స్వేచ్ఛా నినాద వేగుచుక్క కుమ్రం భీం
కుమ్రం భీమ్ ప్రతిఘటనోద్యమం (1938 – 1940)
# సుర్దాపూర్ అటవీ ప్రాంతంలో కుమ్రం భీమ్ తన అన్నలతో కలిసి పోడు భూమిని సిద్ధం చేసుకుని, పంట సాగు చేశాడు. పంట కోతకు వచ్చిన సమయంలో ఈ భూములు ముస్లిం పట్టేదారు సిద్ధిఖీకి సంబంధించినవని పట్వారీ లక్ష్మణరావు చెప్పడంతో కుమ్రం భీమ్ అభ్యంతరం తెలిపాడు. చాలాకాలం నుంచి సాగు చేసుకుంటున్న ఆ భూమిపై తమకే హక్కు ఉందని వాదనకు దిగిన భీమ్ చిన్నాయన కుర్దుపై పట్టేదారు సిద్ధిఖీ చేయి చేసుకున్నాడు. దీంతో మొదలైన ఘర్షణలో పట్టేదారు సిద్ధిఖీని తమ ఆత్మ రక్షణ కోసం కుమ్రం భీమ్ హత్య చేశాడు. ఈ సంఘటన భీమ్ జీవితంలో తీవ్ర పరిణామాలకు కారణమైంది. కానీ, అడవి, పోడు వ్యవసాయమే ఏకైక జీవనాధారమై బతుకుతున్న గోండు, కొలాం గిరిజనుల్లో ‘చావోరేవో’ అనే నిర్ణయానికి, ఐకమత్యానికి ఈ సంఘటన గట్టి పునాదిని వేసింది.
# సిద్ధిఖీ మరణంతో మున్ముందు జరగబోయే పరిణామాలను ఊహించిన కుమ్రం భీమ్ తన మిత్రుడైన కొండల్‌తో కలిసి మహారాష్ట్రలోని బల్లార్షాకు వెళ్లి అక్కడ నెల రోజులు పనిచేసిన తర్వాత చంద్రాపూర్‌కు వెళ్లాడు. అక్కడ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేశాడు. దాని యజమాని విఠోభా. ఆయన సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ఆ కాలంలోనే కొంత చదవడం, రాయడం నేర్చుకోవడమే కాకుండా, విఠోభా ద్వారా చాలా ప్రభావితుడయ్యాడు. కానీ, ప్రభుత్వ వ్యతిరేక సమాచారాన్ని ప్రచురిస్తున్నాడనే కారణంతో బ్రిటిష్ అధికారులు విఠోభాను అరెస్టు చేశారు. దీంతో భీమ్ ప్రెస్ నుంచి తప్పించుకుని అస్సాం (చాయ్‌పత్తా దేశం)కు పారిపోయి టీ, కాఫీ తోటల్లో ఐదేండ్లపాటు పనిచేశాడు. మేస్త్రీలు, కాఫీ, టీ తోటల యజమానులు, బ్రిటిష్ అధికారులు సాగించే అణచివేతకు వ్యతిరేకంగా, కార్మికుల, కర్షకుల సమస్యల పరిష్కారానికి కూలీలందరికీ నాయకత్వం వహించాడు. ఆ సమయంలోనే నిరంకుశుడైన ఒక మేస్త్రీని కూలీలందరు కలిసి హత్య చేశారు. దీంతో కుమ్రం భీమ్ అక్కడి నుంచి తప్పించుకుని తన సొంత ప్రాంతంలోనే తన ప్రజల కోసం పాటుపడాలనే సంకల్పంతో తిరిగి ఆదిలాబాద్ అటవీ ప్రాంతమైన ‘జోడేఘాట్’కు వచ్చాడు. కుమ్రం భీమ్ తిరిగి వచ్చినట్లు అన్ని గోండు గూడాల్లో తెలిసిపోయింది. అస్సాం వెళ్లి వచ్చిన భీమ్ చదువుకున్నట్లు, బాగా తెలివిమంతుడైనట్లు గోండులు, కోలాములు భావించారు. ఇంతకుముందు లాగే పట్టేదార్లు, పోలీసుల దౌర్జన్యాలు ఇంకా ఆ ప్రాంతంలో కొనసాగుతూనే ఉన్నాయి. గిరిజన ప్రజల్లో అసంతృప్తి రగులుతూనే ఉంది. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషలు తెలిసిన భీమ్ కాకన్‌ఘాట్ గూడెం పెద్ద లచ్చుపటేల్కు చాలా దగ్గరయ్యాడు. గతంలో 12 ఎకరాల పోడు వ్యవసాయ భూమి విషయంలో జనగామలో అమీన్‌సాబ్ పెట్టిన కేసు నుంచి లచ్చుపటేల్‌ను గెలిపించడంతో గోండు, కోలాము గూడాల్లో కుమ్రం భీమ్ పలుకుబడి బాగా పెరిగిపోయింది. ఈ సమయంలోనే లచ్చుపటేల్ చొరవతో సోమ్బాయితో కుమ్రం భీమ్ వివాహం జరిగింది.
# కుమ్రం భీమ్ గోండు, కొలాము గూడాల్లోని గిరిజనులతో ‘జల్ జంగిల్ జమీన్’ (నీళ్లు, అడవులు, భూములు) అనే నినాదంతో తరతరాలుగా ఇవి మనవే కాబట్టి మనమందరం ఏకమై ప్రభుత్వాధికారులను ఎదిరించి పోడు వ్యవసాయం చేసుకుందామని పలుమార్లు నచ్చజెప్పి, చివరికి వారిని సంఘటితం చేసి జోడేఘాట్ చుట్టు పక్కల పోడు భూములను సిద్ధం చేసుకుని ఎక్కడికక్కడే 12 గోండు గూడాలను కుమ్రం భీమ్ ఏర్పాటు చేశాడు. అవి..
1. బాబేఝరీ 2. జోడేఘాట్ 3. చల్‌బరిడి 4. గోగిన్మోవాడం 5. టోయికన్మోవాడం 6. భీమన్‌గొంది 7. కల్లేగామ్ 8. మురికిలొంక
9. అంకుసాపూర్ 10. నర్సాపూర్ 11. దేమ్డీగూడ 12. పట్నాపూర్
# ఈ 12 గూడెల పరిధిలో దాదాపుగా 300 ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజనులు కుమ్రం భీమ్ నాయకత్వంలో ఆక్రమించుకుని, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సాగుచేస్తున్నారని రెవెన్యూ, అటవీ అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా గిరిజనులకేమైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి తెలపడానికి కొంతకాలం గడువిచ్చారు. కానీ, నిరక్షరాస్యులైన గోండు గిరిజనులకు ఇవేమి తెలియక, ఏం చేయాలో తెలియక ఆ భూములను సాగు చేస్తుండటంతో అధికారులు కేసులు కూడా పెట్టారు. అప్పుడు ఆ గిరిజనులు కుమ్రం భీమ్ మద్దతుతో కేసులను లెక్క చేయక కొంతమంది అధికారులతో ఘర్షణకు దిగి గాయపడ్డారు. అప్పుడు కుమ్రం భీమ్‌కు తుపాకీ గుండు తగిలి తీవ్రంగా గాయపడగా, పరిస్థితి విషమిస్తున్నదని గ్రహించిన అసిఫాబాద్ తాలుక్దార్ (కలెక్టర్), ఫస్ట్ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్లు కుమ్రం భీమ్‌తో చర్చలు జరిపారు. అంతకుముందే భీమ్ అనుచరుడు కుమ్రం నూరు, ఇతర ఐదుగురు బంధువులను అంగడికి వెళ్లినప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా, పై అధికారులు కుమ్రం భీమ్‌కు వ్యక్తిగతమైన ఆశలు చూపి ప్రభుత్వంపై పోరాటం ఆపేస్తే గిరిజనులకు భూమి హక్కు పట్టాలు కూడా ఇస్తామన్నారు. కానీ, భీమ్ తమకు 12 గూడేలపై స్వతంత్ర అధికారం (మావె నాటె – మావేరాజ్) కావాలని డిమాండ్ చేశాడు. దాంతో చర్చలు విఫలమయ్యాయి.
# ఇదే విషయంలో అంటే తమ గిరిజనులకు అటవీ భూము ల మీద హక్కులు కావాలని, తమ ప్రాంతం మీద తమకు స్వేచ్ఛాధికారాలు ఉండాలని కుమ్రం భీమ్, జనాకపురం పంతులు, ఆసిఫాబాద్‌లోని న్యాయవాది రామచంద్రారావు పైకాజీల సలహా మేరకు అనేకసార్లు మహదుద్వారా ఉత్తరాలు రాయించి నిజాంకు పంపాడు. అయినా నిజాం రాజు నుంచి ఎలాంటి జవాబు రాలేదు. దీంతో స్వయంగా వెళ్లి తమ సమస్యలను చెప్పుకోవాలని ఒక ఉత్తరంతో భీమ్, రఫీ, మహదులతో కలిసి హైదరాబాద్ వెళ్లగా, అధికారులు గానీ ప్రధానమంత్రిగానీ భీమ్ చెప్పే విషయాన్ని వినకపోగా గట్టిగా మందలించి తిరిగి పంపించారు. నిజాం దర్శనం కాక నిరాశతో తిరిగి వచ్చిన కుమ్రం భీమ్ జోడేఘాట్‌లో అధికారులు, పోలీసులు సృష్టించిన బీభత్సాన్ని తట్టుకోలేక, యుద్ధమే శరణ్యమని భావించి తన 12 గూడేల గిరిజనులను సమావేశపరిచి, అందరూ సంప్రదాయక ఆయుధాలతో సిద్ధంగా ఉండాలని చెప్పి పోరాటానికి పిలుపునివ్వడంతోపాటు 12 గ్రామాలు విముక్తి చెందినట్లు ప్రకటించి, తన పోరాట కేంద్రంగా జోడేఘాట్‌ను ఎంచుకున్నాడు. వెంటనే భీమ్ గోండు, కోలాం, పరధాన్, తోటి, నాయకపోడు గిరిజనులతో సైన్యాన్ని తయారుచేసుకుని యుద్ధానికి సన్నద్ధమయ్యాడు.
# ఈ సమయంలోనే అమీన్‌సాబ్ (ఎస్ఐ) తన సిబ్బందితో కుమ్రం భీమ్‌ను అరెస్టు చేయడానికి రాగా, వచ్చిన పోలీసులను భీమ్ అనుచరులు, సాయుధ గోండు సైనికులు చితకబాదారు. అంతేకాకుండా కుమ్రం భీమ్ నాయకత్వంలో గోండు రాజ్యం పాలన ప్రారంభమైందని, ఈ విషయాన్ని మీ నిజాం రాజుకు చెప్పాలని, మా రాజ్యంలో కాలుమోపితే తగిన బుద్ధి చెబుతామని గట్టిగా హెచ్చరించి పంపారు. ఈ సంఘటన అక్కడి గిరిజన ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. పోరాటం ఉద్ధృతం కావడంతో ఒక దశలో నిజాం ప్రభుత్వాధికారులు, పోలీసులు, కుమ్రం భీమ్ రాజ్యంలో కాలు మోపడానికి భయపడ్డారు. వెంటనే ఆసిఫాబాద్ డీఎస్పీ మీర్ హిదాయత్ అలీ సాహెబ్ అదనపు బలగాలు కావాలని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకోగా, ఆ కలెక్టర్ ఈ విషయమే వరంగల్ వెళ్లి సుబేదార్ అజర్హసన్ బేగ్‌కు చెప్పాడు. వెనువెంటనే సుబేదారు నిజాంకు ఈ విషయాన్ని చేరవేశాడు.
# విషయాన్ని తెలుసుకున్న నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమ్రం భీమ్‌తో చర్చించి సమస్యను పరిష్కరించి రావాలని సబ్‌కలెక్టర్‌ను పంపించాడు. అప్పుడు కలెక్టర్ మీ పన్నెండు గ్రామాలకు పట్టాలిస్తాం. కానీ, రాజ్యాధికారం ఇవ్వలేమని పోరాట నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరగా కుమ్రం భీమ్ మేము బతకడానికి కాసింత భూమి అడిగాం. కానీ, మీ నిజాం ఇవ్వలేదు. సమస్య ఇప్పుడు మా నిర్ణయాధికారంగా మారింది. ఇప్పుడు నిజాం మా సమస్యలను తీరుస్తాడనే నమ్మకం కూడా పోయింది. మా రాజ్యాధికార నిర్ణయం మారదు. మరొక్కసారి గోండులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి.
# ఈ విధంగా జోడేఘాట్ ప్రాంతంలో పరిస్థితులు చేజారుతున్న సమయంలోనే కుమ్రం భీమ్ దగ్గర పనిచేసిన కుర్దుపటేల్ను ప్రభుత్వాధికారులు లంచంతో కొనేసి, అతడి సహాయంతో నిజాం ప్రభుత్వ బలగాలు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కెప్టెన్ అలీరజా బ్రాండెన్ నాయకత్వంలో వంద నుంచి మూడు వందల మంది సైనికులు 800 అడుగుల ఎత్తు ఉన్న జోడేఘాట్ గుట్టలను ఎక్కారు. అప్పుడు వారితో తలపడిన కుమ్రం భీమ్ దళ సభ్యులు 200- 500 వరకు ఉంటారు.
# జోడేఘాట్ స్థానిక ప్రజలు చెబుత్నున వివరాలు, ఆనాటి నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ, కమ్యూనిస్టు నాయకులు బద్దం ఎల్లారెడ్డి స్థల సందర్శన చేసి సేకరించిన వివరాల ప్రకారం 1940, సెప్టెంబర్ 1న జోడేఘాట్‌లో ఉన్న గాల్గడ దేవత గుడి దగ్గర 12 గిరిజనుల గూడేల ప్రజలు సమావేశమవుతారాన్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ దాదాపుగా 300 మంది సాయుధ పోలీసులతో, విప్లవ ద్రోహి కుర్దు పటేల్ దారి చూపగా అదేరాత్రి ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున ఎలాంటి హెచ్చరికలు లేకుండానే మూకుమ్మడిగా దాడి జరిపారు. పడుకున్న గిరిజనులను, లేచి పరుగెత్తిన గిరిజనులను, జోడేఘాట్ లోయలోని నెయ్కప్పి జలపాతం, కారియేర్ గుండం దగ్గర కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో భాగంగానే కుమ్రం భీమ్ కూడా నిజాం సైనికులతో హోరాహోరీగా పోరాడుతూ వారి తూటాలకు బలయ్యాడు. ఈ కాల్పుల్లో దాదాపుగా 140 మంది గిరిజనులు అమరులై ఉంటారని అంచనా.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు