దళితుల ‘భాగ్య’ విధాత
హైదరాబాద్ రాజ్యంలో జరిగిన దళిత ఉద్యమంపై ఒక వ్యాసం రాయండి?
# హైదరాబాద్ రాజ్యంలో దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ అంటరానితనానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆదిహిందూ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి ఆద్యుడు మాదరి భాగ్యరెడ్డి వర్మ.
# భాగ్యరెడ్డి వర్మ రంగమాంబ, వెంకయ్య దంపతులకు 1888, మే 22న హైదరాబాద్‌లో జన్మించారు.
# ఈయన అసలు పేరు భాగయ్య. ఈయన కుటుంబ గురువు భాగ్యరెడ్డిగా ఆరునెలల ప్రాయంలో పేరుమార్చారు.
#భాగ్యరెడ్డి వర్మ 1906లో జగన్ మిత్రమండలి అనే సంస్థను స్థాపించారు. విద్యకు నోచుకోని దళితులకు విద్యాబుద్ధులు, క్రమశిక్షణ, వ్యాయామం నేర్పడం, దళితుల్ని సంఘటితపర్చడం జగన్ మిత్రమండలి ఆదర్శాలు.
# 1910లో దళితుల్లో ధార్మిక నైతిక ప్రబోధన కోసం వైదిక ధర్మ ప్రచారిణీ సభను స్థాపించారు. 1913లో ఆర్య సమాజ సేవకుడు అయిన బాజీ కృష్ణారావు భాగ్యరెడ్డికి ఆర్యసమాజ దీక్ష ఇచ్చి వర్మ బిరుదు ఇచ్చారు.
# 1911లో జగన్ మిత్రమండలి పరిధిని విస్తృతపరిచి ‘మనన…. సంఘాన్ని’ ఏర్పర్చారు. 1913లో దీన్నే ‘ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్’గా మార్చారు.
#1912లో ‘స్వస్తిక్ వాలంటీర్ల’ సంఘాన్ని ప్రారంభించి దళితుల సేవకు ఈ దళాన్ని ఉపయోగించారు.
# సికింద్రాబాద్‌లో జరిగిన సమావేశంలో భాగ్యరెడ్డి వర్మ అనేకమంది దళితుల్ని బ్రహ్మసమాజంలో చేర్పించారు.
# 1913లో బౌద్ధంవైపు ఆకర్షితుడైన భాగ్యరెడ్డి వర్మ వైశాఖ పౌర్ణమిన మొదటిసారిగా బుద్ధ జయంతి నిర్వహించారు. పద్మజానాయుడు, ఆదిపూడి సోమనాథరావు, చంద్రవర్మలు తదితరులు వీటిలో పాల్గొన్నారు.
#ఇలా బుద్ధ జయంతిని ప్రతి ఏడాది నిర్వహించేవారు. చివరి బుద్ధ జయంతి 1937, మే 25న వర్మ నేతృత్వంలో జరిగింది.
# భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ రాష్ట్రంలోనే కాక ఆంధ్రప్రాంతంలో కూడా దళితుల ఆత్మగౌరవ ఉద్యమానికి ఆద్యుడయ్యారు. బెజవాడలో 1917లో జరిగిన పంచమ సదస్సుకు అధ్యక్షుత వహించి తన అధ్యక్ష ఉపన్యాసంలో పంచమ శబ్దాన్ని ఖండించారు.
# భాగ్యరెడ్డి వర్మ నిరంతర కృషివల్ల మద్రాసు ప్రభుత్వం స్పందించి 1922, మార్చి 25న జీవో 817ను విడుదల చేసింది. మద్రాసు శాసనమండలి తీర్మానం చేస్తూ ‘దక్షిణ భారతాన నివసించే ప్రాచీన జాతుల్ని పంచమ, పరయాలుగా పిలవడం నిలిపివేయాలని ఆ పదాల్ని ప్రభుత్వం రికార్డుల్లోంచి తొలగించాలని, తమిళ ప్రాంతాల్లో ఆది ద్రావిడ, తెలుగు ప్రాంతాల్లో ఆది ఆంధ్రులుగా పిలవాలని స్పష్టం చేసింది.
# హైదరాబాద్‌లోనూ వర్మ చేసిన ప్రయత్నంవల్ల నిజాం ప్రభుత్వం 1931 జనాభా లెక్కల్లో అంటరానివర్గాలను ఆదిహిందువులుగా పేర్కొంది.
#1922 హైదరాబాద్ చరిత్రలో కీలకమైంది. ‘ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్’ మొదటి సదస్సు ఏటీజే పాపన్న అధ్యక్షతన హైదరాబాద్‌లో నిర్వహించారు. బొంబాయి, పుణే, కరాచీ, అకోలా, అమరావతి, నాగ్‌పూర్, మద్రాస్, కోస్తా ప్రాంతాల నుంచి దళిత ప్రతినిధులు పాల్గొన్నారు.
# ఈ సమావేశంలో అగ్రవర్ణ సంస్కర్తలైన జస్టిస్ రాయ్, సీ బాలముకుంద్, పండిత్ కేశవరావు, ఆర్ఈ రిపోర్టర్లు పాల్గొని ప్రసంగించారు.
# రెండో రోజు అన్ని కులాలకు చెందిన 900 మంది సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. కుసుమ ధర్మన్న ‘మాకొద్దీ నల్లదొరతనమని’ పాట పాడారు.
# దళితుల్లో విభేదాల పరిష్కారానికి పంచాయతీల పునరుద్ధరణ తీర్మానాలు చేశారు. భాగ్యరెడ్డి వర్మకు హైదరాబాద్‌లో ధర్మవీర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన వర్మ అరుంధతీయ నాయకుడుగా పేరుగాంచిన సుబేదారు సాయన్న అధ్యక్షతన 1925లో ఆదిహిందూ సభను నిర్వహించారు. 1925లోనే గుంటిమల్ల రామప్ప నేతృత్వంలో మాతంగ (మాదిగ) జనసభ ఏర్పర్చారు. దీనికి కొనసాగింపుగా 1927, మార్చిలో మల్లేపల్లిలో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన మాతంగి సభ జరిగింది. కల్లు, సారాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు.
#మాలలతోపాటు మాదిగల హక్కుల సాధన కోసం ఎన్ఆర్ బాబయ్య ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కేంద్రంగా ఉత్సవాలు జరిగాయి. బాబయ్య కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ పర్యటించి మాదిగల అభ్యున్నతికి పాటుపడ్డారు. ఈ ఉద్యమానికి ముదిగొండ లక్ష్యయ్య అనే పారిశ్రామికవేత్త, నాయకుడు ఆర్థిక సాయం చేశారు. ఎందరో మాదిగ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు.
# ఆదిహిందూ ఉద్యమాలు, వివిధ సంఘాలవల్ల దళితుల్లో పట్టణాల్లోనేకాక, గ్రామాల్లో కూడా చైతన్యం వచ్చింది. దీనిక ఉదాహరణ 1931, ఫిబ్రవరి 28న గోల్కొండ పత్రిక మధిర తాలూకా జోగిలపాడు గ్రామంలో దళితులైన బులుసుపాటి లూసి, దేవసహాయంలు వెట్టిని నిరాకరించారని పేర్కొంది.
#ఈ సందర్భంగా వెట్టికి వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకులైన పీసరి వీరన్న గ్రామాల్లో వెట్టి చేయవద్దని ప్రజల్ని చైతన్యపర్చడమేకాక, 1937లో హైదరాబాద్‌లో గాంధీ పర్యటనలో ప్రశ్నల్ని సంధించి, హరిజన పదాన్ని వ్యతిరేకించారు.
# ఆంధ్ర మహాసభ సమావేశాల్లో కూడా భాగ్యరెడ్డివర్మ పాల్గొన్నారు. జోగిపేటలో 1930, మార్చి 3, 4, 5 తేదీల్లో జరిగిన మొదటి సభకు అధ్యక్షతన వహించిన సురవం ప్రతాపరెడ్డి ఆదిహిందువులకు విద్యావకాశాలు, వసతుల కోసం నిజాం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు ప్రతిపాదించగా అంటరానితనం విడనాడాలని భాగ్యరెడ్డి వర్మ ప్రతిపాదించారు.
# ఆదిహిందూ యువతను చైతన్యపర్చడానికి 1925లో ప్రేమ్ థియేటర్ మైదానంలో ప్రఖ్యాత మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు అధ్యక్షతన ఆదిహిందూ యూత్ జిమ్నాస్టిక్ పోటీలు నిర్వహించారు.
# 1925లోనే ఆదిహిందూ వర్గాలకు పెయింటింగ్, స్కెచ్‌లు, శిల్పాల ఒక ఎగ్జిబిషన్ నిర్వహించారు.
#వర్మ కార్యక్రమాల్ని అభినందించిన గాంధీ 1929లో వర్మ స్థాపించిన ఆదిహిందూ సోషల్ సర్వీస్ లీగ్‌కు వచ్చి వర్మను ప్రశంసించారు.
# 1931, సెప్టెంబర్ 27, 28 తేదీల్లో లక్నోలో జరిగిన ప్రత్యేక సదస్సుకు అధ్యక్షునిగా భాగ్యరెడ్డి ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో దళితుల ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటును డిమాండ్ చేశారు. భారతదేశంలో 9 కోట్ల ఆదిహిందూ సమాజ ఏకైక ప్రతినిధిగా అంబేద్కర్‌ను ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
#ఈ సదస్సులో వర్మ పదం అగ్రకులాన్ని సూచిస్తుందని కొందరు సభ్యులు అభ్యంతరం తెలుపగా, తన పేరు నుంచి వర్మ పదం తొలగిస్తున్నానని భాగ్యరెడ్డి ప్రకటించారు.
#ఆయన తన జీవితంలో 1934 నాటికి దాదాపు 3,348 ఉపన్యాసాలు ఇచ్చినట్టు కృష్ణస్వామి ముదిరాజ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. 1939, ఫిబ్రవరి 18న అనారోగ్యంతో భాగ్యరెడ్డి మరణించారు.
అరిగె రామస్వామి
# భాగ్యరెడ్డి వర్మ సమకాలికుడైన అరిగె రామస్వామి హైదరాబాద్ రాష్ట్రంలో దళితుల చైతన్యానికి, కుల వివక్షతలకు వ్యతిరేకంగా కృషిచేశారు.
# రామస్వామి సికింద్రాబాద్‌లోని కుమ్మరి వాడలో సునీత బాల సమాజాన్ని, నాంపల్లిలో మాతంగి మహాసభను ప్రారంభించారు. మద్యపాన నిషేధం, జోగినీ వ్యవస్థ నిర్మూలన కోసం ఉద్యమించారు.
# దళితుల్లో ఉన్న మూఢ విశ్వాసాలు, జంతుబలులు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 1922లో ఆదిహిందూ జాతీయోన్నతి సభను స్థాపించారు. దీనికి రామస్వామి ఉపాధ్యక్షులుగా, కొండా వెంకటస్వామి అధ్యక్షులుగా జే పాపయ్య మరో ఉపాధ్యక్షులుగా ఉన్నారు.
# రామస్వామి ఒక మాల బాలికను దేవదాసీగా చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టి మాదిగ అబ్బాయితో పెండ్లి జరిపించి రెండు కులాల మధ్య సయోధ్య కాంక్షించారు. తరువాతి కాలంలో అరుంధతీయ మహాసభ స్థాపించి మాదిగ కులాల్లో చైతన్యాన్ని కలిగించారు.
# రామస్వామి సంస్కర్తే కాదు కవి కూడా.
బీఎస్ వెంకట్రావు
# అంబేద్కర్ అడుగుజాడల్లో దళిత వర్గాల విముక్తి కోసం నిజాం సంస్థానంలో మరో ఉద్యమం నడిపిన నేత బీఎస్ వెంకట్రావు.
#నిజాం రాష్ట్రంలో దళితుల విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో అనేక హక్కుల్ని సాధించారాయన. హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి పొందిన ఆయన 1898, డిసెంబర్ 11న హైదరాబాద్‌లో జన్మించారు.
#వెంకట్రావు దళితుల్లో మూఢనమ్మకాలు, జంతు బలులు, మద్యపానం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడి దళితుల్లో విద్యావ్యాప్తికి కృషిచేశారు.
# వెంకట్రావు అనేక దళిత సంఘాల్ని స్థాపించారు. వాటిలో మొదటిది 1922లో స్థాపించిన ఆది ద్రావిడ సంఘం. ఇది అతని స్నేహితులు మాదరి గోవిందరాజులు, మాదరి వెంకటస్వామితో కలిసి స్థాపించారు.
# 1927లో సీఎస్ యతిరాజ్, కే రామస్వామి, అరిగె రామస్వామితో కలిసి ఆదిహిందూ మహాసభ స్థాపించారు. ఈ సంస్థల ద్వారా దేవదాసీ వ్యవస్థ నిర్మూలన, దళితుల ఐక్యతపై శ్రమించారు.
# 1926లో సికింద్రాబాద్‌లో ఆదిహిందూ మహాసభను స్థాపించి, దానికి అనుబంధంగా లైబ్రరీని ప్రారంభించి విద్యావ్యాప్తి కోసం రాత్రి పాఠశాలలను ప్రారంభించారు.
# 1936లో ‘అంబేద్కర్ యూత్ లీగ్’ను ఏర్పాటు చేసి దళిత యువకుల ప్రగతికి శ్రమించారు. 1936, మేలో పూనాలో మహాసభకు అధ్యక్షతన వహించారు.
#1934లో అప్పటి ప్రధాని అక్బర్ హైదరీని కలిసి దళితులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని, జనాభా ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
# 1938లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో సభ్యునిగా, 1939లో హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్‌గా, 1946లో హైదరాబాద్ శాసనసభకు ఎమ్మెల్యేగా, 1947లో విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
# ఈయన అన్ని చిన్న దళిత సంఘాలన్నింటిని కలిపి హైదరాబాద్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు.
బత్తుల శ్యామ్‌సుందర్
# ‘అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిపేషన్’ పుస్తక రచయిత పీఆర్ వెంకటస్వామి శ్యాంసుందర్ దళితోద్యమ ప్రవేశాన్ని ‘రెడ్ లెటర్ డే’గా అభివర్ణించారు.
# వెంకట్రావుతో కలిసి దళిత జాతుల సమాఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌కు అధ్యక్షునిగా ఉన్నారు.
# హైదరాబాద్ రాష్ట్ర దళిత సమస్యల్ని నిజాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో శ్యాంసుందర్ ప్రముఖ పాత్ర వహించారు. నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యాన్ని కోరారు.
#1942, మే 30న పర్బణీలో జరిగిన డిప్రెస్డ్ క్లాసెస్ మహాసభకు అధ్యక్షత వహించారు.
# దళితులు తమ ఆత్మగౌరవ చిహ్నాలుగా అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని బీదర్‌లో ప్రారంభించారు.
# 1968లో శ్యాంసుందర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి అంబేద్కర్ పేరుపెట్టాలని కోరారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు