వీరే మన తెలంగాణ తత్వ కవులు
జ్ఞానాన్ని గురించి చాలా విధాలుగా వివరించి ఉంది. జ్ఞానం అంటే తెలుసుకొనే తెలివి. ఇంకా గీతలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని ఉంది. జ్ఞానం ఎలా కలుగుతుంది. అంటే కర్మవల్ల కలుగుతుంది అంటారు ఆంగ్లేయులు. ముఖం మాత్రమే కాదు బాహ్య కర్మ అంతయూ మనస్సుకు అద్దం వంటింది. కర్మ అంటే జ్ఞానానికి నిప్పంటించే వత్తి.
తెలంగాణలో తత్వ కవులు ఎందరో ఉన్నారు. తాత్విక ఆధ్యాత్మిక అంశాల్లోనూ ముందున్నది తెలంగాణవారే. స్వేచ్ఛగా రచనలు చేయడం, ప్రచారాలు చేయడం, గానం చేయడం, తత్వ కవుల లక్షణాలు. జానపద సాహిత్యపోకడలతో కూడా తత్వకవులు రచనలు చేశారు. పాటకు పనితో అవినాభావ సంబంధం ఉంది. కొందరు తత్వ కవులు తంబూరా, డప్పు, డక్క, డోలు, పిల్లనగ్రోవి, మద్దెల, తాళం, స్వరతిత్తి వంటి వాయిద్యాలతో తమ రచనలను గానం చేశారు.
అన్నావదూత (1820-89)
-ఈయన శ్రీధర స్వామి శిష్యుడు. భూమానంద దీక్షానామం. భాగవతుల కృష్ణదాసు ఈయన సమకాలికులు. సికింద్రాబాద్లో వేపూరు నృసింహాచార్య, వెంకమాంబ దంపతులకు జన్మించారు. ఈయన వంజరి కులస్తుడు. సికింద్రాబాద్ తిరుమలగిరి బ్రిటిష్వారి వద్ద టైమ్ కీపర్గా పనిచేశారు. ఈయన రచనలను బట్టి మెగుడంపల్లి మల్లయ్య ఈయన ప్రథమ గురువు (హంగ శతకం). శ్రీధరస్వామి అచల బోధ గురువు. ఈయన రచనలు 1) రాజరాజేశ్వర శతకం, 2) హంస శతకం, 3) గురువాక్య తారావళి, 4) అంఖండానంద బోధార్థ కందార్థ దరువులు, 5) శివజ్ఞానాష్టకస్తోత్రం, 6) చరమానుష్టానం, 7) గురువాక్యసుధారసం, 8) పరబ్రహ్మానంద విలాసం, 9) అన్నావదూత వాగ్భూషణం, 10) పంచవశి పరమతత్వాలు, 11) ఉపదేశ రత్నమాల.
-ఈయనను 40 మంది కాశీ పండితులు సన్మానించారు. అఖండమండల సాధుమండనో బృహద్వాశిష్టాన్వయ సింధు చంద్రమా, విద్యానిధి స్తత్వసుభూషణోజ్ఞలోహ్యన్నావదూతాత్మవిధే శిఖామణి అని పాడారు.
-ఈయన రచనలు నేటికీ కొన్ని.. సికింద్రాబాద్ అచల పరిపూర్ణ పీఠంవారి ఉప్పలంచి కృష్ణమూర్తి వద్ద ఉన్నాయి.
సిద్దప్ప వరకవి (అచల సిద్ధాంత కవి)
-కరీంనగర్ జిల్లా గుండారెడ్డిపల్లి తాలూకా వరగణేశనగరంలో 1903లో లక్ష్మమ్మ, పెదరాజయ్యలకు జన్మించారు. కుమ్మరి కులస్తుడు. 81 ఏండ్లు జీవించారు. వినుడిమాయప్ప సిద్దప్ప విహితుడప్ప కనుడి కరమెప్ప కవికుప్ప కనుకమప్ప మకుటంతో రచనలు చేశారు.
-నిజాం ప్రభుత్వంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో 7వ తరగతి వరకు చదివారు. ఉర్దూ, తెలుగు, ఇంగ్లిష్ భాషలు తెలుసు. 25 ఏండ్లు ప్రాథమికోపాధ్యాయుడిగా పనిచేశారు. నెలకు జీతం రూ. 7. గాంధీ టోపి ధరించి (గాంధేయ స్వరాజ్యోద్యమం నడుస్తున్న రోజుల్లో) ఉద్యోగం చేసినందుకు చాలా ఇబ్బందుల పాలయ్యారు. ఈయన 17వ ఏటనే భారత, భాగవత తెనుగు పురాణ గ్రంథాలే కాక అమరాన్ని, నీతిశాస్ర్తాన్ని చదివారు.
రచనలు:
1) సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని (4 భాగాలు), 2) శ్రీజీవ నరేంద్ర (నాటకం), 3) శ్రీగాంధీ మహాత్మ (యక్షగానం), 4) కాకి హంసోపాఖ్యానం, 5) ఆత్మప్రపంచవిలక్షణం, 6) శ్రీప్రసిద్ధబోధిని, 7) శ్రీబిక్కనవోలు కందర్పాలు, 8) శ్రీశివస్తుతి, 9) శ్రీభక్తాంజనేయ (వర్ణమాల), 10) శ్రీరామ భజనావళి, 11) శ్రీలక్ష్మీనరసింహస్వామి, 12) శ్రీవిష్ణుస్తుతి, 13) శ్రీభారతీ నక్షత్రమాల, 14) బాలభక్త శిక్ష, 15) శ్రీరాధాకృష్ణ సంభాషణం, 16) ఆర్యకుల సుబోధిని, 17) యుగపంచాంగం, 18) జ్యోతిష్యఫల ప్రబోధిని, 19) శ్రీమత్తడి పోచమ్మస్తవము, 20) కలియుగ వర్తమాన కందర్పాలు, 21) గోవ్యాఘ్ర సంభాషణం, 22) శ్రీరాజరాజేశ్వర నక్షత్రమాల, 23) శ్రీశిస్తుతి వర్ణమాల.
-ఈయన రచనలు 1920 నుంచి ముద్రణ అవుతున్నాయి. వ్యవసాయం చేస్తూ కుమ్మరివృత్తిని కూడా చేశారు. ఈయనకు జలస్తంభన, వాయుస్తంభన యోగాసనాలు, వాస్తు కూడా తెలుసు. గోలకొండ కవుల సంచిక 1934లో ఈయన రచనలు ప్రచురితమయ్యాయి. 1967లో కుమ్మరి సిద్దప్ప కవిని గురించి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈ నాటి భారతీయ భాషల్లో ముఖ్యంగా తెలుగులో విశ్వేశ్వరకవి, చిత్రకవి పెద్దన, తిమ్మన వంటి కవులేగాక వటమూలుడు, నామయోగి, సిద్దప్ప వరకవి రాజయోగి, పరమానంద తీర్ధులు అటు వేదాంతంలోనూ, ఇటు రసవంతమైన కవిత్వం రాయడంలోనూ వెల్లడించిన భావాలు అపూర్వమైనవి అని కొనియాడారు. కాశీలో గాంధీ ఉపన్యాసం విని ఆధ్యాత్మికమైనదని భావించారు. నెహ్రూను దర్శించి వారి జాతక చక్రాన్ని వేసి వారితో భూషణ బిరుదు పొందారు. అంతకుముందే నిజాం రాజ్యంలో కిషన్ప్రసాద్, తారాచంద్ప్రసాద్, బూర్గుల రామకృష్ణారావుల ద్వారా సన్మానం పొందారు.
-దేహానికి ఆత్మకు గల సంబంధాన్ని తెలుపుతూ మట్టి ఒక్కటే కుండలు వేరు, బంగారమొక్కటే సొమ్ములు వేరు, ఇనుము ఒక్కటే ఆయుధాలు వేరు, పనిముట్లు వేరు, వస్తువు ఒక్కటే రూపాలు వేరు, ఆత్మ ఒక్కటే దేహాలు అనంతాలు. ఈ దేహం గాలిలోని దీపకలిక, పండుబారిన ఆకు, నీటిమీద బుడగ, నూనెకుండమీద రాత, తృణం, వడిగావిసిరే సుడిగాలి, తిరిగే బొంగరం, మెరిసే మెరుపు అని వర్ణించారు సిద్దప్ప కవి.
అహ్మదొద్దీన్ ఆత్మతత్వకవి
-మహబూబ్నగర్ జిల్లా వసంతాపురంలో జన్మించారు. అమీరొద్దీన్ ఈయనకు గురువు. ఈయన గ్రంథంలో మొదటి భాగం తత్వాలు, రెండో భాగం కందర్ప తత్వాలు, మూడో భాగం కేవల తత్వాలు, శాస్త్రవేదాంత రహస్య తత్వాలు, నాలుగో భాగం విజ్ఞాన సూచన తత్వాలు (పద్యాలు) ఉన్నాయి.
-వీరి రచనల్లో నీతి, సద్గురువుపై ప్రీతి, సమాజ సంస్కరణ, జ్ఞానం మొదలైన అంశాలు ఉన్నాయి. ఉదా: ఒక కందార్థం
కులవాదము మనకేలను
మలమూత్రము లోనగూడె మాయాఘటముల్
ఇలలో సద్గురు మంత్రము
కలనైనను మరువబోకు అంటారు.
-కులాన్ని గురించి వాదనలు చేయొద్దంటారు. సద్గురువును కలలో కూడా మరువద్దంటాడు. ఈ జీవితం మాయ అనే కుండవంటిదని చెబుతున్నారు. ఇంకా గురువు కన్నా వేరే దైవం లేదని చెబుతూ
అనుమానమేలనూ
సద్గురువు కన్నా హరివేరే లేడు ఒక
అనుమాన మేలనూ
అల్లాజికన్న హరివేరే లేడు ఒక
అనుమానమేలనూ.
-సద్గురువును మించిన దైవం లేదని భావం.
-ఇంకా మానసా హంసా మవి చేకొనవే, మానక నిలలో కనుగొను బ్రహ్మం బోటిలో సద్గురు సుటీను బల్కవి కోటి ప్రకాశుడు సాటిరారెవ్వరు- బ్రహ్మం కనుగొనే విధానం తెలియజేస్తాడు.
సాతెల్లి బాలదాసు (అచల తత్వం)
-ఈయనది సికింద్రాబాద్. కలిప్రమాణ తత్వాలు ఈయన రచన. కలికాల ధర్మాలను గురించి తత్వాలు రాశారు. ఇది ఒకవిధానమైన కాలజ్ఞానం. నేనేమి పెద్ద కవిని కూడా కాదని చెప్పుకున్నాడు. ముందు గురువునే ప్రార్థించాడు.
శ్రీగురుబ్రహ్మము పదముల నెప్పుడు
చింతన చేయుము ఓ మనసా
బాగుగ ఇక నీబంధము లన్నియు
పారదోలునే ఓ మనసా!- శ్రీగురు
-ఈ కవి విశ్వబ్రాహ్మణుడని తెలుసున్నది. పూజచేసే విధము తెలియుండీ గురువీర బ్రహ్మము, భజనచేసి భావమెరుగండి అని, మరోచోట- ఓంకారంబనే ప్రణవాక్షరాన్ని వొనరుగ తెలియర ఓరన్నా హంకారంబును మాని సద్గురుని వంకజేరరా ఓరన్నా అని రాశారు. కులాన్ని గురించి కులమేదిరా సిద్ద కులమేదిరా మనది కులమంటరా సిద్ద కులమాటరా కులము కులంబని, కులగోత్రములుగాక మలమూత్రములో బుట్టి మాటి మాటికి బల్క అని కులాన్ని విమర్శించారు.
చెరుపల్లి రామదాసు (భక్తకవి)
-నల్లగొండ జిల్లా గడ్డంవారి ఎడవెల్లి గ్రామం. ఈయన రాసిన జ్ఞానబోధ లింగాత్మక కీర్తనలు 1968లో అచ్చయ్యాయి. భద్రాలచం రామునికి అంకితమిచ్చారు. ఈయన తండ్రి చెరుపల్లి జ్ఞానబోధ లింగయ్య. తల్లి మీనాక్షి. ఈయన రచనలు 1) జ్ఞానబోధ నీతిపద్యాలు, 2) జీవాత్మరామ శతకము, 3) జ్ఞానబోధ లింగాత్మక కీర్తనలు. ఇందులో సాంఖ్య, తారకం, ఛాయా పురుష లక్షణాలు, పంచముద్రల ప్రభావం వచనరూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా రాశారు. రాజయోగంబు చేసి విరాగిమయ్యి నిందసంస్తుతు లెన్నడు నందు కొనక జ్ఞానబోధను పేరునుగాంచె నిలను అట్టి శ్రీగురు నెప్పుడు నభానుతింతు అని గురువును స్తుతించారు. జ్ఞానబోధ రామ వినరా సోమ అనే మకుటంతో 130 పద్యాలు రాశారు. ఇవి ఆటవెలదిలో ఉన్నాయి. జీవాత్మరామ శతకంలో 108 కందర్పాలు పద్యాలు ఉన్నాయి. జ్ఞానబోధ లింగాత్మ కీర్తనల్లో గురుడే నిరాకారుడమ్మ నిజగురునితో సరి ఎవరే కొమ్మా అనే కీర్తన ఉత్తమమైంది. ఇందులో 55 కీర్తనలు ఉన్నాయి.
సర్వేశుడు సర్వాత్ముడు
సర్వమయుందఖిలమునకు సర్వము తానై
సర్వము నంటియు నంటక సర్వము పరిపూర్ణుడనుచు చాటుము జీవా. ఈ పద్యంలో సర్వం సర్వాత్ముడు పరిపూర్ణంగా ఉన్నాడని రాశారు.
-ఇంకా ఈయన రచనల్లో సాంఖ్య శాస్త్ర వివరణ,
1) భూచరీముద్ర (పృథ్వి) 2) అంతర్దీచరీ ముద్ర (ఆకాశం) 3) అంతర్లక్షముద్ర (సూర్యచంద్రులు)
4) షణ్ముఖ ముద్ర (గురువు) 5) శాంభవి ముద్ర (సదాశివుడు) అనే పంచముద్రలను వివరించారు.
గాండ్ల చంద్రమౌలి
– ఈయనది హన్మకొండ నివాసం. ఈయన తత్వాలు జనంలో బాగా ప్రచారమయ్యాయి. నూనె గానుగను నడిపించి జీవించేవారని తెలుస్తున్నది. తత్వం నన్ను దయజూడరా గోదావరి చిన్నదొరా !నన్ను! పొందూ కద్దము రాత్రి పోవచ్చునని రాగా అందించి మొరిగేటి ఆ మూడు కుక్కలకూ మందేదో తెలుసురా- గోదావరి చిన్నదొరా !నన్ను!.
గంగాధరయ్య చిత్తారు
-1823లో నల్లగొండ జిల్లాలోని చర్లపల్లిలో జన్మించారు. రచనలు 1) కొలిపాక మహత్యం, 2) శృంగార భల్లాణ చరిత్ర 3) శృంగార సిరియాణ 4) శుకసప్తతి మొదలైనవి. పాల్కురికి సోమన వలె శైవభక్తిపరులు. ద్విపదలు రాశారు.
ఏలె ఎల్లయ్య
-1904లో జన్మించారు. 1990 ఏప్రిల్ 16న మరణించారు. రామన్నపేట వద్ద ఉన్న ఎల్లంకి గ్రామం. ప్రస్తుతం యాదగిరిగుట్ట జిల్లా. నర్సయ్య, ముత్తమ్మ దంపతులకు జన్మించారు. సంస్కృతం, తెలుగు, వాస్తుశాస్త్రం, జ్యోతిషశాస్త్రం తెలుసు. ఈయన రచనలు 1) మార్కండేయ 2) భార్గవి 3) పరాత్పర శతకాలు 4) ఆంజనేయ 5) రామలింగేశ 6) రామచంద్ర నక్షత్ర మాలికలు 7) మార్కండేయ దండకం 8) సీతారామ భజన కీర్తనలు 9) ఆంజనేయ భాస్కరమాల 10) స్వామి ప్రార్థన 11) భృగువంశం 12) వెంకటేశ శశికళ 13) వెల్లంకి-శంభులింగ శశికళ 14) పద్మవ్యూహం 15) కురుపాండవ యుద్ధం 16) చండూరు సీతారామ భజన కీర్తనలు 17) గణపత్యష్టోత్తర శతనామావళి 18) మార్కండేయ సుప్రభాతం 19) కర్ణవధ 20) వేదాంతి. మొత్తం 50కి పైగా కృతులు వివిధ ప్రక్రియల్లో రాశారు.
జొన్న ఎల్లారెడ్డి (1876-1940)
-భువనగిరి మండలం గొల్లపల్లి గ్రామ నివాసి. రచనలు 1) కాశీశతకం 2) శ్రీగురు మానస పూజా విధానం 3) శివపూజావిధానం 4) సత్బ్రాహ్మణ శతకం మొదలైనవి.
-ఈయన గొప్ప వేదాంత భక్తులు. కాశీ శతకంలోని పద్యాలు
వాణీవి నీవే కద
– శర్వాణీవి సర్వర్థభోగవర్తివి గదా పూ
బోణి మత గీర్వాణీ
వీణాకరకమల నిన్ను వేడితి గాళీ!!
భాగవతుల కృష్ణప్రభువు (1823-76)
-ఈయన అచల గురు బోధకులు. వైదిక బ్రాహ్మణులు, భరద్వాజ గోత్రికులు, కొలనుపాక (యాదాద్రి జిల్లా) నివాసం. నారాయణ, జానకి దంపతులకు 1823లో జన్మించారు. ఈయన సహజకవి. అచలగురు సార్వభౌములైన శివరామ దీక్షితుల ప్రశిష్యుడైన కంబలూరి అప్పమంత్రి శిష్యుడు. పరశురామ సీతారామస్వామి వద్ద గురుదీక్ష పొందాడు. గురువు వద్ద అచలబోధపొందాడు. అప్పటికప్పుడే సంస్కృతంలో గురుపూజ విధానం గురించి రచించి గురువుకు అర్పించాడు. గురుబోధ చేస్తూ హైదరాబాద్ చేరారు. జ్వాలమాంబ అనే స్త్రీని శిష్యురాలిగా చేసుకున్నాడు. ఇంకా బొల్లారంలో దేశపాండ్యులైన ఆదిరాజు తిరుమల రాయశర్మ మంగోల్ వెంకటనర్సయ్యచారి, ఫీల్ఖానా లక్ష్మణ దేశికులు, ఫీల్ఖానా శంకర్రావులు శిష్యులయ్యారు. రచనలు: 1) ఆధ్యాత్మతత్వ కీర్తనలు, 2) శక్తిద్వయ నిరసక శుద్ధ నిర్గుణ తత్వ కందర్పాలు, 3) జ్వాలమాంబకు ఉపదేశించిన ద్వాదశ బోధలు, 4) భగవద్గీత సారాంశజ్ఞానం, 5) వేదాంత వర్తికము, 6) హంస సంచారక్రమము, వివరము, 7) విశ్వోద్భవస్థితి ప్రళయములు, 8) బృహద్వాశిష్టబాణం, 9) ప్రణవార్థప్రదీపిక, 10) పరిపూర్ణ ప్రబోధ, 11) అచలబోధషట్కం, 12) హంస సంచారచతుష్కం, 13) దృగ్దృశ్య చతుష్కం, 14) మహావాక్యార్థ వివరణబాణం.
అన్నదాసుల పురుషోత్తం
-ఈయనది కరీంనగర్ జిల్లా మెట్టపల్లి తాలూకా ఆత్మకూరు గ్రామం. రచన శ్రీమానసానంద భజన మాల ఇది బొంబాయిలో అచ్చయ్యింది. దీని సవరణ కర్త శ్రీఅఖిలానంద చాట్ల నర్సయ్య రాజయోగి. ఈయనది రామడుగు. సినిమా పాటల ఫక్కీలో వేదాంతం, కీర్తనలు, తత్వాలు రాశారు.
రామచిలక ఆత్మారాముని గనవె
రామరామా యనరా నీనోటినిండా
హరినారాయణ దురిత నివారణ
భగవంతా నీ మహిమ పరికించ తరమా
అని రాశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు