తెలంగాణ టూరిజం
తెలంగాణ భౌగోళికంగా పీఠభూమి కావడంతో గుట్టలు, లోయలు, నదులు, వాగులు, సహజసిద్ధమైన ప్రకృతి దృశ్యాలతో విదేశీయులను సైతం ఆకర్షించ గల పర్యాటక క్షేత్రాలు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి. చరిత్రకారులకు తెలంగాణ గని వంటిదని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు అన్నారు. అలాగే, ఈ ప్రాంతం పర్యాటకులకు గని వంటిదేనని చెప్పవచ్చు. ఎన్నో విహార స్థలాలు, చారిత్రక ప్రదేశాలు, కోటలు, బురుజులు, పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, నదులు, అభయారణ్యాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు ఎన్నో కనిపిస్తాయి.
తెలుగు వారిని పరిపాలించిన రాజ వంశాలన్నింటికి తెలంగాణే పుట్టినిల్లు. కాబట్టి చారిత్రక వారసత్వ సంపద తరతరాలుగా మనకు అందుతున్నది. అన్నిరకాల పర్యాటకులను తెలంగాణ ఆకర్షించగలుగుతుంది. ప్రకృతి ప్రేమికులకు పరిచయం చేయాల్సిన ప్రదేశాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. సమాచార-సాంకేతిక పరిశ్రమ తర్వాత అధిక ఆదాయం పర్యాటకరంగం నుంచే వస్తుంది.
-దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రం నాలుగు దశాబ్దాల క్రితం నల్లమల అడవుల్లో ఏర్పాటైంది. ఇలాంటి చూడతగినవి మరెన్నో ఉన్నాయి.పర్యటన అంటే ఒక ప్రదేశంలో నివసిస్తూ మరో కొత్త ప్రదేశానికి వినోదార్థం ప్రయాణం చేస్తూ, అక్కడి ప్రకృతి అందాలను, ప్రజల జీవన విధానాన్ని (సంస్కృతిని) అర్థం చేసుకోవడాన్ని పర్యాటనగా నిర్వచించవచ్చు. ఆధునిక శాస్ర్తాలు పర్యాటకులను రెండు రకాలుగా నిర్వచిస్తున్నాయి.
1. ఒక దేశం లోపల పర్యటించే వారిని దేశీయ పర్యాటకులని (డొమెస్టిక్ లేదా ఇన్బెండ్ టూరిస్ట్) అంటారు.
2. ఒక దేశానికి చెందినవారు మరో దేశాన్ని సందర్శిస్తే వారిని విదేశీ పర్యాటకులు (ఇంటర్నేషనల్ టూరిస్ట్ లేదా అవుట్ బెండ్ టూరిస్ట్) అంటారు.
-కొత్త ప్రదేశాలల్లోని చారిత్రక, విహార స్థలాలు, సాంస్కృతిక విషయాలు పర్యాటకరంగంలో ఉంటాయి. ప్రపంచ పర్యాటక స్థలాల్లో తెలంగాణ ఏమాత్రం తీసిపోదు.
పర్యాటకరంగం రకాలు
-పిలిగ్రిమేజ్ టూరిజం: మనదేశంలో తొలిసారిగా బౌద్ధుల కాలంలో ప్రారంభమైంది. ఇతిహాస, పౌరాణిక, చారిత్రక స్థలాలు ఈ కోవకు చెందుతాయి. ఈ టూరిజం మధ్యయుగంలో ప్రాముఖ్యత చెందింది.
-హెరిటేజ్ టూరిజం: చారిత్రక సంఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచి ఉన్న కోటలు, బురుజులు, గుడులు, బౌద్ధ, జైన ప్రదేశాలు, శిలాయుగపు ఆనవాళ్లు మొదలైనవి హెరిటేజ్ టూరిజం కిందికి వస్తాయి.
-కల్చరల్ టూరిజం: జానపద కళలకు సంబంధించిన వస్తు సముదాయం ఉంచిన మ్యూజియాలు (పేరిణి శివతాండవం-వరంగల్), చరిత్రకు సంబంధించిన మ్యూజియాలు.. హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియం, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా పురావస్తు మ్యూజియం, ఆదిలాబాద్-రవీంద్రశర్మ-కళాశ్రమం మొదలైనవి.
-ఎకో-టూరిజం: ప్రకృతిని చూసి ఆనందపడటం మానవ సహజం. ప్రకృతిలోని అనేక సుందర దృశ్యాలు చూసేవారిని ఎకో-టూరిస్టులు అంటారు.
-ఎకో టూరిజం అమెరికా ఖండంలో ప్రారంభమైంది.
-వైల్డ్-లైఫ్ టూరిజం: క్రూర జంతువులు, వింతపక్షులు, వన్యప్రాణులు మొదలైనవాటి సంరక్షణాలయాలు సందర్షించడం వైల్డ్-లైఫ్ టూరిజం.
-లీజర్-టూరిజం: మనస్సుకు ఆహ్లాదం కలిగించే సుందరదృశ్యప్రాంతాలకు వెళ్లేవారు విశ్రాంత దినాల్లో అక్కడే గడపడం.
-హెల్త్ టూరిజం: మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచుకునే పర్యటన. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాత్రా ప్రాశస్త్యం పెరిగింది. సుందరమైన ప్రదేశాలు, సహజసిద్ధమైన, చారిత్రకమైన అనేక యాత్రా కేంద్రాలు తెలంగాణలో కోకొల్లలు. హైదరాబాద్ ఉత్తర-దక్షిణ భారతదేశాలకు వారధి. ఇక్కడ ఉమ్మడి సంస్కృతి ఉన్నా భిన్నత్వంలో ఏకత్వం గోచరిస్తుంది.
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 1974లో ఒక ప్రత్యేక శాఖ ఏర్పడింది. మొదట ఇది ఆర్టీసీకి అనుబంధంగా ఉండేది. 1988లో దీన్ని పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా మార్చారు. 1999లో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఏర్పడింది.
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉంది.
చారిత్రక కోటలు
-ధూళికట్ట: ఇది శాతవాహనుల కాలపు స్తూపంతోపాటు మట్టికోటగా కూడా ఉంది.
-ఎంతో వైభవోపేతమైన చారిత్రక కోటలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. చరిత్రలో స్థల, వన, గిరి, జల దుర్గాలు ఉన్నాయి. మధ్యయుగ రక్షణ వ్యూహంలో ఎన్నో గిరి దుర్గాలు ఉన్నాయి.
-బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం వెలుపల శాతవాహనుల కాలంనాటి ఎత్తయిన మట్టికోట ఉన్నది. కోట లోపల కాకతీయుల కాలపు ఆలయాలు, కుతుబ్‌షాహీల కాలపు దేవళ్ మాస్కులు ఉన్నాయి.
-రాజపేట కోట: యదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. దీన్ని 1775లో రాజా రామన్న కట్టించాడు. అలనాటి మహోన్నత వైభవానికి, గతకాలపు చరిత్రకు సాక్షిగా నిలుస్తున్నది. కోటలో అద్భుత శిల్పకళ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. శత్రుదుర్భేద్యంగా నిర్మించిన ప్రధాన కోట చుట్టూ లోతైన అగడ్త ఉంది. కోటకు రెండు ఎత్తయిన ప్రధాన ద్వారాలు, వాటి పక్కన రెండు బురుజులు ఉన్నాయి.
-వరంగల్ కోట: మధ్యయుగ రక్షణ వ్యూహంలో భాగంగా ఈ కోటను నిర్మించారు. కాకతీయ ధైర్య సాహసాలకు పెట్టిన కోటగా ఇది ప్రసిద్ధిగాంచింది. చుట్టూ కంధకం, లోపలివైపు రాతిగోడలు, పటిష్ఠంగా, వ్యూహాత్మకంగా కట్టిన ప్రవేశ ద్వారాలు, కోట లోపల కీర్తి తోరణాలు ఉన్నాయి.
-హనుమకొండ: ఇది గిరి దుర్గం. కాకతీయుల తొలి రాజధాని హన్మకొండ గుట్టపై ఉంది. రాష్ట్రకూటుల కాలంలోనే ఇక్కడ రాతికోట ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తోరణ ద్వారం గుండా ప్రవేశించినా, కొండపైకి వెళ్తే చక్కని రాతికోట దర్శనమిస్తుంది.
-దేవరకొండ: ఈ గిరి దుర్గం నల్లగొండ జిల్లాలో ఉంది. సుమారు 10 కి.మీ. పొడవులో నిర్మితమైన ఈ దుర్గం గత వైభవానికి సాక్ష్యం. ఏడు కొండలను చుడుతూ కట్టిన శిలా ప్రాకారం. దుర్గంలో ద్వారాలు, వాటిపై చెక్కిన సింహం, నంది, లోపలికి వెళ్లగానే కూర్చోవడానికి కట్టిన నిర్మాణాలు, పూర్ణకుంభం వంటి నిర్మాణాలు ఆకర్షిస్తాయి. దీన్ని గతంలో సురగిరి అని పిలిచేవారు. సురగిరి అంటే దేవతల కొండ అని అర్థం. అదే దేవరకొండగా మారింది.
-గాంధారికోట: ఇది మంచిర్యాలకు సమీపంలో ఉంది. కొండను తొలచి కోటగా తీర్చిదిద్దారు. చిన్న ద్వారం, పెద్ద ద్వారం, గోడలపై శిల్పాలు, పైన గుహాలయాలు, నీటి తొట్లు, ఆపైన రాతియుగపు చిత్రాలవంటి నిర్మాణాలు ఉన్నాయి.
-ఖమ్మం కోట: వెయ్యేండ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం ఖమ్మం ఖిలా. ఈ కోట నిర్మాణం 997 నుంచి 1006 వరకు జరిగింది. విశాలమైన బురుజులు, కోటమీద రాతికట్టడాలు, కాకతీయుల నిర్మాణ కళానైపుణ్యం అబ్బురపరుస్తుంది. 4 చ.మైళ్ల వైశాల్యం ఉన్న ఈ ఖిలాలో పది ద్వారాలు, 15 బురుజులు ఉన్నాయి. రాతి గోడల చుట్టూ లోతైన కంధకాలు, సింహద్వారం దగ్గర్లో ఆరు అడుగుల ఫిరంగి ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ దుర్గాన్ని జయించాడు. ఔరంగజేబు 1687లో వశపర్చుకున్నాడు. 1937లో నిజాం ప్రభుత్వం ఈ దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నది.
-వేల్పుగొండ: జనగాం జిల్లాలో ఉన్న జఫర్‌గఢ్ పాతపేరు వేల్పుగొండ. జఫరుద్దౌలా పాలనవల్ల జఫర్‌గఢ్ అని పేరొచ్చింది. కోటలో ఫిరంగులు, నరసింహస్వామి గుడి, కొలను ఉన్నాయి.
ఇతర గిరి దుర్గాలు
-నల్లగొండ, సిరికొండ, అనంతగిరి, ఉండ్రుగొండ, ఉర్లుగొండ, రాచకొండ మొదలైనవి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. ప్రకృతి దృశ్యాలు, కమనీయమైన చారిత్రక బురుజులు, తోరణాలు, కోటలు, అంతఃపురాలు, రాతి కట్టడాలు, కొలనులు, బావులు, ఇతర నిర్మాణాలు ఎన్నో చూడముచ్చటగా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా
-సుమారు 15 చూడదగిన ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి. కుంటాల, పొచ్చెర్ల, కనకాయి, గాడిద (గాయిత్రి) జలపాతాలు, సత్నాల ప్రాజెక్టు, నాగోబా ఆలయం, జైనాథ్ ఆలయం, మహాదేవ్ (బేల), గుడి హత్నూర, పాప హరేశ్వరాలయం, ఖాందేవుడు (నార్నూర్), ఉట్నూరు (శివాలయం), మత్తడివాగు ప్రాజెక్టు చూడదగ్గవి.
-నాగోబా మందిరం: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఈ గుడి ఉంది. ఇక్కడ గిరిజనుల సర్ప దేవత నెలవై ఉంటుంది. గోండ్ జాతికి చెందిన నాగోబా ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది.
-కృష్ణాగ్రహారం: గద్వాలకు 4 కి.మీ. దూరంలో సీతారామాలయం 22 ఏండ్ల క్రితం ఏర్పడింది.
-బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం: కృష్ణ-తుంగభద్ర నదులమధ్య, జాతీయ రహదారికి దగ్గర్లో ఉంది. ఇక్కడ హనుమంతునికి రెండువైపుల శంఖచక్రాలు ఉంటాయి.
-బీచుపల్లి నిజాంకొండ ఆంజనేయస్వామి ఆలయం: బీచుపల్లి క్షేత్రం వద్ద కృష్ణానదిలో ద్వీపపు కొండపై 18వ శతాబ్దంలో నిర్మించారు. 35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోటలో ఆంజనేయస్వామి ఆలయం, మసీదులు ఉన్నాయి.
-యాపర్ల: ఇది వనపర్తి సంస్థాన గ్రామం. 1915లో ఈ సంస్థాన దివాన్ గోవింద్‌నాయక్ యాపర్లలో రామాలయం నిర్మించారు.
-సంగమేశ్వర ఆలయం: ఇది కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతం. ఇక్కడ కృష్ణానది తీరంలో నివృత్త సంగమేశ్వరం, కూడలి సంగమేశ్వరం అనే ప్రసిద్ధ సంగమ క్షేతాలు ఉన్నాయి. అలంపురం నవబ్రహ్మాలయం శిల్పరాతులు కూడా ఈ ఆలయ నిర్మాణంలో చూడవచ్చు. కుడ్యాలపై నటరాజు, అర్ధనారీశ్వర, అంధకాసుర సంహార వంటి శిల్పాలు చూడవచ్చు.
-ఓంకారేశ్వర స్వామి ఆలయం: అలంపురానికి 7 కి.మీ. దూరంలో గొందిమళ్ల గ్రామం గుట్టపై ఉంది.
-బెక్కేశ్వరస్వామి ఆలయం: కొల్లాపూర్ సమీపంలో బెక్కెం గ్రామంలో ఉంది. కళ్యాణీ చాళుక్య త్రిభువన మల్ల 6వ విక్రమాధిత్యుని సామంతుడైన బిజ్జరస్గు క్రీ.శ. 1111లో ఈ ప్రాంతంలో పెద్ద తటాకం తవ్వించాడు. ఈ గ్రామం దగ్గర్లో కాళిక, నటరాజ, భైరవ సూర్య, మహిషాసురమర్దిని వంటి 11 గదులున్నాయి.
-జటప్రోలు: ఇక్కడ మదనగోపాలస్వామి ఆలయం ఉంది. దీనికి 400 ఏండ్ల చరిత్ర ఉంది.
-నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధస్తూపం ఇది. దీనికి తూర్పు దిక్కున నల్లరాతి కొండ ఉంది. అందుకే ఇది క్రమంగా నేలకొండపల్లి అయ్యింది.
-భద్రాచలం: గోదావరి నది ఒడ్డున వెలసింది. తానీషా పాలనలో రామదాసు కట్టించాడు. గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం భక్తులను ఆకర్షిస్తున్నది. శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి.
-నవబ్రహ్మాలయాలు: బాల బ్రహ్మేశ్వరాలయం, తారక బ్రహ్మేశ్వరాలయం, స్వర్గబ్రహ్మేశ్వరాలయం, పద్మాబ్రహ్మేశ్వరాలయం, విశ్వబ్రహ్మేశ్వరాలయం, గరుడ బ్రహ్మేశ్వరాలయం, కుమార బ్రహ్మేశ్వరాలయం, అర్కబ్రహ్మేశ్వరాలయం, వీరబ్రహ్మేశ్వరాలయం.
-వీటిలో ప్రధానమైనది బాల బ్రహ్మేశ్వరాలయం.
-దేవాలయ ప్రాంత దుర్గ కుడ్యాలపై కొన్ని బౌద్ధ జైనమత శిల్పాలు చూడదగినవి.
-దత్తాత్రేయ స్వామి ఆలయం: ఇది కృష్ణానది తెలంగాణలో అడుగుపెట్టే ప్రాంతంలో ఉంది. (మక్తల్ మండలంలో)
-చెన్నబసవేశ్వరస్వామి ఆలయం: కృష్ణానది మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించిన తర్వాత రెండు పాయలుగా చీలి కురుగడ్డ, గుర్రంగడ్డ, నారదగడ్డ అనే దీవులు ఏర్పడ్డాయి. ఈ నారదగడ్డపై చెన్నబసవేశ్వరస్వామి ఆలయం వెలిసింది.
-చింతరేవుల ఆంజనేయస్వామి ఆలయం: ఇది గద్వాలకు 11 కి.మీ. దూరంలో ఉంది. ఈ స్వామి భీమ, హనుమ, మధ్య త్రిముఖాలతో దర్శనమిస్తాడు.
-మంచాలకట్ట మాధవస్వామి ఆలయం: ఈ ఆలయం శిల్పకళాశోభీయం. ఆలయ కుఢ్యాలపై అద్భుతమైన శిల్పకళతో విష్ణుమూర్తి దశావతారాలు, మరికొన్ని శిల్పాలు ఉన్నాయి.
-రామతీర్థం-రామలింగేశ్వరాలయం: ఈ ఆలయాన్ని సోమనాథ సిద్ధుడు, చిదానంద సిద్ధుడు నిర్మించారు. ఇక్కడ పంచముఖేశ్వర నవలింగాలయాలు ఉన్నాయి.
-అగస్తేశ్వరాలయం: కొల్లాపూర్‌కు 11 కి.మీ. దూరంలో ఉంది.
-మట్టపల్లి: ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది. ఇది సూర్యాపేట జిల్లాలో ఉంది.
-మేళ్ల చెరువు: స్వయం భూ శంభులింగేశ్వర స్వామి ఆలయం కృష్ణానదీతీరంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ దగ్గల్లో ఉంది.
హైదరాబాద్‌లో టూరిజం ప్రాజెక్టులు
-హెరిటేజ్ విలేజ్- పుప్పాలగూడ: 78 ఎకరాల విస్తీర్ణంలో ప్రాచీన వారసత్వ కట్టడాల నమూనాలో ఉంటుంది.
-బర్డ్ పార్క్-హిమాయత్‌సాగర్: రకరకాల పిట్టలు, పక్షులు, మొసళ్లు, పచ్చని ల్యాండ్ స్కేటింగ్‌తో 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
-అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్-హిమాయత్ సాగర్: ఇది 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
-ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ -షామీర్పేట్: ఇది 700 ఎకరాల్లో ఉంది.
-వ్యూ టవర్ అండ్ రివాల్వింగ్ రెస్టారెంట్: లోయర్ ట్యాంక్ బండ్లో ఉంది. ఇది 200 అడుగుల ఎత్తులో ఉంది.
-బొటానికల్ గార్డెన్స్-కొత్తగూడ: ఇది 120 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
-హుస్సేన్‌సాగర్ వద్ద ఫ్లోటింగ్ ప్యారడైజ్-కాసినో క్లబ్.
-మహావీర్ హరిణవనస్థలి వద్ద ఎకో-టూరిజం అభివృద్ధి.
-కీసరగుట్ట: ఇక్కడ రామలింగేశ్వరాలయం ఉంది. కొండపై ప్రతిష్ఠించిన అనేక శివలింగాలు, చెరువు, నగరానికి దగ్గర్లో కొండపై ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇక్కడ టూరిజం వారి పున్నమి హోటల్ ఉంది.
నిర్మల్ జిల్లా
-చక్రలింగేశ్వరస్వామి ఆలయం, కోటిదేవుని ఆలయం (ధర్మారం), వేంకటేశ్వర ఆయలం-గంగాపూర్, గోపాలస్వామి ఆలయం-భైంసా, లక్ష్మీనరసింహస్వామి ఆలయం-కాల్వ, శ్యామ్ఘర్ కోట- నిర్మల్, బత్తీస్ఘడ్ కోట-నిర్మల్, కడెం ప్రాజెక్టు, నిర్మల్-కొయ్యబొమ్మలు, సదర్మట్ ఆనకట్ట-ఖానాపూర్, పోచంపాడు జలాశయం మొదలైనవి చూడదగినవి.
-జ్ఞానసరస్వతి ఆలయం- బాసర: దక్షిణ భారతదేశంలో విశిష్ఠమైనది సరస్వతి ఆయలం. ఇది గోదావరి నది ఒడ్డున ఉంది. ఇది చాళుక్యుల నిర్మాణం.
-ఈ విగ్రహాన్ని వ్యాసుడు ప్రతిష్ఠించడం వల్ల వ్యాసపురి బాసరగా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
-సీతారామచంద్ర స్వామి ఆలయం-భద్రాచలం, బాలాజీ ఆయం-అన్నపురెడ్డిపల్లి, వీరభద్రస్వామి ఆయలం-మోతెగడ్డ, పెద్దమ్మతల్లి ఆలయం-పాల్వంచ, వేంకటేశ్వరస్వామి ఆయలం-పాల్వంచ, కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఉమామహేశ్వరాలయం-జూలూరుపాడు, పర్ణశాల-దుమ్ముగూడెం, ఐటీసీ పేపర్‌మిల్-సారపాక, భారజల విద్యుత్ కేంద్రం-మణుగూరు, థర్మల్ విద్యుత్ కేంద్రం- కొత్తగూడం, సెయింట్ ఆండ్రూస్ చర్చి-కొత్తగూడెం, కిన్నెరసాని ప్రాజెక్టు (గోదావరి ఉపనదిపై ఉంది).
-కిన్నెరసాని అభయారణ్యం: భద్రాచలానికి 35 కి.మీ. దూరంలో ఉంది. లేళ్ల పార్కు, గాజుతో నిర్మించిన అతిథిగృహం, పర్యావరణ పార్కు, పర్యావరణ అధ్యయన కేంద్రం ఉన్నాయి.
-పర్ణశాల: ఇది ప్రకృతి సౌందర్యానికి ప్రతీక. ఇక్కడ శ్రీరాముడు కొంతకాలం నివసించాడు. పర్ణశాలలోని రామున్ని శోకరాముడు అంటారు.
-అన్నపురెడ్డిపల్లి: 700 ఏండ్లనాటి వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది.
-గుండాల: ఇక్కడ 100 చ.గ. విస్తీర్ణంలో వేడినీటి బుగ్గలు ఉన్నాయి.
-అలంపురం: ఈ మహాక్షేత్రంలో ప్రధానంగా నవలింగాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయాలను బాదామీ చాళుక్యులు నిర్మించారు. స్థల పురాణం ప్రకారం పరుశురాముని తండ్రి జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉండేది.
బీచుపల్లి క్షేత్రం: ఇది కృష్ణానది తీరంలో ఉంది. నది మధ్యలో చిన్నకొండపై ఒక శిథిల దుర్గం ఉంది. దీన్ని గద్వాల సంస్థానాధీశులు కట్టించారని, ఇక్కడ కణ్వమహర్షి తపస్సు చేశాడని ప్రతీతి. ఈ దేవాలయ అర్చకులు బోయవారు. ఈ క్షేత్రంలో ఉన్న ఆంజనేయస్వామిని 11వ శతాబ్దంలో వ్యాసరాయలు కట్టించినట్లు తెలస్తున్నది. అంతకుముందే 9వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఆలయం శిథిలమవ్వగా, గద్వాల సంస్థానాధీశులు పునర్నిర్మించారు.
అలంపురం: ఇది కృష్ణ-తుంగభద్రానదులు కలిసే ప్రాంతాల్లో ఉంది. దీన్ని దక్షిణ కాశీ అంటారు. హలం (నాగలి) దున్నేవారు క్రీ.పూ. ఉన్నారని కథ. అదే అలంపురం అయ్యింది. కొందరు ఎల్లమ్మ దేవత కారణంగా ఎల్లమ్మపురం, ఎలమ్పురం, అలంపురంగా మారిందని చెప్తారు. ఈ క్షేత్రాన్ని బ్రహ్మేశ్వర క్షేత్రమని, పరశురామ క్షేత్రమని, శక్తిపీఠమని ఎన్నోపేర్లతో పిలుస్తారు.
భువనగిరి కోట: దీన్ని ఏకశిలపై కళ్యాణీ చాళుక్య త్రిభువనమల్లుడు నిర్మించాడు. సర్దార్ సర్వాయి పాపన్న కొద్ది రోజులు ఈ కోట నుంచి పరిపాలించాడు. ఈ కోటలో కొండపై కుతుబ్‌షాహీల బారాదరి, నీరు తోడుకునే విధానం పర్యాటకులను ఆకర్షిస్తుంది.
భద్రాచలం: గోదావరి తీరంలో శ్రీరామదాసు నిర్మించాడు. దీనిని Heart of The Deccan అని బ్రిటిష్ వారు పిలిచేవారు. ఈ ఆలయానికి ప్రత్యేకమైన, చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. 1965లో దేవాలయానికి ఉత్తరాన కల్యాణ మండపాన్ని నిర్మించారు. దీనిచుట్టూ రామాయణ కథలోని అద్భుత దృశ్యాలను శిల్పాలుగా మలిచారు. గర్భగుడికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామిని దర్శించిన తర్వాతే రామదర్శనం చేసుకోవాలి.
-కల్యాణ మండపం 31 చదరంలో ఉపోప పీఠంతో చేశారు. దీనిపై వరుసగా నడుస్తున్నట్టుగా 50 ఏనుగులను చెక్కారు. దీని పైభాగాన పట్రోపపీఠం అని ఒక ఉపపీఠమున్నది. పద్మ దళంతో కూడిన పద్మజగతి కంఠం అనే శిల్పం ఉంది. ముందువరుసలో గరుడుడు, ద్వారా పాలకులు ఒక పక్క, ఆంజనేయుడు మరోపక్క ఉన్నారు. రామదాసు, దమ్మక్క, గీతోపదేశం, శివధనుర్భంగం, చతుర్భుజ రాముడు, పాణీగ్రహణం, పోకల దమ్మక్క, శేషశయనం, శ్రీరామ పట్టాభిషేకం, జనక కన్యాదానం, పంచముఖవాద్యం, భద్రునికి రామదర్శనం, కబీర్దాసు మొదలైన శిల్పాలు ఉన్నాయి.
గోల్కొండ: హైదరాబాద్‌లో ఉన్న ఈ కోట నిర్మాణం కాకతీయుల కాలంలో ప్రారంభమై, కుతుబ్‌షాహీల కాలంలో విస్తరించింది. కొండ చుట్టూ కంధకం, దాని పక్కనే రాతికోట, నాలుగువైపుల 4 ప్రవేశ ద్వారాలు, పైన రెండు వరుసల్లో కోట గోడలు, లోపల రాజప్రసాదం, అద్భుతమైన కట్టడాలు. కంచర్ల గోపన్న బందీఖానా, చుట్టూ కోట గోడలు చూడదగ్గ విశేషాలు.
జైనాథ్ ఆలయం: ఇది పల్లవ రాజుల కాలంలో జైన సంప్రదాయ పద్ధతిలో అష్టకోణాకృతిలో నిర్మించారు. ఈ ఆలయంలోని లక్ష్మీనారాయణుడిపై సూర్యోదయ కిరణాలు నాలుగు నెలలపాటు కనిపిస్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు