తెలంగాణ ఉద్యమం..పెద్దమనుషుల ఒప్పందం
ఫజల్ అలీ కమిషన్ నివేదికకు భిన్నంగా, తెలంగాణ ప్రజల మనోభావాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆంధ్ర నేతల లాబీయింగ్‌తో 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడింది. అలా ఏర్పడిన ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాల గురించి తెలుసుకుందాం..
-1948, సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనమైన తరువాత 1952, నవంబర్ 1 వరకు 8 ఏండ్ల పాటు స్వతంత్ర రాష్ర్టంగా ఉన్న హైదరాబాద్‌ను, మద్రాస్ నుంచి విడిపోయి 1953 అక్టోబర్ 1న ప్రత్యేకరాష్ర్టంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి 1956, నవంబర్ 1న ఆంద్రప్రదేశ్ గా ఏర్పాటు చేశారు.
-ఉమ్మడి రాష్ట్రానికి మొదట ఆంధ్ర-తెలంగాణగా నామకరణం చేసినప్పటికీ ఆంధ్ర నేతలు తమ ఆధిపత్యంతో ఆ పేరును ఆంద్రప్రదేశ్ గా చేశారు.
-ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణపై అన్ని రంగాల్లో వివక్ష చూపారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ఆర్థికరంగా ల్లో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణించారు.
-ఉద్యోగాల్లో ఉన్నతస్థానాల్లో ఆంధ్రులు ఉంటే, తెలంగాణ ప్రజలను మాత్రం నాలుగో తరగతి ఉద్యోగాలకు పరిమితం చేశారు.
-1956 నవంబ్ 1 నుంచి 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడేవరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు సీఎంలు కేవలం ఐదున్నరేండ్లు మాత్రమే పాలించారంటే.. రాజకీయంగా కూడా ఆంధ్రులు తెలంగాణ ప్రజలను ఏవిధంగా చేశారో అర్థం చేసుకోవచ్చు.
-ఈ నేపథ్యంలో మొదట్లో ఉద్యోగుల వరకు మాత్రమే పరిమితమైన ముల్కీ ఉద్యమం కాస్త ప్రత్యేక రాష్ర్ట ఉద్యమంగా మారింది.
-1954 జూన్, జూలైలలో రాష్ట్రాల పునర్విభజన సంఘం హైదరాబాద్‌ను సందర్శించి వివిధ సంస్థలు, వ్యక్తుల అభిప్రాయాలను తెలుసుకుని 1955, సెప్టెంబర్ 30న తన నివేదికను సమర్పించింది.
-హైదరాబాద్ రాష్ర్టం లోపలా, వెలుపలా ఉన్న ప్రజాభిప్రాయం ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని సూచించింది.
-మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను మహారాష్ర్టలో, కన్నడ మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలో విలీనం చేసి, తెలుగు మాట్లాడే (బీదర్‌తో సహా) ప్రాంతాలతో అంటే 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అలాగే ఉంచాలని, దానిపేరు హైదరాబాద్ రాష్ర్టంగా ఉండాలని సూచించింది.
-అయితే 1961 సాధారణ ఎన్నికల అనంతరం అంటే ఐదేండ్ల తరువాత హైదరాబాద్ రాష్ర్ట నూతన అసెంబ్లీలో 2/3వ వంతు మెజారిటీ సభ్యులు విలీనానికి ఒప్పుకుంటే విశాలాంధ్రను ఏర్పాటు చేసుకోవచ్చని చాలా స్పష్టంగా చెప్పింది.
-విశాలాంధ్ర ఏర్పాటు నిర్ణయం కేవలం హైదరాబాద్ రాష్ర్ట అసెంబ్లీ మాత్రమే తీసుకోవాలని ఫజల్ అలీ కమిషన్ సూచించడం గమనార్హం.
-కానీ తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుల్లో అధికులు, 10 జిల్లాల కాంగ్రెస్ కమిటీల్లో 7 కమిటీలు విశాలాంధ్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశాయి.
-కమ్యూనిస్టులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి విశాలాంధ్ర సమస్యపై ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించారు. కొంతమంది తెలంగాణ కాంగ్రెస్‌వాదులు కూడా ఇదేవిధంగా ప్రకటించారు.
-దీంతో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఢిల్లీలో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను కలిశారు. అప్పటివరకు విలీనానికి వ్యతిరేకంగా ఉన్న నెహ్రూ కూడా అయిష్టంగానే అంగీకరించారు.
-కేంద్రం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ శాసనసభను సమావేశపరచి విశాలాంధ్ర అంశాన్ని చర్చించారు.
-హైదరాబాద్ శాసనసభలోని మొత్తం 174 మంది సభ్యుల్లో 147 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో 103 మంది విశాలాంధ్రను కోరుకోగా, 29 మంది వ్యతిరేకంగా ఓటువేశారు. 15 మంది తటస్థంగా ఉన్నారు.
-ఆంధ్ర రాష్ర్ట శాసనసభ సభ్యులంతా విశాలాంధ్రకు మద్దతు తెలిపారు. ఒక్క ఆచార్య ఎన్జీ రంగా మాత్రం విశాలాంధ్రను వ్యతిరేకించారు.
-చివరకు కాంగ్రెస్ అధిష్టానం విశాలాంధ్ర ఏర్పాటుకు ఒప్పుకుంది.
-అయినా కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి మరికొందరు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. వారు ఒక ప్రతినిధి వర్గంగా ఢిల్లీ వెళ్లి అప్పటి హోంమంత్రి గోవింద్ వల్లభ్పంత్ను కలిసి రాజకీయ, సాంస్కృతికపరంగా రెండు ప్రాంతాల మధ్య తేడాలున్నాయని విలీనం అణచివేతకు దారితీస్తుందని చెప్పినా ఆయన అర్థం చేసుకోలేదు.
-ఈ వ్యత్యాసాల గురించి నెహ్రూకు స్పష్టంగా తెలియడంతో విశాలాంధ్ర ఆలోచన వెనుక దురాక్రమణోద్దేశ ప్రేరిత సామ్రాజ్య వాదతత్వం దాగి ఉందని వ్యాఖ్యానించారు.
-ఇలాంటి పరిస్థితిలో రెండు ప్రాంతాలమధ్యగల అభిప్రాయభేదాలను తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది.
ఆంధ్రాభవన్ లో ఒప్పందం
-1956 ఫిబ్రవరి 20న కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో రెండు ప్రాంతాల నాయకుల్ని సమావేశపరిచింది.
-ఒక్కో ప్రాంతం నుంచి నలుగురు నాయకులు హాజరయ్యారు. ఇరు ప్రాంతాల నాయకుల మధ్య ఈ సమావే శంలో జరిగిన ఒప్పందాన్నే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. దీనిపై వారంతా సంతకాలు చేశారు.
హైదరాబాద్ రాష్ర్టం నుంచి
1) బూర్గుల రామకృష్ణారావు (ముఖ్యమంత్రి)
2) కేవీ రంగారెడ్డి (విద్యాశాఖ మంత్రి)
3) మర్రి చెన్నారెడ్డి (ఎక్సైజ్ శాఖ మంత్రి)
4) జేవీ నర్సింగరావు (హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు)ఆంధ్ర రాష్ర్టం నుంచి
1) బెజవాడ గోపాల్‌రెడి (ముఖ్యమంత్రి)
2) నీలం సంజీవరెడ్డి (ఉపముఖ్యమంత్రి)
3) గౌతు లచ్చన్న (మంత్రి)
4) అల్లూరి సత్యనారాయణరాజు (ఆంధ్రా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు)
-ఈ సమావేశానికి హాజరైన బూర్గుల రామకృష్ణారావు విశాలాంధ్రకు తన సమ్మతం తెలుపగానే హైదరాబాద్‌లో నిరసన వెల్లువెత్తింది.
-ఈ పరిస్థితిని అధ్యయనం చేయడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తమ ప్రతినిధిగా ఎస్కే పాటిల్‌ను హైదరాబాద్‌కు పంపింది.
-అన్నివర్గాలవారితో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రాంత ప్రజలు కోరనిదే విశాలాంధ్ర ఏర్పాటు జరగదు అని పేర్కొన్నాడు.
-ఆ రోజుల్లోనే కేంద్ర హోంమంత్రి గోవింద్ వల్లభ్‌పంత్ తెలంగాణ ప్రాంత ప్రజలు సమ్మతిస్తే విశాలాంధ్ర స్థాపన జరుతుంది అని పార్లమెంటులో ప్రకటించాడు.
-1956 మార్చి 5న నిజామాబాద్‌లో భారత సేవక్ సమాజ్ ఏర్పాటుచేసిన బహిరంగసభలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విశాలాంధ్ర స్థాపనకు అనుకూలంగా కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు.
-ఇదే సందర్భంగా ఒక అమాయకురాలి (తెలంగాణ) పెండ్లి ఒక తుంటరి పిల్లవాని (ఆంధ్ర)తో జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఉండే పొంతన కుదరకపోతే ఆలుమగలు విడాకులు తీసుకున్నట్లే కొంతకాలం తరువాత రెండు ప్రాంతాలుగా విడిపోవచ్చు అని ప్రకటించారు (ఇండియన్ ఎక్స్‌ప్రెస్, 1956 మార్చి 6).
-అలా చివరికి 1956 జూలై 19న పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రెండు ప్రాంతాలకు చెందిన 8 మంది నాయకులు ఆ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఒప్పంద అంశాలు
-రాష్ర్ట ప్రభుత్వపు ముఖ్య సాధారణ పరిపాలనా విభాగాలపై అయ్యే ఖర్చుని తగిన నిష్పత్తిలో రెండు ప్రాంతాలు భరించాలి. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి. ఈ నిబంధనను ఐదేండ్ల తరువాత సమీక్షించి అసెంబ్లీలోని తెలంగాణ శాసనసభ్యులు కోరినపక్షంలో మళ్లీ ఐదేండ్ల పాటు వర్తింపజేయాలి.
-తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యాసౌకర్యాలన్నీ తెలంగాణ విద్యార్థులందరికీ వర్తింపజేసి మరింతగా అభివృద్ధిచేయాలి. తెలంగాణలోని సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశం ఆ ప్రాంత విద్యార్థులకే పరిమితం చేయాలి. లేకపోతే రాష్ర్టం మొత్తంమీద 1/3వ వంతు సీట్లను తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించాలి. అయితే ఈ రెండింటిలో తెలంగాణవారికి ఏది ప్రయోజనమైతే దాన్ని ఎంచుకోవచ్చు.
-విశాలాంధ్రను ఏర్పటుచేసినప్పుడు ఎక్కువైన ఉద్యోగుల్ని తీసివేయాల్సివచ్చినప్పుడు ఆయా ప్రాంతాలకు తగిన నిష్పత్తిలోనే తొలగించాలి.
-ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఆయా ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా తీసుకోవాలి.
-తెలంగాణలోని సాధారణ పరిపాలన, న్యాయ విభాగాల్లో ఉర్దూ భాషకు ఉన్న ప్రస్తుత స్థానాన్ని మరో ఐదేండ్ల పాటు కొనసాగించాలి. ఐదేండ్ల తరువాత ప్రాంతీయమండలి పరిస్థితిని సమీక్షిస్తుంది. ఉద్యోగ నియామకాల్లో తెలుగు భాషాపరిజ్ఞానం తప్పనిసరి అనే నిబంధనను పెట్టకూడదు. అయితే ఉద్యోగంలో చేరిన రెండేండ్లకు ఉద్యోగుల కోసం నిర్వహించే తెలుగు పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు కావాలి.
-తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు 12 ఏండ్లు స్థానికుడై ఉండాలనే నిబంధన వంటి కొన్ని నియమాల్ని కూడా రూపొందించాలి.
-తెలంగాణ ప్రాంతపు బహుముఖాభివృద్ధి కోసం ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి.
-తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ మండలి అధికార పరిధిలో ఉండాలి.
-కేబినెట్ మంత్రుల నియామకం 60:40 నిష్పత్తిలో జరగాలి. తెలంగాణకు చెందిన మంత్రుల్లో ఒకరు ముస్లిం అయి ఉండాలి.
-ముఖ్యమంత్రి ఆంధ్రప్రాంతం వ్యక్తి అయితే, ఉపముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికిచెందిన వ్యక్తి ఉండాలి. ఒకవేళ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికిచెందిన వ్యక్తి అయితే, ఉపముఖ్యమంత్రి ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యక్తి ఉండాలి.
హోంశాఖ, ఆర్థికశాఖ, రెవెన్యూ శాఖ ప్రణాళిక, అభివృద్ధి శాఖ, వాణిజ్యం, పరిశ్రమల శాఖ వీటిల్లో ఏవైనా రెండు శాఖలు తెలంగాణవారికి అప్పగించాలి.
-తెలంగాణకు 1962 వరకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ కావాలని హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జేవీ నర్సింగరావు కోరారు. ఇందుకు ఆంధ్ర రాష్ర్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణరావు కూడా తన ఆమోదాన్ని తెలిపారు.
-పైన పేర్కొన్న అంశాలనే పరిరక్షణలు (సేఫ్‌గార్డ్) అంటారు.
తెలంగాణ ప్రజల భయాలు
-మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్రరాష్ర్టం ఆవిర్భవించిన నాటి నుంచి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. దాంతో పోలిస్తే తెలంగాణ సగటు ఆదాయం చాలా ఎక్కువ. అంటే తెలంగాణ ఆర్థికంగా వెనుకబాటుతనంలో లేదు. అత్యధిక భూమిశిస్తు పన్ను, ఎక్సైజ్ ఆదాయం వల్ల తెలంగాణకు ఆంధ్రకన్నా ఏడాదికి రూ. 5 కోట్ల ఆదాయం, రాబడి ఎక్కువగా ఉంది.
-కావున విలీనం జరిగితే తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి వినియోగించాల్సిన ఈ మిగులు ఆదాయాన్ని ఆంధ్రరాష్ర్టంతో పంచుకోవాల్సి వస్తుందన్న భయం తెలంగాణకు ఉంది.
-విశాలాంధ్ర ఏర్పడితే అభివృద్ధి పథకాల రూపకల్పనలో తమ ప్రాంతానికి తగినంత ప్రాధాన్యత లభించకపోవచ్చనే భయం తెలంగాణవారికి ఉంది. కృష్ణా, గోదావరి నదులపై కట్టబోయే ప్రాజెక్టుల్లో ఎక్కువ నీరు కోస్తాంధ్రకే చెందే ప్రమాదం ఉంది. కావున నదీజలాల వినియోగంలో తమవంతు వాటా తమకు దక్కదేమోనన్న భయం తెలంగాణ ప్రజలకు ఉంది.
-మరో ముఖ్యమైన కారణం విద్య, ఉద్యోగాలకు సంబంధించింది. బ్రిటిష్‌వారి పాలనలో ఉండటంతో ఆంధ్రప్రాంతంవారు ఇంగ్లిష్ విద్యావిధానంలో, ఉన్నత విద్యల్లో అభివృద్ధిని సాధించారు. నిజాం రాజరిక ఫ్యూడలిజం వల్ల తెలంగాణ ఇంగ్లిష్ భాషలో వెనుకబడటమేగాక విద్యాభివృద్ధి చాలా పరిమితమైంది. ఒకవేళ విలీనం జరిగితే ఇంగ్లిష్ భాషలో, విద్యలో అభివృద్ధిచెందిన ఆంధ్రావారితో తాము పోటీపడలేమని, ఎక్కువ అర్హతలున్నవారికే ఉద్యోగాలు దక్కుతాయని భయపడ్డారు.
-రాష్ర్ట పునర్విభజన చట్టంలో ఈ పెద్ద మనుషుల ఒప్పందానికి స్థానం కల్పించి భారత ప్రభుత్వం చట్టబద్దమైన మద్దతునిచ్చింది.
-1956 ఆగస్టు నెలలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఓట్ ఆన్ సేఫ్‌గార్డ్స్ పేరిట ప్రవేశపెట్టారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు