి 4-బి 5-సి 6-ఎ 7-బి 8-సి 9-డి 10-సి 11-ఎ 12-బి 13-సి 14-బి 15-ఎ 16-డి 17-ఎ 18-బి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు