తెలంగాణలో మిశ్రమ సంస్కృతి..
13వ శతాబ్దం చివరికాలం నుంచే దక్కనులో, తెలంగాణలో కూడా ముస్లిం మత పెద్దలు, అధికారులు, ప్రజలు స్థిర నివాసం ఏర్పర్చుకుంటున్నప్పటికీ కుతుబ్‌షాహీలు తెలంగాణలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసేంతవరకు ముస్లింలకు స్థానికత లేదు. కుతుబ్‌షాహీ సుల్తానులు ఇస్లాం మతంలోని షియా శాఖకు చెందినవారు. షియా శాఖకు చెందిన ముస్లింలకు సహనం ఎక్కువ. సుల్తాన్ కులీకి మరీ ఎక్కువ. ఆయన తెలుగుదేశం అంతా తనదే అనుకునేవాడు.
ఆయన వారసత్వం ఆయన కొడుకు ఇబ్రహీం కుతుబ్‌షాకు వచ్చింది. రాజకీయ కారాణాల వల్ల ఇబ్రహీం హిందూ రాజులైన విజయనగర రాజ్యంలో కొంతకాలం ఉండటం, దేవరకొండ ప్రాంతానికి రాజప్రతినిధిగా పనిచేయడంతో ఆయనకు హిందువుల భాషా-సంస్కృతులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆయన హిందూ అమ్మాయి భాగీరథిని పెళ్లి చేసుకున్నాడని ఆయన ఆస్థాన కవి అద్దంకి గంగాధరుడు తన గ్రంథం తపతీ సంవరణోపాఖ్యానం లో రాశాడు. ఇబ్రహీం కొడుకు మహ్మద్ కులీకుతుబ్‌షా భాగమతి అనే హిందూ స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఆమె ఊరు చించెలంలో చార్మినార్ కట్టించాడు. ఆమె పేరు మీదనే చార్మినార్ ప్రాంతపు కొత్త నగరానికి భాగ్యనగర్ అనే పేరు వచ్చిందట. భాగమతి మహమ్మద్ కులీకి భార్య అయిన తర్వాత ఆమె పేరు హైదర్‌మహల్‌గా మార్చడంతో ఆమె పేరు మీదనే భాగ్యనగరానికి హైదరాబాద్ అనే పేరు వచ్చిందని ఆ కాలపు విదేశీయుల రచనలు భిన్న కథనాలను నమోదు చేశాయి.
-అబ్దుల్లా కుతుబ్‌షా కాలం నుంచి అక్కన్న, మాదన్న మొదలైన హిందువులు సర్వసైన్యాధ్యక్షుడు, ప్రధానమంత్రి వంటి పెద్ద పెద్ద పదవులను నిర్వహించారు.
-అబుల్ హసన్ తానీషా హిందూ దేవుడైన భద్రాచల రాముడికి భద్రాచలం, పాల్వంచ, శంకరగిరి గ్రామాల్లో వందల ఎకరాలను రాసిచ్చాడు. ఇలా కుతుబ్‌షాహీ రాజులు ఇస్లాం మతస్థులు అయినప్పటికీ వారు తమను తాము ఎప్పుడూ విదేశీయులు (టర్కీలు=తురకలు) అనుకోకుండా స్థానిక హిందువులతో బలమైన బంధాలను పెంచుకోవడంతో తెలుగు దేశంలో మిశ్రమ సంస్కృతి వికసించింది. అది రాజకీయ, మత, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నింటిలోనూ వేళ్లూనుకొంది.
కుతుబ్‌షాహీ రాజులు ముస్లింలు అయినప్పటికీ గ్రామాల్లో పన్నులు వసూలు చేయడం, అధికార యంత్రాంగాన్ని నడిపించడం వంటి అధికారాలు ఎక్కువగా హిందువులైన బ్రహ్మణులు, రెడ్లు, వెలమలు, కమ్మలకే మిరాశీదార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేల పేర్లతో ఇవ్వబడ్డాయి. గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, దోమకొండ, పాపన్నపేట మొదలైన సంస్థానాధీశులు హిందువులే. అక్కడక్కడ పైఅధికారం మాత్రం కొంతమంది ముస్లింలకు ఇవ్వబడంది. కాబట్టి పల్లెల్లో అక్కడక్కడా పన్ను వసూలు కేంద్రాలు, కచేరీలు, మసీదులు కుతుబ్‌షాహీ వాస్తుశైలిలో నిర్మించబడ్డాయి.
కుతుబ్‌షాహీ రాజులు, వారి ముస్లిం సామంతులు, అధికారులు మసీదులు, ఇతర ముస్లిం కట్టడాలు కట్టించి వాటికి మాన్యాలు ఇచ్చారు. కొన్ని చోట్ల హిందూ ఆలయాలకు, బ్రాహ్మణులకు కూడా అగ్రహారాలను దానాలుగా ఇచ్చారు. కృష్ణానది తీరంలో ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయానికి తానీషా భోగాపురం, చెరకూరు, వీరన్న పట్టణాలను దానం చేశాడు. మహమ్మద్ కులీ కుతుబ్‌షా ఉద్యోగి లాల్‌ఖాన్ ఉప్పునూతల అనే గ్రామాన్ని బ్రాహ్మణులకు అగ్రహారంగా ఇచ్చాడు. అక్కన్న-మాదన్నలైతే ఎన్నో హిందూ ఆలయాలను పునరుద్ధరించారు. అలాంటి ఆలయాలను వారి పేర్లతో పిలుస్తున్నారు.
-పర్షియా చక్రవర్తిని ప్రపంచంలో ఉన్న ముస్లిలందరికీ మత పెద్దగా భావించి ఆయన పేరును శుక్రవారం నాటి ప్రార్థనల్లో చదివినా, వారి కాలంలోనే సూఫీలు అనే ముస్లిం మత గురువులు మత సహనాన్ని బోధించినా కుతుబ్‌షాహీ రాజులు వారికి అభ్యంతరం చెప్పలేదు. నిజానికి హిందూ ముస్లిం సంస్కృతుల సమ్మేళనానికి, ఐక్యతకు కృషి చేసింది సూఫీలే. మానవులంతా సోదరులే అని బోధించే వారి మఠాలను హిందువులు ఎంతోమంది దర్శించేవారు.
సంగీతం-నాట్య కళల్లో ప్రావీణ్యం కలిగిన వేశ్యలు హిందూ-ముస్లిం ఇరు సమాజాల్లోనూ ఉండేవారు. వారిని ఇరు సమాజాలకు చెందిన కులీనులు పోషించేవారు. కూచిపూడి భాగవతులకు అబుల్హసన్ తానీషా కూచిపుడి అగ్రహారాన్నిచ్చాడు. అబ్దుల్లా కుతుబ్‌షా ఆస్థానాన్ని క్షేత్రయ్య దర్శించి ఆయన మీద ఎన్నో పదాలు చెప్పాడు. భద్రాచలం రామదాసు కీర్తనలు తెలుగుదేశమంతటా ప్రచారమయ్యాయి. భద్రాచలానికి కుతుబ్‌షాహీలు మాన్యాలిచ్చారు. ఆనాటి ముస్లిం వాద్యకారులు భద్రాచలంలో ఇప్పటికీ కొనసాగుతున్నారు.
-హిందూ వాస్తు-శిల్ప రీతికి సంబంధించిన పూర్ణ కుంభాలు, లతలు-పద్మాలు, హంసలు, ఏనుగులు మొదలైన శిల్పాలు ముస్లిం కట్టడాల్లో ప్రవేశించాయి. దాంతో భారత్-పర్షియా వాస్తు నిర్మాణాల కలయికతో ఇండో-శారసెనిక్ అనే కొత్త వాస్తు రీతి పుట్టింది. అబ్దుల్లా కుతుబ్‌షా కాలం నుంచి వెలుగులోకి వచ్చిన దక్కన్ సూక్ష్మ చిత్రకళ (Meniature paintigs)లో హిందూ పద్ధతిలో రాగాలు, స్త్రీల (రాగమాల) భావనలు ప్రవేశించాయి.
ఇలా ఓ పక్క సామరస్య సంస్కృతి వెల్లి విరుస్తున్న కాలంలోనూ మరో పక్క పర్షియా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి షియా ముస్లింలు వచ్చి తెలుగు దేశమంతటా విస్తరించారు. మహమ్మద్ కులీ సున్నీ ముస్లింలను నిరసించేవాడు. దాంతో సున్నీ ముస్లింలైన మెఘల్ చక్రవర్తులు షాజహాన్, ఔరంగజేబులకు కోపం వచ్చి, గోల్కొండ రాజ్యాన్ని ఓడించి తమ రాజ్యంలో కలుపుకున్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న
1687లో తెలంగాణను పాలించే గోల్కొండ రాజ్యాన్ని మెఘల్ సామ్రాట్ ఔరంగజేబు ఓడించి దక్కన్ సుబాగా చేసి ఒక గవర్నరు పాలనలో ఉంచాడు. సుబా అధికారులు ఇక్కడి స్థానికులు కాదు. కాబట్టి వారు ప్రజా సంక్షేమం కోసం పనిచేయకుండా పన్నుల వసూలు, వీలైనన్ని విధాల వ్యక్తిగత సంపాదనల మీదే దృష్టి పెట్టేవారు. ప్రత్యక్ష పరిపాలన లేకపోవడం వల్ల అలాంటి ముస్లిం సర్దారుల అండతో జమీందార్లు కూడా ప్రజలనే హింసించడం మొదలుపెట్టారు. బాధిత ప్రజల్లో 14వ శతాబ్దం నుంచి తెలంగాణలో స్థిరపడుతూ వచ్చిన తురకలు కూడా ఉన్నారు. అంటే హిందూ ముస్లింలు అందరూ 17వ శతాబ్దానికల్లా ఒక స్థానిక సంక్షేమ ప్రభుత్వ ఏర్పాటును కోరుకున్నారు.
ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని జనగామ ప్రాంతంలో గౌడ కులంలో నాచగోని సర్వాయి పాపన్న అనేవాడు పుట్టాడు. ఇతడు తెలంగాణలో స్థానిక పరిపాలనను ప్రవేశపెట్టాలనే బృహత్ ఆశయం కలవాడు. శారదకాండ్రు, వీరముష్టివారు, పిచ్చుకుంట్లవారు అనే జానపదులు పాడే పాపన్న వీరగాథ ప్రకారం తన తల్లి సర్వమ్మను హింసించి, ఆమె చూపిన చోట తవ్వి, ఏడు కొప్పెరల ధనం వెలికి తీసి, దానితో బంధుమిత్రులను, యువకులను కలుపుకొని సైన్యాన్ని నిర్మించాడు. సమకాలీన ముస్లిం రచనల ప్రకారం పాపన్న ధనం సేకరించి నిర్మించాడు.
పాపన్న సైన్యంలో ముఖ్యమైన వ్యక్తి మీరా సాహెబు. ఇతర ముఖ్య వ్యక్తుల్లో పేర్కొనదగినవారు హసన్, ఇమామ్, దూదేకుల పీరు, కుమ్మరి గోవిందన్న, చాకలి సర్వన్న, మంగలి మాసన్న, జానపద గాథ ప్రకారం పాపన్న మొత్తం 12 వేల మంది సైనికులను తయారుచేశాడు. ఖాఫీఖాన్ అనే 17వ శతాబ్దపు ముస్లిం చరిత్రకారుని ప్రకారం సుమారు 12 వందల మంది సైనికులను నియమించుకున్నాడు.
సైన్యాన్ని నియమించుకోవడానికి అవసరమయ్యే ధనాన్ని సంపాదించడానికి పాపన్న అనేక దారి దోపిడీలు చేశాడు. ధనికులు, వ్యాపారులు, జమీందారులు, సర్దార్లను దోచుకున్నాడు. వారందరూ కలిసి ప్రభుత్వ సహాయంతో పాపన్నను బంధించే పథకాన్ని రూపొందించారు. ఇది తెలిసి పాపన్న వారి ప్రాంతాలకు దూరంగా కరీంనగర్ జిల్లాలో ఉండే ఎలగందల పరగణా జమీందారు వెంకట్రావు కొలువులో పనికి కుదిరాడు. ఆ కాలంలో కరీంనగర్ జిల్లాలోని పొలవాస, మానాల జమీందార్ల మధ్య జగడాలు జరుగుతున్నాయి. పాపన్న తన జమీందారు పక్షాన ఆ జగడాల్లో పాల్గొని విజయం సాధించాడు. దాంతో పాపన్నకు తన వంటి వ్యక్తులు కొండల రాయుడు, హనుమంతులతో పరిచయమైంది. వీరు ఏకమై గ్రామాలు గ్రామాలనే దోచుకునేవారు. బాధిత ప్రజలు జమీందారు వెంకట్రావుకు చెప్పగా ఆయన పాపన్నను జైలులో పెట్టాడు. కాని తన భార్య, కొడుకు ఆరోగ్యం బాగైతే ఖైదీలను విడుదల చేస్తామని మొక్కుక్కున్న కోరిక మేరకు వెంకట్రావు పాపన్నను విడిచి పెట్టాడు.
పాపన్న.. చాకలి సర్వన్నతో కలిసి వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలోని షాహ్పురానికి వచ్చి, అక్కడొక మట్టికోట కట్టి సైనికులను నియమించడం ప్రారంభించాడు. అందుకు ఇంకా ధనం కావాల్సి వచ్చి మళ్లీ వ్యాపారులను, గ్రామాలను దోచుకోవడం మొదలుపెట్టాడు. పాపన్న దోపిడీ విషయం ప్రజలు, ప్రభుత్వాధికారుల ద్వారా మొఘలు చక్రవర్తి ఔరంగజేబుకు తెలిసింది. వెంటనే అతడు పాపన్నను శిక్షించమని కొలనుపాకలో సర్దార్‌గా పనిచేస్తున్న రుస్తుం దిల్‌ఖాన్‌ను ఆదేశించాడు. రుస్తుం తన అనుచరుడు ఖాసింఖాన్ నాయకత్వంలో పంపిన సైన్యం షాహ్‌పురం కోటను ముట్టడించింది. దాంతో అప్పటివరకు దొంగగా ముద్రపడిన పాపన్న ఒక భారతదేశస్థాయి చక్రవర్తి ఔరంగజేబు పంపిన సైన్యంతో పోరాడాల్సి వచ్చింది. ఆ సైన్యాన్ని ఎదిరించినట్లయితే తాము రాజకీయంగా ఎదగవచ్చు అనే ఉద్దేశంతో అర్థమై పాపన్న, అతని సైన్యం ఖాసింఖాన్ సైన్యాన్ని ఎదుర్కొని ఓడించారు. పాపన్న ఖాసింఖాన్‌ను చంపాడు.
-పాపన్న శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశానని రుస్తుం దిల్‌ఖాన్ తెలుసుకొని వెంటనే వేలకొలది సైనికులను వెంటేసుకొని వెళ్లి షాహ్‌పురం కోటను ముట్టడించాడు. దిల్‌ఖాన్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదనుకొని కోటలోని రహస్య ద్వారం నుంచి తప్పించుకొని పారిపోయాడు.
-రుస్తుం దిల్‌ఖాన్ కొలనుపాకకు వెళ్లిపోగానే పాపన్న సైనిక బలగాలను అధిక సంఖ్యలో నియమించుకొని వచ్చి, షాహ్‌పురం కోటను ముట్టడించి, కాపలా ఉన్న తురక సైనికులను ఓడించి కోటను వశపర్చుకున్నాడు. ఆ వెంటనే షాహ్‌పురం మట్టికోట స్థానంలో రాతి కోటను బలిష్టంగా నిర్మించాడు. ఆధునిక ఆయుధాలు అంటే తుపాకులు, మందుగుండు సామాగ్రి, ఫిరంగులు సమకూర్చుకున్నాడు.
-పాపన్న బలపడుతున్న సంగతి తెలుసుకొని రుస్తుం దిల్‌ఖాన్ షాహ్‌పురం కోటపై మళ్లీ దండయాత్ర చేశాడు. యుద్ధ సమయంలో పుర్దిల్ఖాన్ అనే జమేదారు కత్తివేటుకు పాపన్న ప్రధాన అనుచరుడు చాకలి సర్వాయ బలయ్యాడు. అప్పటినుంచి అతని పేరునే (సర్వాయ) పాపన్న తన పేరు ముందు పెట్టుకున్నాడంటారు.
1707లో మొఘల్ సామ్రాట్ ఔరంగజేబు చనిపోయాడు. సింహాసనం కోసం ఢిల్లీలో అతని వారసుల మధ్య పోరు మొదలైంది. ఆ కాలంలో దక్కన్ ప్రాంత వ్యవహారాలు చూస్తున్న ఔరంగజేబు కొడుకు కాంబక్ష్ కూడా ఢిల్లీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల మీద దృష్టి పెట్టి తెలంగాణలో పరిణామాలను అలక్ష్యం చేశాడు. ఇదే అదనుగా భావించిన పాపన్న నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ మీద కోట కట్టాడు. వరంగల్ జిల్లా తాటికొండలో మరో కోట కట్టాడు. మరింత సైనిక బలాన్ని పెంచుకున్నాడు.
-ఆత్మవిశ్వాసం పెంచుకున్న తర్వాత 1708 ఏప్రిల్ 1న వరంగల్ ప్రజలు మొహర్రం పండుగ జరుపుకుంటున్న సమయంలో పాపన్న రెండుమూడు వందల పదాతిదళం, నాలుగైదు వందల ఆశ్విక దళంతో ఓరుగల్లును (వరంగల్) ముట్టడించాడు. వరంగల్ పట్టణాన్ని చేరే దారులన్నింటినీ మూయించి అశ్విక దళంతో పట్టణం మీద పడి లక్షల రూపాయల విలువైన ధన సంపత్తిని దోచుకున్నాడు.
-ఓరుగల్లు కోట చుట్టుపక్కల గ్రామాలను దోచుకొని, విశేషమైన ధనాన్ని సంపాదించుకొని రెట్టించిన ఉత్సాహంతో పాపన్న తన సైన్యంతో వెళ్లి భువనగిరి కోటపై దండెత్తి, దుర్గ పాలకున్ని ఓడించి కోటను స్వాధీనపరుచుకున్నాడు.
-తెలంగాణకు గుండెకాయ వంటి ప్రాంతంలోని ఓరుగల్లు, భువనగిరి వంటి శత్రుదుర్భేద్య కోటలను పాపన్న అవలీలగా స్వాధీనం చేసుకొని సంపదను కొల్లగొట్టడం, ముస్లిం సైనికులను, సర్దారులను చంపడం అనేక మంది ముస్లిం సర్దారులకు కోపం తెప్పించింది. పాపన్న కూడా సర్దారు అని పిలువబడే స్థాయికి ఎదగడం వారికి కంటగింపయింది. అలాంటి వారిలో షాహె ఇనాయత్ అనే ఒక ముస్లిం యోగి ఢిల్లీకి వెళ్లి ఔరంగజేబు తర్వాత మెఘల్ చక్రవర్తి ఐన బహదూర్షాకు పిర్యాధు చేశాడు. పాపన్నపై త్వరగా తగిన చర్యలు తీసుకోవాలంటూ నలభై రోజులు నిరాహార దీక్ష చేసి చనిపోయాడు. దాంతో బహదూర్షా పాపన్నను చంపుమని హైదరాబాద్ సుబేదార్ యూసఫ్‌ఖాన్ రుజ్ బహానికి ఆదేశాలిచ్చాడు. యూసఫ్‌ఖాన్ ప్రధాన సేనాని దిలావర్ఖాన్ సైనిక బలగాలతో వెళ్లి పాపన్న ఉన్న షాహ్‌పురం కోటను ముట్టడించాడు. దాంతో ఓటమి తప్పదని అర్థమైన పాపన్న రహస్య మార్గం గుండా తప్పించుకొని తాటికొండ కోటకు చేరాడు.
-పాపన్న తాటికొండలో మరింత సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఈ లోగా దిలావర్ఖాన్ సైనిక బలగాలతో షాహ్‌పురం నుంచి వచ్చి తాటికొండ కోటను ముట్టడించాడు.
-తాటికొండలో కూడా పరాజయం తప్పదని భావించి పాపన్న కొద్దిమంది అనుచరులతో కలిసి కోట నుంచి తప్పించుకొని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ సమీపంలోని సర్వాయిపేటకు వెళ్లాడు. అక్కడ కోట కట్టి బలపడుతున్న సమయంలో ఒక పేరు తెలియని నమ్మకద్రోహి గూఢచర్యం ద్వారా ముస్లిం సైన్యాలకు చిక్కాడు. యూసఫ్‌ఖాన్ రుజ్ బహానీ పాపన్న తలను నరికి గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీయించాడు. మొండన్నేమో ఢిల్లీలోని మొఘల్ చక్రవర్తి బహదూర్షాకు కానుకగా పంపాడు. జానపద ఆధారాలేమో పాపన్న గోల్కొండ కోటను వశపరుచుకొని ఏడు ఘడియలు ఏలాక చనిపోయాడని తెలుపుతాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు