ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఆకాంక్ష
– 1948 నాటి పోలీస్ చర్య ద్వారా భారత యూనియన్‌లో హైదరాబాద్ రాజ్య విలీనం నాటి నుంచే మరాఠ్వాడాలు, కన్నడిగులతో పాటు మద్రాస్ రాష్ట్ర ఆంధ్రుల ఆధిపత్యం, అజమాయిషీ ధోరణుల వల్ల తెలంగాణ ప్రాంత ప్రజల్లో హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే భావన చాలా దృఢంగా ఉండేది.
-ఇది అకస్మాత్తుగా ఏర్పడిన ఆలోచన కాదు. 1921 నాటి ఆంధ్రజన సంఘం మొదలుకొని 1930 నాటి ఆంధ్ర మహాసభ వరకు హైదరాబాద్ నిజాం రాజ్యంలో తెలుగు భాషకు జరిగిన అవమానాలకు వ్యతిరేకంగా సాగిన అనేక సాంస్కృతిక, సామాజిక, రాజకీయ చైతన్య ఉద్యమాల్లో ప్రజలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోరుకున్నారు. తదనంతరం తెలుగు భాష మాట్లాడే ఆంధ్రులు, తెలంగాణీయులు ఒక్కటి కానందు వల్ల ఆంధ్రుల ఆధిపత్యం ఏదో ఒక రూపంలో హైదరాబాద్ రాష్ట్రంలో, విశాలాంధ్ర ప్రదేశ్ లో చాలా స్పష్టంగా కనపడుతుండేది.
– ఈ క్రమంలో 1948, 1950 సంవత్సరాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో పాటు 1952లో పెల్లుబికిన ముల్కీ ఉద్యమ ప్రభావం వల్ల స్థానికుల్లో రాష్ట్ర ఆకాంక్ష బాగా పెరిగిపోయింది. తెలంగాణలోని తెలుగు ప్రజలు, మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ఆంధ్రులతో కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడతామని ఎన్నడూ ఊహించలేదు. కానీ 1950-56 సంవత్సరాల మధ్య హైదరాబాద్ , ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన పెను పరిణామాల వల్ల విశాలాంధ్ర అనే భావనతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల అభీష్టానికి పూర్తిగా విరుద్ధం.
– మొదటి నుంచి విశాలాంధ్రను సమర్థిస్తున్న కాళోజీ నారాయణ రావు, స్వామి రామానంద తీర్థతో పాటు కమ్యూనిస్టులను తెలంగాణ ప్రజలు పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా వివిధ సమావేశాల్లో వారిపై రాళ్లు రువ్విన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే తెలంగాణ ప్రజల్లో ఆకాంక్ష ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.
-ముఖ్యంగా బూర్గుల రామకృష్ణారావు పాలనా కాలంలోనే హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రదేశ్ కాంగ్రేస్ లోని తెలంగాణ ప్రాంత సభ్యులు 1954, జూన్ 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశమై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అప్పటి హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రేస్అధ్యక్షుడు మరాఠ్వాడ ప్రాంత నాయకుడైన స్వామి రామానంద తీర్థ తీవ్రంగా వ్యతిరేకిస్తూ విశాలాంధ్రను సమర్థించగా, తెలంగాణ నాయకులైన బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవీ నర్సింగరావు విశాలాంధ్రను పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని గట్టిగా సమర్థిస్తూ నిలబడ్డారు.
– హైదరాబాద్ రాష్ర్టంలో తెలుగు భాష మాట్లాడే తెలంగాణ ప్రజలు, రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో కలవాలా? లేదా? అనే అంశాన్ని తేల్చుకోవాల్సింది వారే గాని, మరాఠ్వాడా, కన్నడ, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యులు, రాజకీయ నాయకులు కారనేది ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్ఆర్సీ) మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను కింది విధంగా ప్రస్తావించింది.
1) ఆంధ్ర ప్రాంత ప్రజలంతా తెలంగాణ తమ రాష్ట్రంలో కలవాలనే ఆత్రుతతో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా అందుకు వ్యతిరేకంగానే ఉన్నారు.
2) తమకంటే అధిక విద్యావంతులైన, లౌక్యం ఎక్కువగా తెలిసిన ఆంధ్రులు తెలంగాణలోకి వస్తే మేం అన్ని రకాలుగా నష్టపోతామనే భావనతో పాటు ముఖ్యంగా విద్యాపరంగా వెనుకబడతామని తెలంగాణ వారు భావిస్తున్నారు.
3) నాగార్జున సాగర్ , పోచంపాడు తదితర ప్రాజెక్టులు నిర్లక్ష్యం అవుతాయని, విలీనీకరణ తప్పనిసరైతే అది తెలంగాణ ప్రజల ఇష్ట ప్రకారం వారి ఆమోదంతో జరిగితే బాగుంటుందని ఎస్ఆర్సీ తేల్చి చెప్పింది.
# పై విషయాలను నిశితంగా పరిశీలిస్తే తెలంగాణ ప్రజలు ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంగా ఉండాలనే కోరుకోవడం జరిగిందని అర్థమవుతుంది.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం లేదా ఫజల్ అలీ కమిషన్
– స్వాతంత్య్రానంతరం భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు గాను 1948లో ఎస్కే థార్ కమిషన్ , 1949లో జేవీపీ కమిటీ, 1953లో వాంఛూ కమిటీ, 1953, డిసెంబర్లో ఫజల్ అలీ కమిషన్లను భారత ప్రభుత్వం నియమించింది. 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో దక్షిణ భారతదేశంలో కూడా నూతన రాష్ట్రాల ఏర్పాటు, సమస్యల అధ్యయనం గురించి 1953, డిసెంబర్ 22న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షుడిగా, హృదయానుథ్కుంజ్రా, కవలం మాధవ ఫణిర్కర్లు సభ్యులుగా కేంద్రం ఏర్పాటు చేసింది.
– ఈ కమిషన్ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వ్యక్తుల నుంచి, వివిధ సంఘాలు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించింది. 1954, జూన్ , జూలై నెలల్లో ఈ సంఘం హైదరాబాద్‌ను సందర్శించి వివిధ రకాల సంస్థల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకున్నది. దీనిలో విశాలాంధ్రకు కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తపర్చారు. విశాలాంధ్రను గట్టిగా వ్యతిరేకించి, తెలంగాణను ఒక ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించాలనేవారికి కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి నాయకత్వం వహించారు.
– ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం తన నివేదికలో 369 నుంచి 389 పేరాల వరకు క్షుణ్ణంగా వివరిస్తూ 1955, సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించేందుకు రాష్ట్రం లోపల, రాష్ట్రం వెలుపల ప్రజాభిప్రాయం బలంగా ఉన్నందున హైదరాబాద్రాష్ట్ర విభజనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫారసు చేసింది. అంతేగాకుండా కన్నడ ప్రాంతాలను మైసూర్రాష్ట్రంలో మరాఠీ ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలో కలపాలని కూడా సిఫారసు చేసింది. కానీ తెలుగు ప్రాంతమైన తెలంగాణ విషయానికి వచ్చేసరికి కమిషన్ ఈ విధంగా నిర్దంద్వంగా సిఫారసు చేయలేదు.
– తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం వల్ల ఉభయ ప్రాంతాలవారికి ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్పిన సంఘం ప్రస్తుతానికి బీదర్జిల్లాలను, మునగాల పరగణా ప్రాంతాన్ని కలుపుతూ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి దానికి హైదరాబాద్రాష్ట్రమని పేరు పెట్టాలని 1961లో జరిగే సాధారణ ఎన్నికల తర్వాత హైదరాబాద్రాష్ట్ర అసెంబ్లీలో 2/3వ వంతు సభ్యులు విలీనానికి ఒప్పుకొంటే ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాలను కలిపి విశాలాంధ్రగా రూపొందించవచ్చని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఆనాడే తెన్నేటి విశ్వనాథం అన్నట్టు ‘కమిషన్వాదనంతా విశాలాంధ్రను బలపరిచేది గాను, ఓడితే మాత్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగాను ఉంది’ అని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా కేవీ రంగారెడ్డి తన వాదనను కింది విధంగా ప్రకటించారు.
– తెలంగాణ రాష్ట్రం ఏర్పడి స్వయం పోషకం కాగానే ఎప్పుడో ఆరేండ్లకు విశాలాంధ్రను కావాలని ఎవరూ కోరరు. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ ఆదాయం రూ.4 కోట్లు ఎక్కువ. విశాలాంధ్ర ఏర్పడితే అది మనకు దక్కదు. ఈ ఆదాయంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. కాబట్టి విశాలాంధ్ర వచ్చి ఏదో ఉద్ధరిస్తుందనే భ్రమతో తెలంగాణను వ్యతిరేకించడం భావ్యం కాదని 1955, అక్టోబర్ 22న కొత్త ఢిల్లీలో స్పష్టంగా చెప్పారు.
విశాలాంధ్ర వల్ల కలిగే ప్రయోజనాలు- కమిషన్ వాదన
1) ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల విలీనం వల్ల ఏర్పడిన విశాలాంధ్ర 32 మిలియన్ల (3 కోట్ల 20 లక్షలు) జనాభాతో, విలువైన ముడి సరకులతో, కావాల్సినంత ఖనిజ సంపదతో ఒక పెద్ద రాష్ట్రంగా రూపొందుతుంది.
2) విశాలాంధ్ర ఏర్పాటు వల్ల ఆంధ్ర రాష్ట్ర రాజధాని సమస్య కూడా తీరడంతో పాటు జంట నగరాలైన హైదరాబాద్ , సికింద్రాబాద్ విశాలాంధ్రకు రాజధానిగా చక్కగా సరిపోతాయి.
3) విశాలాంధ్ర ఏర్పాటు వల్ల కృష్ణా-గోదావరి నదీజలాల వినియోగం ఒకే అధికార పరిధి కిందకు వస్తుండటంతో నదీ ముఖద్వారాల్లో ఉన్న తూర్పు ప్రాంతాల అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుంది. విశాలాంధ్రలో భాగంగా తెలంగాణకు కూడా ఈ అభివృద్ధి వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
4) కరువు కాటకాలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా తెలంగాణలో ఆహార కొరత ఏర్పడటం, ఆంధ్ర రాష్ట్రంలో అధికోత్పత్తి రావడం వల్ల మిగులు ఉత్పత్తిని తెలంగాణలో వాడుకోవచ్చు.
5) ఆంధ్ర రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలు లేవు కాబట్టి తెలంగాణలో ఉన్న సింగరేణి నుంచి ఈ బొగ్గును ఆంధ్ర ప్రాంతానికి తరలించి అభివృద్ధి చెందవచ్చు.
ప్రత్యేక తెలంగాణ వాదన- కమిషన్ నివేదిక
1) ఆంధ్ర రాష్ట్రం పుట్టినప్పుడు ఆర్థికంగా చాలా క్లిష్ట సమస్యలను ఎదుర్కొంది. తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తలసరి రెవెన్యూ ఆదాయం చాలా తక్కువగా ఉండేది. ఇందుకు తెలంగాణలో రెవెన్యూ విధింపు రేటు ఎక్కువగా ఉండటం, మద్యపాన నిషేధం అమలులో లేకపోవడం వల్ల ఆబ్కారీ పాటల ద్వారా ఏటా రూ.5 కోట్ల ఆదాయం లభించడం. ఆంధ్ర రాష్ట్రంలో చేరడం వల్ల తన అదనపు ఆదాయాన్ని తన అభివృద్ధి కోసం వినియోగించుకునే మంచి అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుంది.
2) విశాలాంధ్రలో తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండదు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ ప్రాంతం వారికి రావాల్సిన కోటా కోస్తా ప్రాంతాలకు ఉపయోగపడే ప్రమాదముంది.
3) హైదరాబాద్‌లో తప్ప మిగిలిన తెలంగాణ ప్రాంతంలో విద్యావ్యాప్తి గల ఆంధ్ర ప్రాంతంవారే విశాలాంధ్రలో అన్ని ఉద్యోగాలను పొందుతారు.
# తెలంగాణ ప్రాంత ప్రజల ఈ భయాలే విశాలాంధ్రను వ్యతిరేకించేలా చేశాయి.
# విశాలాంధ్రవాదుల, ప్రత్యేక తెలం గాణ వాదుల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత విశాలాంధ్ర ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టమైనవి కావడం వల్ల దీన్ని ఏర్పాటు చేసేందుకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని కమిషన్ అభిప్రాయపడింది.
మాదిరి ప్రశ్నలు
1.‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ పుస్తక రచయిత?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) వావిలాల గోపాలకృష్ణయ్య
3) వెంకట రంగయ్య
4) రావి నారాయణ రెడ్డి
2. 1911లో విశాలాంధ్ర చిత్రపటాన్ని తయారు చేసిన కాంగ్రెస్ నాయకుడు?
1) మాడపాటి హనుమంతరావు
2) కొండా వెంకటప్పయ్య
3) స్వామి రామానంద తీర్థ
4) నీలం సంజీవరెడ్డి
3. ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం’ తన నివేది కను కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పిం చింది?
1) 1955, సెప్టెంబర్ 30
2) 1953, డిసెంబర్ 29
3) 1955, సెప్టెంబర్ 29
4) 1953, అక్టోబర్ 30
4. కింది వారిలో ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ’ సంఘంలో సభ్యులు కానివారు?
1) సయ్యద్ ఫజల్ అలీ
2) హృదయాంథు కుంజా
3) ఎస్కే థార్
4) కేఎం ఫణిక్కర్
5. విశాలాంధ్రను వ్యతిరేకించిన తెలంగాణ అగ్రనాయకులు?
1) కేవీ రంగారెడ్డి 2) మరి చెన్నారెడ్డి
3) జేవీ నర్సింగరావు 4) పై అందరూ
6. మొదటి విశాలాంధ్ర సభ సమావేశం-1950 ఎవరి అధ్యక్షతన జరిగింది?
1) స్వామి రామానంద తీర్థ
2) హయగ్రీవాచారి
3) టంగుటూరి ప్రకాశం పంతులు
4) పుచ్చలపల్లి సుందరయ్య
7. ‘విశాలాంధ్ర నిర్మాణం యావదాంధ్రుల జన్మహక్కు’ అని నినాదం ఇచ్చింది?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) రావి నారాయణ రెడ్డి
3) టంగుటూరి ప్రకాశం పంతులు
4) స్వామి రామానంద తీర్థ
8. సయ్యద్ఫజల్ అలీ అధ్యక్షతన ఎస్ఆర్సీని కేంద్రం ఎప్పుడు నియమించింది?
1) 1953, డిసెంబర్ 29
2) 1954, డిసెంబర్ 29
3) 1955, సెప్టెంబర్ 30
4) 1953, నవంబర్ 29
9. 1949, నవంబర్‌లో విశాలాంధ్ర మహాసభ ను విజయవాడలో స్థాపించింది?
1) కొండా వెంకటప్పయ్య
2) అయ్యదేవర కాళేశ్వరరావు
3) మామిడిపూడి వెంకటరంగయ్య
4) బెజవాడ గోపాల్ రెడ్డి
10. కింది వారిలో ప్రత్యేక తెలంగాణ వాదానికి అనుకూలంగా ఉన్న ఆంధ్ర నాయకులు?
1) ఎన్జీ రంగా
2) దరువూరి వీరయ్య
3) నడింపల్లి నరసింహారావు
4) పై అందరూ
Answers
1-1, 2-2, 3-1, 4-3, 5-4,
6-2, 7-3, 8-1, 9-2, 10-4.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు