అభివృద్ధే పరమావధి – రౌండప్ 2022
ఆహారభద్రత చట్టం అమలుకు విజిలెన్స్ కమిటీ
ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ కమిటీని నియమించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనీల్ కుమార్ 2022 మే 20న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి పౌరసరఫరాల శాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ వైస్ చైర్మన్‌గా, ఆహార భద్రత చట్టం వ్యవహారాలను రాష్ట్రంలో పర్యవేక్షించే డిప్యూటీ కమిషనర్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, బీసీ, ఎస్సీ, సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, వైద్యారోగ్య శాఖ, ఉన్నత విద్య, గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శులు, పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లు, నికలు-కొలతల కంట్రోలర్, రాష్ట్ర ఆహార కమిషన్ సభ్య కార్యదర్శి, చమురు సంస్థల సమన్వయకర్త, చౌకధరల దుకాణాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పౌరసరఫరాల శాఖ ఉప కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
కరెంటు కొనుగోలులో 8.5 శాతం సంప్రదాయేతర ఇంధనం
సంప్రదాయేతర ఇంధనాన్ని (రెన్యూవబుల్ ఎనర్జీ-ఆర్ఈ) తప్పనిసరిగా కొనాలనే లక్ష్యసాధనకు అవసరమైతే ప్రజల ఇళ్లపై సౌర విద్యుత్‌ను సొంత ఖర్చుతో విద్యుత్ పంపిణీ సంస్థలే ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఇంధన విధానం-2016లో భాగంగా ఆర్ఈ ఉత్పత్తి, వినియోగాన్ని బాగా ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం విద్యుత్ చట్టం-2003 సెక్షన్ 86(1) ప్రకారం ప్రతి డిస్కం ఏటా కొనుగోలు చేసే మొత్తం కరెంటులో ఎంత ఆర్ఈ ఉండాలనేది రాష్ట్ర ఈఆర్సీ నిర్ణయించాలని కేంద్ర విద్యుత్‌శాఖ ఆదేశించింది, దీన్ని ‘విధిగా సంప్రదాయేతర ఇంధన కొనుగోలు’ (రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్)అని పిలుస్తారు. అంటే దేశవ్యాప్తంగా ప్రతి డిస్కం విధిగా ఆర్ఈని కొనాలి. ఈ ఏడాది (2022-23)లో మొత్తం కరెంటు కొనుగోళ్లలో ఆర్పీపీఓ 8.5 శాతం ఉండాలని. 8.5 శాతంలో 7.5 శాతం సౌరవిద్యుత్ మాత్రమే ఉండాలని ఈఆర్సీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
రాష్ట్రంలో మరో రూ.950 కోట్ల పెట్టుబడులు
సౌరవిద్యుత్ పరికరాల ఉత్పత్తి, విద్యుత్ వాహనాల రంగాల్లో మరో రూ.950 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేందుకు మూడు సంస్థలు నిర్ణయించాయి. అమెరికాకు చెందిన అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్, భారత్‌కు చెందిన ప్రీమియర్ ఎనర్జీ గ్రూప్‌లు సంయుక్తంగా హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ సిటీలో రూ.700 కోట్లతో సోలార్‌సెల్, మాడ్యూల్ల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఈ రెండు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పత్రాలను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ 2022 జూన్ 13న అందజేశారు. యూఏఈకి చెందిన మెటా4 సంస్థ రూ.250 కోట్లతో జహీరాబాద్‌లో ద్విచక్ర వాహనాల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
ప్రీమియర్, అజ్యూర్ల సౌర విద్యుత్ పరిశ్రమ-
హైదరాబాద్‌లో ఇప్పటికే ఎలక్ట్రానిక్ సిటీలో ప్రీమియర్ ఎనర్జీ పరిశ్రమను నిర్వహిస్తోంది. కొత్తగా 1.25 గిగావాట్ల సోలార్‌సెల్, 1.25 గిగావాట్ల మాడ్యూళ్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుపై ‘ప్రీమియర్’తో అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది.
మింట్ మ్యూజియం
భావితరాలకు అప్పటి, ఇప్పటి నాణేల ముద్రణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సైఫాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ‘మింట్ మ్యూజియం’ ప్రారంభమైంది. 2022 జూన్ 7న ఎస్పీఎంసీఐఎల్ సంస్థ చైర్మన్, ఎండీ త్రిప్తిఘోష్ దీన్ని ప్రారంభించారు.
షేర్షా సూరి కాలం నాటి తొలి రూపాయి నుంచి
– నిజాం కాలం నుంచి ఇప్పటివరకు అచ్చు వేసిన నాణేలు, అందుకోసం ఉపయోగించిన పనిముట్లు, యంత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. షేర్షా సూరి కాలం నాటి తొలి నాణెం మొదలుకొని ప్రస్తుతం చలామణితో ఉన్న అన్నింటినీ ప్రదర్శిస్తున్నారు.
1803 నుంచి 1997 వరకు–
1803లో హైదరాబాద్ రాజ్యంలో అసఫ్‌జా-3 మీర్ అక్బర్ అలీఖాన్ సికిందర్జా కాలంలో పనిముట్లతో నాణేల ముద్రణ ప్రారంభమైంది. సుల్తాన్‌షాహీలో ఉన్న రాయల్ ప్యాలస్‌లో ఏర్పాటయిన మింట్‌లో నిజాం సంస్థానం నాణేలు తయారయ్యేవి. 1895లో లండన్ నుంచి ప్రత్యేక యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. పూర్తిస్థాయిలో ఆధునీకరించే ఉద్దేశంతో సైఫాబాద్‌లో ప్రత్యేక భవనాన్ని నిర్మించి 1903లో యూరప్ మింట్ల తరహాలో ఏర్పాటుచేశారు. 1918లో హైదరాబాద్ కరెన్సీ చట్టాన్ని తెచ్చి, నోట్ల ముద్రణనూ ప్రారంభించారు. 1997 వరకు సైఫాబాద్‌లోని టంకశాలలోనే కరెన్సీని ముద్రించారు. తరువాత చర్లపల్లిలో కొత్త మింట్‌ను ఏర్పాటు చేశారు.
తెలంగాణ పరిశ్రమలశాఖ 2021-22 వార్షిక నివేదిక
2021-22 రాష్ట్ర పరిశ్రమల వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ 2022 జూన్ 6న విడుదల చేశారు. తెలంగాణలో పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ విధానం ద్వారా ఇప్పటివరకు రూ.2,32,311 కోట్ల పెట్టుబడులతో 19,454 భారీ పరిశ్రమలకు అనుమతులిచ్చామని, వీటి ద్వారా 16.48 లక్షల మందికి ఉపాధి లభించిందని నివేదిక వెల్లడించింది. ఒక్క సంవత్సరంలోనే రూ.17,867 కోట్ల పెట్టుబడులు, 96,863 మందికి ఉపాధి కల్పన కోసం 3,938 పరిశ్రమలు అనుమతి పొందాయని వెల్లడించింది. నీతిఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ వాణిజ్య వాతావరణ
నగరంగా వంద మార్కులను సాధించిందని, ఎగుమతుల్లో దేశంలో అయిదో ర్యాంకు, గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్‌లో వాణిజ్య, పారిశ్రామిక ర్యాంకుల్లో మొదటి స్థానంలో సృజనాత్మకత, ఆవిష్కరణ, మేథోసంపత్తి హక్కుల్లో అగ్రస్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. తెలంగాణ జీఎస్డీపీ 2021-22లో రూ.11.54 లక్షల కోట్లతో 19.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 2014-15 నుంచి 2021-22 వరకు జీఎస్డీపీ 128.3 శాతం వృద్ధి చెందింది. జాతీయ జీడీపీ తెలంగాణ వాటా 5 శాతం.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐదో వార్షిక నివేదిక
ఐటీ తెలంగాణ ఐదో వార్షిర నివేదికను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాక మంత్రి కేటీఆర్ 2022 జూన్ 1న హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో తెలంగాణ గత ఎనిమిదేళ్లలో అద్భుతమైన పురోగతి సాధించిందని అన్నారు. రాష్ట్రంలో ఈ ఎగుమతులు 2020-21లో రూ.1,45,522 కోట్లు ఉండగా.. 2021-22లో అవి 1,83,569 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. అంటే గతేడాది కంటే 26.14 శాతం ఎక్కువని అన్నారు. ఈ ఎగుమతుల జాతీయ సగటు 17.2శాతం ఉంటే తెలంగాణ దానికంటే 9 శాతం అధికమని తెలిపారు.
ఎస్ఎల్బీసీ రుణ ప్రణాళిక
తెలంగాణ రాష్ర్టానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,14,041 కోట్ల రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ ఆమోదించింది. గత ఏడాది కంటే 15 శాతం అధికంగా రుణాలను ఇవ్వాలని నిర్ణయించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1,01,030 కోట్ల రుణాలు అందించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయించింది. 2022 జూన్ 14న హైదరాబాద్‌లో ఎస్ఎల్బీసీ చైర్మన్, ఎస్బీఐ ఛీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ నేతృత్వంలో ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. ఇందులో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణప్రణాళికను ఆమోదించారు. గత ఏడాది రూ.1,85,035 కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించగా ప్రాధాన్యరంగ రుణాలను పెంచుతూ 15 శాతం అదనపు మొత్తంలో ఈ ఏడాదికి రుణ ప్రణాళికను ఆమోదించారు. ప్రాధాన్యరంగ రుణాల్లో వ్యవసాయ రంగం రుణాల వాటా 61 శాతంగా పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ (consul) జనరల్‌గా జెన్నిఫర్
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ నియమితులయ్యారు. ప్రస్తుతం కాన్సుల్ జనరల్‌గా ఉన్న జోయెల్ రీఫ్మాన్ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో జెన్నిఫర్ బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర పండుగగా భాగ్యరెడ్డి వర్మ జయంతి
దళితుల అభివృద్ధికి విశేష కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతిని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో వర్మ జయంతి ఉత్సవాలను జరపాలని ఆదేశించింది. దీనికయ్యే ఖర్చును దళిత సంక్షేమ, అభివృద్ధి శాఖ నుంచి వెచ్చించాలని సూచించింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ సీజే జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న పంపిన సిఫారసులకు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2022 జూన్ 28న ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ భూయాన్‌తో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రమాణం
చేయించారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ – 1964 ఆగస్టు 2న అస్సాంలోని గువాహటిలో జస్టిస్ భూయాన్ జన్మించారు. 1991 మార్చిలో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. 2010లో సీనియర్ న్యాయవాది హోదా పొందగా, అస్సాం అదనపు అడ్వకేట్ జనరల్‌గా విధులు నిర్వహించారు. 2011 అక్టోబర్‌లో ముంబై హైకోర్టుకు బదిలీపై వచ్చి అక్కడి నుంచి 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు వచ్చారు.
అడ్వాన్స్ ఆటో పార్ట్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
ప్రముఖ వాహన రంగ సంస్థ అడ్వాన్స్ ఆటో పార్ట్స్ ప్రపంచస్థాయి సామర్థ్య కేంద్రాన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని కోకాపేట జీఏఆర్ ఇన్ఫోబాన్ ఐటీ భవనంలో 2022 జూన్ 13న ప్రారంభించారు. అడ్వాన్స్టో పార్ట్స్ సంస్థ అమెరికా తర్వాత రెండో పెద్ద కార్యాలయాన్ని నగరంలో ఏర్పాటు చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తద్వారా తమ కార్యాలయాలు ఏర్పాటు చేసిన మైక్రోసాఫ్ట్, మైక్రాన్, ఊబర్ వంటి దిగ్గజ సంస్థల జాబితాలో చేరిందని అన్నారు.
– విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు