తెలంగాణ సమాజం
ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం మధురమైన తీపి జ్ఞాపకంగా ఉండాలని కోరుకుంటారు. అయితే లింగపరమైన వివక్ష, సామాజికాంశాలు, సామాజిక దురాచారాలతో బాల్యం ఒక విషాద కథగా కొనసాగుతున్నది. బాల్యంలో జరిగిన సంఘటనల ప్రభావం జీవితాంతం ఉంటుంది. నిజానికి సమాజ మనుగడకు కొనసాగింపునకు అవసరమైన సభ్యులను అందించాలంటే మాతృమూర్తి తప్పనిసరి.
బాలికా శిశు హత్యలు-చట్టాలు
తెలంగాణ సమాజంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళలతో పాటు బాలికా శిశువులు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, దేవరకొండ మొదలు అనేక ప్రాంతాల్లో బాలికల విక్రయం గర్భస్థ దశలోనే బ్రూణహత్యలు జరగడం, పేదరికం, సామాజిక వెనుకబాటుతనం తదితర కారణాలతో బాలికలు బడికి దూరంగా బాలకార్మికులుగా, అదేవిధంగా బాల్యవివాహాల ద్వారా సమాజం చేత వివక్షకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్‌లో తెలంగాణ ప్రత్యేక సామాజిక అంశాల్లో భాగంగా బాలికా శిశువుల గురించి ప్రస్తావించింది. బాలికా శిశువుల సమస్యలు, వాటి పరిష్కారమార్గాలు, భవిష్యత్తులో ఈ సమస్య కొనసాగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై అభ్యర్థులు ప్రధానంగా దృష్టిసారించాలి.
బాల్యంతో పోరాటం: భారతదేశంలో సామాజిక వ్యవస్థ నిర్మాణం పితృస్వామ్య వ్యవస్థ రూపంలో ఉందనడానికి ఆధారం నేటికి మహిళలను రెండో తరగతి పౌరులుగా భావించడం, ఆడపిల్ల జననాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించకపోవడం, గర్భస్థ దశలోనే బ్రూణహత్యలకు పాల్పడటం వంటి సంఘటనలు తరచూ చోటుచేసుకోవడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భారతదేశంతో పాటు ఇతర అగ్నేయాసియా దేశాల్లో సగటున ప్రతిరోజు 7,400 మంది శిశువులు జన్మించిన ఏడాదిలోపే మరణించడం, అందులోనూ 70 శాతం వరకు ఆడ శిశువులే ఉండటం విచారకరమైన అంశం.
-2013 గణాంకాల ప్రకారం శిశు మరణాల రేటు (ప్రతి 1000 మందికి) జాతీయ సగటు 40 కాగా, ఇది తెలంగాణలో 39, ఇక ప్రసూతి మరణాల రేటు (ప్రతి లక్ష మందికి) జాతీయ సగటు 167 కాగా, రాష్ట్రంలో ఇది 92. మొత్తంగా చూస్తే తెలంగాణ సమాజంలో కూడా బాలికా శిశుహత్యలు ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతున్నది. తెలంగాణలో బాలికలు ఎక్కువగా రక్తహీనత (ఎనీమియా) పోషకాహార లోపం వంటి ఆరోగ్య సమస్యలతో పాటు పేదరికం, నిరక్షరాస్యత, వెట్టిచాకిరి, వలసలు వంటి సామాజిక ఆర్థిక సమస్యలను కూడా ఏకకాలంలో ఎదుర్కొంటున్నారు.
ప్రధాన సమస్యలు
నాలుగేండ్లలోపు శిశు మరణాల రేటు బాలికల్లో 61శాతం ఎక్కువగా ఉన్నది.
56 శాతం కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు.
47 శాతం బాలికలు బాల్య వివాహాలకు బలవుతున్నారు.
వెట్టిచాకిరి, జోగిని, దేవదాసి వంటి సామాజిక దురాచారాలు
బాలికల విక్రయం (బంజార తెగలో ఎక్కువ)
బాలికలపై అత్యాచారాలు
బలవంతంగా, మోసపూరితంగా వ్యభిచారంలోకి నెట్టివేయడం
వలసలతో నిరంతరం సంచార జీవనం
బాలకార్మిక వ్యవస్థ పర్యవసనాలు
ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం మధురమైన తీపి జ్ఞాపకంగా ఉండాలని కోరుకుంటారు. అయితే లింగపరమైన వివక్ష, సామాజికాంశాలు, సామాజిక దురాచారాలతో బాల్యం ఒక విషాద కథగా కొనసాగుతున్నది. బాల్యంలో జరిగిన సంఘటనల ప్రభావం జీవితాంతం ఉంటుంది. నిజానికి సమాజ మనుగడకు కొనసాగింపునకు అవసరమైన సభ్యులను అందించాలంటే మాతృమూర్తి తప్పనిసరి. అలాంటి తల్లి బాల్యంలో శారీరకంగా, మానసికంగా హింసకు గురైతే సహజంగానే జీవితాంతం విషాదం అనుభవించాల్సిన దుస్థితి నెలకొంటుంది. బాల్యంలో వివాహం జరిగితే విద్యకు దూరంకావడంతో పాటు తను శారీరకంగా ఎదగకుండానే మరో బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చినప్పుడు నరకయాతన అనుభవించడమే కాకుండా అనారోగ్యం, లోపాలతో కూడిన సంతానంతో జీవితాంతం నరకం అనుభవించే ప్రమాదం ఉంది.
బాలికలను రక్షించుకోవాలి
నేటి బాలలే రేపటి పౌరులు. అందులోనూ నేటి బాలికలే రేపటి సమాజ తల్లులు. కాబట్టి బాలికలను తప్పనిసరిగా రక్షించుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు, పథకాలను అమలుచేస్తున్నాయి. అయినప్పటికీ బాలికల పట్ల సామాజిక ధోరణిలో మార్పు రానంత కాలం బాలికల బాల్యం, మిగతా జీవితం విషాదభరితమే.
బాలికల రక్షణలు
సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమం – 1975(Integrated Child Development Scheme)
ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం 0-6 వయస్సున్న పిల్లలకు ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారాన్ని అందించడం.
ఈ కార్యక్రమంలో భాగంగా మొదట దేశవ్యాప్తంగా 33 ప్రాజెక్ట్‌లు, 489 అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,076 ప్రాజెక్టులు, 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి.
ఈ తరహా పథకాల్లో ప్రపంచంలోనే అతి పెద్ద పథకంగా పరిగణిస్తున్న ఐసీడీఎస్‌లో ఆరేండ్లలోపు పిల్లల కోసం గర్భిణులు, బాలింతల కోసం ఆరు కీలక సేవలందిస్తున్నారు.
1.ఆరోగ్య చెకప్‌లు
2. టీకాలు వేయడం
3. వ్యాక్సిన్లు వేయడం
4.ప్రత్యేక డాక్టర్లకు చూపించే సేవలు
5. పౌష్టికాహారాన్ని అందించడం
6.నర్సరీ విద్యనందించడం
12వ పంచవర్ష ప్రణాళికలో ఐసీడీఎస్ పథకానికి రూ. 1.2 లక్షల కోట్లు కేటాయించారు.
తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఐసీడీఎస్ పథకాన్ని గ్రామస్థాయి నుంచి సమర్థమంతంగా అమలుచేయడానికిగాను అంగన్వాడీల నియామకంపై ప్రధానంగా దృష్టి సారించింది.
వందేమాతరం – 2004
గర్భిణులకు మరింత ఆహార ఆరోగ్య భద్రతను కల్పించడం
జననీ సురక్షా యోజన – 2005
దేశంలో ప్రసూతి మరణాలు, శిశు మరణాలను తగ్గించేందుకుగాను ప్రారంభించిన పథకం
బాలికల సంరక్షణ పథకం – 2008 మార్చి 8
(ధనలక్ష్మి పథకం)
బాలికలను అన్ని రకాలుగా సంరక్షించేందుకు ఉద్దేశించిన పథకం లక్ష రూపాయల బీమా సదుపాయాన్ని కల్పిస్తారు. 20 ఏండ్ల తర్వాత కుటుంబంలో మొదటి బాలికకు లక్ష రూపాయలను, రెండో బాలికకు రూ. 50 వేలు అందింస్తుంది.
జననీ శిశు సురక్షా కార్యక్రమం – 2014
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా ప్రసూతి సదుపాయాన్ని కల్పించడంతో పాటు శిశువుకు ఏడాది పాటు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం.
రాష్ట్రీయ కిశోర్ స్వస్థ్య కార్యక్రమం – 2014
కౌమార బాలికల ఆరోగ్య సంరక్షణా కౌన్సిలింగ్ కోసం ప్రారంభించిన పథకం కౌమార మిత్ర ఆరోగ్య చికిత్స కేంద్రాలు యువక్లినిక్లను ఏర్పాటుచేశారు.
బేటీ బచావో – బేటీ పడావో పథకం – 2014
దేశంలో అతి తక్కువ బాలబాలికల లింగ నిష్పత్తి ఉన్న హర్యానాలోని పానిపట్‌లో ప్రారంభించారు. బాలికల విద్యకోసం ఈ పథకంలో భాగంగా రూ. 100 కోట్లు కేటాయించారు.
అంతర్జాతీయ ఆవేదన
బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక నేరాలు, హింస, అక్రమ రవాణా, వివక్షతల పట్ల సార్క్ దేశాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
బాలికలపై అన్ని రకాల హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల ఫలితంగా కొంతవరకు పురోగతి కన్పిస్తున్నప్పటికీ లైంగిక దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని సార్క్ దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి.
బాలికలపై జరిగే అన్ని రకాల హింసలను అరికట్టిన ప్రాంతంగా దక్షిణాసియాను తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తూ సార్క్ దేశాల ప్రతినిధులు, పౌర హక్కుల సంఘాలు, బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలతో సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను సార్క్ రూపొందించనుంది.
తెలంగాణలో బాలికల రక్షణ
రాష్ట్రంలో ప్రధానంగా వలసలు బాలకార్మిక వ్యవస్థ కుల వృత్తులు, జోగిని, దేవదాసి దురాచారాలు, బాల్య వివాహాలు, బాలికల విక్రయం వంటి ప్రమాదకరమైన సామాజిక సమస్యలు కొనసాగుతున్నాయి. వీటన్నింటికి పరిష్కారం కనుగొనే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రారంభించింది.
ఆరోగ్య రక్షణ
బాలికలు శైశవ దశలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుండటంతో రాష్ట్ర ప్రభుత్వం బాలికల ఆరోగ్య రక్షణ కోసం అనేక రకాల సేవలను అందించడంతో పాటు వైద్య సదుపాయాలను కల్పిస్తుంది.
రాష్ట్రంలో ప్రసూతి ఆరోగ్య సేవలు, శిశు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం అవసరమైన సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగం.
1.మాతా శిశు సంరక్షణ ఆస్పత్రులు- 5
2. ఏరియా దవాఖానలు- 42
3.కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు- 114
4.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు- 661
5. సబ్ సెంటర్లు- 4,863
6.స్టేషన్ న్యూబార్న్ కేర్ యూనిట్లను ప్రతి జిల్లాలో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేశారు.
7. పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రాలు- 55
8.పట్టణ ఆరోగ్య కేంద్రాలు- 87
సామాజిక భద్రత
బాలికల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమన్ను ప్రారంభించింది. దీనినే మహిళ రక్షణ సాధికారత సమితి అని పిలుస్తారు.
24/7 మహిళల హెల్ప్‌లైన్ – 181
మహిళలపై జరిగే అన్ని రకాల నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్ 181ను ఏర్పాటుచేసింది. మహిళలపై జరిగే నేరం రకాన్ని బట్టి ఆ నేరాన్ని నిర్భయ కేంద్రం/పోలీస్/దవాఖాన/అంబులెన్స్‌కు తెలియజేస్తారు.
అనాథ బాలికల కోసం వసతి గృహాలు, పర్యవేక్షణ గృహాలను ఏర్పాటు చేశారు.
యువ కౌన్సిలింగ్ గైడెన్స్ క్లినిక్‌ల ద్వారా బాలికల మానసిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.
షీ-టీమ్స్ ద్వారా రక్షణ కల్పిస్తున్నారు.
బాలికల విద్య
విద్య ద్వారా బాలికల సమస్యలకు పరిష్కారం చూపవచ్చన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల విద్యపై ప్రధానంగా దృష్టిసారించాయి. దీనికోసం వివిధ పథకాలను ప్రవేశపెట్టాయి..
సర్వశిక్షా అభియాన్- 2001
6 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలందరూ తప్పనిసరిగా బడిలోనే ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సర్వశిక్షా అభియాన్ ప్రత్యక్షంగా పిల్లలకు విద్య అందించడంతోపాటు పరోక్షంగా అనేక సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నది. అవి..
1.బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
2.వలసల నివారణ
3.మధ్యాహ్న భోజనం ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం
ఉజ్వల- 2007
మానవ అక్రమ రవాణా, బాలికల విక్రయం, కిడ్నాపింగ్, బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టబడిన బాలికలు, మహిళలకు విముక్తి కలిగించి వారికి పునరావాసం కల్పించేందుకు ఉద్దేశించిన పథకం ఉజ్వల. దీనికింద 16 రాష్ర్టాల్లో 73 పునరావాస కేంద్రాలతో సహా 134 ప్రాజెక్టులను చేపట్టారు.
NOTE: ఐక్యరాజ్య సమితి ఆదేశాల ప్రకారం భారతదేశంలో 2008 నుంచి జనవరి 24న (ఇందిరాగాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు) జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంగన్వాడీ కేంద్రాలు
బాలికలకు పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలు క్రియాశీలక ప్రాత పోషిస్తున్నాయి.
రాష్ట్రంలో మొత్తం అంగన్వాడీ కేంద్రాలు- 35,700 (వీటిలో ప్రధాన కేంద్రాలు- 31,711, చిన్న కేంద్రాలు- 3,989)
పట్టణ ప్రాంతాల్లో- 25,326
పట్టణ ప్రాంతాల్లో- 3,716
గిరిజన ప్రాంతాల్లో- 787
అంగన్వాడీ కేంద్రాల ద్వారా 5,18,215 మంది మహిళలు, 18,96,844 మంది పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న అంగన్వాడీ ప్రాజెక్ట్‌లు- 149. వీటిలో ..
గ్రామీణ ప్రాంతాల్లో- 104
పట్టణ ప్రాంతాల్లో- 25
గిరిజన ప్రాంతాల్లో- 20
చట్టాలు
లింగ నిర్ధారణ నిషేధ చట్టం – 1994
గర్భస్థ దశలో ఆడ శిశువుల హత్యలను నివారించేందుకుగాను ఈ చట్టాన్ని రూపొందించారు.
తల్లికి లేదా బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదం ఉందని, లేదా జన్యు సంబంధిత వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని డాక్టర్లు అధికారికంగా గుర్తించిన సందర్భంలోనే గర్భ స్రావానికి అనుమతి ఉంటుంది. మిగతా ఏ కారణంతో అయిన గర్భస్రావం చేయడం చట్టరీత్యా నేరం.
స్కానింగ్ సెంటర్లు లేదా డాక్టర్లు ఈ రకమైన చర్యలకు పాల్పడకుండా నిరోధించేందుకుగాను కలెక్టర్‌కు పూర్తి అధికారులు కల్పించింది.
బాలల న్యాయ (రక్షణ పరిరక్షణ) చట్టం – 2000
బాలబాలికలకు అన్ని రకాల రక్షణలు కల్పించేందుకు ఉద్దేశించిన చట్టం ఇది.
బాలల అవసరాలను బట్టి వారి పరిరక్షణకు వారితో స్నేహపూర్వక ధోరణితో మెలగాలి. అవసరమైన సేవలను అందించేందుకు ఈ చట్టం దోహదపడుతుంది.
2006లో ఈ చట్టాన్ని సవరించారు.
బాలల న్యాయ కార్యక్రమం అనే పథకం కింద అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవసరం ఉన్న బాలలకు ఆశ్రయం కల్పించేందుకు పలు ఆశ్రమాలను ఈ చట్టం ప్రకారం ఏర్పాటుచేశారు.
బాల్య వివాహ నిషేధ చట్టం – 2006
ఈ చట్టం ప్రకారం బాల్య వివాహాలు పూర్తిగా నిషేధం.
ఈ చట్టం ప్రకారం వివాహ వయసు పురుషునికి 21, స్త్రీకి 18 సంవత్సరాలు.
మైనర్ బాలికలను వివాహం చేసుకొంటే లక్ష రూపాయల జరిమానా లేదా రెండేండ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.
బాల్య వివాహాన్ని ఎవరైనా ప్రోత్సహించినా, కుదిర్చినా, చేయించిన తల్లిదండ్రులు, సంరక్షకులు చట్టరీత్యా శిక్షార్హులే.
జిల్లా ప్రధాన న్యాయాధికారి ఈ చట్ట పరిధిలో కేసులను విచారించవచ్చు.
బాల్య వివాహాన్ని ఎవరైనా జరిపిస్తున్నారని సమాచారం అందింతే వెంటనే ఆ వివాహాన్ని నిరోధిస్తూ నిషేధాజ్ఞ జారీ చేసే అధికారం జిల్లా జడ్జికి ఉంది.
రహస్యంగా జరిగిన బాల్య వివాహాన్ని ఈ చట్ట ప్రకారం రద్దు చేయవచ్చు.
బాల్య వివాహ నిరోధక అధికారులను నియమించి వారి ద్వారా బాల్య వివాహాలను నిరోధిస్తుంది.
బాలలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టం – 2012
(Protection OF Children From Sexual Offence Act – 2012)
మైనర్ బాలలపై జరిగే లైంగిక దాడులను అరికట్టేందుకు రూపొందించిన చట్టం ఇది.
అసభ్య చిత్రీకరణ కోసం (పొర్నోగ్రఫి) బాలలను ఉపయోగిస్తే ఈ చట్టం ప్రకారం ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తుంది. రెండోసారి ఇదే నేరానికి పాల్పడితే ఏడేండ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.
లైంగికంగా బాలలను వేధిస్తే ఐదేండ్లు తగ్గకుండా జైలు శిక్ష, నేర తీవ్రతను బట్టి ఈ శిక్షను ఏడేండ్ల వరకు కూడా పొడిగించవచ్చు.
తీవ్ర లైంగిక దాడికి పాల్పడితే యావజ్జీవ శిక్ష వేస్తుంది.
ఈ నేరాలను విచారించేందుకుగాను ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేస్తారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ చట్టం అమలుతీరును పర్యవేక్షిస్తుంది.
ఇతర చట్టాలు
గృహహింస నిరోధక చట్టం-2005
బాలికలపై గృహంలోని సమీప బంధువులు కూడా లైంగిక దాడులకు, హింసకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో గృహహింస నిరోధక చట్టం ప్రకారం ఇలాంటి నేరాలకు పాల్పడిన వారు తల్లిదండ్రులు, సమీప బంధువులైనా వారిని కూడా శిక్షిస్తారు.
మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం-1958
స్త్రీల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం- 1986
ఆంధ్రప్రదేశ్ దేవదాసి నిషేధ చట్టం- 1988
పౌర హక్కుల రక్షణ చట్టం- 1995
బాలకార్మికుల నిషేధ చట్టం- 1986
భారత శిక్షా స్మృతి
సెక్షన్- 263: పిల్లలను అసభ్యంగా చిత్రీకరించడం నేరం
సెక్షన్- 315: బ్రూణ, శిశు హత్యలు నిషేధం
సెక్షన్- 363 (ఎ): పిల్లలను కిడ్నాప్ చేయడం, పిల్లలతో భిక్షాటన చేయించడం నేరం
సెక్షన్- 366 (ఎ): మైనర్ బాలికలతో వ్యభిచారం చేయించడం నేరం
సెక్షన్ 372: మైనర్ బాలికలను వేశ్యావృత్తికోసం అమ్మడం, కిరాయికి ఇవ్వడం నేరం
సెక్షన్- 373: మైనర్ బాలికలను వేశ్యావృత్తి కోసం కొనడం, అద్దెకు తీసుకోవడం నేరం
సెక్షన్- 376: మైనర్ బాలికపై భర్త లైంగికంగా హింసకు పాల్పడటం నేరం
ప్రాక్టీస్ బిట్స్
1. రాష్ట్రంలో బాలికల ప్రధాన సమస్య? (4)
1) పేదరికం 2) బాలికల విక్రయం
3) బాలకార్మిక వ్యవస్థ 4) పైవన్నీ
2.కేంద్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేసింది? (2)
1) 2005 2) 2006 3) 2007 4) 2008
3.సమగ్ర శిశు అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? (3)
1) 1973 2) 1974 3) 1975 4) 1976
4.రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్? (2)
1) 180 2) 181 3) 182 4) 183
5.రాష్ట్రంలో బాలికల విక్రయం ఎక్కువగా ఏ తెగలో కనబడుతుంది? (3)
1) ఎరుకల 2) చెంచు 3) బంజారా 4) గోండ్
6.జాతీయ మహిళా కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? (3)
1) 1990 2) 1991 3) 1992 4) 1993
7.సర్వశిక్ష అభియాన్‌తో కలిగే ప్రయోజనం? (4)
1) బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
2) 100 శాతం నమోదు నిష్పత్తి
3) బాల్యవివాహాల నిర్మూలన 4) పైవన్నీ
8.బాలికలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం? (3)
1) ఆంధ్రప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) మధ్యప్రదేశ్ 4) అరుణాచల్‌ప్రదేశ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు